Skip to main content

9 కోట్ల ఉద్యోగాలు అవసరం...ఏఏ రంగాల్లో అంటే..?

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగార్ధులు ఏటా జాబ్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుండటంతో 2022 నుంచి 2030 వరకూ ఎనిమిదేళ్లలో 9 కోట్ల మంది అదనంగా ఉద్యోగ వేటలో ఉంటారని మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎంజీఐ) అంచనా వేసింది.
వీరందరికీ ఉద్యోగాలు దక్కాలంటే భారత్‌ ఏటా 8 నుంచి 8.5 శాతం మధ్య వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. మారుతున్న పరిస్థితుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగి 5.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాన్వేషణలో ఉంటారని, వీరి సంఖ్య అదనమని ఎంజీఐ పేర్కొంది. ఇంతటి పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చేందుకు భారీ సంస్కరణలు చేపట్టడం అనివార్యమని, లేనిపక్షంలో పదేళ్ల గరిష్టస్ధాయిలో ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొంటుందని హెచ్చరించింది.

ప్రస్తుత జనాభా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో 6 కోట్ల మంది కొత్తగా శ్రామిక శక్తిలో కలుస్తారని, మరో 3 కోట్ల మంది వ్యవసాయ పనుల నుంచి వ్యవసాయేతర, ఉత్పాదక రంగాలకు మళ్లుతారని భారత్‌లో కీలక మలుపు. 'వృద్ధి, ఉద్యోగాల కోసం ఆర్థిక అజెండా' పేరిట ఎంజీఐ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కోవిడ్‌-19 అనంతరం 2029-30 వరకూ వ్యవసాయేతర ఉద్యోగాల్లో ఏటా 1.2 కోట్ల ఉద్యోగాల వృద్ధి కీలకమని పేర్కొంది. 2012-18 వరకూ ఏటా కేవలం 40 లక్షల ఉద్యోగాలే అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఉత్పాదక, వ్యవసాయ ఎగుమతులు, డిజిటల్‌ సేవలు వంటి రంగాల్లో గ్లోబల్‌ హబ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోటీతత్వాన్ని పెంచడం, రవాణా, విద్యుత్‌ రంగాలను పటిష్టపరచడం కీలకమని నివేదిక తెలిపింది. నూతన జీవన, పని విధానాలు, షేరింగ్‌ ఎకానమీ, ఆధునీకరించబడిన రిటైల్‌ వ్యవస్థ వంటి వినూత్న విధానాలకు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Published date : 28 Aug 2020 03:28PM

Photo Stories