Skip to main content

అక్టోబర్ 2020 వ్యక్తులు

భారత నావికా దళ మారిటైమ్ మిషన్లలో చేరనున్న మొదటి ముగ్గురు మహిళలు?
Current Affairs
తొలిసారిగా ముగ్గురు మహిళా పైలట్లు నావికా దళంలో మారిటైమ్ రికానెజైన్స్ మిషన్లలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ‘‘లెఫ్టినెంట్ దివ్యా శర్మ, లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. 27వ డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్(డీఓఎఫ్‌టీ) కోర్సును ఈ ముగ్గురు పూర్తిచేశారు. వీరు ఇకపై డోర్నియర్ విమానాలను నడుపుతూ సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన మారిటైమ్ రికానెజైన్స్(ఎంఆర్) మిషన్లలో పాలుపంచుకుంటారు’’ అని భారత రక్షణ శాఖ అక్టోబర్ 22న తెలిపింది. లెఫ్టినెంట్ దివ్యా శర్మ స్వస్థలం ఢిల్లీలోని మాలవ్యా నగర్. లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్ ఉత్తరప్రదేశ్‌లోని తిహార్ పట్టణవాసి. ఇక లెఫ్టినెంట్ శివాంగి సొంత ఊరు బిహార్‌లోని ముజఫర్‌పూర్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావికా దళంలో మారిటైమ్ రికానెజైన్స్ మిషన్లలో చేరనున్న మహిళా పైలట్లు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : లెఫ్టినెంట్ దివ్యా శర్మ, లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి

ప్రపంచ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు?
ప్రపంచ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఎన్నికయ్యారు. 2021 జూన్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్‌కు ఐఎల్‌వో అధ్యక్ష పదవి దక్కడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2020, నవంబర్‌లో జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్, డెరైక్టర్ జనరల్ ఎంపికలో పాలకమండలి కీలక పాత్ర పోషిస్తుంది. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అపూర్వచంద్ర ఇప్పటివరకు ఏడేళ్లపాటు కేంద్ర పెట్రోలియంశాఖలో పనిచేశారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య: 187
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర

గుప్కార్ అలయెన్స్ చైర్మన్‌గా ఫరూఖ్
కశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్ కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్ కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ చైర్మన్‌గా ఫరూఖ్
ఎవరు : ఫరూఖ్ అబ్దుల్లా
ఎక్కడ : జమ్మూకశ్మీర్
ఎందుకు : జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం...

బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రికి జైలు శిక్ష
జార్ఖండ్‌లో 1999లో బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే(68)కు ఢిల్లీ కోర్టు అక్టోబర్ 26వ తేదీన మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సాధారణ నేరాల కంటే ఇలాంటి వైట్‌కాలర్ నేరాలు అత్యంత ప్రమాదకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిలీప్ రేతోపాటు అప్పటి బొగ్గు శాఖ అధికారులు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్‌కు సైతం ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా క్యాస్ట్రన్ టెక్నాలజీస్ లిమిటెడ్(సీటీఎల్) డెరైక్టర్ మహేంద్రకుమార్ అగర్వాల్‌కు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దిలీప్ రే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో న్యాయస్థానం ఆయనకు రూ.10 లక్షల జరిమానా విధించింది. బెనర్జీ, గౌతమ్‌కు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. రూ.60 లక్షల జరిమానా చెల్లించాలని మహేంద్రకుమార్ అగర్వాల్‌ను ఆదేశించింది. తీర్పును సవాలు చేస్తూ దోషులు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చని సూచించింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నూతన ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్
ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఆదిత్య పురి అక్టోబర్ 26వ తేదీన పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా నియమితులైన శశిధర్ జగదీశన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్చువల్ కార్యక్రమంలో పురికి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

జియోలైఫ్ అగ్రిటెక్‌ఇండియా తొలి సీఈవోగానియమితులైనవారు?
సేంద్రియ ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా తొలి సీఈవోగా అమిత్‌త్రిపాఠి నియమితులయ్యారు. బయో అగ్రికల్చర్‌విభాగంలో విస్తరించాలన్న సంస్థ లక్ష్యంలో భాగంగా ఈ నియామకం చేపట్టినట్టు అక్టోబర్ 27న కంపెనీ తెలిపింది. 70కిపైగా దేశాలకు కంపెనీ తన ఉత్పత్తులు, సేవలతో విస్తరించింది. ఇండోఫిల్, బయోస్టాట్, డ్యూపాంట్, జెటైక్స్‌వంటి సంస్థల్లో అమిత్‌త్రిపాఠి గతంలో పనిచేశారు. ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.

