Science Fair: సైన్స్‌ఫేర్ పిలుస్తోంది..
కొత్తగూడెంఅర్బన్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచి పెంపొందించేందుకు, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ ఏటా వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్‌ఫేర్) నిర్వహిస్తోంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేయూతను అందిస్తున్నాయి. కాగా ఈ నెల 19 నుంచి 21 వరకు పాల్వంచలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. 2023–24 సైన్స్‌ఫేర్ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుండగా, పాఠశాలల్లో ప్రాజెక్టుల సందడి మొదలైంది. గతేడాది సైన్స్‌ఫేర్ ఇల్లెందులో నిర్వహించగా, 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 510 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. జూనియర్, సీనియర్, ఐటీడీఏ విభాగాల నుంచి మొత్తం 21 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇన్‌స్పైర్ పోటీలు కూడా అక్కడే నిర్వహించగా, 7 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి.
సమాజం కోసం శాస్త్ర–సాంకేతిక రంగం..
2023–24 సైన్స్‌ఫేర్‌లో ప్రధాన అంశం ‘సమాజం కోసం శాస్త్ర–సాంకేతిక రంగం’, ఉప అంశాలు ఆరోగ్యం, వ్యవసాయం, సమాచారం–రవాణా, జీవన విధానం–పర్యావరణం, కంప్యూటేషన్ థింకింగ్‌గా పేర్కొన్నారు. పాల్వంచలోని డీఏవీ పాఠశాలలో వేడుక నిర్వహించనుండగా, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు, జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుంది. ఒక ఎగ్జిబిట్‌కు ఇద్దరికి మించి విద్యార్థులు పాల్గొనొద్దని, ప్రతి పాఠశాల నుంచి తప్పని సరిగా 3 నుంచి 5 అంశాలపై ప్రదర్శన ఇవ్వాలని జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాల నుంచీ ఒక గైడ్ టీచర్ మాత్రమే హాజరు కావాలని చెబుతున్నారు. ఐటీడీఏ పాఠశాలల ఎగ్జిబిట్లకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, గైడ్ టీచర్లకు భోజనం, రాత్రి బస వసతి సౌకర్యాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దూరప్రాంతాల నుంచి హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వెట్టర్లు, దుప్పట్లు తెచ్చకోవాలని సూచిస్తున్నారు. సైన్స్‌ఫేర్‌లో ఈ ఏడాది ‘మిల్లెట్స్ ఫర్ హెల్త్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్’అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నారు. క్విజ్, వ్యాసరచన పోటీలు, శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు. సైన్స్‌ఫేర్ విజయవంతానికి రిసెప్షన్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ, కల్చరర్ కమిటీ, ఫుడ్ కమిటీలతోపాటు మరో 11 కమిటీలను ఏర్పాటు చేసినట్లు విద్యాధికారులు తెలిపారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
పాల్వంచ డీఏవీ పాఠశాలలో మూడు రోజులపాటు సైన్స్‌ఫేర్ సందడి చేయనుంది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.
–ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాధికారి