జూలై 2018 రాష్ట్రీయం
స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య (96) జూలై 25న కన్నుమూశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన చంద్రయ్య రజాకార్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. మహారాష్ట్రలో మిలిటరీ శిక్షణ తీసుకున్న ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రయ్య కాంగ్రెస్ విధానాలు నచ్చక సోషలిస్టు పార్టీలో చేరారు.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డితో కలసి ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్‌ను చంద్రయ్య స్థాపించారు. అలాగే బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శిగా 18 ఏళ్ల పాటు పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత
ఎప్పుడు : జూలై 25
ఎవరు : పడాల చంద్రయ్య (96)
ఎక్కడ : భీమదేవరపల్లి, వరంగల్ అర్బన్ జిల్లా
ఎందుకు : అనారోగ్యం కారణంగా
‘పశుపోషణ - పంచసూత్రాలు’ పుస్తకావిష్కరణ
ఆచార్య వి.ఎన్.విశ్వనాథ రెడ్డి రచించిన ‘పశుపోషణ-పంచసూత్రాలు’ అనే పుస్తకంను ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్సింగ్ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జూలై 26న ఆవిష్కరించారు. పశువుల జాతి, మేత, ఆరోగ్యం, పునరుత్పత్తి, ఆదాయం వంటి పంచసూత్రాలతో పాటు ఆర్గానిక్ ఎరువుల తయారీ, యంత్రాల వినియోగం వంటి విషయాలను ఈ పుస్తకంలో వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘పశుపోషణ-పంచసూత్రాలు’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 27
ఎవరు : ఆచార్య వి.ఎన్.విశ్వనాథ రెడ్డి
ఎక్కడ : పాయకరావుపేట, విశాఖపట్నం జిల్లా
ఎంబీసీలోకి మరో 35 కులాలు
తెలంగాణలోని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం జూలై 26న ఉత్తర్వులు జారీ చేసింది. జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంబీసీ యాక్ట్-2013 కింద వీటిని చేర్చింది.
ఈ కేటగిరీలో బాలసంతి/బాహుపురి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ/మొండివరు, వంశరాజ్/పిచ్చిగుంట్ల, పాముల, పర్ది, పంబలా, పెద్దమ్మవండ్లు/దేవరవండ్లు/ఎల్లమ్మవండ్లు/ముత్యాలమ్మవండ్లు/దమ్మాలి, వీరముష్టి/వీరబద్రీయ, గుడాలా, కంజారా-బట్ట, రెడ్డిక/కెంపర, మొండెపట్ట, నొక్కర్, పర్కిముగ్గుల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివాలాస్, మందుల, కునపలి, పట్ర, పాల ఎక్రాయి/ఎకిల/వ్యాకుల/ఎకిరి/నాయినవారు/పాలేగారు/తొలగరి/కావలి, రాజన్నలా/రాజన్నలు, బుక్కఅయ్యవారు, గొట్రాలా, కస్కిపడి/కస్కిపుడి, సిద్దుల, సికిల్‌గర్/సైకల్‌గర్, అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంబీసీ కేటగిరీలోకి మరో 35 కులాలు
ఎప్పుడు : జూలై 27
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : ఆ కులాల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు
హైదరాబాద్‌లో తొలి బ్లాక్‌చైన్ కాంగ్రెస్
హైదరాబాద్, గోవాలో తొలి అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఆగస్టు 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో, 5న గోవాలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ జూలై 26న వెల్లడించారు. నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు, న్యూక్లియస్ విజన్ లు సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సులో ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ల యజమానులతోపాటు మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను అత్యంత సురక్షితంగా భద్రపరిచేందుకు బ్లాక్‌చైన్ సాఫ్ట్‌వేర్‌ను ‘ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రూఫ్ లెడ్జర్’గా రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్
ఎప్పుడు : ఆగస్ట్ 3 నుంచి 5 వరకు
ఎవరు : నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు, న్యూక్లియస్ విజన్
ఎక్కడ : హైదరాబాద్, గోవా
ఐటీడీఏ తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభం
తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) తొలి ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల జూలై 26న ప్రారంభమైంది. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ పంచాయతీలోని న్యూ చించుఘాట్‌లో కలెక్టర్ దివ్యదేవరాజన్ ఈ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ‘నివ బాతల్ ఫోరొల్ (నీ పేరు ఏంటీ)’ అని గోండి భాషలో పలకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీడీఏ తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభం
ఎప్పుడు : జూలై 26
ఎవరు : కలెక్టర్ దివ్యదేవరాజన్
ఎక్కడ : న్యూ చించుఘాట్, చించుఘాట్, ఆదిలాబాద్ రూరల్ మండలం
‘మై బాడీ ! వాట్ ఐ సే గోస్’ పుస్తకావిష్కరణ
వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన ‘మై బాడీ! వాట్ ఐ సే గోస్’ (నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది) అనే పుస్తకంను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో జూలై 25న ఆవిష్కరించారు. బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. వరల్డ్ విజన్ పనిచేసే గ్రామాలు, పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రతినిధి తబితవాణి తెలిపారు. పిల్లల వ్యక్తిగత శారీరక భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహ న కల్పించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మై బాడీ ! వాట్ ఐ సే గోస్’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 25
ఎవరు : వరల్డ్ విజన్ స్వచ్ఛంద సేవా సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా
ఉస్మానియాలో వాణిజ్య సదస్సు
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 71వ అఖిల భారత వాణిజ్య సదస్సును నిర్వహించనున్నారు. ఇన్నోవేషన్, ఉద్యోగ కల్పన, స్థిరమైన అభివృద్ధి అనే అంశాలపై డిసెంబర్ 20 నుంచి 22 వరకు సదస్సును నిర్వహించనున్నట్లు సదస్సు కార్యదర్శి ప్రొ.వెంకటేశ్వర్లు జూలై 27న తెలిపారు. ఈ సదస్సులో పరిశోధన విద్యార్థులు, వ్యాపార, పారిశ్రామిక, ఆర్థిక వేత్తలతో సహా దాదాపు 2 వేల మంది పాల్గొననున్నారు. 2017లో 70వ సదస్సును జైపూర్‌లో నిర్వహించారు.