ఫేస్‌బుక్‌ను వీడిన అంఖి దాస్
ఫేస్‌బుక్‌ఇండియా పాలసీ హెడ్‌అంఖి దాస్‌ఫేస్‌బుక్‌ను వీడారు. సమాజ సేవ చేయడం కోసమే ఫేస్‌బుక్‌నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామా అనంతరం ఫేస్‌బుక్‌ఇండియా మేనేజింగ్‌డెరైక్టర్‌అజిత్‌మోహన్ అక్టోబర్ 27న ఈ విషయాలను వెల్లడించారు. బీజేపీకి, హిందుత్వకు మద్దతుగా విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌లోఅనుమతిచ్చారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

యూఎస్‌సుప్రీం జడ్జిగా బారెట్ ప్రమాణం
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌అక్టోబర్ 27న ప్రమాణ స్వీకారం చేశా రు. ఆమె నియామకానికి సెనేట్‌ఆమోదం తెలిపిన గంటలోనే ప్రమాణ స్వీకారం జరిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు సుప్రీం జడ్జి క్లారెన్స్ థామస్‌పాల్గొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 9మంది న్యాయమూర్తుల్లో బారెట్‌తోసహా ట్రంప్‌ముగ్గురిని నియమించారు. అమెరికా ప్రీంకోర్టులోజడ్జిలకు రిటైర్‌మెంట్‌ఉండదు. జీవితకాలం వారు న్యాయమూర్తులుగా ఉంటారు. తాజా నియామకంతో కన్జర్వేటివ్‌‌సకు సుప్రీంలో 6-3 నిష్పత్తిలో మద్దతు లభించనుంది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా తొలి సీఈవోగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అమిత్ త్రిపాఠి

ఎస్వీబీసీ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే?
టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రనియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... ఎస్వీబీసీ చైర్మన్‌గా సాయికృష్ణ రెండేళ్లపాటు కొనసాగనున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం వైసీపీ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం నంబూద్రి కన్నుమూత
Current Affairs
55వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, సంఘసంస్కర్త, పాత్రికేయుడు అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి (94) కన్నుమూశారు. కొద్దిరోజులుగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిస్సూర్‌లో అక్టోబర్ 15న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మలయాళం కవిత్వానికి ఆధునికతను అద్దిన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. 1956లో కోజికోడ్‌లో ఆల్ ఇండియా రేడియోలో చేరే ముందు అనేక పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు.
ఆధునిక కవిత్వాల్లో ఒకటిగా...
అక్కితమ్ కలం నుంచి జాలువారిన ‘ఇరుపతం నూట్టండింటే ఇతిహాసం(20వ శతాబ్దపు ఇతిహాసం)’ను మలయాళ సాహిత్యంలో తొలి ఆధునిక కవిత్వాల్లో ఒకటిగా పరిగణిస్తారు. కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ అక్కితమ్ తనదైన ముద్ర వేశారు. దాదాపు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అందుకున్న ఆయన 2019లో 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, సంఘసంస్కర్త, పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి (94)
ఎక్కడ : త్రిస్సూర్, కేరళ
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో

భారత్ తరపున తొలి ఆస్కార్ అందుకున్న ప్రముఖ డిజైనర్ కన్నుమూత
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న ఆమె అక్టోబర్ 15న ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించిన భాను అతైయా... 1956లో హిందీచిత్రం ‘సి.ఐ.డి’తో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు వంద సినిమాలకుపైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.
గాంధీ చిత్రానికి...
1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా భాను పని చేశారు. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డులను అందుకున్నారు.
కాస్ట్యూమ్ డిజైన్ పుస్తకం...
భాను రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని ఆమె అన్నారు. 2004లో ‘స్వదేశ్’ తర్వాత భాను సినిమాలు చేయలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : భాను అతైయా (91)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్య కారణాలతో

ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ ఎంత?
భారత ప్రధానమంత్రి నరేంద్ర అక్టోబర్ 15న తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ వివరాల ప్రకారం 2020, జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. 2019 ఏడాది మొత్తం ఆస్తుల విలువ రూ.2.49 కోట్లతో పోల్చితే రూ.36 లక్షలు పెరుగుదల కనిపించింది.
నెల జీతం రూ. 2 లక్షలు.. సొంత కారు లేదు...
  • మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30 శాతం ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది.
  • ప్రధాని సేవింగ్స్ అకౌంట్‌లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి.
  • గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి.
  • నేషనల్ సేవింగ్‌‌స సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు.
  • నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది.
  • గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది.
  • ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు.


హత్యకు గురైన శౌర్యచక్ర పురస్కార గ్రహీత
పంజాబ్‌లో తీవ్రవాదం అంతానికి పోరాడిన, శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ సంధూ(62) హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా బిఖివిండ్ పట్టణంలో అక్టోబర్ 16న కార్యాలయంలో ఉన్న బల్వీందర్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తీవ్రవాదుల ఘాతుకమే ఇదని బల్వీందర్ భార్య జగదీశ్ కౌర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమపై 62 దాడులు జరిగాయ తెలిపారు. బల్వీందర్‌కు కల్పించిన భద్రతను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు ఆయన అలుపెరగని పోరాటం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హత్యకు గురైన శౌర్యచక్ర పురస్కార గ్రహీత
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : బల్వీందర్ సింగ్ సంధూ(62)
ఎక్కడ : బిఖివిండ్ పట్టణం, తరన్‌తారన్ జిల్లా, పంజాబ్

