Skip to main content

ఏప్రిల్ 2021 వ్యక్తులు

గాంధేయవాది సదాశివ భోసలే అస్తమయం
Current Affairs
దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే (101) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బెళగావి జిల్లా కడోళి గ్రామంలో తన స్వగృహంలో ఏప్రిల్‌ 15న తుదిశ్వాస విడిచారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. భూదానోద్యమంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు : సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే (101)
ఎక్కడ : కడోళి గ్రామం, బెళగావి జిల్లా
ఎందుకు : వృద్ధాప్య సమస్యల కారణంగా...

పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఇక లేరు
ప్రముఖ రేడియాలజిస్ట్, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు(96) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 16న తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో 1925 జనవరి 25న వ్యవసాయ కుటుంబంలో కాకర్ల జన్మించారు.
కాకర్ల సుబ్బారావు నేపథ్యం...
  • విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల నుంచి 1950లో వైద్య పట్టాను పొందారు.
  • అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులై న్యూయార్క్, బాల్టీమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954–1956 వరకు పనిచేశారు.
  • 1956లో స్వదేశం తిరిగి వచ్చి ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాల రేడియాలజీ విభాగం అధిపతిగా పదోన్నతి పొందారు.
  • 1970లో మళ్లీ ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లి యూకే అందించే ఫెల్లోషిప్‌ ఆఫ్‌ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజిస్టు (ఎఫ్‌ఆర్‌సీఆర్‌) పట్టా అందుకున్నారు.
  • 1978లో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • డాక్టర్‌ కాకర్ల 1985లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌ను అన్ని విభాగాల్లో, వైద్య శిక్షణలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లారు.
  • వైద్య రంగానికి ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పలు పుస్తకాలు రచించడంతోపాటు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో వ్యాసాలు రాశారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రేడియాలజిస్ట్, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు(96)
ఎక్కడ : కిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్య సమస్యల కారణంగా...

సీబీఐ మాజీ చీఫ్‌ రంజిత్‌ సిన్హా కన్నుమూత
సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. కోవిడ్‌–19 కారణంగా ఏప్రిల్‌ 16న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. బిహార్‌ కేడర్‌కు చెందిన 1974 బ్యాచ్‌ అధికారి రంజిత్‌ 21 ఏళ్లకే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఐటీబీపీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సిన్హా హయాంలో బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేపట్టిన దర్యాప్తు వివాదస్పదమైంది. అనంతరం సీబీఐ 2జీ కుంభకోణంపై చేపట్టిన దర్యాప్తు చుట్టూ కూడా వివాదం ఏర్పడింది. ఈ కుంభకోణంలోని కీలక సూత్రధారులు కొందరు సిన్హా నివాసానికి వెళ్లినట్లు వెల్లడైంది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా ఉన్న సిన్హా ఆ కేసు విచారణ నుంచి వైదొలిగారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సీబీఐ మాజీ డైరెక్టర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : రంజిత్‌ సిన్హా(68)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కోవిడ్‌–19 కారణంగా...

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌?
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌ ఏప్రిల్‌ 16న బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అజయ్‌... తరుణ్‌ బజాజ్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. తరుణ్‌ బజాజ్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ రెవెన్యూ కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో అజయ్‌ ఆయన స్థానంలో నియమితులయ్యారు. అజయ్‌ గతంలో బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2004 మధ్య ఆర్థిక వ్యవహారాల శాఖ, వ్యయ శాఖల్లో డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : అజయ్‌ సేథ్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : తరుణ్‌ బజాజ్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ రెవెన్యూ కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో...

ఇటీవల కన్నుమూసిన భూమిధర్‌ బర్మన్‌ ఏ రాష్ట్ర సీఎంగా పనిచేశారు?
అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్‌ బర్మన్‌ (91) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గువాహటిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 18న కన్నుమూశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన భూమిధర్‌ బర్మన్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1996లో ఒకసారి, 2010లో మరోసారి సీఎంగా పనిచేశారు.

ప్రముఖ తమిళ నటుడు వివేక్‌ కన్నుమూత
ప్రఖ్యాత తమిళ హాస్య నటుడు వివేక్‌ (59) ఏప్రిల్‌ 17న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. కోలీవుడ్‌లో హాస్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వివేక్‌ కన్నడం, హిందీ తదితర భాషా చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు వివేక్‌ సుపరిచితులే.

