JEE Mains-2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 ఫేజ్–1 ఫలితాల్లో తెలుగోళ్ల హవా
అనంతపురం : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 ఫేజ్–1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు పాలగిరి లక్ష్మీరెడ్డి కుమారుడు పాలగిరి సతీష్‌రెడ్డి 99.99 పర్సంటైల్ సాధించాడు. అలాగే అనంతపురం నగరానికి చెందిన బి.షేక్ ముజమ్మిల్ 99.96 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు నజ్హత్ కౌసర్, కలీముల్లాలు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరితో పాటు అనంతపురం నగరానికి చెందిన విద్యార్థులు శశికిరణ్ 99.89 పర్సంటైల్, చిగిచెర్ల మేఘన 99.64, పటాన్ ఆసింఖాన్ 99.23, మంగతి నవదీప్ 99.08, గంపల హరిచాణిక్య రెడ్డి 98.88, మన్నెపూరి సిద్ధార్థరెడ్డి 97.85, పొరకల శివప్రసాద్ 97.70, పట్నం భానుప్రకాష్ 97.45, కె.సీతారామచరణ్ 97.27, రాయపాటి వంశీకృష్ణారెడ్డి 97.23, ములకల అమృత్ 97.05, కప్పెత అజయ్‌కృష్ణారెడ్డి 96.79, కురబ శివసాయితేజ 96.52, బి.అనురిద్ 96.45, కూచి అరవింద్ 96.44, ఉస్తిలి మోహిత్‌కుమార్‌రెడ్డి 96.10, తలుపుల ప్రశాంతి 95.37, నాపా మహర్షి 95.30, పొన్నపాటి వినీల 95.26, జయం షణ్ముఖ శివాన్విత 95.25 పర్సంటైల్ సాధించారు. ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11.70 లక్షలమంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.40 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు.
మునగపాక: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించాడు మునగపాక మండలం గవర్ల అనకాపల్లికి చెందిన విద్యార్థి శర్వన్‌నాయుడు. ఒకటో తరగతి నుంచి చదువులో ముందుండి మంచి మార్కులు సాధిస్తూ వచ్చిన ఈ విద్యార్థి సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మెరుగైన పాయింట్స్ సాధించాడు. దొడ్డి కిరణ్‌కుమార్, నాగపార్వతీదేవీ దంపతుల కుమారుడైన శర్వన్‌నాయుడు చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్నాడు. గత నెల 29న జేఈఈ మెయిన్స్ పరీక్ష రాశాడు. అందులో ఓవరాల్‌గా 99.8216742 పాయింట్స్ (ఎన్‌టీఏ స్కోర్) సాధించాడు. ఐఐటీలో సీటు సాధించడమే తన లక్ష్యమని శర్వన్‌నాయుడు తెలిపాడు. అతనిని తల్లిదండ్రులతోపాటు తోటాడ సర్పంచ్ దొడ్డి మంగవేణి, కోటేశ్వరరావు దంపతులు, గ్రామస్తులు అభినందించారు.
సిద్దవటం : జిల్లాలోని కొందరు విద్యార్థులు మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటారు. సిద్దవటం మండలంలోని మాధవరం–1కు చెందిన కుడుముల రామ్ ధ్రువ సాయితేజ్‌రెడ్డి, వంతాటిపల్లికి చెందిన ముక్కర సాత్విక్ అనే విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. మాధవరం–1లోని హ్యాపీకిడ్స్ హైస్కూల్ కరస్పాండెంటు కుడుముల అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు రామ్‌ధ్రువ సాయితేజ్‌రెడ్డి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.38 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. సిద్దవటంలో పదో తరగతి చదివిన ఈ విద్యార్థికి గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అలాగే వంతాటిపల్లికి చెందిన ముక్కర వెంకటసుబ్బారెడ్డి కుమారుడు ముక్కర సాత్విక్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 96.61 శాతంతో ఉత్తీర్ణత సాఽధించారు. ఈ విద్యార్థి సిద్దవటంలో 10వ తరగతి చదివాడు. ఈ అబ్బాయికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
గురిజాల విద్యార్థి..
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన భూమిరెడ్డి నీలకంఠారెడ్డి కుమారుడు గగన్ శ్యాంసుందర్‌రెడ్డి 99.567 శాతంతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తమ కుమారుడి ప్రతిభకు కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ విద్యార్థికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఆ విద్యార్థి తెలిపారు.
ఎస్‌డీఆర్ విద్యార్థుల సత్తా
నంద్యాల : జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షల్లో ఎస్‌డీఆర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మేరకు ప్రతిభ చాటిన విద్యార్థులను మంగళవారం డీఎస్పీ కె.రవీంద్రారెడ్డి, ఎస్‌వీఆర్ కశాశాల చైర్మన్ వెంకటరామిరెడ్డి తదితరులు అభినందించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో మోహన్ కృష్ణ 99.95 శాతం సాధించి ప్రతిభ చూపారు. అలాగే జితేంద్ర 99.36 శాతం, కె.నాగపవన్‌కుమార్ 97.63, వి.కార్తీకేయరెడ్డి 96.78, 90 శాతంతో మొత్తం 18 మంది అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన విద్యార్థులను, అధ్యాపకులను ఎస్‌డీఆర్ కళాశాల చైర్మన్ కొండారెడ్డి అభినందించారు. అత్యాధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో సీఐ మంజునాథరెడ్డి, డాక్టర్ గెలివి సహదేవుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కె.కోటపాడు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండలంలోని కొరువాడ గ్రామానికి చెందిన కొరువాడ తేజేష్ 100 మార్కులకుగాను 98.2811924 పర్సంటెల్ స్కోర్(ఎన్‌టీఏ) సాధించాడు. సాధారణ మధ్య తరగతికి చెందిన గోవిందరావు, లోవమణిల కుమారుడు తేజేష్ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉంటూ మంచి మార్కులు సాధించేవాడు. గత నెల 29న జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాశాడు. ఈ నెల 12 విడుదలైన ఈ ఫలితాల్లో మంచి పర్సంటెల్ స్కోర్‌ను సాధించి అధ్యాపకులు, గ్రామస్తుల నుంచి అభినందనలు అందుకున్నాడు.
జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టరు బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం విద్యార్థి ఎస్. కార్తీక్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటాడు. దేవరాపల్లికి చెందిన అతడు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఓవరాల్‌గా 89.94 పర్సెంటెల్ స్కోర్ (మ్యాథ్స్–97.5156, ఫిజిక్స్–73.93305, కెమిస్ట్రీ–81.6489) సాధించాడు. ఈ మేరకు సదరు విద్యార్థిని గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ సిహెచ్. రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు.