Skip to main content

ఫిబ్రవరి 2020 వ్యక్తులు

మలేషియా ప్రధాని మహతీర్ రాజీనామా
Current Affairs
మలేసియా ప్రధానమంత్రి మహతీర్ మొహమాద్ ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మలేసియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో 94 ఏళ్ల మహతిర్ తన పదవికి రాజీనామా చేశారు. 2018, మే 10న మలేసియా ప్రధానిగా మహతీర్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేసియా ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : మహతీర్ మొహమాద్
ఎందుకు : ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో

రాకెట్ ప్రమాదంలో ఖగోళ శాస్త్రవేత్త మైక్ మృతి
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64) ఫిబ్రవరి 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. ఆ రాకెట్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బార్‌స్టో సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖగోళ శాస్త్రవేత్త మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64)
ఎక్కడ : బార్స్టో, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కన్నుమూత
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హోస్నీ ముబారక్ (91) ఫిబ్రవరి 25న మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది.1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న ముబారక్ అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. ముబారక్ నియంతృత్వ ధోరణిని అనుసరిస్తున్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 18 రోజులపాటు జరిగిన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 900 మంది మరణించారు. దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది. 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై న్యాయస్థానాలు 2012 జూన్‌లో ముబారక్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో ఆ తీర్పును కొట్టివేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : హోస్నీ ముబారక్ (91)
ఎందుకు : అనారోగ్యం కారణంగా

తెలంగాణ సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం
తెలంగాణ సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ఫిబ్రవరి 25న ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

నటుడు కొండలరావుపై పోస్టల్ కవర్ విడుదల
ప్రముఖ సినీ నటుడు రావి కొండలరావుపై తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించింది. హైదరాబాద్ డాక్ సదన్‌లో ఫిబ్రవరి 25న జరిగిన కార్యక్రమంలో తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి ఈ కవర్‌ను విడుదల చేశారు. రావి కొండలరావు సుమారు 600కుపైగా చిత్రాల్లో నటించారు. తాను తీసిన సీరియల్స్‌కు 12 నంది అవార్డులు, 50 కథలకు అవార్డులు అందుకున్నారు. ఆరు జాతీయ భాషల్లోకి ఆయన కథలు అనువాదమయ్యాయి. ఆకాశవాణి కోసం పదేళ్లలో వంద నాటికలు రాసిన ఏకై క రచయితగా పేరొందారు.

రన్నింగ్ ట్రాక్‌పైకి కంబళ వీరుడు శ్రీనివాస గౌడ
కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు. బురదతో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబళ పోటీల్లో గౌడ వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇటీవల స్పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) దక్షిణభారత విభాగం డెరైక్టర్ అజయ్ భేల్, ఇతర అధికారులు కాసరగోడ్ జిల్లాలోని పైవలికేలో శ్రీనివాసతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు. బెంగళూరులోని శాయ్ కేంద్రంలో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస 2020 ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కై వసం చేసుకున్నాడు.

హరూన్ గ్లోబల్‌రిచ్ లిస్ట్ 2020 విడుదల
2019 ఏడాదికి గాను రూపొందించిన 9వ ఎడిషన్ ‘హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020’ తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో 140 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 67 బిలియన్ డాలర్ల సంపదతో 9వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అలాగే అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేశ్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు), అంతకుమించిన నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.
హరూన్ రిచ్ లిస్ట్ 2020లోని ముఖ్యాంశాలు
  • ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది బిలియనీర్లు ఉన్నారు. 2019లో కొత్తగా 480 మంది బిలియనీర్లుగా అవతరించారు.
  • 799 మంది బిలియనీర్లతో చైనా, 626 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల తర్వాత భారత్ 138 మందితో మూడో స్థానంలో ఉంది.
  • భారత్‌లో 2019 ఏడాదికి 34 మంది బిలియనీర్లు అదనంగా జత కూడడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 38కి చేరుకుంది. భారత్‌కు వెలుపల ఉన్న భారత సంతతికి చెందిన బిలియనీర్లను కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్య 170గా ఉంటుంది.
  • భారత్‌లో ప్రతీ నెలా ముగ్గురు చొప్పున పెరగ్గా, చైనాలో ప్రతీ వారానికి ముగ్గురు చొప్పున బిలియనీర్లు పుట్టుకొచ్చారు.
  • జాబితాలో తొలి 100 మందిలో భారత్ నుంచి ముకేశ్‌తోపాటు గౌతమ్ అదానీ, శివ్ నాడార్ (కుటుంబం) చెరో 17 బిలియన్ డాలర్ల సంపదతో 68వ స్థానం దక్కించుకున్నారు. ఉదయ్ కోటక్ 15 బిలియన్ డాలర్ల సంపదతో 91వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020 విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : హరూన్ సంస్థ
ఎందుకు : ప్రపంచంలోని బిలియనీర్ల వివరాలు తెలిపేందుకు

టెరి వ్యవస్థాపక డెరైక్టర్ ఆర్కే పచౌరి మృతి
Current Affairs
ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టెరి) మాజీ చీఫ్ ఆర్‌కే పచౌరి(79) ఫిబ్రవరి 13న కన్నుమూశారు. ఢిల్లీలోని ఎస్కార్‌‌ట్స హార్ట్ ఇన్‌స్టిట్యూట్లో ఫిబ్రవరి 11న పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డెరైక్టర్‌గా పచౌరి సేవలందించారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి ఆయన వైదొలిగారు. 1974లో స్థాపించిన టెరి విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది.
పురస్కారాలు..
2007లో వాతావరణ మార్పులకు సంబంధించి ఐరాస ఇంటర్-గవర్న్‌మెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) అధ్యక్షుడిగా... అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్‌తో కలిసి పచౌరి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 2001లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టెరి) వ్యవస్థాపక డెరైక్టర్ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఆర్‌కే పచౌరి(79)
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న నియమించింది. నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర ఎయిర్ ఇండియా సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఆయన్ని మళ్లీ నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్ ఇండియాకు సీఎండీగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రాజీవ్ బన్సాల్

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా భారత సంతతి ఎంపీ
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా భారత సంతతి బ్రిటిష్ ఎంపీ, ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ఎంపికయ్యాడు. బ్రిటన్ కేబినెట్‌లో చోటుచేసుకున్న మార్పుల్లో భాగంగా ఫిబ్రవరి 13న ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆర్థిక బాధ్యతలను రిషికి అప్పగించారు. రిషితో పాటు భారత సంతతికే చెందిన అలోక్ శర్మ, సుయెల్లా బ్రావర్‌మాన్‌లనూ ప్రధాని జాన్సన్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అలోక్ శర్మకు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్‌ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ కొనసాగుతున్నారు.
ప్రధాని జాన్సన్ చీఫ్ స్పెషల్ అడ్వైజర్ డొమినిక్ కమ్మింగ్‌‌సతో తలెత్తిన విభేదాల కారణంగా బ్రిటన్ ఆర్థిక మంత్రి, పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న రిషిని ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు.
రిషి సునక్...
రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. నారాయణమూర్తి కుమార్తె అక్షతను రిషి వివాహం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రిషి సునక్

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అలాగే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : రాంలీలా మైదానం, ఢిల్లీ

అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఎన్నిక
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ మరోసారి ఎన్నికయ్యారు. అఫ్గానిస్తాన్ అధ్యక్ష పదవికి 2019, సెప్టెంబర్ 28వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం దాదాపు ఐదు నెలల తర్వాత ఫిబ్రవరి 18న వెలువరించింది. ఈ ఫలితాల్లో ఘనీకి 50.64 శాతం ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు నూరిస్తానీ తెలిపారు. అఫ్గాన్ జనాభా 3.50 కోట్లు కాగా ఓటర్లు 96 లక్షలు. వీటిలో ఎన్నికల్లో పోలైంది 27 లక్షలు. అష్రాఫ్ ఘనీ 2014, సెప్టెంబర్ 29న తొలిసారి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : అష్రాఫ్ ఘనీ

ముంబై మాజీ సీపీ మారియా పుస్తకం విడుదల
2008 ముంబై ఉగ్రదాడుల కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా రచించిన పుస్తకం ‘లెట్ మి సే ఇట్ నౌ’ ఫిబ్రవరి 17న మార్కెట్లోకి విడుదలైంది. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించిన విషయాలను మారియా తన పుస్తకంలో వివరించారు. 2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు.
లెట్ మి సే ఇట్ నౌలోని కొన్ని అంశాలు...
  • ఐఎస్‌ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది.
  • టైస్ట్‌ల్లో ప్రాణాలతో పట్టుబడిన కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించాలని కుట్ర పన్నారు. అందుకే కసబ్ పేరుని సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించారు. కానీ వారి ప్లాన్ ఫ్లాప్ అయింది.
  • పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకున్నాయి.
  • నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదు.
  • నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు.