పీడీఎఫ్‌ సహరూపకర్త కన్నుమూత
పోర్టబుల్‌ డాక్యుమెంట్‌ ఫార్మాట్‌ (పీడీఎఫ్‌) సహరూపకర్త చార్లెస్‌ చక్‌ గీస్కీ (81)కన్నుమూశారు. ఏప్రిల్‌ 16న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ అట్లాస్‌లో తుదిశ్వాస విడిచారు. జాన్‌ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ ఇన్‌కార్పొరేషన్‌ను చార్లెస్‌ స్థాపించారు. అడోబ్‌ ఇన్‌కార్పొరేషన్‌ తెచ్చిన సాఫ్ట్‌వేర్లలో పీడీఎఫ్‌ ప్రముఖమైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : 18
ఎవరు : భూమిధర్‌ బర్మన్‌ (91)
ఎక్కడ : గువాహటి, అస్సాం
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా ముత్యాలరాజు
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ముత్యాలరాజు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌... ఏప్రిల్‌ 17న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీగా ఎన్‌.బంగారురాజును ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ నరసింహం కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో ఏప్రిల్‌ 20న తుదిశ్వాస విడిచారు. నరసింహం భారతీయ రిజర్వు బ్యాంకుకు 13వ గవర్నర్‌గా ఏడునెలల పాటు పనిచేశారు. ఆర్థిక రంగంలో దేశానికి విశేష సేవలందించిన ఆయన భారతీయ బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలకు పితామహుడిగా గుర్తింపు పొందారు.
నరసింహం నేపథ్యం...
  • మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మనవడైన నరసింహం... 1927, జూన్‌ 3న గుంటూరులో జన్మించారు.
  • మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జిలోని సెయింట్‌ జాన్స్‌ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం రిజర్వు బ్యాంకు అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
  • ఆర్‌బీఐలో ఉద్యోగిగా మొదలై అదే బ్యాంకు గవర్నర్‌గా నియమితులైన ఏకైక వ్యక్తి నరసింహమే.
  • ప్రపంచ బ్యాంకులో భారత ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ ఆయన సేవలందించారు.
  • ఆర్థిక రంగానికి చేసిన సేవలకుగాను 2000 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : మైదవోలు నరసింహం (94)
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా...

దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్‌ ఎవరు?
ప్రముఖ సైకలాజికల్‌ హిప్నాటిస్ట్‌ డాక్టర్‌ హిప్నో కమలాకర్‌(53) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఏప్రిల్‌ 21న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని నాగుల్లంకకు చెందిన కమలాకర్‌... 15 ఏళ్లుగా హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతోపాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్‌గా ఆయన ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్‌ సతీమణి డాక్టర్‌ హిప్నో పద్మాకమలాకర్‌ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్‌.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ సైకలాజికల్‌ హిప్నాటిస్ట్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : డాక్టర్‌ హిప్నో కమలాకర్‌(53)
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా...

శిల్పిగురు అవార్డు గ్రహీత న్యానేశ్వర్‌ కన్నుమూత
హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్‌ (70) కన్ను మూశారు. అనారోగ్యం కారణంగా ఆదిలాబాద్‌లో ఓ ఆస్పత్రిలో ఏప్రిల్‌ 21 తుదిశ్వాస విడిచారు. హస్తకళల్లో న్యానేశ్వర్‌ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్‌ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అందుకున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి...
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్రదాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్‌ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్‌ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : హస్తకళ కళాకారుడు, శిల్పిగురు అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : కోవ న్యానేశ్వర్‌ (70)
ఎక్కడ : ఆదిలాబాద్‌
ఎందుకు : అనారోగ్య సమస్యల కారణంగా...

సీఆర్‌పీఎఫ్‌ జవాను రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల
Current Affairs
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ దండకారణ్యంలో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ (కోబ్రా) జవాను రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాన్‌ను మావోయిస్టులు ఏప్రిల్‌ 8న విడుదల చేశారు. ఏప్రిల్‌ 3న బీజాపూర్‌ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే.
భారీ ప్రజా కోర్టు...
ఛత్తీస్‌గఢ్‌లోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ స్థాయిలో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే జమ్మూకశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ను తాళ్లు విప్పి విడుదల చేశారు. మధ్యవర్తులైన పద్మశ్రీ ధర్మపాల్‌ షైనీ, గోండ్వానా సమాజ్‌ అధ్యక్షుడు తెల్లం బోరయ్య, మరో ఏడుగురు జర్నలిస్టులకు అతన్ని అప్పగించారు.

బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త, ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత
బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌(99) ఏప్రిల్‌ 9న కన్నుమూశారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్‌.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. ప్రిన్స్‌ ఫిలిప్‌ గొప్ప సాహసి. బ్రిటన్‌ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు.
ప్రిన్స్‌ ఫిలిప్‌ గురించి...
  • జూన్‌ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం.
  • 1939 బ్రిటిష్‌ రాయల్‌ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం
  • 1942 మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్‌మెంట్‌
  • 1947 యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్‌ డానిష్‌ రాయల్‌
టైటిల్స్‌ని వదులుకున్నారు.
  • 1947, నవంబర్‌ 20న ఎలిజెబెత్‌తో వివాహం
  • 1951 నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు.
  • 2017 ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ
  • 2019 కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు
  • 2021, మార్చి 4న గుండెకు విజయవంతంగా చికిత్స చేయించుకున్నారు.
  • 2021, మార్చి 16న ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి రాక
  • 2021, ఏప్రిల్‌ 9న తుది శ్వాస
భారత్‌ పర్యటన వివాదాస్పదం
రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్‌ మూడుసార్లు భారత్‌ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్‌ పులిని వేటాడడం వివాదాస్పదమైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌–2 భర్త కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌(99)
ఎక్కడ : లండన్, బ్రిటన్‌
ఎందుకు : వయో భారంతో...

ఏ దేశ ప్రధానమంత్రికి కోవిడ్‌ జరిమానా విధించారు?
కోవిడ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు నార్వే ప్రధాన మంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీసులు రూ. 1,75,690 జరిమానా విధించారు. దేశాధినేత స్థాయిలో ఉన్న వ్యక్తికి కోవిడ్‌ నిబంధనల పేరుతో జరిమానా పడటంతో ఆమె వార్తల్లోకెక్కారు. నార్వే ప్రధాని ఎర్నా 2021, ఫిబ్రవరిలో తన 60వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు తెలిపారు. తన చర్యకుగానూ ప్రధాని ఎర్నా సైతం క్షమాపణలు చెప్పారు. ఆమె రెండు సార్లు నార్వే ప్రధానమంత్రిగా పనిచేశారు.
నార్వే...
రాజధాని: ఓస్లో; కరెన్సీ: నార్వేజియన్‌ క్రోన్‌
నార్వే ప్రస్తుత రాజు: హరాల్డ్‌ వి
నార్వే ప్రస్తుత ప్రధాని: ఎర్నా సోల్‌బెర్గ్‌

ఒడిశా ఇతిహాస్‌ పుస్తకాన్ని హిందీలోకి అనువదించిన రచయిత
స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్కళ్‌ కేసరి, ఒడిశా మొట్టమొదటి సీఎం హరేకృష్ణ మహ్తాబ్‌ రచించిన ‘ఒడిశా ఇతిహాస్‌’ పుస్తకం హిందీ అనువాదాన్ని ఏప్రిల్‌ 9న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఒడియా, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని శంకర్‌లాల్‌ పురోహిత్‌ అనే రచయిత తొలిసారిగా హిందీలోకి అనువదించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... భారత్‌ తూర్పు ప్రాంతం సారథ్యంలోనే దేశం ఒకప్పుడు చారిత్రక స్వర్ణయుగాన్ని సాధించిందని అన్నారు. తూర్పు ప్రాంత అభివృద్ధికి మరోసారి వైబ్రంట్‌ కోల్‌కతా సారథిగా ఉండబోతోందని తెలిపారు.

