Shooting World Cup:ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో అర్జున్ కి స్వర్ణం
దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పసిడి బోణీ కొట్టింది. జూలై 11న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అర్జున్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం. 2016 జూనియర్ ప్రపంచకప్‌లో అతను స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అమెరికా షూటర్ లుకాస్ కొజెనిస్కయ్‌తో జరిగిన ఫైనల్లో అర్జున్ 17–9తో గెలుపొందాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో పోటీపడుతున్న ఇద్దరు షూటర్లలో తొలుత 16 పాయింట్లు గెలిచిన షూటర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో షాట్‌లో ఇద్దరు షూటర్లలో అత్యధిక స్కోరింగ్ షాట్ సాధించిన షూటర్‌కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇద్దరు స్కోరింగ్ షాట్ సమంగా ఉంటే ఒక్కో పాయింట్ ఇస్తారు. లుకాస్‌తో జరిగిన ఫైనల్లో 13 షాట్‌లలో అర్జున్ ఎనిమిదింట పైచేయి సాధించగా, లుకాస్ నాలుగు షాట్‌లలో భారత షూటర్‌కంటే ఎక్కువ స్కోరు చేశాడు. మరో షాట్‌లో ఇద్దరూ సమానంగా స్కోరింగ్ షాట్ కొట్టారు. అంతకుముందు ఎనిమిది మంది మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో అర్జున్ 261.1 పాయింట్లు, లుకాస్ 260.4 పాయింట్లు సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన పార్థ్ మఖీజా 258.1 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP