డిజిటల్ విద్యతో నైపుణ్యాలు అసాధ్యమే: ఎన్‌సీఈఆర్‌టీ
ఇంటర్మీడియెట్ కాలేజీలు ఆరంభమైనా లెక్చరర్లు మాత్రమే వస్తున్నారు. డిగ్రీ, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా తెరుచుకోలేదు. విద్యా సంస్థలు మొదలవ్వడం ఆలస్యమైతే ఆన్‌లైన్ బోధన తప్పనిసరవుతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ బోధన సాగుతోంది. అయితే ఇది ఏ మేరకు విద్యార్థులకు సామర్థ్యాలను, నైపుణ్యాలను అందించగలదన్న ప్రశ్న నిపుణుల నుంచి వినిపిస్తోంది.
అందరికీ అందుబాటులో లేని ఆన్‌లైన్ పాఠాలు
- పభుత్వ విద్యా సంస్థల్లో సగానికిపైగా విద్యార్థులకు కంప్యూటర్లు, ట్యాబ్, టీవీలు అందుబాటులో లేవు. దీంతో వారికి ఆన్‌లైన్ పాఠ్యాంశాలు సమాన రీతిలో అందడం లేదు.
- రాష్ట్రంలో మొత్తం 62,305 పాఠశాలలుండగా అందులో ప్రభుత్వ స్కూళ్లు 45,149, ప్రైవేటు స్కూళ్లు 17,156 ఉన్నాయి. వీటిలో 72,31,253 మంది చదువుతున్నారు.
సామర్థ్యాల పెంపు అంతంతే..
- ఆన్‌లైన్ బోధన వల్ల పూర్తిస్థాయి నైపుణ్యాలు అందవని నిపుణులు పేర్కొంటున్నారు.
- పాఠశాలల స్థాయిలో ఆన్‌లైన్ బోధన వల్ల ప్రయోజనం లేకపోగా పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయని ఇటీవల యునిసెఫ్ తేల్చిచెప్పింది.
- ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆన్‌లైన్ బోధనకు సమయ పరిమితులను విధించింది. 1-8 తరగతులకు రోజుకు రెండు క్లాసులు, 12వ తరగతి వరకు 4 క్లాసులుండాలని వెల్లడించింది.
కంటెంట్ సమస్యలు
- ఆన్‌లైన్ పాఠాలు రొటీన్‌గా కాకుండా వారితో ప్రయోగాలు చేయించే పద్ధతిలో ఉండాలని నిపుణులు అంటున్నారు.
- డిజిటల్ పరికరాలు, నెట్ సదుపాయం లేని గ్రామాల్లో ప్రత్యేక టీవీ లేదా స్క్రీన్ ఉపయోగించి వీడియో పాఠాలు చెప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- కంటెంట్ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వమే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక చానెల్ నిర్వహించాలని, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లు అందించాలని చెబుతున్నారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, విద్యార్థుల వివరాలు..
జిల్లా | ప్రభుత్వ | ప్రైవేటు | మొత్తం విద్యార్థులు | స్కూళ్లు |
శ్రీకాకుళం | 3,880 | 1,253 | 5,133 | 3,76,399 |
విజయనగరం | 4,883 | 1,379 | 6,262 | 3,08,571 |
విశాఖపట్నం | 4,309 | 1,775 | 6,084 | 6,90,970 |
తూర్పు గోదావరి | 3,340 | 1,594 | 4,934 | 7,41,981 |
పశ్చిమ గోదావరి | 3,279 | 1,336 | 4,615 | 5,42,415 |
కృష్ణా | 2,738 | 1,890 | 4,628 | 6,25,734 |
గుంటూరు | 2,887 | 1,561 | 4,448 | 7,01,100 |
ప్రకాశం | 3,393 | 1,158 | 4,551 | 4,91,361 |
నెల్లూరు | 3,277 | 1,199 | 4,476 | 4,04,496 |
వైఎస్సార్ | 3,289 | 600 | 3,889 | 4,51,298 |
కర్నూలు | 4,049 | 1,402 | 5,451 | 7,06,445 |
అనంతపురం | 2,766 | 645 | 3,411 | 6,10,635 |
చిత్తూరు | 3,059 | 1,364 | 4,423 | 5,79,848 |
మొత్తం | 45,149 | 17,156 | 62,305 | 72,31,253 |
వర్చువల్ పాఠ్యాంశాలపై కసరత్తు
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు బోధన సాగాలంటే ఈ-పాఠశాలలు, ఈ- కంటెంట్‌ను అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాల్లో తెరలు అమర్చి పాఠాలు బోధిస్తున్నాం.
- బి.ప్రతాప్‌రెడ్డి, డెరైక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ
ఆశించిన సామర్థ్యాలు రాబట్టలేం
ప్రత్యక్ష బోధన ద్వారానే విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందిం చగలరు. ఆన్‌లైన్ బోధనలో విద్యార్థులు వింటున్నారో, లేదో ఉపాధ్యాయులు గ్రహించలేరు. దీంతో విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలను రాబట్టలేం.
- ఎన్.మోహన్‌దాస్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులతో సంబంధాలు ఉండవు. ఆన్‌లైన్ క్లాసులు చెప్పా లంటే ముందుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి.
- గౌస్ భాషా, అధ్యాపకులు, కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లూరు