Puneeth Rajkumar: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేత
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. జిమ్ చేస్తుండగా గురువారం ఉదయం 9.45 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. అయితే పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. . ఇప్పటికే శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
అప్పూ అని పిలుచుకుంటారు..
పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్‌కుమార్. 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.