JoSAA Counselling 2023: అడ్వాన్స్‌డ్, మెయిన్స్ ఉత్తీర్ణులకు జోసాతోనే అడ్మిషన్... కౌన్సెలింగ్ ఇలా!
- ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు జోసా
- అడ్వాన్స్‌డ్, మెయిన్స్ ఉత్తీర్ణులకు జోసా కౌన్సెలింగ్‌తోనే అడ్మిషన్
- ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణ
- ఈ నెల 19 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్
50 వేలకు పైగా సీట్లు
- 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మ రో 38 టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉంటాయి.
- ఇన్‌స్టిట్యూట్స్ వారీగా సీట్ల వివరాలు: ఐఐటీలు-16,598, ఎన్‌ఐటీలు-23,994, ట్రిపుల్ ఐటీలు-7,126, జీఎఫ్‌టీఐలు-6,759.
- ఈ ఏడాది కూడా మహిళా విద్యార్థులకు 20 శాతం తక్కువ కాకుండా.. సూపర్ న్యూమరరీ కోటా పేరుతో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఛాయిస్ ఫిల్లింగ్
- జేఈఈ-అడ్వాన్స్‌డ్, మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జోసా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని.. తమ వివరాలు పొందుపరచాలి. తమ ఆసక్తి మేరకు కోర్సు, ఇన్‌స్టిట్యూట్ ప్రాథమ్యాలను ఆన్‌లైన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. ఇలా ప్రాథమ్యాలను పేర్కొనడాన్నే.. ఛాయిస్ ఫిల్లింగ్ అంటారు.
- ఆన్‌లైన్‌లో ప్రాథమ్యాలను పొందుపరిచిన తర్వాత విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఉదాహరణకు.. ఒక విద్యార్థి మొదటి ప్రాథమ్యంగా ఐఐటీ-ఢిల్లీలోని సీఎస్‌ఈ బ్రాంచ్‌ను, రెండో ప్రాథమ్యంగా ఐఐటీ-ముంబైలోని సీఎస్‌ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటే..ఆ విద్యార్థి పొందిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ-ఢిల్లీలో సీటు లభించకపోతే.. ఐఐటీ-ముంబైలోని సీటుకు పరిగణనలోకి తీసుకుంటారు.
Joint Seat Allocation Authority (JoSAA)2023 Important Dates
అడ్వాన్స్‌డ్‌తో అన్నింటికీ అర్హత
జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐలు.. ఇలా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లను తమ ప్రాధాన్యత క్రమంలో పేర్కొనొచ్చు. మెయిన్‌లో అర్హత సాధించిన వారు నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీటు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు, ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. వీరికి ఐఐటీలకు అర్హత ఉండదు.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్
- ఆన్‌లైన్ విధానంలో జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆరు రౌండ్లలో జరుగుతుంది. మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు.. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- ఫ్రీజ్: మొదటి రౌండ్‌లోనే తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్, ప్రోగ్రామ్‌తో సంతృప్తి చెందితే ఫ్రీజ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో తదుపరి రౌండ్లకు ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకోరు. తొలిదశలో సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
- స్లైడ్: మొదటి రౌండ్‌లో నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక బ్రాంచ్‌లో సీటు వచ్చిన విద్యార్థి.. అదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో బ్రాంచ్‌లో సీటు కోరుకుంటే స్లైడింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఫ్లోట్: మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు నచ్చకపోతే.. మరింత మంచి ఇన్‌స్టిట్యూట్ లేదా బ్రాంచ్ కోసం ఫ్లోటింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఆ విద్యార్థి ప్రాథమ్యాలను తదుపరి రౌండ్లకు పరిగణనలోకి తీసుకుంటారు.
- ఇలా ఫ్లోటింగ్, స్లైడింగ్ ఆప్షన్‌లు పేర్కొనడం వల్ల అభ్యర్థులకు చివరగా కేటాయించిన సీట్లే ఖరారవుతాయి. తొలిదశలో లేదా అంతకుముందు దశల్లో వచ్చిన సీట్లు రద్దవుతాయి.
మాక్ సీట్ అలోకేషన్
- జోసా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. అదే రోజు నుంచి 'ఛాయిస్ ఫిల్లింగ్' ఆప్షన్‌ను వినియోగించుకుని.. తమ ప్రాథమ్యాలను(ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్ వివరాలు) ఆన్‌లైన్‌లో పేర్కొనాలి. ఇలా ఆన్‌లైన్‌లో నిర్దేశిత గడువు తేదీలోగా ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ముందుగా.. మాక్ సీట్ అలొకేషన్(నమూనా సీటు కేటాయింపు) వివరాలను అందుబాటులో ఉంచుతారు. అంటే.. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల వివరాలు తెలుస్తాయి. మాక్ సీట్ అలొకేషన్ జాబితాను బేరీజు వేసుకున్న విద్యార్థులు.. తమ ర్యాంకుకు ఇంకా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వస్తుందనుకుంటే..ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు.
ఆమోదం లేదా ఉపసంహరణ
సీట్లు పొందిన విద్యార్థులు.. ప్రతి రౌండ్ తర్వాత సీటు యాక్సప్టెన్స్ లేదా ఉపసంహరణ విషయాన్ని స్పష్టం చేయాలి. మొత్తం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో అయిదో రౌండ్ వరకే ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చివరి రౌండ్(ఆరో రౌండ్)లో ఉపసంహరణకు వీలుండదు.