ఉత్తమ పరిశోధనకు ఎంఎంషా పురస్కారం
కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో అత్యున్నత స్థాయిలో పరిశోధనలు చేసిన వారికి ప్రొఫెసర్ ఎంఎం షా పురస్కారాన్ని వాణిజ్య సదస్సులో అంద జేయనున్నారు. 2012లో ఎంఎం షా తనయుడు అనీల్ షా కోటి రూపాయలను విరాళంగా అందచేసి, తన తండ్రి పేరు మీద ఈ అవార్డును స్థాపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 71వ అఖిల భారత వాణిజ్య సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 20 నుంచి 22 వరకు
ఎక్కడ : ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
పెద్దపులి ఫోటోతో పోస్టల్ స్టాంప్ విడుదల
దేశంలో తొలిసారిగా పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌ను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేసింది. తెలంగాణలో కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో ఉంటున్న ఫాల్గుణ అనే పెద్దపులి ఫోటోను ఈ స్టాంప్‌పై ముద్రించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్ విడుదల
ఎప్పుడు : జూలై 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఉద్యాన వర్శిటీల్లో వైఎస్సార్ వర్శిటీకి అగ్రస్థానం
దేశంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అగ్రస్థానం లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 2018 ఏడాది ర్యాంకులు జూలై 28న ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పనితీరు, రైతులకు అందించిన ప్రయోజనాల ఆధారంగా ఐసీఎఆర్ ఈ ర్యాంకులను కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉద్యాన యూనివర్సిటీల్లో అగ్రస్థానం
ఎప్పుడు : 2018
ఎవరు : వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ
ఎక్కడ : తాడేపల్లి గూడెం, పశ్చిమ గోదావరి
ఎందుకు : రైతులకు అందించిన ప్రయోజనాలకు
సినారె పేరిట జాతీయ పురస్కారం
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ‘డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు జూలై 28న వెల్లడించారు. సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు తరఫున ఏటా సినారె జయంతి రోజున (జులై 29) ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పుర స్కారం కింద రూ.3 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారు. 2019లో హైదరాబాద్‌లో తొలి పురస్కారం ను బహుకరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సినారె పేరిట జాతీయ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు
ఎక్కడ : హైదరాబాద్
ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 28న నిర్ణయించింది. ఈ మేరకు పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తుంది. ఇప్పటికే పథకం అమలు బాధ్యతలను అక్షయపాత్రకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మోడల్ స్కూల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు, డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సదుపాయం పొందనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
పర్యాటక ప్రాంతంగా శామీర్‌పేట చెరువు
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం జూలై 30న నిర్ణయించింది. ఇందుకోసం ఏడాది పొడవునా చెరువులో నీరు ఉండేలా చర్యలు చేపట్టడంతోపాటు, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లను చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా శామీర్‌పేట చెరువుకు, అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక ప్రాంతంగా శామీర్‌పేట చెరువు
ఎప్పుడు : జూలై 30
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : శామీర్‌పేట్, హైదరాబాద్
ప్రముఖ నిర్మాత రాఘవ కన్నుమూత
ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ (105) హైదరాబాద్‌లో జూలై 30న కన్నుమూశారు. తెలుగులో పలు మూకీ, టాకీ చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆఫీస్ బాయ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, స్టంట్ అసిస్టెంట్, స్టంట్ మాస్టర్‌గా పని చేసిన ఆయన జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, జగత్ జెట్టీలు సినిమాలను నిర్మించి జగత్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. రాఘవ నిర్మించిన ‘తాత-మనవడు’ సినిమాకు నంది అవార్డు, ‘సంసారం-సాగరం’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ ద్వారా దాసరి నారాయణరావు, రావు గోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమన్ , భానుచందర్ వంటి వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
1913 డిసెంబర్ 9న తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామంలో జన్మించిన రాఘవ 1975 నుంచి 1982 వరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫౌండర్ మెంబర్‌గా, కోశాధికారిగా వ్యవహరించడంతోపాటు 1991 నుంచి 2001 వరకు కార్యనిర్వాహక సభ్యుడిగా పని చేశారు. రాష్ర్ట ప్రభుత్వం అందించిన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతోపాటు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ నిర్మాత కన్నుమూత
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కోటిపల్లి రాఘవ (105)
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్‌లో రాంజీగోండు మ్యూజియం
హైదరాబాద్‌లోని బాపూఘాట్లో తెలంగాణ తొలితర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు రాంజీగోండు పేరుతో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎకరన్నర స్థలంలో రూ.15 కోట్లతో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నట్లు జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మ్యూజియంలో గిరిజనులకు సంబంధించిన చరిత్ర, ఆనాటి స్వాతంత్య్ర పోరాట దృశ్యాలు, తెలంగాణ గిరిజన యోధులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇప్పటికే గుజరాత్లో నిర్మించిన గిరిజన మ్యూజియంలో రాంజీగోండు, కుమురంబీం లకు ప్రత్యేక స్థానం కల్పించారు.
