Skip to main content

మార్చి 2019 రాష్ట్రీయం

హైదరాబాద్ లో ఇన్నోవ్యాప్టివ్ కేంద్రం ప్రారంభం
Current Affairs హైదరాబాద్‌లో ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, టెక్నికల్ సర్వీస్ సెంటర్ ప్రారంభమైంది. సైయింట్ చైర్మన్ బి.వి. మోహన్‌రెడ్డి మార్చి 25న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్నోవ్యాప్టివ్ సంస్థ సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్ రవండే మాట్లాడుతూ... 5 మిలియన్ డాలర్లతో, 150 వర్కింగ్ స్టేషన్లతో ఈ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. అమెరికాలోని హోస్టర్‌లో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉన్న ఇన్నోవ్యాప్టివ్ సంస్థ 16 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్నోవ్యాప్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం
Current Affairs డిజిటల్ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్థాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘సైబర్ రక్షక్’ పథకాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మార్చి 18న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ అనర్థాలు అరికట్టడంలో శిక్షణ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షి’ టీంల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్‌‌జ (టాస్క్) సహకారంతో ఎండ్ నౌ ఫౌండేషన్ సైబర్ రక్షక్ పథకాన్ని రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : సైబర్ నేరాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు

మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు గుర్తింపు

హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అంతర్జాతీయ సంస్థ మెర్సర్ ప్రతి ఏడాది వివిధ అంశాలపై నిర్వహించే సర్వేలో ఉత్తమంగా నిలిచి వరుసగా ఐదోసారి స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మార్చి 14న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘న్యూయార్క్‌కు చెందిన మెర్సర్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఈసారి మొత్తం 230 నగరాల్లో సర్వే చేయగా, మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. దేశానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణ విభాగంలో చెన్నై మొదటి స్థానంలో ఉండగా... హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో పుణేతో కలిసి ప్రథమ స్థానంలో నిలిచింది. పోలీసులకు నగర ప్రజలు అందిస్తున్న సహకారం, సీసీ కెమెరాల ఏర్పాటులో తోడ్పాటు తదితరాల నేపథ్యంలో వరుసగా ఐదోసారి హైదరాబాద్‌కు ఈ గుర్తింపు సాధ్యమైంది’అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు 4వ స్థానం
ఎప్పుడు : మార్చి 14
ఎందుకు : మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
Current Affairs తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు దిగుమతి చేసుకుంటామని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్‌గుడ్ మార్చి 4న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్‌గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని అన్నారు. తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్

కర్నూలులో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
కర్నూలు జిల్లాలో రూ.8,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మార్చి 2న కోడుమూరులో శంకుస్థాపన చేశారు. జిల్లాలోని గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాలువ, ఎల్‌ఎల్‌సీ వద్ద పైపులైను ఏర్పాటు కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సహకారంతో ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్నూలులో సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్

నారీశక్తి పేరుతో రాజకీయపార్టీ ఆవిర్భావం
స్త్రీ అభివృద్ధే సమాజాభివృద్ధి నినాదంతో ‘నారీశక్తి’ పేరుతో నూతన రాజకీయపార్టీ ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మార్చి 3న పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు కావూరి లావణ్య మాట్లాడుతూ... సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు భవిత కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నారీశక్తి పేరుతో రాజకీయపార్టీ ఆవిర్భావం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కావూరి లావణ్య
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్ ప్లాంటు
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటుచేయనున్నట్లు ఓలెక్ట్రాను ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ డెరైక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. బీవైడీ-ఓలెక్ట్రా తయారీ 40 ఎలక్ట్రిక్ బస్‌లను టీఎస్‌ఆర్‌టీసీ హైదరాబాద్‌లో మార్చి 5న ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వెల్లడించారు. కొత్త ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఓలెక్ట్రా సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్

హైదరాబాద్‌లో డీబీఐఎల్ తొలి బ్యాంక్ ప్రారంభం
హైదరాబాద్‌లో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తొలి బ్యాంక్ మార్చి 5న ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీబీఐఎల్ సీఈఓ సురోజిత్ షోమీ మాట్లాడుతూ... డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుందని తెలిపారు. ఇక్కడి నుంచే మన దేశంతో పాటూ చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్‌లకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
25 సంవత్సరాల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. 2019, మార్చి 1న ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది 2018, డిసెంబర్‌లో ఆర్‌బీఐ అనుమతి పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీబీఐఎల్ తొలి బ్యాంక్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : హైదరాబాద్
Published date : 13 Mar 2019 05:20PM

Photo Stories