Skip to main content

RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 19,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..! ఇది ఫేక్‌ న్యూస్‌..

సాక్షి ఎడ్యుకేషన్‌ : రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాల పేర కేటుగాళ్లు నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.

మామూలు మాటలు చెబితే అభ్యర్థులు నమ్మరన్న ఉద్దేశంతో, ఫేక్‌ నోటిఫికేషన్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వీరి వలలో పడినట్లు తెలుస్తోంది. తాజా గా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వే కార్యాలయాలకు అభ్యర్థులు వచ్చి, దరఖాస్తులు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటాయో వాకబు చేయటం ప్రారంభించారు. దీంతో గుట్టు రట్టయింది.  
 

దరఖాస్తు ఆప్షన్‌ రాకపోవడంతో.. 
రైల్వేలో ఉద్యోగాల పేర మోసగాళ్లు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తరచూ వెలు గు చూస్తున్నాయి. వీరితో స్టడీ సెంటర్ల నిర్వాహకు లు కొందరు చేతులు కలుపుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూ లు చేస్తుంటే, వారికి పరీక్ష కోసం శిక్షణ పేరుతో స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందా నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో తాజా గా 19,800 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయిందంటూ ఆర్‌పీఎఫ్‌ పేరుతో ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. 

కొన్ని పత్రికల్లో కూడా ఈ ప్రకటన ప్రచురితమైంది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేల మందిలో ఆశలు రేకెత్తాయి. దీంతో కేటుగాళ్లు ఉద్యోగాలిప్పిస్తామంటూ దందా ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రోజులు గడుస్తున్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రైల్వే కార్యాలయాలకు వెళ్లి వాకబు చేయటం ప్రారంభించటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.  

ప్రస్తుతం ఎలాంటి రిక్రూట్‌మెంటూ లేదు.. 
తామెలాంటి రిక్రూట్‌మెంట్‌ ప్రస్తుతం చేపట్టడం లేదని, అది నకిలీ ప్రకటన అంటూ అధికారులు వెల్లడించారు. సాధారణంగా రైల్వే ఉద్యోగాల భర్తీ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ద్వారా జరుగుతుంది. కానీ ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాలు వీటి ద్వారా కాకుండా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం రైల్వే బోర్డు అలాంటి కమిటీ ఏదీ ఏర్పాటు చేయలేదు. కానీ ఏకంగా 19,800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలకు తెరతీయటం రైల్వేలో దుమారం రేపుతోంది. దీని వెనుక ఉన్నవారి కోసం రైల్వే పోలీసులు వేట ప్రారంభించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

ఇలాంటి ప్రకటనలు నమ్మొద్దు .. 
రైల్వేలో ఎలాంటి ఉద్యోగ భర్తీ కసరత్తు మొదలైనా ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, రైల్వే బోర్డు ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు నోటిఫికేషన్‌ జారీ చేస్తాయి. ఇవన్నీ రైల్వే అ«దీకృత వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే వెల్లడవుతాయి. సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ నోటిఫికేషన్ల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. కేటుగాళ్లు వాటిని సృష్టించి మోసగించే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. 
                                                                                         – దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్‌ 
 

Published date : 12 Jan 2023 06:55PM

Photo Stories