Skip to main content

NIMCET 2024 Notification: NIMCET ప్రత్యేకత, ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ.. ఎంసీఏతో కెరీర్‌ అవకాశాలు..

పీజీ స్థాయిలో కంప్యూటర్‌ స్పెషలైజేషన్‌తో.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ నిట్‌ల్లో ఎంసీఏలో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నిట్‌లు నిర్వహించే నిమ్‌సెట్‌లో స్కోర్‌తో ప్రవేశం సొంతం చేసుకోవచ్చు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిమ్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిమ్‌సెట్‌ ప్రత్యేకత, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, సిలబస్‌ విశ్లేషణ, ఎంసీఏతో కెరీర్‌ అవకాశాలు తదితర వివరాలు..
Computer Specialization Opportunity   MCA Admissions Notification   Career Opportunities with MCA Degree   Selection Procedure for MCA  Exam Pattern Analysis  NIMCET 2024 Notification and Specialties and Selection Process and Syllabus Analysis
  • నిట్‌ క్యాంపస్‌ల్లో ఎంసీఏ ప్రవేశాలకు నిమ్‌సెట్‌
  • నిట్‌ల్లో ఎంసీఏతో ఐటీలో దీటైన కెరీర్‌ అవకాశాలు
  • నిమ్‌సెట్‌–2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌.. సంక్షిప్తంగా ఎంసీఏ. ఈ కోర్సు బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత కంప్యూటర్‌ పీజీకి చక్కటి మార్గం. ఎంసీఏను బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివేందుకు అవకాశం కల్పిస్తుంది నిమ్‌సెట్‌. దేశంలో ఇంజనీరింగ్‌ కోర్సులను అందించడంలో మంచి పేరున్న నిట్‌లు.. పీజీ స్థాయిలో మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షనే.. నిట్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌).

11 క్యాంపస్‌లు.. 1,033 సీట్లు
నిమ్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రస్తుతం 11 నిట్‌ క్యాంపస్‌ల్లో ఎంసీఏలో ప్రవేశం కల్పిస్తున్నారు. అగర్తల–30 సీట్లు, అలహాబాద్‌–116 సీట్లు, భోపాల్‌–115, జంషెడ్‌పూర్‌– 115, కురుక్షేత్ర–64, కురుక్షేత్ర (సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌) 32, రాయ్‌పూర్‌ 110, సూరత్‌కల్‌–58, తిరుచిరాపల్లి–115, వరంగల్‌–58, భోపాల్‌ –60, పాట్నా (డేటా సైన్స్, ఇన్ఫర్మాటిక్స్‌– 40, పాట్నా (ఏఐ అండ్‌ ఐఓటీ)–40 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నిట్‌ పాట్నాలో డేటా సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ విధానంలో 40; అదే విధంగా ఐఏ అండ్‌ ఐఓటీలోనూ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ విధానంలో మరో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నిట్‌ సూరత్‌కల్, నిట్‌–వరంగల్‌ క్యాంపస్‌లు మూడేళ్ల వ్యవధిలో ఎంసీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తూ.. రెండో ఏడాది తర్వాత ఎగ్జిట్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత మానేయాలనుకునే వారికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు.

చదవండి: Humane AI Pin: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్‌ ఎలా పనిచేస్తుందంటే..

అర్హతలు
మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లలో ఏదో ఒకటి ప్రధాన సబ్జెక్ట్‌గా 60 శాతం మార్కులు/ 6.5 సీజీపీఏతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు లేదా 6 జీపీఏ పొందాలి) ఉండాలి. (లేదా) బీఈ/బీటెక్‌ చదివిన వారు కూడా నిమ్‌సెట్‌–2024కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీబీఏ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సు ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. అదే విధంగా అర్హత కో­ర్సు చివరి సంవత్సరం/సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు సెప్టెంబర్‌ 30 లోపు సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.

