సెప్టెంబర్ 2020 వ్యక్తులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59) సెప్టెంబర్ 24న హఠాన్మరణం చెందాడు. ఐపీఎల్-2020 వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్‌లో తీవ్ర గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలోని కోబర్గ్‌లో 1961, మార్చి 24న డీన్ జోన్స్ జన్మించాడు. అతని పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. 1987 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర (314 పరుగులు) పోషించిన డీన్ జోన్స్ కెరీర్‌లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలురాయి. ఆసీస్ 4-0తో నెగ్గిన ఈ సిరీస్‌లో జోన్స్ 566 పరుగులు సాధించాడు.
కోచ్‌గా, కామెంటేటర్‌గా...
ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జోన్స్ ఆ తర్వాత కోచ్‌గా, కామెంటేటర్‌గా క్రికెట్‌తో మళ్లీ తన అనుబంధాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2015నుంచి 2019 వరకు ఇస్లామాబాద్ యునెటైడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా పలు ఘనతలు సాధించడంతో పాటు సునిశీత పరిశీలన, క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాలపై అతని విశ్లేషణలకు క్రికెట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే జోన్స్ ను ‘ప్రొఫెసర్’ అని కూడా అతని సన్నిహితులు పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : డీన్ మెర్విన్ జోన్స్ (59)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : గుండెపోటు కారణంగా
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి?
దేశంలోని న్యూస్‌పేపర్లు, మాగజీన్లు, పీరియాడికల్స్‌కు సంబంధించిన అపెక్స్‌బాడీ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) 2020-21 అధ్యక్షుడిగా ఎల్.ఆదిమూలం ఎన్నికయ్యారు. 81వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఎల్.ఆదిమూలం హెల్త్ అండ్ ది యాంటీసెప్టిక్ జర్నల్ ప్రతినిధిగా ఉన్నారు. ఐఎన్‌ఎస్ నూతన కార్యవర్గంలో డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఆనందబజార్ పత్రిక నుంచి డి.డి.పుర్కాయస్త, వైస్ ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్ నుంచి మోహిత్ జైన్, గౌరవ కోశాధికారిగా రాకేష్ శర్మ(ఆజ్ సమాజ్), సెక్రటరీ జనరల్‌గా మేరి పాల్ ఎన్నికయ్యారు. మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) 2020-21 అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎల్.ఆదిమూలం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 5న కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలు ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇతర అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1946 జూన్ 4న జననం...
1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట((ప్రస్తుతం తమిళనాడు, తిరవళ్లూరు జిల్లా)లో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వారాల అబ్బాయిగా ఉండి విద్యాభ్యాసం చేశారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలు యుక్త వయసులోనే సంగీతంపట్ల ఆకర్షితుడయ్యారు. ఇంజనీరింగ్ చేస్తూనే పలు సంగీత పోటీల్లో పాల్గొన్నారు.
16 భాషల్లో... 40 వేలకుపైగా...
సినీ నేపథ్య గాయకుడిగా ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న’(1966) చిత్రం ద్వారా బాలు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ.. ఇలా సుమారు 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
నటుడిగా, సంగీత దర్శకుడిగా...
విజయవంతమైన గాయకుడు అనిపించుకున్న బాలు నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1969లో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. 1990లో కేలడి కన్మణి(తెలుగులో ఓ పాపా లాలి), దేవస్థానం, మిథునం, ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరోప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. బాలచందర్ తమిళ చిత్రం ‘మన్మధ లీలై’తెలుగు డబ్బింగ్ ‘మన్మధ లీల’తో డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు.
1977లో వచ్చిన ‘కన్యా కుమారి’తో బాలు సంగీత దర్శకుడిగా మారారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 46 సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా ‘యోధ’, ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’, ‘శుభ సంకల్పం’వంటి సినిమాలు నిర్మించారు.
1979లో తొలి జాతీయ అవార్డు...
- సంగీత శిఖరం బాలు ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1979లో సంగీత ప్రధానంగా వచ్చిన ‘శంకరాభరణం’ చిత్రానికిగాను ఆయన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు.
