Skip to main content

Jallianwala Bagh Massacre: జలియన్ వాలాబాగ్ ఊచకోత‌కు 104 ఏళ్లు..

భారత జాతీయోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టమైన సంఘటన. నాటి వలస పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయక ప్రజ‌లు ప్రాణాలు పోయాయి.
Jallianwala Bagh Massacre Day

జలియన్ వాలాబాగ్ ఊచకోత ఉదంతం జరిగి నేటికి 104 ఏళ్లు పూర్త‌యింది. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే బ్రిటిషర్లు రౌలత్ చట్టాన్ని(21 మార్చి 1919న) తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్‌ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు.  జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ నగరంలోని ఓ తోట. 1919 ఏప్రిల్ 13న పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండగ సందర్భంగా వేలాది మంది జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు. ఈ వేడుకల్లోనే స్వాతంత్య్ర‌ పోరాట యోధుడు సైఫుద్దీన్ కిచ్లేవ్‌, సత్యపాల్‌ను బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా ప‌లువురు జాతీయోద్యమ నేతలు సమావేశమై శాంతియుతంగా నిరసన తెలిపారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు ఉన్నాయి.

World Health Day: మనం తినే ఆహారమే ఔషధం..

ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ ఓ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై కాల్పుల వ‌ర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించిన‌ట్లు నాటి పాలకులు తెలిపారు. 
కానీ కాల్పుల్లో 1000కి పైగా చనిపోగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. ప‌లువురు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా తోడ గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే స‌మ‌యంలో డయ్యర్ జన సంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమేగాక చివరకు గాయపడినవారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో ఈ ఉదంతం ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.

Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్‌రామ్.. సమతావాది.. సంస్కరణవాది..
ఈ దుర్ఘ‌ట‌న‌పై ప్రభుత్వం లార్డ్‌ హంటర్‌ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని నియమించింది. హంటర్‌ విచారణ సంఘం 1920, మే 20న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జ‌లియ‌న్ వాలాబాగ్‌ సంఘటనలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని నిర్ణయించింది. పైగా డయ్యర్ ఉద్దేశ‌పూర్వకంగా కాల్పులు జరపలేదని, కానీ ఆయ‌న నిర్ణయంలో పెద్ద పొరపాటు దొర్లిందని చెప్పింది. హంటర్‌ నివేదిక రాకముందే డయ్యర్‌ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. బ్రిటిష్‌ సమాజం డ‌య్య‌ర్‌కు ‘బ్రిటిష్‌ సామ్రాజ్య పరిరక్షకుడు’ అన్న బిరుదునిచ్చి సత్కరించింది. బ్రిటన్‌ పార్లమెంటు ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించి ‘పంజాబ్‌ రక్షకుడు’ అంటూ బిరుదులను అంకితం చేసింది. కాగా దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాత్రం డయ్యర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన అతడిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి.. భారత్‌లో మళ్లీ పనిచేయకుండా లండన్‌కు పంపింది. అనంత‌రం ‘సర్‌’ బిరుదుతో సత్కరించింది. ఈ ఘటన జరిగిన 20 సంవ‌త్స‌రాల తర్వాత ఉద్దమ్‌సింగ్‌ అనే దేశభక్తుడు లండన్‌ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్‌ను హతమార్చి జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు.  

Potti Sriramulu: ఆధునిక శిబిచక్రవర్తి అమరజీవి.. నేడు పొట్టి శ్రీరాములు జయంతి

Published date : 13 Apr 2023 04:12PM

Photo Stories