Skip to main content

వైద్య విద్య నిబంధనల్లో జోక్యం చేసుకోలేము: హైకోర్టు

సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉందని, అందువల్ల విశ్వవిద్యాలయ నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్‌లో మొదటి సంవత్సరం ఫెయిలైనా రెండో సంవత్సరంలోకి అనుమతించేలా జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను ఆదేశించాలంటూ 114 మంది వైద్య విద్యార్థులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. రెండో సంవత్సరంలో బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులను రాసేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఎన్‌ఎంసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యార్థులు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం రెండు వారాలకు వాయిదా వేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్‌ఎంసీ, ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం తదితరులను ఆదేశించారు. ఎన్‌ఎంసీ తరఫున న్యాయవాది సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారని, వారిని రెండో సంవత్సరానికి అనుమతించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని విద్యార్థులను ఉన్నత తరగతులకు పంపడం వైద్య వృత్తి స్థాయిని తగ్గించడమే అవుతుందన్నారు. ఈ వాదనలతో న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఏకీభవిస్తూ విద్యార్థుల అనుబంధ పిటిషన్‌ను కొట్టేశారు.
Published date : 05 Aug 2021 03:30PM

Photo Stories