- ఆ తర్వాత 1981లో హిందీ చిత్రం ‘ఏక్ ధూజే కేలియే’, 1983లో ‘సాగర సంగమం’, 1988లో ‘రుద్రవీణ’, 1995లో కన్నడ చిత్రం ‘సంగీత సాగర గానగోయి పంచాక్షర గవై’, 1996లో తమిళ చిత్రం ‘మిన్‌సార కనవు’చిత్రాలకు జాతీయ అవార్డు అందుకున్నారు. 25 నంది అవార్డులు దక్కాయి.
- భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకుగాను 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.
- 2012లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’అవార్డు తీసుకున్నారు. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇంకా తమిళ, కన్నడ ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. 1964లో తన తొలి అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74)
ఎక్కడ : ఎంజీఎం ఆసుపత్రి, చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్య కారణాలతో
అమెరికా సుప్రీం నూతన జడ్జి ఎన్నిక?
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ సెప్టెంబర్ 26న ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 48 ఏళ్ల వయసున్న బారెట్ మాట్లాడుతూ.. సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్ తనకు దక్కిన అత్యంత గౌరవమని బారెట్ అన్నారు. సెనేట్ ఆమోదం తర్వాత గిన్స్ బర్గ్ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : జస్టిస్ అమీ కోనే బారెట్
ఎక్కడ : అమెరికా
బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్(82) కన్నుమూశారు. చాన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 27న గుండెపోటుతో న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 27న ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. జశ్వంత్ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను సమర్థంగా నిర్వహించారు.
రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ
1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా- ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్(82)
ఎక్కడ : ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి, న్యూ ఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా
జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ నూతన డెరైక్టర్?
భారత ప్రభుత్వం జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డెరైక్టర్‌గా ములుగు జిల్లాకు చెందిన వికాస్ అగ్రి ఫౌండేషన్ చైర్మన్ నాశిరెడ్డి సాంబశివరెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్‌జీఓ కోటాలో ఆయనకు స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. డెరైక్టర్‌గా మూడేళ్ల కాలం కొనసాగుతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ములుగు జిల్లాకు చెందిన వికాస్ అగ్రి ఫౌండేషన్ చైర్మన్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి
ట్రాయ్ నూతన చైర్మన్‌గా నియమితులైన బ్యూరోక్రాట్?
టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మూడేళ్ల పాటు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే దాకా (ఏది ముందైతే అది) ఉంటుంది. ప్రస్తుత చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పదవీకాలం సెప్టెంబర్ 30తో తీరిపోనుంది. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన వఘేలా ప్రస్తుతం ఫార్మా విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో వఘేలా కూడా ఉన్నారు.
కోలార్ బంగారం గనుల్లో అన్వేషణ ప్రారంభం
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారం గనుల్లో అన్వేషణను మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) సెప్టెంబర్ 28న ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కోలార్ బంగారం గనుల్లోని బెట్రేయస్వామి బ్లాక్‌లో అన్వేషణ ప్రారంభమైందని తెలియజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : సీనియర్ బ్యూరోక్రాట్ పి.డి. వఘేలా
ప్రముఖ చిత్రకారుడు చందమామ శంకర్ కన్నుమూత
ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’ శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 29న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కరథొలువు గ్రామంలో 1924 జూలై 24న జన్మించిన శంకర్ చిన్నప్పటి నుంచే చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్నారు. పన్నెండవ తరగతి పూర్తయ్యాక చెన్నైలోని ఆర్ట్ కాలేజీలో చేరారు. అక్కడ తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత 1946లో కళైమాగల్ అనే పత్రికలో తొలిసారి చిత్రకారునిగా కొలువులో చేరారు.
60 ఏళ్లు పాటు చందమామలో...
1952 ఏడాదిలో ‘చందమామ’లో చేరిన శంకర్ 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ దాదాపు 60 ఏళ్లు పాటు అందులోనే పనిచేశారు. తన అద్భుత చిత్రాలతో చందమామలోని భేతాళ కథలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కారింపచేశారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ ఆయన అద్భుత చిత్రాలు వేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ చిత్రకారుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో
హురూన్ రిచ్ లిస్ట్-2020 ప్రకారం దేశంలోనే మూడో ధనవంతుడు ఎవరు?
దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏట తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సెప్టెంబర్ 28న విడుదలైన ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020’లో ఈ విషయం వెల్లడైంది. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ సంస్థతో కలసి హరూన్ రూపొందించిన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 2020, ఆగస్ట్ 31 నాటికి రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన 828 మందిని చేర్చారు. ఈ నివేదిక ప్రకారం... ఉమ్మడిగా ఈ 828 మంది సంపద 2020 ఏడాది 20 శాతం పెరిగింది.
హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-ముఖ్యాంశాలు
- 2020 ఏడాది అంబానీ సంపద 73 శాతం పెరిగి రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలోనే మొదటి ఐదుగురు ధనవంతుల్లో ముకేశ్ నిలిచారు.
- హిందుజా సోదరులు రూ.1.43 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్, ఆయన కుటుంబం సంపద 34 శాతం పెరిగి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.
- అదానీ గ్రూపు సారథి గౌతం అదానీ సంపద ఈ ఏడాది 48 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. రెండు స్థానాలు ఎగబాకి అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి చేరారు.
- రూ.1.14 లక్షల కోట్లతో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి జారిపోయారు.
- సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా సంపద 6 శాతం పెరిగి రూ.94,300 కోట్లకు చేరుకోవడంతో ఆయన 6వ స్థానంలో నిలిచారు.
- డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం సంపద 56 శాతం పెరగడంతో టాప్ 10లోకి చేరారు. వారి సంపద రూ.87,200 కోట్లకు చేరింది.
- కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రమోటర్ ఉదయ్ కోటక్ సంపద 8 శాతం తగ్గి రూ.87,000 కోట్లుగా ఉండడంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు.
- కెమికల్స్, పెట్రో కెమికల్స్ నుంచి 20 మంది, సాఫ్ట్‌వేర్ రంగం నుంచి 15 మంది కొత్తగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద ఫార్మా పరిశ్రమ నుంచి 122 మంది, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాలకు సంబంధించి 55 మంది, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ నుంచి 50 మందికి చోటు లభించింది.
ఏమిటి : హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-2020 ప్రకారం మూడో ధనవంతుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్
ఎక్కడ : భారత్
కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి?
ఏళ్ల తరబడి కువైట్‌ను పాలించిన రాజు(ఎమిర్ ఆఫ్ కువైట్) షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా(91) సెప్టెంబర్ 29న అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం రోచెస్టర్ నగరంలో కన్నుమూశారు. కువైట్‌లోని కువైట్ నగరంలో 1929, జూన్ 16న జన్మించిన షేక్ సబా.... 2006, జూన్ 29 కువైట్ రాజుగా ఎన్నికయ్యారు. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో, ఇతరత్రా ప్రాంతీయ సంక్షోభాలకు పరిష్కారాలు చూపడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అరబ్ దేశాల మధ్య తలెత్తిన వివాదాలను తన దౌత్యం ద్వారా పరిష్కరిస్తూ వచ్చారు.
కువైట్ తదుపరి రాజుగా...
కువైట్ తదుపరి రాజుగా షేక్ సబా సవతి సోదరుడు, యువరాజు షేక్ నవాఫ్ అల్‌అహ్మద్ అల్ సబా బాధ్యతలు చేపట్టనున్నారు.
కువైట్ రాజధాని నగరం: కువైట్ సిటీ
కరెన్సీ: కువైట్ దినార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కువైట్ రాజు(ఎమిర్ ఆఫ్ కువైట్) కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా(91)
ఎక్కడ : రోచెస్టర్, మిన్నెసోటా రాష్ట్రం, అమెరికా
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులైన పద్మశ్రీ అవార్డీ?
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత కళాకారిణిగా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యాన్ని తీసుకురావడంలో ఆమె కృషి ఎనలేనిది.
టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ...
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు టీటీడీలో ప్రస్తుతం ఏఈవోగా పనిచేస్తున్న ధర్మారెడ్డి పూర్తిస్థాయి ఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులైన పద్మశ్రీ అవార్డీ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : డాక్టర్ శోభారాజు
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా నియమిలైన దర్శకుడు?
పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ ప్రెసిడెంట్‌గా, ఎఫ్‌టీఐఐ ఇనిస్టిట్యూట్స్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖల మంత్రి ప్రకాశ్ కేశవ్ జవదేకర్ సెప్టెంబర్ 30న తెలిపారు. 2023, మార్చి 3 వరకు శేఖర్ కపూర్ పదవీకాలం కొసాగుతుందని పేర్కొన్నారు.
1983లో మాసూమ్ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా శేఖర్ కపూర్ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మిస్టర్ ఇండియా (1987), బండిట్ క్వీన్ (1994), ఎలిజబెత్ (1998), ది ఫోర్ ఫీదర్స్ (2002), ఎలిజబెత్: ది గొల్డెన్ ఏజ్ (2007), న్యూయార్క్, ఐ లవ్ యూ (2008), పాసేజ్ (2009) చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఇష్క్ ఇష్క్ ఇష్క్, ఉడాన్, విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాల్లో నటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ ప్రెసిడెంట్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్
ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి?
ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా 2020-21 సంవత్సరానికిగాను గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ పూర్ణచంద్రరావు సూరపనేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 52 ఏళ్ల చరిత్ర కలిగిన ఐఏసీసీకి ఈ పదవిని అలంకరించిన రెండవ తెలుగు వ్యక్తిగా పూర్ణచంద్రరావు నిలిచారు. 2018-20 కాలానికి ఐఏసీసీ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నెరవేర్చారు. భారత్-యూఎస్ వ్యాపార సంబంధాలు, వాణిజ్యం మరింత మెరుగుపడేందుకు ఆయన అనుభవం దోహదం చేస్తుందని ఐఏసీసీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ పూర్ణచంద్రరావు సూరపనేని
కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సెప్టెంబర్ 17న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా కేబినెట్ మంత్రి అయిన హర్‌సిమ్రత్ కౌర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లులను ఎస్‌ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు.
ఎన్‌డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు బిల్లులను ఎస్‌ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
ఎందుకు : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా
నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ బాధ్యతలు
కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె సెప్టెంబర్ 17న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీల వేతనాలు తగ్గింపు బిల్లుకు ఆమోదం
పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30 శాతం తగ్గించేందుకు ఉద్దేశించిన ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్-1954 సవరణ బిల్లు’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బిల్లును లోక్‌సభ సెప్టెంబర్ 15న ఆమోదించగా, సెప్టెంబర్ 18న రాజ్యసభ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా అదనపు బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : నరేంద్ర సింగ్ తోమర్
అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళ కన్నుమూత?
అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో పోరాడుతున్న ఆమె న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో సెప్టెంబర్ 18న తుదిశ్వాస విడిచారు. బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933, మార్చి 15న జన్మించిన రూత్ హార్వార్డ్ యూనివర్సిటీలో లా చదివారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు.
అధ్యక్షుడికే...
అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జాన్ రాబర్‌ట్స ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87)
ఎక్కడ : బ్రూక్లిన్, న్యూయార్క్, అమెరికా
ఎందుకు : పాన్‌క్రియాటిక్ కేన్సర్ కారణంగా
రఫేల్ ఫైటర్ జెట్ పైలట్‌గా మహిళా పైలట్
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 2020, సెప్టెంబర్ 10న చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. ఇందుకు సంబంధించి మిగ్-21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
మొదటి భారతీయ మహిళా పైలట్
2018 ఫిబ్రవరి 19న యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె జామ్‌నగర్ స్థావరం నుంచి మిగ్-21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో అవనీ కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875.
కరోనాతో మృతి చెందిన కేంద్ర మంత్రి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ సురేశ్ అంగడి (65) కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో సురేశ్ అంగడి జన్మించారు. బెళగావిలోని ఎస్‌ఎస్‌ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. బెళగావి లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : సురేశ్ అంగడి (65)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : కోవిడ్-19 వ్యాధితో
2020 ఏడాదిలో అత్యంత ప్రభావం చూపించిన భారతీయలు?
