Education Hub: ఎడ్యుకేషన్ హబ్‌గా రాజమహేంద్రవరం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): కళలకు, సాహిత్యానికి, వాణిజ్యానికి కేంద్ర బిందువుగా పేరుగాంచిన రాజమహేంద్రవరంను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తొలి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యను చదువుతున్న విద్యార్థులతో ఎంపీ గురువారం మాట్లాడారు. కళాశాల, హాస్టల్ సదుపాయాల్లోను, నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయా అని ఆయన విద్యార్థులను అడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విద్యారంగంలో పలు మార్పులను తీసుకొచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే మంజూరయ్యాయన్నారు. వీటిలో మూడు కేంద్ర ప్రభుత్వ నిధులతోను, మిగిలిన 13 కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నామన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో అయిదు మెడికల్ కళాశాలలు నిర్మించగా, వాటిలో రాజమహేంద్రవరం ఒకటన్నారు. గతంలో వైద్య విద్య కేవలం ఆర్థిక స్తోమత గలవారికే అందుబాటులో ఉండేదని, నేడు అట్టడుగు వర్గాల పిల్లలకూ అందుబాటులో తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యారంగానికే రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. వైద్య విద్య విద్యార్థులకు ఏ ఇబ్బంది, అవసరం ఉన్నా తెలియజేస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. తమ కళాశాలకు బస్సు మంజూరు చేయమని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సౌమ్య భాగ్యలక్ష్మి ఎంపీ భరత్‌ను కోరారు. దీనిపై ఎంపీ భరత్ సానుకూలంగా స్పందించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి అఽధిక సంఖ్యలో రోగులు వస్తుంటారని, వారికి అనుకూలంగా ఉండేలా మూడు బస్సులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. నగరంలోని గోకవరం బస్టాండు, కోటిపల్లి బస్టాండు, ఆర్టీసీ బస్టాండ్‌ల నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నాయకులు ఎన్వీ శ్రీనివాస్, గుర్రం గౌతమ్, కాంతారాం పాటిల్ ఉన్నారు.
చదవండి: YS Jagan Mohan Reddy: సెప్టెంబర్ 14న 5 వైద్య కళాశాలలు ప్రారంభం