ఈ ఉద్యోగులను తొలగిస్తే కఠిన చర్యలు..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోని కొన్ని మేనేజ్‌మెంట్ తమ కాలేజీల నుంచి ఇప్పటికే చాలా మంది సిబ్బందిని (టీచింగ్ & నాన్-టీచింగ్) తొలగించినట్లు తెలిసిందని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది.
ఈ మేరకు నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా భవన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి పరిస్థితిలో సిబ్బందికి జీతాలు చెల్లించలేక తొలగించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇది G.O.Ms.45, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ: 22-03-2020 రెగ్యులేషన్ 14కు వ్యతిరేకం అయినందున ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు తీసుకోంటామని తెలిపింది. ఇంకా నిర్దేశించిన క్వాలిఫైడ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేకపోతే కూడా ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21 అఫిలియేషన్ దరఖాస్తులు తిరస్కరించనున్నట్లు తెలిపింది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యలు, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని, తప్పుగా వ్యవహరించిన యజమాన్యానికి ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయనున్నట్లు తెలిపింది.
Published date : 11 Sep 2020 07:44PM