India vs South Test Series: టీమిండియాకు భంగపాటు..దక్షిణాఫ్రికా ఘన విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
తొలి టెస్ట్‌లోనే..
టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.