2020 ఏడాదికి గాను టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తులు-100’ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల బిల్కిస్ ఈ జాబితాలో స్థానం పొందారు. అలాగే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
టైమ్స్ జాబితా రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇండియన్ అమెరికన్ కమలా హ్యారిస్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ పత్రిక పేర్కొంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవీంద్ర గుప్తా హెచ్‌ఐవీ ఎయిడ్‌స వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ జాబితా ప్రకారం... 2020 ఏడాదిలో అత్యంత ప్రభావం చూపించిన భారతీయలు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : నరేంద్ర మోదీ, బిల్కిస్ దాదీ, ఆయుష్మాన్ ఖురానా, సుందర్ పిచాయ్, రవీంద్ర గుప్తా
ఆర్యసభ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఆధ్యాత్మిక వేత్త?
ప్రముఖ సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 11న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించిన అగ్నివేశ్ అసలు పేరు వేప శ్యామ్ రావు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు.
హరియాణా విద్యా శాఖ మంత్రిగా...
సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందిన అగ్నివేశ్ బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : స్వామి అగ్నివేశ్(80)
ఎక్కడ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్ ఆస్పత్రి, ఢిల్లీ
ఎందుకు : లివర్ సిర్రోసిస్ వ్యాధితో
జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పుస్తక రచయిత?
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వర్చువల్‌గా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 12న జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ భానుమతి పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జస్టిస్ బాబ్డే ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం జస్టిస్ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పుస్తక రచయిత
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. రెండోసారి కోవిడ్ లక్షణాల(మొదటిసారి జూన్‌లో కోవిడ్-19 నిర్ధారణ అయింది)తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. బిహార్ వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 1946, జూన్ 6న వైశాలిలో జన్మించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రఘువంశ్ ప్రసాద్ సింగ్(74)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : కోవిడ్ లక్షణాలతో
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన వారు?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సభానాయకుడు తావర్‌చంద్ గెహ్లోత్ ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు కానీ, ఓటింగ్‌కు పట్టుబట్ట లేదు. హరివంశ్ జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరికీ ఆప్తుడుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రశ్నోత్తరాల సమయం రద్దు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు సెప్టెంబర్ 14న వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. కోవిడ్ కారణంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
సాధారణంగా...
సాధారణంగా సభ ప్రారంభం కాగానే తొలి గంట ప్రశ్నోత్తరాల సమయం( క్వశ్చన్ అవర్)గా ఉంటుంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజన అంశాలపై సభ్యులను మంత్రులను ప్రశ్నించి, సమాధానాలు పొందవచ్చు. తాజా సమావేశాల్లో, కరోనా ముప్పు కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల సభాకార్యక్రమాల్లో క్వశ్చన్ అవర్‌ను, ప్రైవేటు మెంబర్ బిజినెస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభకు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : హరివంశ్ నారాయణ్ సింగ్
జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి?
జపాన్‌లో అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో సుగా ఎంపికయ్యారు. సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్‌లో అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నూతన సారథిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : యోషిహిడే సుగా
వూహాన్‌లోనే కరోనా పుట్టిందని తెలిపిన చైనా వైరాలజిస్టు?
ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పుట్టింది వూహాన్‌లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు డాక్టర్ లి-మెంగ్ యాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్ టాక్ షో ‘లూస్ వుమన్’ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమంలో డాక్టర్ యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. 2019, డిసెంబర్- 2020, జనవరిలో తొలిసారి, 2020, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ యాన్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత ఆమె హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు.
2024 చివరికి కూడా..
