Skip to main content

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 8 కంపెనీలకు శంకుస్థాపన

గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్‌ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
AP CM YS Jagan Mohan Reddy

పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న‌ ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆగస్టు 16వ తేదీన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 

సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
15 నెలల వ్యవధిలోనే ఉత్పత్తి ఆరంభం :
ప్రపంచంలో టాప్‌ 5–6 స్థానాల్లో ఉన్న జపాన్‌ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటుకు 2020 సెపె్టంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడ నుంచి చకచకా అన్ని రకాలుగా తోడ్పాటు అందించాం. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాగా కేవలం 15 నెలల వ్యవధిలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి దశలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకోవడంతో రెండో దశకు కూడా నాంది పలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్లాంట్‌ ప్రారం¿ోత్సవ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు రెండో దశ ప్లాంట్‌కు శంకుస్ధాపన జరుగుతోంది. రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్లతో దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు క‌ల్పించారు . ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2,000 మందికి ఉపాధి ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. 
 భరోసా కల్పించే బాధ్యత మనదే.. 
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా అక్కడ మన యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించడం చాలా అవసరం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించగలిగితే పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైనా పరిశ్రమ ఏర్పాటైతే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. మనవైపు నుంచి కూడా వారికి సహాయ, సహకారాలు అందాలి. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే గొడవ పడకుండా పరిష్కరించుకునేలా అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామికవేత్తలకు నమ్మకం, విశ్వాసం పెరిగి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. తద్వారా మన యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తాయి. మనవాళ్లు చాలా మంచివాళ్లు.. బాగా కష్టపడి పనిచేస్తారు... ఎటువంటి సమస్యలూ సృష్టించరు.. అని పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగితే రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాలపైనే ఉంది.  
రానున్న రెండేళ్లల్లో మరో 1.64 లక్షల ఉద్యోగాలు..
ఈ మూడేళ్ల వ్యవధిలోనే అతి భారీ, భారీ పరిశ్రమల విభాగంలో 98 పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 60,541 మందికి గత మూడేళ్లలో ఉద్యోగాలు లభించాయి. ఇదే సమయంలో మరో 31,671 ఎంఎస్‌ఎంఈలు రూ.8,285 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా మరో 1,98,521 మందికి ఉద్యోగాలు లభించాయి. రాబోయే ఒకటి రెండేళ్లలో మరో 56 అతి భారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మరో 1,64,155 మందికి ఉద్యోగాలు కలి్పంచేందుకు సిద్ధమవుతున్నాయి.  
 పారిశ్రామికవేత్తల ఓటుతో నంబర్‌ వన్‌గా.. 
ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామిక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. తొలిసారిగా ఈదఫా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్టిఫికేషన్‌ తీరు కూడా మార్చారు. ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ ఇస్తున్నారు. అలా నిబంధనలు మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్‌ 1 ర్యాంకు సాధిస్తోంది. ప్రతి అడుగులోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం.
 పాత బకాయిలు పిలిచి మరీ చెల్లించాం.. 
గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి బకాయిలు  పేరుకుపోయాయి. చిన్న పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో దాదాపు లక్షకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఉండగా పది లక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన‌ తర్వాత గుర్తు పెట్టుకుని మరీ పాత బకాయిలను చెల్లించడంతోపాటు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. చేయి పట్టుకుని ప్రోత్సహిస్తూ ఈ మూడేళ్లలో రూ.1,463 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం. ఇలా ప్రభుత్వం ప్రతి దశలోనూ ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది కాబట్టే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9 శాతమే ఉంది. దేశంతో పోలిస్తే రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 
పది శాతం ఎగుమతులే లక్ష్యం..
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాలుగు కొత్త పోర్టులతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నాం. తద్వారా ఎగుమతుల్లో రాష్ట్ర వాటా భారీగా పెరగనుంది. 2021–22లో రాష్ట్ర ఎగుమతుల విలువ 19.3 బిలియ¯న్‌ డాలర్లు ఉంది. మొత్తం దేశం ఎగుమతుల్లో ఇది 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తైన తరువాత ఏపీ నుంచి ఎగుమతులు 10 శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నాం. 
ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. 
దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోనే ఏర్పాటవుతున్నాయి. విశాఖ–చెన్నై, చెన్నై– బెంగళూరు, హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్‌లున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రం వైపు చూడని వారు కూడా ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో సెంచరీ ఫ్లైవుడ్‌ బజాంకాల పేరు విన్నారా? ఈరోజు బజాంకాలు వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో సెంచరీ ఫ్లైవుడ్‌  ఫ్యాక్టరీ పెడుతున్నారు. బంగూర్‌ల పేరు గతంలో విన్నారా? ఎప్పుడూ రాష్ట్రంవైపు చూడని వారు ఇవాళ రాష్ట్రంలో శ్రీసిమెంట్స్‌ ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారు. ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి వారి ప్లాంట్‌ను ప్రారంభించడం గతంలో చూశారా? ఈరోజు ఆదిత్య బిర్లా మన రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వారి ప్లాంట్‌ను ప్రారంభించారు. గతంలో అదానీ.. అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. అదానీ సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. జగన్‌ సీఎం అయిన తర్వాతే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారంతా ఏపీవైపు చూసేలా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెబుతున్నాం. మీరు పరిశ్రమ స్థాపించండి.. అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది.  
ఏపీలో తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు..
తమ సంస్థ మొట్టమొదటి గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టును ఏపీలోనే చేపట్టామని ఏటీసీ సీవోవో అనిల్‌ చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయని ధన్యవాదాలు తెలియచేశారు. అధికారులు ఫోన్‌ చేసి మరీ మీకు లైసెన్స్‌ మంజూరైందని తెలియచేశారని చెప్పారు. సీఎం జగన్‌ను యువత ఎంతో అభిమానిస్తోందన్నారు. వచ్చే ఏడాది తమ ప్లాంట్‌ రెండో దశ ప్రారంభానికి రా>వాలని సీఎంను ఆహా్వనించారు.  
 నూతన ప్లాంట్‌తో లక్ష్యాన్ని సాధిస్తాం .. 
ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, అందుకు  అచ్యుతాపురం ప్లాంట్‌ ఎంతో దోహదం చేస్తుందని ఏటీసీ సీఈవో నితిన్‌ పేర్కొన్నారు. మొదటి దశ ప్లాంట్‌లో రోజుకు 69 టన్నుల రబ్బర్‌ వినియోగిస్తున్నామని, రెండో దశ ప్లాంట్‌ పూరైత్తే 132 టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు.  
 ఏపీకి మరిన్ని జపాన్‌ కంపెనీలు! 
పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామని చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ టాగా మషయూకి వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ శంకుస్థాపన చేసిన 8 కంపెనీలు.. 

కంపెనీ పేరు కేటాయించిన స్థలం పెట్టుబడి రూ.కోట్లలో వ‌చ్చే ఉద్యోగాలు
పిడిలైట్‌ 18.17 ఎకరాలు 202 380
మేఘా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌  6 ఎకరాలు 185.25 677
ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్టŠస్‌ 6.77 ఎకరాలు 145 70
ఆప్టిమస్‌ డ్రగ్స్‌ 15.02 ఎకరాలు 125 185
విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్‌ 47.77 ఎకరాలు 107.70 382
సినాప్టిక్స్‌ లాబ్స్‌ 11.67 ఎకరాలు 81.75 300
స్టైరాక్స్‌ లైఫ్‌ సైన్స్‌ 4.08 ఎకరాలు 87.77 450
ఇషా రిసోర్సెస్‌ 32.53 ఎకరాలు 68.06 220
Published date : 17 Aug 2022 05:24PM

Photo Stories