ఐసీఎంఆర్‌ సలహాదారుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు. హైదరాబాద్‌ సమీపం షామీర్‌పేట్‌లో ఉన్న జీనోమ్‌ వ్యాలీలో 100 ఎకరాల్లో బయో మెడికల్‌ రీసెర్చ్‌ కోసం ఏర్పాటు చేయబోతున్న ప్రతిష్టాత్మకమైన ‘‘నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ’’కి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్‌.. ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం జంతువులపై ప్రి క్లినికల్‌ ట్రయల్స్‌ చేయడానికి దోహదపడుతుంది.
ఐసీఎంఆర్‌...
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ఐసీఎంఆర్‌ ప్రస్తుత డెరైక్టర్‌ జనరల్‌: బలరాం భార్గవ్‌
బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా నీరబ్‌...
ప్రస్తుతం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ (సీసీఎల్‌ఏ)గా ఉన్న నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ హోదాను అదనపు మిషన్‌ డైరెక్టర్‌గా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐసీఎంఆర్‌ సలహాదారుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి
భారత ఎన్నికల కమిషన్‌ 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర ఏప్రిల్‌ 13న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న సునీల్‌ అరోరా ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేశారు. ఎలక్షన్‌ కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. 1980 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన సుశీల్‌ చంద్ర 2019, ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌గా 2022 మే 14వ తేదీ వరకు కొనసాగనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం
భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందువల్ల జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని 2011 నుంచి పాటిస్తున్నారు. దేశ తొలి చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్‌ సేన్‌(కాలం 1950, మార్చి 21–1958, డిసెంబర్‌ 19) పనిచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం – బహుళ సభ్యత్వం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. 1950 జనవరి 25 నుంచి 1989 అక్టోబర్‌ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా, అంటే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో మాత్రమే పనిచేసింది. 1989లో మొట్టమొదటిసారిగా బహుళ సభ్య సంస్థగా మార్పు చేస్తూ ఇద్దరు ఇతర కమిషనర్లను నియమించారు. కానీ 1990లో తిరిగి ఏక సభ్య సంస్థగా మారింది. తిరిగి 1993లో బహుళ సభ్య సంస్థగా మారుస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేశారు. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 1993 నుంచి ఒక చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇద్దరు సభ్యులతో కొనసాగుతోంది.
ప్రత్యేక వివరణ: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయాలను అమలుచేస్తారు.
నియామకం–అర్హతలు–పదవీకాలం
చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజనల్‌ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉంటుంది. నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలేమీ లేవు. ప్రకరణ 324(5) ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్ల పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది. సాధారణంగా సీనియర్‌ బ్యూరోక్రాట్లను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమిస్తారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు, పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. పదవిలో కొనసాగే కాలంలో ఈ రెండింటిలో ఏది ముందువస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రత్యేక వివరణ: ప్రస్తుతానికి రీజనల్‌ కమిషనర్ల నియామకం చేపట్టలేదు.
జీతభత్యాలు
వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి జీతాలు చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా వీరి వేతనాలుంటాయి.
తొలగింపు
ప్రకరణ 324(5) ప్రకారం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంటు తొలగిస్తుంది. కానీ, ఇతర కమిషనర్లను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : సుశీల్‌చంద్ర
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు సీఈసీగా ఉన్న సునీల్‌ అరోరా ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేయడంతో...

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ కృష్ణమూర్తి కన్నుమూత
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ జీవీజీ కృష్ణమూర్తి (86) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్‌ 14న ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీరాలలో 1934లో జన్మించిన కృష్ణమూర్తి.. 1950వ దశకంలో ఢిల్లీకి వచ్చారు. సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌ అధికారిగా, లా కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా పనిచేశారు.
1999 సెప్టెంబర్‌ వరకు...
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఎంఎస్‌ గిల్‌తోపాటు జీవీజీ కూడా నియమితులయ్యారు. బిహార్‌ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. 1993, అక్టోబరు 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన కృష్ణమూర్తి 1999 సెప్టెంబర్‌ 30 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు : డాక్టర్‌ జీవీజీ కృష్ణమూర్తి (86)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అనారోగ్య సమస్యలతో

ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్‌ రాజీనామా
లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నతవిద్యా మంత్రి కేటీ జలీల్‌ ఏప్రిల్‌ 13న రాజీనామా చేశారు. జలీల రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆమోదించారని ఏప్రిల్‌ 13న ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
కేరళ...
రాజధాని: తిరువనంతపురం
ప్రస్తుత గవర్నర్‌: ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: పినరయి విజయన్‌

ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రాజీనామా
అధిక పనితో బాగా అలసి పోయానంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్‌ అన్సోబెర్‌ (60) ఏప్రిల్‌ 13న పదవికి రాజీనామా చేశారు. పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. పదవీ కాలంలో ఉన్న 15 నెలలు.. 15 ఏళ్లుగా గడిచాయని వివరించారు. కరోనా వచ్చిననాటి నుంచి ప్రభుత్వం తరఫున సూచనలు/సమాచారం అందించేందుకు రుడాల్ఫ్‌ తీవ్రంగా శ్రమించారు.
ఆస్ట్రియా...
రాజధాని: వియన్నా; కరెన్సీ: యూరో
ఆస్ట్రియా ప్రస్తుత అధ్యక్షుడు: అలెగ్జాండర్‌ వాన్‌ డెర్‌ బెల్లెన్‌
ఆస్ట్రియా ప్రస్తుత ఛాన్స్‌లర్‌: సెబాస్టియన్‌ కుర్జ్‌

