Skip to main content

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఏపీ విద్యార్థులకు కష్టాలు: తెలంగాణా ప్రభుత్వం ఈ పని చేయడం వల్లే!

సాక్షి, అమరావతి: తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఏపీ విద్యార్థులు తమ కోటా సీట్లను పొందలేని పరిస్థితి తలెత్తింది.
కోవిడ్-19 వల్ల రాష్ట్రంలో టెన్‌‌త పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఎవరికీ గ్రేడ్లు, మార్కులు లేకపోవడంతో తెలంగాణలోని ట్రిపుల్ ఐటీలో స్థానికేతర కోటాలో దక్కాల్సిన సీట్లు దూరమవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో 1,500 సీట్లుండగా అందులో 15 శాతం స్థానికేతర కోటా కింద మెరిట్ ప్రాతిపదికన కేటాయించాలి. మార్కులు, గ్రేడ్లు లేకపోవడం రాష్ట్ర విద్యార్థులకు సమస్యగా మారింది. అక్కడి అధికారులు 85 శాతం కోటాలో ఎంపికై న స్థానిక అభ్యర్థుల జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్ కూడా పూర్తిచేశారు. ఈ 15 శాతం సీట్లను మాత్రం అలాగే వదిలేశారు. ఇక ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆర్జీయూకేటీ నిర్ణయించింది. ఈ మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు ట్రిపుల్ ఐటీలుండగా మొత్తం 4 వేల సీట్లున్నాయి. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన ఉమ్మడిగా కేటాయించనున్నారు. ఈనెల 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Published date : 04 Nov 2020 03:53PM

Photo Stories