2024 ఏడాది చివరినాటికి కూడా ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వ్యాక్సిన్ అందటం కష్టమేనని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ అందించడానికి కనీసం 15 బిలియన్ డోసులు అవసరమవుతాయని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వూహాన్‌లోనే కరోనా పుట్టిందని తెలిపిన చైనా వైరాలజిస్టు
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : డాక్టర్ లి-మెంగ్ యాన్
భారత మాజీ క్రికెటర్ సదాశివ్ పాటిల్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్‌జీ (ఎస్‌ఆర్) పాటిల్(86) కన్నుమూశారు. సెప్టెంబర్ 15న ఆయన కొల్హాపూర్(మహారాష్ట్ర)లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మీడియం పేసర్ అయిన పాటిల్... 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 79వ ఆటగాడిగా నిలిచిన ఆయన... కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్‌కు పరిమితం అయ్యారు. అనంతరం లాంక్‌షైర్ లీగ్‌లో 1959 నుంచి 1961 వరకు రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ల్లో ఆడి... 111 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1952-64 మధ్య మహారాష్ట్ర తరఫున 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. రంజీల్లో మహారాష్ట్రకు సారథ్యం కూడా వహించాడు.
థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ వాయిదా
ప్రతిష్టాత్మక థామస్ కప్-ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను 2021 ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. కరోనా వైరస్ భయానికి ఈ టోర్నీలో ఆడబోమని చెప్పే దేశాల సంఖ్య పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం 2020, అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సదాశివ్ రావ్‌జీ (ఎస్‌ఆర్) పాటిల్(86)
ఎక్కడ : కొల్హాపూర్, మహారాష్ట్ర
ఏవరి నేతృత్వంలోని బృందం కోవిడ్ టీకా పంపిణీ విధానాన్ని రూపొందించింది?
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాని పంపిణీ, టీకా డోసులు ఏ దేశానికి ముందు ఇవ్వాలన్న అంశంపై 19 మందితో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల బృందం ఒక విధానాన్ని రూపొందించింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వంలోని ఈ బృందం పలు దశల్లో వ్యాక్సిన్ పంపిణీకి పలు సూచనలు చేసింది. కోవిడ్-19 ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ దాడి చేస్తోంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని రూపొందించారు. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించిన విషయం తెలిసిందే.
నిపుణుల బృందం-సూచనలు
- కరోనా వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
- కోవిడ్-19తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలి.
- వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల కోవిడ్ ప్రభావంతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
- వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :19 మందితో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల బృందానికి నేతృత్వం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఎజెకీల్ జే ఎమ్మన్యూల్
ఎందుకు : కోవిడ్ టీకా పంపిణీ విధానాన్ని రూపొందించేందుకు
ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తి?
ఆస్ట్రియాకు చెందిన స్విమ్మర్ జోసెఫ్ కోబెర్ల్ ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ 5న ఆయన వియన్నా మెయిన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గాజు గదిలో ఉంచిన 200 కిలోల ఐస్‌క్యూబ్‌ల మధ్య ఒంటిపై కేవలం స్విమ్ సూట్ మాత్రమే ధరించి రెండు గంటల, 30 నిమిషాల, 57 సెకన్ల పాటు నిలబడ్డారు. అరగంట ఎక్కువ సమయం గడిపి 2019లో తను నెలకొల్పిన రికార్డును తాజాగా బద్దలుకొట్టారు. ప్రదర్శన తర్వాత జోసెఫ్‌కు వైద్యులు పరీక్షలు చేసి, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధ్రువీకరించారు. 2021 ఏడాది లాస్‌ఏంజెలెస్‌లో ఇలాంటి ప్రయత్నమే చేసి, మరో రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు జోసెఫ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఆస్ట్రియాకు చెందిన స్విమ్మర్ జోసెఫ్ కోబెర్ల్
ఎక్కడ : వియన్నా మెయిన్ రైల్వే స్టేషన్, ఆస్ట్రియా
ఐటా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు?
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు అనిల్ జైన్ ఎన్నికైయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 6న జరిగిన ‘ఐటా’ వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మధ్యప్రదేశ్ టెన్నిస్ సంఘం (ఎంపీటీఏ) అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ధూపర్‌ను సెక్రటరీ జనరల్‌గా... భారత మాజీ డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌ను కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరు 2024 వరకు ఆ పదవుల్లో కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్షుడిగా ఎన్నకైన రాజ్యసభ సభ్యుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అనిల్ జైన్
స్వామి కేశవానంద భారతి కన్నుమూత
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన తత్వవేత్త, శాస్త్రీయ సంగీతకారుడు స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. 1940, డిసెంబర్ 9న జన్మించిన ఆయన వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబర్ 6న కర్ణాటకలోని మంగళూరులో కన్నుముశారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కాసర్‌గఢ్‌లోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా ఉన్న కేశవానంద భారతి శ్రీపాద గల్వరు యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు.
