Skip to main content

JSW Steel Plant: కడపలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రూ.23,985 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.

దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లాకు ఇచ్చిన హామీ మేరకు గట్టి ప్రయత్నంతో  దేశంలో రెండో అతి పెద్ద స్టీల్‌ దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూని సీఎం జగన్‌ ఒప్పించి ఉక్కు కర్మాగారం నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు.   డిసెంబర్‌ 12న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ నెలకొల్పే పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. 

☛ రాజమహేంద్రవరానికి సమీపంలో రూ.270 కోట్లతో అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు..
ఎస్‌ఐపీబీ ఆమోదించినప్రాజెక్టులు ఇవీ..
దేశంలో రెండో అతిపెద్ద స్టీల్‌ గ్రూప్‌ జేఎస్‌డబ్ల్యూ  
వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా ఒక మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు కానుంది. రెండో విడతలో మరో రెండు మిలియన్‌ టన్నులతో కలిపి మొత్తం 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో యూనిట్‌ అందుబాటులోకి రానుంది. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్‌ లాంటి పలు రంగాల్లో విస్తరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ విలువ సుమారు రూ.1,76,000 కోట్లు (22 బిలియన్‌ డాలర్లు) ఉంటుంది. ఏటా 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి ద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా జేఎస్‌డబ్ల్యూ నిలిచింది. కంపెనీకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో స్టీల్‌ ప్లాంట్లున్నాయి. తాజాగా మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీలో అడుగు పెడుతోంది. 

Visakhapatnam: విశాఖ వేదికగా ‘జీ–20 సదస్సు’
ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 

ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్‌ఎనర్జీ పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సుమారు రూ.6,330 కోట్ల పెట్టుబడితో 1,600 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వెయ్యి మెగావాట్లు, అనకాపల్లి – విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్‌ పనులను 2024 డిసెంబర్‌లో ప్రారంభించ‌నుంది. నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 4,196 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.  
ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు 
ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమో దం తెలిపింది. ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్లతో మొత్తం రెండు ప్రాజెక్టుల ద్వారా 2,100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమై విడతల వారీగా డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిస్థాయిలో యూనిట్‌ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Also read: Fraudulent Loan Apps: మోసకారి లోన్‌ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌: సీఏం జగన్‌

Published date : 13 Dec 2022 12:56PM

Photo Stories