1857 సిపాయి తిరుగుబాటు సమయంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్, నిజాం సైన్యం పెత్తనాన్ని రాంజీగోండు ఎదురించి సైన్యానికి పట్టుబడ్డారు. దేశ ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తరువాత బ్రిటిష్-నిజాం నిరంకుశత్వాలను ఎదురించిన తొలి సమరయోధుడిగా రాంజీగోండు గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాంజీగోండు గిరిజన మ్యూజియం ఏర్పాటు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : బాపుఘాట్, హైదరాబాద్
పీవోఎస్ పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ‘పేస్విఫ్’ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాన్ని విడుదల చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన పీవోఎస్ పరికరాన్ని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు జూలై 18న ఆవిష్కరించారు. ఈ పరికరం ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్, ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరం ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 19
ఎవరు : ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు
ఎక్కడ : హైదరాబాద్
ఏపీ సీఐడీ చీఫ్‌గా అమిత్‌గార్గ్
ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) చీఫ్‌గా అమిత్‌గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యలయంలో ద్వారకా తిరుమలరావు నుంచి ఆయన జూలై 19న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఐడీ చీఫ్‌గా ఉన్న తిరుమలరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూలై 19
ఎవరు : అమిత్ గార్గ్
సంఘసేవకుడు అగ్నిగుండాల కన్నుమూత
ప్రముఖ సంఘ సేవకుడు అగ్నిగుండాల వెంకట రంగారావు (105) హైదరాబాద్‌లో జూలై 20న కన్నుమూశారు. గుంటూరు జిల్లా అగ్నిగుండాల గ్రామంలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ చదివారు. భూస్వామి అయిన రంగారావు తనకున్న భూములను నిరుపేదలకు పంచడంతోపాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సంఘ సేవకుడు కన్నుమూత
ఎప్పుడు : జూలై 21
ఎవరు : అగ్నిగుండాల వె ంకట రంగారావు(105)
ఎక్కడ : హైదరాబాద్
టెస్కాబ్‌కు జాతీయ ఉత్తమ అవార్డు
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు జాతీయ ఉత్తమ అవార్డు లభించింది. 2016-17 సంవత్సరానికి 32 రాష్ట్ర సహకార బ్యాంకుల్లో టెస్కాబ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ముంబైలో జూలై 20న జరిగిన కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ నేతి మురళీధర్ ఈ పురస్కారం అందుకున్నారు.
దేశంలోని 93,367 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాడ్లరాంపూర్ (నిజామాబాద్ జిల్లా) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ద్వితీయ బహుమతి దక్కింది. దేశంలోని 371 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) 2016-17కు ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ డీసీసీబీకి తృతీయ బహుమతి లభించింది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీసీసీబీలు, వ్యవసాయ సహకార సంఘాలకు ముంబైలోని రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య ఏటా ప్రతిభా పురస్కారాలు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెస్కాబ్‌కు జాతీయ ఉత్తమ అవార్డు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య
ఎక్కడ : ముంబై
ఎందుకు : ఉత్తమ ప్రతిభ కనబరినందుకు
ఎస్ఆర్పీ ప్రాజెక్టుకు ఏపీలో మూడు స్టేషన్లు
స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్పీ)కు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ మేరకు గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను రైల్వేశాఖ జూలై 21న ఎంపిక చేసింది. స్టేషన్లలో ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలను రైల్వేశాఖ కల్పిస్తే బడ్జెట్ హోటళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తాయి. ఇందుకోసం రూ.120 కోట్లు మంజూరు చేయనున్నారు.
రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించేందుకు స్టేషన్ రీ డెవలప్మెంట్ (ఎస్ఆర్పీ) కార్యక్రమంను రైల్వే మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా విజయవాడ స్టేషన్‌కు రూ.40 కోట్లు కేటాయించగా తిరుపతి స్టేషన్‌ను రూ.400 కోట్లు, నెల్లూరు స్టేషన్‌ను రూ.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దేశం మొత్తం మీద 23 స్టేషన్లను ఎస్‌ఆర్‌పీకి ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్ఆర్పీ ప్రాజెక్టుకు ఏపీలో మూడు స్టేషన్లు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : రైల్వే శాఖ
ఎక్కడ : గుంటూరు, కర్నూలు, గుంతకల్
ఎందుకు : రెల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించేందుకు
గజ్వేల్ నుంచి ‘కంటి వెలుగు’ కార్యక్రమం
తెలంగాణలో దాదాపు 3.70 కోట్ల మంది ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణకు కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆగస్టు 15న కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 21 నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులతో పాటు ఉచిత ఆపరేషన్లను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్ట్ 15
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : గజ్వేల్, సిద్ధిపేట్, తెలంగాణ
ఎందుకు : ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు
అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
‘అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 24న శంకుస్థాపన చేశారు. విజయవాడలోని విద్యాధరపురంలో రూ.60 కోట్లతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే ఒలింపిక్స్‌లో పతకాలను సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘గాండీవ’ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు.
గాండీవ ప్రాజెక్టు నిర్వహణకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్విక్ సంస్థతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పాంచజన్య ప్రాజెక్టు పేరుతో విశాఖపట్నం, నెల్లూరు, నర్సారావుపేట, గుడివాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన శాప్ స్పోర్ట్స అకాడమీలను లాంఛనంగా ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన
ఎప్పుడు : జూలై 24
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : విద్యాధరపురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
నారాయణ కాలేజీకి ఏపీ గ్రీన్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వనం-మనం కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పెంచేందుకు కృషి చేసిన నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీకి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అవార్డు లభించింది. ఈ మేరకు నారాయణ గ్రూప్ ఎండీ డాక్టర్ సింధూర నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూజివీడులో జూలై 14న అవార్డును అంద జేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అవార్డు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : నెల్లూరు నారాయణ మెడికల్ కాలే జ్
ఎక్కడ : నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : పచ్చదనం పెంచేందుకు కృషి చేసినందుకు
సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు పదో స్థానం
దేశవ్యాప్తంగా అత్యధికంగా సూక్ష్మ సేద్యం చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు పదో స్థానం దక్కింది. రాష్ట్రంలో 3. 31 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులో ఉంది. 2018 ఫిబ్రవరి నాటికి లక్ష భూసార కార్డులను మాత్రమే ప్రభుత్వం రైతులకు అందజేసింది. ఈ మేరకు జాతీయ వ్యవసాయ గణాంక నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ జూలై 14న విడుదల చేసింది.
ఈ జాబితాలో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. అలాగే 35.31 లక్షల ఎకరాలతో మహారాష్ట్ర, 28.45 లక్షల ఎకరాలతో గుజరాత్, 7.1 లక్షల ఎకరాలతో ఛత్తీస్‌గఢ్‌లు వరుసగా రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులో ఉంది.
మరోవైపు 1950- 51లో వరి ఉత్పాదకత హెక్టారుకు 6.68 క్వింటాళ్లుంటే, 2016-17 నాటికి 25.5 లక్షలకు చేరుకుంది. అలాగే 1980-81లో వంట నూనెల తలసరి అందుబాటు 3.8 కిలోలుండగా 2015-16లో 17.7 కిలోలకు పెరిగింది. 1980-81లో పంచదార తలసరి అందుబాటు 7.3 కిలోలు ఉండగా 2015-16లో 19.4 కిలోలకు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు పదో స్థానం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ
సినీనటుడు వినోద్ కన్నుమూత
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు వినోద్(59) జూలై 14న కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వినోద్ అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు. 1980లో వి. విశ్వేశ్వరావు దర్శకత్వంలో వచ్చిన కీర్తి కాంత కనకం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. దాదాపు 300 సినిమాల్లో పైగా నటించిన వినోద్ 28 తమిళ, 2 హిందీ సినిమాలతోపాటు టీవీ సిరియళ్లలోనూ నటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సినీనటుడు కన్నుమూత
ఎప్పుడు : జూలై 14
ఎవరు : వినోద్(59)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : బ్రెయిన్ స్ట్రోక్‌తో
పోతార్లంక ఎత్తిపోతల పథకం ప్రారంభం
గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని పోతార్లంక ఎత్తిపోతల పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 16న ప్రారంభించారు. రూ.49.68 కోట్లతో నిర్మించిన ఈ పథకం ద్వారా 4,995 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అనంతరం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో గ్రామ దర్శిని, కొల్లూరు జిల్లాపరిషత్ హైస్కూల్లో గ్రామ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించి సభలు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోతార్లంక ఎత్తిపోతల ఎత్తిపోతల ప్రారంభం