మైలురాయి... ఆ తీర్పు
కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం.
రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ..
కేరళ ప్రభుత్వం వర్సెస్ కేశవానంద భారతి కేసు తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది.
మొదట కేరళ హైకోర్టులో...
భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన తత్వవేత్త కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : స్వామి కేశవానంద భారతి (79)
ఎక్కడ : మంగళూరు, కర్ణాటక
ఎందుకు : వృద్ధాప్య సమస్యలతో
విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి కన్నుమూత
సుప్రసిద్ధ విలక్షణ నటుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి (74) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సెప్టెంబర్ 8న గుంటూరు విద్యానగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లా, సిరివెళ్ల మండలం, వీరారెడ్డి పల్లెలో 1946, మే 8న జన్మించిన ప్రకాష్‌రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రంగస్థల దిగ్గజంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటనా రంగంలో విశేష కృషి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 340 సినిమాలు, 3 వేల నాటకాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ యాసతో ఆయన నటనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.
లవుడు ఇకలేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం లవకుశలో లవుడు పాత్ర పోషించిన నటుడు ఆనపర్తి నాగరాజు ఇకలేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లో గుండెపోటుతో సెప్టెంబర్ 7న కన్నుమూశారు. 340కి పైగా చిత్రాల్లో నటించిన నాగరాజు అసలు పేరు.. నాగేందర్‌రావు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏ.వీ.సుబ్బారావు కుమారుడే నాగరాజు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రసిద్ధ విలక్షణ నటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తూర్పు జయప్రకాష్‌రెడ్డి (74)
ఎక్కడ : విద్యానగర్, గుంటూరు
ఎందుకు : గుండెపోటు కారణంగా
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి 2020, ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు.
పార్థసారథి ప్రస్థానం...
- 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)-ఆగ్రోనమి డిస్టింక్షన్‌లో పూర్తిచేశారు.
- 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు.
- ఐఏఎస్‌గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు.
- 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్‌ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్‌స కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు.
- 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది 2020, ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.
- ఆ తర్వాత ఈపీటీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బదిలీపై వెళ్లి, 2020, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.
ఏమిటి : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథి
రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రముఖ సినీ హీరో?
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ హీరో ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు(ప్రభాస్) అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు బాహుబలి సినిమా హీరో ప్రభాస్ ముందుకు వచ్చారు. ఈ నిర్ణయం వల్ల దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకోటూరిజం సెంటర్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 7న సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు.
సూర్యనారాయణ రాజు పేరు మీదుగా...
ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు. తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరు మీదుగా బాహుబలి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రముఖ సినీ హీరో?
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు(ప్రభాస్)
ఎక్కడ : హైదరాబాద్ సమీపం
ఎందుకు : గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా
జపాన్ ప్రధాని పదవిని వీడనున్న షింజో అబె
ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు. ఆగస్టు 31న పదవి నుంచి వైదొలుగుతానని ఆగస్టు 28న షింజో అబె ప్రకటించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు.
2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన 65 ఏళ్ల అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. 2021 ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తా
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : షింజో అబె
ఎందుకు : అనారోగ్య కారణాలతో
హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ కన్నుమూత
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్(43) కన్నుమూశారు. కొంతకాలంగా పేగు సంబంధిత క్యాన్సర్‌తో ఆయన లాస్‌ఏంజెల్స్‌లో ఆగస్టు 28న తుదిశాస విడిచారు. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. 2003లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన చద్విక్ ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : చద్విక్ బోస్‌మ్యాన్(43)
ఎక్కడ : లాస్‌ఏంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : పేగు సంబంధిత క్యాన్సర్ కారణంగా
పీటీఐ చైర్మన్‌గా అవీక్ సర్కార్ ఎన్నిక
ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్(75) ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీటీఐ బోర్డు ఆగస్టు 29న ధ్రువీకరించింది. పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా స్థానంలో అవీక్ సర్కార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సర్కార్.. టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి. పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్
న్యాయవాది ప్రశాంత్‌కు రూపాయి జరిమానా
న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. 2020, సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ ఆగసు 31న తీర్పునిచ్చింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్...