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏప్రిల్‌ 1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగిసింది. 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన నీలం సాహ్ని 2019 నవంబర్‌ 15 నుంచి 2020 డిసెంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పని చేశారు. ఇప్పటివరకు క్యాబినెట్‌ హోదాలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఎస్‌ఈసీ పదవి చేపట్టే నాటికి ఆమె ఈ పదవికి రాజీనామా చేశారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఓ మహిళ నియమితులవ్వడం ఇదే తొలిసారి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : నీలం సాహ్ని
ఎందుకు : ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియడంతో

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అధికారి?
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేశారు. కనూంగో ఏడాది పదవీకాలం పొడిగింపు ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి ముగిసింది. 1982లో కనుంగో ఆర్‌బీఐలో చేరారు. నగదు నిర్వహణ, విదేశీ పెట్టుబడులు, నిర్వహణ, పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి పలు కీలక విభాగాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఉర్జిత్‌ పటేల్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో 2017 ఏప్రిల్‌లో డిప్యూటీ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2020 ఏప్రిల్‌ 2తో ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా...
స్థాపన: 1935, ఏప్రిల్‌ 1
ప్రధాన కార్యాలయం: ముంబై
ప్రస్తుత గవర్నర్‌: శక్తికాంత దాస్‌
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు: 4.00 శాతం
ప్రస్తుతం ఆర్‌బీఐ రివర్స్‌ రెపో రేటు: 3.35 శాతం
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వైదొలిగిన అధికారి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : బీపీ కనుంగో
ఎందుకు : పదవీ కాలం ముగియడంతో

48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి?
భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించడంతో కేంద్ర న్యాయ శాఖ ఏప్రిల్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. 2021, ఏప్రిల్‌ 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న రమణ... 2022, ఆగస్టు 26 వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది.
తెలుగువారిలో రెండో వ్యక్తి...
జస్టిస్‌ రమణ... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్‌ కోకా సుబ్బారావు (జూన్‌ 30, 1966– ఏప్రిల్‌ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే.
జస్టిస్‌ రమణ నేపథ్యం...
  • పుట్టిన తేదీ : 1957, ఆగస్టు 27
  • ఊరు : పొన్నవరం, కృష్ణాజిల్లా
  • న్యాయవాదిగా పేరు నమోదు : 1983, ఫిబ్రవరి 10
  • హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం : 2000, జూన్‌ 27
  • హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు: 2013, మార్చి 10 నుంచి మే 20 వరకు
  • న్యూఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి: 2013, సెప్టెంబరు 2
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి : 2014, ఫిబ్రవరి 17
  • భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేది : 2021 ఏప్రిల్‌ 24న
మరిన్ని వివరాలు...
  • వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ... ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
  • సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు.
  • అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్‌ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
  • కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు.
  • 2019, మార్చి 7 నుంచి నవంబర్‌ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
  • 2019 నవంబర్‌ 27 నుంచి నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు : జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుండటంతో...

నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ త్రిపుర కేడర్‌ అధికారి కొలనుపాక రాజేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేశ్వరరావును స్పెషల్‌ సెక్రటరీ స్థాయిలో నియమిస్తూ కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 6న కేబినెట్‌ నియామకాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ జిల్లాకు చెందిన రాజేశ్వర్‌రావు... సోషల్‌ సైన్స్‌లో డాక్టరేట్, నేషనల్‌ సెక్యూరిటీలో ఎంఫిల్, సైకాలజీ, జర్నలిజంలలో పీజీ చేశారు. నీటిపారుదల రంగ నిపుణుడైన దివంగత విద్యాసాగర్‌రావుకు ఈయన మేనల్లుడు. జాతీయ స్థాయిలో మినరల్‌ పాలసీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. పీఎం జన ఆరోగ్య యోజన పథకం మార్గదర్శకాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు.

ప్రస్తుతం నీతి ఆయోగ్‌ సీఈవోగా ఎవరు ఉన్నారు?
ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా(నీతి ఆయోగ్‌–NITI Aayog) ఏర్పాటైంది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి... నీతి ఆయోగ్‌ చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, సీఈవోగా అమితాబ్‌ కాంత్‌ ఉన్నారు. అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు నీతి ఆయోగ్‌ పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.
శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్‌ అందిస్తుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ త్రిపుర కేడర్‌ అధికారి కొలనుపాక రాజేశ్వరరావు
Published date : 16 Apr 2021 05:40PM

Photo Stories