‘మెడికల్’ కన్వీనర్ కోటాకు 14,300 దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో వైద్య విద్య అభ్యసించేందుకు 14,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ధ్రువపత్రాల పరిశీలన మరో 7 రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించడంతో పాటు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. తొలి విడత ప్రవేశాలు పూర్తయిన అనంతరం యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నారు. అఖిల భారత కోటాలోనూ ఎయిమ్స్, జిప్‌మర్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల గడువును పెంచారు. ఈ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14లోపు కళాశాలల్లో చేరాల్సి ఉండగా.. గడువును మరో రెండ్రోజులు పొడిగిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండో విడత ప్రవేశాలు 18న ప్రారంభం కానుండగా.. 25న సీట్ల కేటాయింపు సమాచారాన్ని ప్రకటిస్తారు.
Published date : 12 Nov 2020 04:58PM