దేశీయంగా తయారు చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్’త్వరలోనే రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అడుగుపెట్టనుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఎంఎస్) వెల్లడించింది. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాక్సిన్’ను మనుషులపై ప్రయోగించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన 12 మెడికల్ కాలేజీల్లో ఐఎంఎస్ కూడా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు
రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఇకలేరు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో ఆగస్టు 31న తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్‌లో ఆగస్టు 10న ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో లోధిరోడ్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.
వారం పాటు సంతాపం..
ప్రణబ్‌కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది.
మిరాటి గ్రామంలో జననం...
1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రణబ్ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం...
- 1969లో క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రణబ్ 1969 జూలైలోనే కాగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై , పలుమార్లు సభా నాయకుడిగా సేవలందించారు.
- 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు.
- 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడైన ప్రణబ్... ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రఖ్యాతి గాంచారు.
- 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
- 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు.
- ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత.
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన ప్రణబ్ 1980-85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు.
- 2004-2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు.
- ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్ దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు.
- 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్- అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
- 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్‌పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్ దా ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో జంగిపూర్ (ముర్షిదాబాద్) నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
- 2012, జూలై 25 నుంచి 2017, జూలై 25 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ దా బాధ్యతలు నిర్వర్తించారు.
భారతరత్న గ్రహీత...
- ప్రణబ్ దా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు.
- దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి.
- ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి.
- 2020, డిసెంబరు 11వ తేదీన ప్రణబ్ జయంతిని పురస్కరించుకొని ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు.
- రాష్ట్రపతిగా తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు ప్రణబ్ దా పాఠాలు చెప్పారు.
- క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో రాష్ట్రపతిగా ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు.
- రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు ప్రణబ్ దా పొందారు.
- సొంతూరి(మిరాటి గ్రామం)తో ఉన్న అనుబంధాన్ని మాత్రం ప్రణబ్ ఎన్నడూ మరువలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉండేవారు.
కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వ్యక్తి?
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ నియమితులయ్యారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి(జార్ఖండ్ క్యాడర్) అయిన రాజీవ్ కుమార్ ఐదేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగి, 2025లో రిటైర్ అవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఈయన నేతృత్వంలో జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు పదవిలో ఉండాల్సి ఉండగా, 2025 ఫిబ్రవరిలో 65 ఏళ్లు నిండడంతో ఈయన ఒక ఏడాది ముందుగానే రిటైర్ కానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్
హిందుస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీగా నియమితులైన వారు?
హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు స్థానంలో ఖత్రి నియామకం జరిగింది. ఖత్రి షిప్‌యార్డ్‌లో 2017 నుంచి డెరైక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా పనిచేశారు. డెరైక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థలో మరమ్మతుల కోసం వచ్చిన ఐఎన్‌ఎస్ సింధూవీర్, ఐఎన్‌ఎస్ అస్త్రధరణి సబ్‌మెరైన్‌లను నిర్ణీత సమయం కంటే ముందే అందించారు. ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ శక్తి, నేవల్ ఫీట్ ట్యాంకర్స్ వంటి నౌకలతో పాటు యూరోపియన్ షిప్‌యార్డ్‌లో నౌకల తయారీలో ఖత్రికి అనుభవం ఉంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి
ఫార్చూన్ 40:40 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?
ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్‌లకు కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.
టెక్నాలజీ కేటగిరీలో...
2020 ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ఫార్చూన్ ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు.
రిలయన్స్ కు తోడ్పాటు...
బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్ లో చేరారు. యేల్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్ లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది.
ఆన్‌లైన్ విద్య సాధ్యమేనని...
భారీ స్థాయిలో ఆన్‌లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్చూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ బెజు రవీంద్రన్, మను కుమార్ జైన్