Skip to main content

Andhra Pradesh Schools: విద్యా విప్లవం... సంస్కరణల పథం

Andhra Pradesh Schools

పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువేనని ప్రతి క్షణం నమ్మి విద్యా రంగంలో ఎవరు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌న్‌మోహన్‌రెడ్డి కృషి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాదిలో పది, ఇంటర్‌ ఫలితాల్లో కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పదిలో స్టేట్‌ టాపర్లుగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థిని నిలవడం గమనార్హం. రాష్ట్రంలో కార్పొరేట్‌ స్కూళ్లలో సైతం కొన్నింటికి మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్‌ విద్యను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ, ద్విభాషా పాఠ్య పుస్తకాలను పరిచయం చేస్తూ.. తీసుకున్న చర్యలతో పాఠశాల విద్యలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.

–సాక్షి, అనకాపల్లి
విద్యా సంస్కరణల్లో భాగంగా సర్కారు బడుల్లో విద్యా బోధన మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించాలనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి ప్రజలు జేజేలు పలుకుతుంటే మరోవైపు పాఠశాలల విలీనంపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. నూతన విద్యా విప్లవంలో భాగంగా పాఠశాలల విలీనంతో పాటు, ఉపాధ్యాయుల సర్దుబాటు, వసతుల ఏర్పాటు వంటి చర్యలపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అయితే విద్యాధికారులు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు.


సాధారణ బదిలీలు..
జిల్లాలో 98 మంది విద్యార్థుల కన్నా తక్కువగా 75 యూపీ సూళ్లు ఉన్నాయి. వీటిలో 350 మంది వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌లున్నారు. వీరిలో కొందరికి సాధారణ బదిలీల్లో భాగంగా స్థాన చలనం అయింది. ఉదాహరణకు అనకాపల్లి మండలం సుందరయ్యపేట ఎంపీయూపీ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఉంది. అక్కడ 77 మంది విద్యార్థులకు నలుగురు ఎన్‌జీటీ టీచర్లు, ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు పండిట్‌) టీచర్‌ బోధిస్తున్నారు. సాధారణ బదిలీల్లో తెలుగు పండిట్‌ టీచర్‌ ఎస్‌.రాయవరం మండలం రేవు పోలవరం హైస్కూల్‌కి బదిలీపై వెళ్లారు.

చ‌ద‌వండి: English Language: విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యానికి మరో ముందడుగు


నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు
నాలుగేళ్ల పాలనలో విద్యావ్యవస్థలో ఎన్నో రకాల సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. పాఠశాలల ప్రారంభం రోజునే జిల్లాలో జగనన్న విద్యా కానుక కిట్లు పేరిట విద్యార్థుల పుస్తకాలు, భోజనం, స్కూలు బ్యాగులు, షూ, యూనిఫారాలు ఇలా అన్నింటిలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అందించింది.
వరల్డ్‌ క్లాస్‌ విద్యా బోధనలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించి డిజిటల్‌ తరగతులకూ నాంది పలికింది. దీనికి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘పెర్‌ఫారెమ్‌న్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌’లో కూడా ఏపీ అగ్రభాగాన నిలిచింది.
2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టేనాటికి విద్యారంగంలో లెవల్‌–6 లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ కృషితో ఏకంగా లెవల్‌–2కు చేరుకోవడం గమనార్హం.

బోధనలో నాణ్యత తగ్గదు
గతంలో ఎంపీయూపీ స్కూళ్లను సమీప హైస్కూళ్లకు మ్యాపింగ్‌ చేస్తున్నాం. టీచర్‌లనూ సమీప హైస్కూళ్ల లో సర్దుబాటు చేశాం. 98 మంది విద్యార్థుల కన్నా తక్కువగా జిల్లాలో 75 యూపీ సూళ్లు ఉన్నాయి. వాటి లో 350 మంది స్కూల్‌ అసిస్టెంట్‌లున్నారు. వీరిలో కొందరికి సాధారణ బదిలీలో స్థానచలనం అయింది. కొత్తగా 21 అప్‌గ్రేడ్‌ స్కూళ్లు కూడా ఉన్నాయి. 98 మంది కన్నా తక్కువ ఉన్న చోట విద్యార్థుల సంఖ్య పెరిగితే అక్కడ స్కూల్‌ అసిస్టెంట్‌ను కూడా వేయడం జరుగుతుంది. – వెంకట లక్ష్మమ్మ, డీఈవో, అనకాపల్లి