రిపోర్టింగ్ తప్పనిసరి
ప్రతి రౌండ్ సీట్ అలొకేషన్ తర్వాత విద్యార్థులు నిర్దిష్ట గడువులోపు తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి పేర్కొన్న రిపోర్టింగ్ సెంటర్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిపోర్ట్ చేయకపోతే.. సీటు రద్దవుతుంది. విద్యార్థులు తమకు ఆసక్తి లేని ఇన్‌స్టిట్యూట్‌లో చేరాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం.. ఒక రౌండ్‌లో నచ్చిన ఇన్‌స్టిట్యూట్ లేదా బ్రాంచ్ పట్ల ఆసక్తి లేకుంటే.. మిగతా రౌండ్లకు తమ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకునేలా సరళీకృత విధానం అమల్లో ఉంది.
Check List of 119 Institutes Participating in JOSAA 2023 Counselling
సీట్ యాక్సప్టెన్స్ ఫీజు తప్పనిసరి
- జోసా కౌన్సెలింగ్ విధానంలో సీటు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా సీట్ యాక్సప్టెన్స్ ఫీజును చెల్లించాలి. దీన్ని కూడా ఆన్‌లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ ఈ-చలాన్ రూపంలో మాత్రమే చెల్లించాలి.
- ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీటు పొందిన జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.35 వేలు;ఎస్‌సీ,ఎస్‌టీ, పీడబ్లు్యడీ విద్యార్థులు రూ.15 వేలు చొప్పున యాక్సప్టెన్స్ ఫీజు చెల్లించాలి.తర్వాత దశలో చివరగా తాము ప్రవేశించిన ఇన్‌స్టిట్యూట్‌కు అనుగుణంగా అకడమిక్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
కోర్ మొదలు ఏఐ వరకు
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్,మెకానికల్,ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌లు మొదలు.. తాజాగా డిమాండ్ నెలకొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా సైన్స్ వరకూ.. వినూత్న కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బయో ఇంజనీరింగ్, బయోటెక్ ఇంజనీరింగ్ తదితర వైద్య అనుబంధ కోర్సులను సైతం ఐఐటీలు, ఎన్‌ఐటీలు అందిస్తున్నాయి.
JOSAA JEE Main Opening and Closing Ranks
ఆ బ్రాంచ్‌లకే ఓటు
- ఐఐటీల్లో చేరే టాప్ ర్యాంకర్లు ముఖ్యంగా అయిదు బ్రాంచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటగా సీఎస్‌ఈ డిమాండింగ్ బ్రాంచ్‌గా అగ్రస్థానంలో ఉంటోంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్,సివిల్, మెకానికల్‌లను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. గత రెండేళ్లుగా అడ్వాన్స్‌డ్‌లో నాలుగు వేలలోపు ర్యాంకు పొందిన విద్యార్థులందరూ దాదాపు ఈ బ్రాంచ్‌లలోనే చేరారు.
- నాలుగేళ్ల ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్ లభించని విద్యార్థులు.. అయిదేళ్ల కోర్సులో సీటు దక్కినా చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సీఎస్‌ఈ విషయంలో నాలుగేళ్ల బీటెక్‌లో సీటు లభించకపోతే.. అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీలో చేరేందుకు సైతం వెనుకాడట్లేదు.
జోసా-2023
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు
- జూన్ 19: జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ప్రారంభం.
- జూన్ 25: మాక్ సీట్ అలొకేషన్ (సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-1 విడుదల. (జూన్ 24 రాత్రి 8 గంటల వరకు అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా దీన్ని విడుదల చేస్తారు.
- జూన్ 27: మాక్ సీట్ అలొకేషన్ (సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-2 విడుదల. (జూన్ 26 సాయంత్రం అయిదు గంటల వరకు పేర్కొన్న ప్రాథ్యమాల ఆధారంగా వెల్లడించనున్నారు).
- జూన్ 28: ఛాయిస్ ఫిల్లింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ.
- జూన్ 29: వివరాల పునస్సమీక్ష, పరిశీలన.
- జూన్ 30: మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూన్ 30-జూలై 4: మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలి. అదే విధంగా యాక్సప్టెన్స్ ఫీజును చెల్లించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- జూలై 6: రెండో దశ సీట్ల కేటాయింపు.
- జూలై 6-10: రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్.
- జూలై 7-11: రెండో రౌండ్‌లో పొందిన సీటు విషయంలో ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి విరమించుకునే అవకాశం.
- జూలై 12: మూడో రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూలై 12-14: మూడో రౌండ్ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్,డాక్యుమెంట్ అప్‌లోడ్.
- జూలై 13-15: మూడో రౌండ్ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి ఉపసంహరణ.
- జూలై 16: నాలుగో రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూలై 16-19: నాలుగో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ అప్‌లోడ్.
- జూలై 18-20: నాలుగో రౌండ్ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్ నుంచి ఉపసంహరణ అవకాశం.
- జూలై 21: అయిదో రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూలై 21-24: అయిదో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ అప్‌లోడ్, ఫీజు పేమెంట్.
- జూలై 21-25: అయిదో రౌండ్ తర్వాత సీటు విత్‌డ్రా లేదా కౌన్సెలింగ్ నుంచి ఉపసంహరణ అవకాశం.
- జూలై 26: ఆరో రౌండ్(చివరి రౌండ్) సీట్ల కేటాయింపు.
- జూలై 26-28: ఆరో రౌండ్‌లో పొందిన సీటుకు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు.
- వెబ్‌సైట్: https://josaa.nic.in/