Skip to main content

International Chess Federation: గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నీ రన్నరప్‌గా హంపి

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ రెండో టోర్నమెంట్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది.
Koneru Humpy

ఫిబ్ర‌వ‌రి 13న‌ ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్‌ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. 
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్‌లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ 64 ఎత్తుల్లో జినెల్‌ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 14 Feb 2023 05:39PM

Photo Stories