నాబార్డ్ చైర్మన్‌గా చింతల గోవింద రాజులు
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చింతల గోవింద రాజులు ఎన్నికయ్యారు. ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు సహా మొత్తం 31 మంది ఈ పదవికి పోటీ పడగా నాబార్డ్ ప్రస్తుత డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న గోవింద రాజులును బ్యాంకుల బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలోని బ్రాహ్మణకోడూరు చెందిన గోవింద రాజులు బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (అగ్రీ), ఎంఎస్సీ (అగ్రానమీ) చదివారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సీడ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్ బీ అధికారిగా క్యాంపస్ రిక్రూట్ అయ్యారు. 35 ఏళ్లుగా నాబార్డ్‌లో వివిధ హోదాలలో పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : చింతల గోవింద రాజులు

నూతన విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్ కొఠారి
నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి నియామకం కానున్నారు. అలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఐఏఎస్ అధికారులుగా పదవీవిరమణ పొందినవారే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత వీరి నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : సంజయ్ కొఠారి

రామ మందిరం ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపాత్ రాయ్, కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ గిరి ఎన్నికయ్యారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 19న జరిగిన ట్రస్టు తొలి సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. లాయర్ కె.పరాశరన్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్తి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ అనూజ్‌కుమార్ ఝా హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : మహంత్ నృత్యగోపాల్ దాస్

అల్ కాయిదా కీలక నేత అల్ రిమీ హతం
Current Affairs
యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 6న ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్‌కాయిదా మరింత బలహీనపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్‌లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు.
లాడెన్ కోసం...
రిమీ 1990ల్లో అల్‌కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ గ్రూపు యెమెన్‌లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు.
డిసెంబర్ 6న...
2019, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్‌లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్‌కాయిదాకు అల్‌జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. 2019, అక్టోబర్‌లో ఐసిస్ నేత బగ్దాదీని, 2020, జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత హతం
ఎవరు : ఖాసిం అల్ రిమీ (46)
ఎక్కడ : యెమెన్
ఎందుకు : యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో

మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్‌బీ నగర్ శాసన సభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 8న సంతకం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్‌రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌బీ నగర్ శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సుధీర్‌రెడ్డి 2019 ఏడాదిలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్‌గా సుధీర్ పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి కన్నుమూత
న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన బెంగళూరులోని తన స్వగృహంలో ఫిబ్రవరి 9న తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి, చెన్నమ్మ దంపతులకు జయచంద్రారెడ్డి 1929లో జన్మించారు.
జయచంద్రారెడ్డి ప్రస్థానం ఇలా..
  • 1951లో మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు.
  • 1952లో మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది బసిరెడ్డి దగ్గర క్రిమినల్ లాయర్‌గా ఆయన న్యాయవాద ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 1956లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదుకు మకాం మార్చి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు.
  • 1956లోనే హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) పనిచేశారు.
  • 1965-70లలో హైకోర్టు ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు.
  • 1975లో అడిషనల్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై న ఆయన అనేక హోదాలలో పనిచేస్తూ 1976లో పర్మినెంట్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 1979-80లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై అనేక హోదాల్లో పనిచేశారు.
  • 1995-97 14వ లా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.
  • 2001-2005 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా

సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పుస్తకం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పేరుతో ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో ఫిబ్రవరి 4న అమ్మకానికి ఉంచారు. ఈ పుస్తకంలో రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో భారత్‌లో అనిశ్చితి గురించి మమతా రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను విశదీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఏఏకు వ్యతిరేకంగా ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పేరుతో పుస్తకం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ

అకాంకాగ్వాను అధిరోహించిన చిన్న వయస్కురాలు
ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని, 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వా(6,962మీ)ను ఫిబ్రవరి 1న విజయవంతంగా అధిరోహించింది. దీంతో అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న కామ్య అకాంకాగ్వా పర్వత శిఖరాగ్రంపై భారత జాతీయ పతకాన్ని ఎగరవేసిందని నేవీ అధికారులు వెల్లడించారు. అకాంకాగ్వా పర్వతం అర్జెంటీనాలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అకాంకాగ్వాను అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : కామ్య కార్తికేయన్
ఎక్కడ : అర్జెంటీనా, దక్షిణ అమెరికా

మిధాని చైర్మన్, సీఎండీగా సంజయ్‌కుమార్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వరంగ సంస్థ మిశ్రధాతు నిగం లిమిటెడ్ (మిధాని) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ)గా సంజయ్‌కుమార్ ఝా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. దీంతో 2020, మే 1న ఆయన మిధాని చైర్మన్, సీఎండీగా ఝా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024లో పదవీ విరమణ చేసేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈడీగా అనూప్ కుమార్
ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా అనూప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్-1 (ఎస్‌ఆర్‌టీఎస్-1)కు ఈయన్ను నియమించగా... ఈ రీజియన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోని కొంత భాగం ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిధాని చైర్మన్, సీఎండీగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : సంజయ్‌కుమార్ ఝా

ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ
Current Affairs
అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్ కృష్ణ నియమితులయ్యారు. 200 బిలియన్ డాలర్ల సంస్థ డెరైక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. 2020, ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుందని జనవరి 31న కంపెనీ వెల్లడించింది. అరవింద్‌తో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జేమ్స్ వైట్‌హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1990లో ఐబీఎంలో చేరిన అరవింద్ అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్) స్థాయికి చేరారు.
అరవింద్ ప్రస్థానం ఇలా...
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో పీహెచ్‌డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ-రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్‌వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) నియామకం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : అరవింద్ కృష్ణ

హెచ్‌ఏఎల్ సీఈఓగా అమితాబ్ భట్
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా అమితాబ్ భట్ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు సంస్థకు చెందిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా అమితాబ్ సేవలందించారు. రక్షణ రంగానికి కామోవ్ కేఏ- 226టీ హెలికాప్టర్లను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌కు ఈయన డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. సంస్థతో 32 ఏళ్ల అనుబంధం ఉన్న అమితాబ్ హాయంలోనే ఓఎన్‌జీసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ప్రభుత్వానికి హెలికాప్టర్లను అందించడంతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాలకు ఎగుమతులు జరిగినట్లు హెచ్‌ఏఎల్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : అమితాబ్ భట్

జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా శ్రీధర్
భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జీఎస్‌ఐ) డెరైక్టర్ జనరల్‌గా ఎం.శ్రీధర్ ఫిబ్రవరి 3న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను చేపట్టడానికి ముందు జీఎస్‌ఐ దక్షిణ ప్రాంతం అదనపు డెరైక్టర్ జనరల్‌గా శ్రీధర్ సేవలందించారు. 1986లో జీఎస్‌ఐలో చేరిన ఆయన హిమాలయాలు మొదలుకొని దక్షిణ భారత ద్వీపకల్పం వరకు భూవైజ్ఞానిక రంగంలో విసృ్తతంగా కార్యకలాపాలు నిర్వహించారు. జీఎస్‌ఐకి చెందిన వివిధ జాతీయ ప్రాజెక్టులను నిర్వహించడంలో టెక్నోఅడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు. వజ్రాల అన్వేషణ రంగంలో ఆయన అసాధారణ తోడ్పాటు అందించినందుకు కేంద్రం నేషనల్ జియో సైన్స్ అవార్డును శ్రీధర్‌కు ప్రదానం చేసింది.
జీఎస్‌ఐ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ మాట్లాడుతూ... ఖనిజాల అన్వేషణలో మెరుగైన ఫలితాల సాధన, క్షేత్రస్థాయి కార్యకలాపాల పెంపు, ప్రయోగశాలలకు పునరుత్తేజాన్ని ఇవ్వడం వంటి వాటితోపాటు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌డీ) కార్యకలాపాలకు ప్రాధాన్యాన్ని ఇస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ఎం.శ్రీధర్

అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.
నలుగురు క్రికెటర్లు..
2019 ఏడాదికి సంబంధించి రూపొందించిన ‘అత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితా’లో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్ కోహ్లి
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ద డఫ్ అండ్ ఫెల్ప్స్
ఎక్కడ : భారత్

భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్‌గా సర్ ఫిలిప్
భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ (రాయబారి)గా సర్ ఫిలిప్ బార్టన్ ఫిబ్రవరి 6న నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి సర్ డొమినిక్ అస్కిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బార్టన్ ప్రస్తుతం విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయంలో కాన్సులర్-సెక్యూరిటీ విభాగం డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1994లో ఢిల్లీలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ హైకమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : సర్ ఫిలిప్ బార్టన్
ఎక్కడ : భారత్
Published date : 01 Mar 2020 03:09PM

Photo Stories