3 విభాగాలు.. 1000 మార్కులు
నిమ్‌సెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం మూడు విభాగాల్లో వేయి మార్కులకు ఉంటుంది. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు–600 మార్కులకు అడుగుతారు. రెండో విభాగంలో అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు–240 మార్కులకు ఉంటాయి. మూడో విభాగంలో కంప్యూటర్‌ అవేర్‌రెస్‌ 20 ప్రశ్నలు–120 మార్కులకు; జనరల్‌ ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు–40 మార్కులకు అడుగుతారు. నెగెటివ్‌ మార్కుల విధానం ఉంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

ఉమ్మడి కౌన్సెలింగ్‌ అడ్మిషన్‌
నిమ్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించే 11 నిట్‌లు ఆన్‌లైన్‌ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయిస్తాయి. అభ్యర్థులు నిమ్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా నిమ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఇలా అప్లికేషన్‌ పూర్తి చేసే సమయంలోనే ప్రాధాన్యతా క్రమంలో తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, ఎంచుకున్న ఇన్‌స్టిట్యూట్‌లు, అందుబాటులో ఉన్న సీట్ల ఆ«ధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు.

ఉజ్వల అవకాశాలు
నిమ్‌సెట్‌ ద్వారా నిట్‌ల్లో ఎంసీఏలో ప్రవేశం పొందితే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఏర్పడినట్లే!. ఈ కోర్సు బోధనలో నిట్‌లు అనుసరిస్తున్న ప్రమాణాలు, నాణ్యత కారణంగా విద్యార్థులకు కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. దీంతో వీరికి సీఎస్‌ఈ అభ్యర్థులకు దీటుగా అవకాశాలు లభిస్తున్నాయి. గత మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. సదరు నిట్‌ల్లో ఎంసీఏ పూర్తి చేసుకున్న వారిలో నూటికి తొంభై శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఖరారవుతున్నాయి. అదే విధంగా వేతనాలు కూడా సగటున రూ.ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు లభిస్తున్నాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 2024, ఏప్రిల్‌ 20.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: 2024, ఏప్రిల్‌ 24–ఏప్రిల్‌ 26.
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 28 – జూన్‌ 8.
  • నిమ్‌సెట్‌ పరీక్ష తేదీ: 2024, జూన్‌ 8 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.nimcet.in/

చదవండి: Career opportunities: డేటా స్కిల్స్‌.. భలే డిమాండ్‌!


బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు
మ్యాథమెటిక్స్‌
ఈ విభాగానికి సంబంధించి విద్యార్థులు తమ బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సెట్‌ థియరీ, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, కో ఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. వీటిలో సంబంధిత అంశాల కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌పై పట్టు సాధించాలి.ప్రాక్టీస్‌కు అధిక ప్రాధా­న్యం ఇవ్వాలి. అదే విధంగా సైంటిఫిక్‌ కంప్యూటర్‌ కాలిక్యులేటర్‌పై అవగాహన పెంచుకోవాలి.

అనలిటికల్‌ ఎబిలిటీ,లాజికల్‌ రీజనింగ్‌
అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌.. నిమ్‌సెట్‌లో మరో కీలక విభాగం. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యాలను, అదే విధంగా తార్కిక ఆలోచనను పెంచుకోవాలి.
ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలను చదువుతూ ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా నిమ్‌సెట్‌ గత ప్రశ్న పత్రాల సాధన కూడా ఉపకరిస్తుంది.

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌
అభ్యర్థుల్లోని కంప్యూటర్‌ బేసిక్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా డేటా రిప్రజెంటేషన్‌ అంశాలపైనా పట్టు సాధించాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌
అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి మార్కులు పొందడానికి కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం కాంపిటీటివ్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ బుక్స్‌ను అధ్యయనం చేయాలి. వీటితోపాటు కాంప్రెహన్షన్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను చదవడం మంచింది.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
అభ్యర్థులు రీడింగ్‌తో పాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రిపరేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి సెల్ఫ్‌ టెస్ట్‌లు రాసుకోవాలి. అదే విధంగా మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఎంతో మేలు చేస్తుంది.

Published date : 25 Mar 2024 04:32PM

Photo Stories