Engineering
ముడి పదార్థాల నుంచి ఉత్పత్తులను తయారు చేసేందుకు కెమికల్ ఇంజనీర్లు కృషి చేస్తుంటారు. అందుకే కెమికల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యం సంతరించుకున్న కోర్సు. డిప్లొమా స్థాయిలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసిన వారు బీటెక్, ఎంటెక్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ఉన్నత విద్య
డిప్లొమా తర్వాత ఈసెట్ పరీక్ష ద్వారా నేరుగా బీఈ/బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. బీఈ/బీటెక్ అనంతరం ఇంకా ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రభుత్వ, ప్రయివేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్ ప్రోగ్రాంలో చేరొచ్చు.
ఉపాధి అవకాశాలు
- కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రయివేట్, ఆర్ అండ్ బీ రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఎరువులు, ఉక్కు, పాలిమర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పల్ప్ అండ్ పేపర్, రసాయనాలు వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్, ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రక్షణ దళాలు అయిన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
- ప్రయివేట్ రంగంలో గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, గోదావరి ఫెర్టిలైజన్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌తోపాటు స్టీల్, పేపర్, మెడికల్ ల్యాబొరేటరీస్‌లలోనూ ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్
- బయోమెడికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, కెమికల్ టెక్నీషియన్, కెమికల్ మెటీరియల్ సైంటిస్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీర్, మెయింటనెన్స్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు తదితర జాబ్ ప్రొఫైల్స్ లభిస్తాయి.
వేతనాలు
డిప్లొమా స్థాయి కెమికల్ ఇంజనీర్లకు వార్షిక వేతనం రూ.1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. డిగ్రీ, పీజీ స్థాయి వారికి సంస్థను బట్టి ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు లభిస్తుంది.
చదవండి: Engineering Jobs: మెకానికల్ ఇంజనీరింగ్.. ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ మార్గాలు