ఎప్పుడు : జూలై 16
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదే శ్
గుంటూరు జిల్లా వాసికి ‘ఆధునిక రైతు’ పురస్కారం
గుంటూరు జిల్లా యాజలికి చెందిన లక్ష్మీనరసింహకు ‘ఆధునిక రైతు’ పురస్కారం లభించింది. సాఫ్ట్వేర్ రంగాన్ని వీడి గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలమైన, ఆర్థికంగా ఉపయుక్తమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో జూలై 17న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్మీనరసింహకు అవార్డును ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధునిక రైతు పురస్కారం
ఎప్పుడు : జూలై 17
ఎవరు : లక్ష్మీనరసింహ
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : గ్రామీణ ప్రాంతాల్లో పర్యవరణ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు
ఒలింపిక్స్‌లో పతకాల సాధనకు ‘ప్రాజెక్టు గాండీవ’
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తారు. అలాగే ‘పాంచజన్య’ కింద బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రాజెక్టు గాండీవ పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఒలింపిక్స్‌లో పతకాల సాధనకు
ఎక్కడ : సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
కర్ణాటకలో 34 వేల కోట్ల రైతు రుణ మాఫీ
కర్ణాటకలో రైతులకు రూ.34 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జూలై 5న ప్రకటించారు. ఇందులో భాగంగా 2017 డిసెంబర్ 31 వరకు రూ.2 లక్షల లోపు ఉన్న అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కుమారస్వామి ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్ణాటకలో 34 వేల కోట్ల రైతు రుణ మాఫీ
ఎప్పుడు : జూలై 5
ఎవరు : ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి
ఎందుకు : రైతు రుణమాఫీలో భాగంగా
ట్రాన్స్ కో సీఎండీకి ఎకనమిక్ టైమ్స్ పురస్కారం
తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’వార్షిక అవార్డు ప్రకటించింది. ఈ మేరకు జూలై 5న జరిగిన ‘ది ఎకనమిక్ టైమ్స్’ 5వ వార్షిక విద్యుత్ సదస్సులో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బబుల్ సుప్రియో ఈ అవార్డును అందజేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిక్ టైమ్స్ 2018 అవార్డు
ఎప్పుడు : జూలై 5
ఎవరు : జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
ఎందుకు : విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతికి
ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాల రద్దు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల విధానాన్ని రద్దు చేస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు జూలై 6న ఉత్తర్వులు జారీచేశారు. కారుణ్య నియామకాలపై తెలంగాణ ఆర్టీసీలో అమలు చేస్తున్న అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఏఎంబీ) (ఉద్యోగం ఇవ్వకుండా అదనంగా కొంత మొత్తం ప్రయోజనం కల్పించే విధానం) ను ఏపీఎస్ ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఏఎంబీ విధానం ద్వారా అన్ని కేడర్ ఉద్యోగులకు రూ.5 లక్షలు అందించే విధంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
కారుణ్య విధానం ద్వారా ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇస్తారు. ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాల విధానాన్ని అమలుచేస్తుండగా 1996-2000 మధ్య కాలంలో నిలిపివేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కారుణ్య నియామకాల రద్దు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఏపీఎస్ ఆర్టీసీ
ఎక్కడ : ఆంధ్రపదేశ్
తెలంగాణలో గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
తెలంగాణలో గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ జూలై 6న ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థుల అనారోగ్య, ఇతర సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి పరిష్కరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : అజ్మీరా చందూలాల్
ఎక్కడ : గిరిజన పాఠశాలలు, తెలంగాణ
ఎందుకు : గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు
కొలకలూరి ఇనాక్ కు రావిశాస్త్రి అవార్డు
సుప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు కొలకలూరి ఇనాక్‌కు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వార్షిక పురస్కారం లభించింది. సాహితీ సృజన, పరిశోధన, విమర్శ వంటి అంశాల్లో కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు ట్రస్ట్ సభ్యుడు, రావిశాస్త్రి తనయుడు రాచకొండ ఉమాకుమారశాస్త్రి జూలై 9న చెప్పారు. ఇనాక్ ఆశాజ్యోతి, ఆది ఆంధ్రుడు, భుజంగరాయ చరిత్ర, షరామామూలే, ఊరబావి మొదలైన కవితా, కథా సంపుటాలు, నాటకాలతో సహా దాదాపు వంద పుస్తకాలను వెలువరించారు.
2016 నుంచి రావిశాస్త్రి అవార్డులను అందజేస్తుండగా 2016లో రామతీర్థకు, 2017లో పతంజలి శాస్త్రికి ఈ అవార్డులను ఇచ్చారు. రావిశాస్త్రి జయంతి జూలై 30న అవార్డును ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ పుర స్కారం 2018
ఎప్పుడు : జూలై 9
ఎవరు : కొలకలూరి ఇనాక్
ఎక్కడ : విజయవాడ
ఎందుకు : సాహితీ సృజన, పరిశోధన, విమర్శ వంటి అంశాల్లో కృషి చేసినందుకు
హైదరాబాద్‌లో కారోకు శంకుస్థాపన
బేగంపేటలోని పాత విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో) ఏర్పాటుకు ఆ శాఖా మంత్రి సురేశ్ ప్రభు ఈనెల 5న శంకుస్థాపన చేశారు. ఎయిర్ నావిగేషన్ సేవలు (ఏఎన్ఎస్), ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో పరిశోధనలు జరిపి దేశీయ సొల్యూషన్లు అభివృద్ధి చేయడానికి కారో తోడ్పడుతుంది.
పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు
పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇది గిరిజన ప్రాంతాల్లో వర్తించదని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం జూలై 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ.గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : హైకోర్టు
ఎక్కడ : తెలంగాణ
తెలంగాణలో 9 వేల మందికి ఒక వైద్యుడు
తెలంగాణలో 9,343 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండగా మొత్తం రాష్ట్రంలో 4,123 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. అలాగే ప్రతి 1.91 లక్షల మందికి ఒక దంత వైద్యుడు చొప్పున మొత్తం 201 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మానవ వనరుల నివేదిక-2018 ఈ వివరాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం సిక్కింలో 2,437, మిజోరంలో 2,358 మందికి ఒక వైద్యుడు ఉండగా తమిళనాడులో 9,544, ఆంధ్రప్రదేశ్‌లో 10,189, బిహార్‌లో 28,391 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడున్నాడు.
వివిధ రాష్ట్రాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్యుడికి జనాభా
రాష్ట్రం | జనాభా |
1) తెలంగాణ | 9,343 |
2) ఆంధ్రప్రదేశ్ | 10,189 |
3) అరుణాచల్‌ప్రదేశ్ | 2,417 |
4) అస్సాం | 5,395 |
5) బీహార్ | 28,391 |
6) చత్తీస్‌గఢ్ | 15,916 |
7) గోవా | 3,883 |
8) గుజరాత్ | 11,475 |
9) హరియాణా | 10,189 |
10) జమ్మూ కశ్మీర్ | 3,060 |
11) కర్ణాటక | 13,556 |
12) కేరళ | 6,810 |
13) మహారాష్ట్ర | 16,996 |
14) మణిపూర్ | 2,358 |
15) పంజాబ్ | 9,817 |
16) రాజస్థాన్ | 10,976 |
17) తమిళనాడు | 9,544 |
18) త్రిపుర | 3,038 |
19) ఉత్తరప్రదేశ్ | 19,962 |
20) పశ్చిమబెంగాల్ | 10,411 |
తెలంగాణ పోస్టల్ సర్కిల్ కు ఆధార్ ఎక్సలెన్సీ అవార్డు
తెలంగాణ పోస్టల్ సర్కిల్‌కు ‘ఆధార్ ఎక్సలెన్సీ అవార్డు-2018’ లభించింది. అత్యంత వేగంగా ఆధార్ నమోదు చేసిన పోస్టల్ సర్కిల్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఇందులో పంజాబ్ పోస్టల్ సర్కిల్ మొదటి స్థానం పొందగా బిహార్, తెలంగాణ పోస్టల్ సర్కిల్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు ఆధార్ నమోదు విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోస్టాపీసులకు ‘ఆధార్ ఎక్సలెన్సీ అవార్డ్స్-2018’ పేరిట మూడు విభాగాల్లో 66 అవార్డులను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జూలై 7న ప్రకటించింది. బెస్ట్ పెర్ఫామింగ్ పోస్టల్ సర్కిల్లో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు అవార్డులను దక్కించుకున్నాయి.
తెలంగాణలో 266, ఆంధ్రప్రదేశ్‌లో 578, ఒడిశాలో 473, ఛత్తీస్‌గఢ్‌లో 161 పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కార్యకలాపాలు సాగుతుండగా మొత్తం దేశవ్యాప్తంగా 14 వేల పోస్టాఫీసుల్లో ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ ఎక్సలెన్సీ అవార్డ్స్-2018’
ఎప్పుడు : జూలై 7
ఎవరు : తెలంగాణ
ఎందుకు : వేగంగా ఆధార్ నమోదు చేసినందుకు
ఎన్టీపీసీ రామగుండంకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఎనర్జీ, ఎఫిషియెన్సీ 20వ వరల్డ్ కాంగ్రెస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, క్లైమెట్ ఛేంజ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్స్ ఆధ్వర్యంలో జూలై 7న ఈ అవార్డులను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎప్పుడు : జూలై 7
ఎవరు : ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టు
ఎక్కడ : న్యూఢిల్లీ
విజయవాడలో ‘ఆరుగాలం’ పుస్తకావిష్కరణ
వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయవాడలో జూలై 8న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఆయన సూచించారు. ఈ పుస్తకాన్ని రైతునేస్తం ఫౌండేషన్ ప్రచురించింది.
మరోవైపు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పోలూరు హనుమజ్జానకీరామశాస్త్రి రచించిన జీవితం-సాహిత్యం సంకలన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : విజయవాడ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి ర్యాంకు
2017 సంవత్సరానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో 98.42 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ జాబితాలో 98.33 శాతం స్కోర్ సాధించి తెలంగాణ రెండో ర్యాంకు పొందగా తర్వాతి స్థానాల్లో హర్యానా, ఝార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ కు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ విభాగం(డీఐపీపీ), ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను జూలై 10న విడుదల చేశారు. 2016 ఈవోడీబీ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు తొలిస్థానాన్ని పంచుకున్నాయి.