స్కూల్‌ అసిస్టెంట్‌లను సర్దుబాటు చేశారంతే..
మ్యాపింగ్‌లో భాగంగా ఎంపీయూపీ స్కూల్స్‌లో గతంలో ప్రైమరీ, అప్పర్‌ప్రైమరీ రెండూ కలిసి ఉన్నాయి. వీటిని ఒకటి నుంచి మూడు వరకూ ప్రైమరీగా...మూడు నుంచి ఐదు తరగతులను సమీపంలో గల హైస్కూళ్లలోకి మార్చడం జరిగింది. దీంతో ప్రైమరీ ఉన్న చోట ఎస్‌జీటీలు ఉంటారు. మూడో తరగతి ఆపై ఉన్న చోట స్కూల్‌ అసిస్టెంట్‌లను మార్పు చేయడం జరిగింది. దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు. – డి.గోపినాథ్‌, పీఆర్‌టీయూ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్‌

అనకాపల్లి జిల్లాలో పాఠశాల వివరాలు..
మొత్తం పాఠశాలలు – 1,901
ప్రైమరీ స్కూల్స్‌ – 1,129
అప్పర్‌ప్రైమరీ – 341
హైస్కూల్‌ – 431
విద్యార్థుల సంఖ్య – 2,21,788
మొత్తం ఉపాధ్యాయులు – 10,412

ఇదీ దుష్ప్రచారం...సబ్జెక్టు టీచర్ల తొలగింపు
గడచిన విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమికోన్నత పాఠశాలలకు సమీపంలో గల ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేశారు. వారికి కూడా ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల మాదిరిగా సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన జరుగుతుందని, దీనివల్ల విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఏడాది వచ్చే సరికి 98 మంది కంటే తక్కువ పిల్లలు గల ప్రాథమికోన్నత పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లను కేటాయించలేమని చెబుతూ ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లను తప్పించి హైస్కూళ్లకు సర్దుబాటు చేసింది. వారి స్థానంలో నలుగురు ఎస్‌జీటీలను నియమించి వారితోనే మూడు నుంచి ఎనిమిది తరగతులకు బోధన జరపాలని నిర్ణయించింది. సబ్జెక్టు టీచర్లకు, వీరికి బోధనలో తేడా ఉంటుందని, దీనివల్ల పిల్లల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతుంది.

ఇదీ వాస్తవం... సర్దుబాటు మాత్రమే...
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నూతన విద్యావిధానం అమలుకు శ్రీకారం చుడుతుంది. అన్ని పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయడంలో భాగంగా టీచర్ల సర్దుబాటు జరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలల్లో 98 మంది కన్నా తక్కువగా విద్యార్థులున్న చోట స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లను సర్దుబాటు చేస్తోంది. శాటిలైట్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌, ప్రీ హైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌లుగా నూతన విద్యావ్యవస్థను అమలు చేయడానికి మ్యాపింగ్‌ చేపడుతోంది. ఇప్పటికే జిల్లాలో 219 ప్రైమరీ, ప్రాథమికోన్నత పాఠశాలలను 132 హైస్కూల్స్‌కి మ్యాపింగ్‌ చేశారు. ఎంపీయూపీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీగా విభజించి..అక్కడ ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లను సమీప హైస్కూళ్లకూ సర్దుబాటు చేస్తున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం శాటిలైట్‌ స్కూళ్లగా ఎల్‌కేజీ, యూకేజీలను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటుకూ...ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషన్‌ (ఒకటి నుంచి మూడో తరగతి వరకూ), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ల(ఒకటి నుంచి ఎనిమిది వరకూ), ప్రీ హైస్కూల్‌(ఒకటి నుంచి ఎనిమిది వరకూ), హైస్కూల్‌ (ఐదు నుంచి పది వరకూ), హైస్కూల్‌ ప్లస్‌ (ఇంటర్‌) అమలుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 98 మంది టీచర్ల కంటే తక్కువగా ఉన్నటువంటి 150 యూపీ స్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంట్లను సమీప హైస్కూల్‌కు సర్దుబాటు చేశారు. వీటిలో అనకాపల్లి జిల్లాలో 75 యూపీ స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేశారు. అదేవిధంగా అల్లూరి జిల్లాలో 64 యూపీ స్కూళ్లలో చేశారు.

Published date : 23 Jun 2023 07:01PM

Photo Stories