అదే విధంగా ఎవిడెన్స్ స్కోర్‌లో తెలంగాణ వంద శాతం, ఏపీ 99.73 శాతం స్కోర్ సాధించాయి. ఫీడ్‌బ్యాక్ స్కోర్‌లో ఏపీ 86.50 శాతం, తెలంగాణ 83.95 శాతం స్కోర్ సాధించాయి. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ (బీఆర్ఏపీ) సూచించిన ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు తదితర 12 అంశాల్లో సంస్కరణల అమలులో ప్రగతి ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.
సులభతర వాణజ్య ర్యాంకులు 2017
ర్యాంకు | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | స్కోరు (వంద శాతానికి) |
1 | ఆంధ్రప్రదేశ్ | 98.42 |
2 | తెలంగాణ | 98.33 |
3 | హర్యానా | 98.07 |
4 | జార్ఖండ్ | 97.99 |
5 | గుజరాత్ | 97.96 |
6 | చత్తీస్‌గఢ్ | 97.36 |
7 | మధ్యప్రదేశ్ | 97.31 |
8 | కర్ణాటక | 96.40 |
9 | రాజస్థాన్ | 95.68 |
10 | పశ్చిమ బంగా | 94.70 |
11 | ఉత్తరాఖండ్ | 94.21 |
12 | ఉత్తర ప్రదేశ్ | 92.87 |
13 | మహారాష్ట్ర | 92.71 |
14 | ఒడిశా | 92.09 |
15 | తమిళనాడు | 90.68 |
16 | హిమాచల్ ప్రదేశ్ | 87.90 |
17 | అసోం | 84.75 |
18 | బిహార్ | 81.91 |
19 | గోవా | 57.34 |
20 | పంజాబ్ | 53.92 |
21 | కేరళ | 44.79 |
22 | జమ్మూకశ్మీర్ | 33.05 |
23 | ఢిల్లీ | 31.60 |
24 | డామన్, డయ్యూ | 28.69 |
25 | త్రిపుర | 22.27 |
26 | దాద్రా, నగర్ హవేళి | 21.88 |
27 | పుదుచ్చేరి | 15.65 |
28 | నాగాలాండ్ | 14.04 |
29 | చంఢీఘర్ | 11.44 |
30 | మిజోరాం | 3. 63 |
31 | అండమాన్,నికోబార్ | 1.24 |
32 | మణిపూర్ | 0. 27 |
33 | సిక్కిం | 0.13 |
34 | అరుణాచల్ ప్రదేశ్ | 0.00 |
35 | లక్షద్వీప్ | 0.00 |
36 | మేఘాలయ | 0.00 |
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
ఎందుకు : వ్యాపార, వాణిజ్య సంస్కరణల అమలుకు
మాతృభాషల్లో తెలుగుకు నాలుగో స్థానం
దేశంలోని అత్యధికులు మాట్లాడే మాతృభాషల్లో తెలుగు నాలుగో స్థానంలో నిలిచింది. 2001 జనాభా లెక్కలప్రకారం దేశ జనాభాలో 7.19 శాతం మంది తెలుగును తమ మాతృభాషగా ఎంచుకోగా 2011 నాటికి ఈ సంఖ్య 6.93 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 96.71 శాతం మంది రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక దాన్ని తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను ఎంపిక చేసుకున్నారు.
2001 లెక్కల ప్రకారం హిందీని మాతృభాషగా ఎంచుకున్న వారి సంఖ్య 41.03 శాతముండగా 2011 నాటికి 43.63 శాతానికి చేరుకుంది. 8.30 శాతంతో బెంగాలీ రెండో స్థానంలో నిలవగా సంస్కృతం చివరిస్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం..
భాష | మాతృభాషగా మాట్లాడేవారు | మొత్తం జనాభాలో శాతం |
హిందీ | 52,83,47,193 | 43.63 |
బెంగాలీ | 09,72,37,669 | 08.30 |
మరాఠీ | 08,30,26,680 | 07.09 |
తెలుగు | 08,11,27,740 | 06.93 |
తమిళం | 06,90,26,881 | 05.89 |
హైదరాబాద్‌లో ‘ఈపామ్’ కేంద్రం
అమెరికాకు చెందిన ఈపామ్ సంస్థ ‘హైదరాబాద్ డిజిటల్ ఇంజనీరింగ్ సెంటర్’ పేరుతో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు జూన్ 28న ప్రారంభించారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో వచ్చే కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఈపామ్ సిస్టమ్స్ సీఈవో అర్కాడీ డోబ్కిన్ తెలిపారు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 27 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా హైదరాబాద్ కేంద్రంలో 900 మంది పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో ఈపామ్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
ఎక్కడ : గచ్చిబౌలి
ఎందుకు : టెక్నాలజీలో వచ్చే కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు
ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల నిర్వహణ
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల నిర్వహణకు విద్యాశాఖ జూన్ 28న ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం కోసం కావాల్సిన టమాటా, సోర, దోస, బీర వంటి కూరగాయలను పండిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,896 పాఠశాలల్లో స్థలం వెసులుబాటు, నీటి సౌకర్యం ఉన్న 9,958 పాఠశాలల్లో ఈ ఏడాది వీటిని చేస్తారు. 2017లో 1,203 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కమిటీకి అప్పగించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల నిర్వహణకు ప్రణాళిక
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు
ఎందుకు :మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు వాడేందుకు
హైదరాబాద్‌లో యూఏఈ దౌత్య కార్యాలయం
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దౌత్య కార్యాలయంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ జూన్ 28న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో తమ దౌత్య కార్యాలయం ఏర్పాటుకు షేక్ అబ్దుల్లా సానుకూలత తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఏఈ దౌత్య కార్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : హైదరాబాద్
గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు వద్ద నిర్మించనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జూన్ 29న శంకుస్థాపన చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గట్టు పరిధిలో 33 వేల ఎకరాలకు కృష్ణా నీటిని అందించేందుకు రూ. 553.98 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను సీఎం పరిశీలించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : పెంచికలపాడు, గట్టు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ
ఎందుకు : గట్టు పరిధిలో 33 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు
వైద్యారోగ్యంలో తెలంగాణకు 12వ ర్యాంకు
వైద్యారోగ్య రంగంపై జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ మొదటిసారిగా నిర్వహించిన ‘బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’ సర్వేలో తెలంగాణ 12వ ర్యాంకు పొందింది. దేశంలో 101 జిల్లాలో నిర్వహించిన ఈ సర్వే వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషించాయి. ఆరోగ్యం, పోషకాహారం, నవజాత శిశువుల ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, మౌలిక సదుపాయాల వంటి 13 అంశాలపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాల వారీగా ఖమ్మం జిల్లా పదకొండో ర్యాంకు సాధించగా భూపాలపల్లి జిల్లా 20, ఆసిఫాబాద్ జిల్లా 100 ర్యాంకులో నిలిచాయి.
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 23గా ఉందని నివేదిక తెలిపింది. లింగ నిష్పత్తిలో ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రసవాల్లో 85.35 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రతి లక్ష మందిలో టీబీ రోగులు 123 మంది ఉండగా టీబీ చికిత్సలను విజయవంతం చేయడంలో తెలంగాణ వెనుక బడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైద్యారోగ్యంలో తెలంగాణకు 12వ ర్యాంకు
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : బేస్‌లైన్ ర్యాంకింగ్ అండ్ రియల్ టైం’సర్వేలో
అమరావతిలో టెలీమెడికాన్ 2018 సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నవంబర్ 3న 14వ అంతర్జాతీయ టెలిమెడికాన్ 2018’ సదస్సుని నిర్వహించనున్నట్లు టెలీమెడికాన్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, సైంటిస్ట్ డాక్టర్ మూర్తి రేమళ్ల జూన్ 30న తెలిపారు. టెలీమెడిసన్పై నిర్వహించే ఈ సదస్సులో వైద్యులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్, పాలసీ మేకర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వంటి వారు 800 మందికిపైగా పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14వ అంతర్జాతీయ టెలీమెడికాన్ 2018 సదస్సు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
కేటీపీఎస్ 7వ దశలో విద్యుదుత్పత్తి ప్రారంభం
తెలంగాణలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఏడవ ద శలో జూన్ 30న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16 వేల మెగావాట్లు దాటింది.
దేశంలో వేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేటీపీఎస్ 7వ దశలో విద్యుదుత్పత్తి ప్రారంభం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు
ఎక్కడ : పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ
హైకోర్టు సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
హైదరాబాద్‌లోని ఆంద్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి హైకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జూలై 1న ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర న్యాయశాఖ ఆయన నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ రాధాకృష్ణన్ ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం 2017 జనవరిలో కేంద్రానికి సిఫారసు చేసింది.
1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించిన రాధాకృష్ణన్ తల్లిదండ్రులు ఎన్.భాస్కరన్ నాయర్, కె.పారుకుట్టి లు ఇద్దరు న్యాయవాదులే. కొల్లంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా నమోదయ్యారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించిన రాధాకృష్ణన్ 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015న అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఏసీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ రికార్డు..
ఇప్పటి వరకు హైదరాబాద్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ నిరాటంకంగా అత్యధిక కాలం పాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. 2016 జూలై 30న ఏసీజే బాధ్యతలు చేపట్టిన రంగనాథన్ దాదాపు రెండేళ్ల పాటు అందులో కొనసాగారు. 1992లో జస్టిస్ అంబటి లక్ష్మణరావు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రెండు సంవత్సరాల పాటు ఏసీజేగా కొనసాగినా, ఏక కాలంలో ఆయన ఆ బాధ్యతలను నిర్వర్తించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
‘మిడిల్ కొలాబ్’ ప్రాజెక్టుకు ఏపీ, తెలంగాణ ఆమోదం
గోదావరి బేసిన్లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలాబ్ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూలై 3న ఆమోదం తెలిపాయి. దీంతో ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిపై మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలంగాణ నీటి వాటాకు గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ చేపడుతోందని తెలంగాణ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గోదావరి బోర్డు అధ్యక్షుడిగా హెచ్‌కే సాహూ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మిడిల్ కొలాబ్’ ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : ఇంద్రావతి నది, గోదావరి సబ్ బేసిన్