న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన మహిళ?
న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్‌లో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.
2017, అక్టోబర్ 26న సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. దేశంలో 2019 ఏడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అలాగే దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో ప్రమాదకర రకాలను నిషేధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మహిళ
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : జెసిండా అర్డెర్న్
ఎందుకు : న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ విజయం సాధించినందుకు

15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ
అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకం ‘పోట్రేయిట్స్ ఆఫ్ పవర్’ విడుదలైంది. ఈ పుస్తకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 19న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పాల్గొన్నారు.
మరోవైపు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి నిర్మలా అక్టోబర్ 19న వర్చువల్ సమావేశం నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకం ‘పోట్రేయిట్స్ ఆఫ్ పవర్’ విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

అత్యంత ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తల్లో ఏపీ శాస్త్రవేత్త
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణకు అరుదైన గుర్తింపు లభించింది. పదార్థ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రపంచంలోనే ‘మేటి వంద మంది శాస్త్రవేత’్తల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో చల్లపల్లి సూర్యనారాయణకు 55వ స్థానం దక్కింది.
కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన సూర్యనారాయణ అక్కడే కొంతకాలం ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 1988 తర్వాత నుంచి అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రంగంలో చేసిన సేవలకు దేశ, విదేశాల నుంచి అనేక పురస్కారాలను అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ప్రతిభావంతులైన వంద మంది శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
ఎక్కడ : ప్రపంచంలో

ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్ పేరు?
సౌదీ అరేబియాకి చెందిన ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి అనే మహిళా కళాకారిణి 4.5 కిలోల పనికిరాని కాఫీ పొడితో సౌదీ అరేబియా స్థాపకులైన కింగ్ అబ్దుల్ అజీజ్, షేక్ జైద్‌ల చిత్రాలను గీశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఏడు వస్త్రాల కాన్వాస్‌పై 220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెయింటింగ్‌ను వేశారు. ‘నసీజ్1’గా పిలుస్తున్న ఈ పెయింటింగ్‌ను గిన్నిస్ ప్రపంచ రికార్డు వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌గా నసీజ్1 నిలిచింది.
తొలి సౌదీ అరేబియా మహిళ...
నసీజ్1 విషయమై గిన్నిస్ రికార్డ్స్ సంస్థ స్పందిస్తూ... గతంలో ఒకరి కంటే ఎక్కువ మంది సౌదీ మహిళలు కలిసి ఇలాంటి పెయింటింగ్‌‌స వేసినట్టు తెలిపింది. 2015లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రియాద్‌లో 8,264 మంది మహిళలు కలిసి అతిపెద్ద హ్యూమన్ ఎవేర్నెస్ రిబ్బన్‌ను రూపొందించారని పేర్కొంది. కానీ ఒక సౌదీ మహిళ ఒంటరిగా గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా నుంచి గిన్నిస్ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి రికార్డు సాధించింది. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అక్టోబర్ 18న ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్ రూపకల్పన
ఎప్పుడు : 18
ఎవరు : ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి
ఎక్కడ : జెడ్డా, సౌదీ అరెబియా

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) కన్నుమూశారు. ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న ఆయన నిమోనియా కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అక్టోబర్ 22న తుదిశ్వాస విడిచారు. 1940, ఫిబ్రవరి 12న నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామంలో నాయిని నర్సింహారెడ్డి జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్న ఆయన 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సోషలిస్టు పార్టీ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు చేసి కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. 1975లో దేశంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు జైల్లో గడిపారు.
రాజకీయ అరంగేట్రం...
ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హేమాహేమీలైన అప్పటి కార్మికమంత్రి టి.అంజయ్య, మాజీ కార్మికమంత్రి జి.సంజీవరెడ్డిలను ఒకే ఎన్నికల్లో ఓడించి నర్సింహారెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా సేవలందించారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తొలి హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : నాయిని నర్సింహారెడ్డి(80)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్య కారణాలతో

జాతీయ పత్తి పరిశోధన కేంద్రం డెరైక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?
Current Affairs
మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా పనిచేసే ప్రతిష్టాత్మక జాతీయ పత్తి పరిశోధన కేంద్రానికి తెలుగు వ్యక్తి డాక్టర్ వై. గెరాడ్ ప్రసాద్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పత్తి పరిశోధన కేంద్రానికి డెరైక్టర్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం గెరాడ్ ప్రసాద్ హైదరాబాద్‌లోని ఐసీఏఆర్- అగ్రి టెక్నాలజీ అప్లికేషన్ పరిశోధన సంస్థ (అటారి) డెరైక్టర్‌గా ఉన్నారు.
580 జిల్లాల కోసం...
గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామానికి చెందిన గెరాడ్ ప్రసాద్ 1981లో బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి బీఎస్సీ (అగ్రి) పట్టా పొందారు. తర్వాత న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి కీటక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. క్రిమికీటకాల నివారణ సంస్థలో శాస్త్రవేత్తగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జాతీయ మెట్ట పరిశోధన సంస్థలో పని చేస్తున్నప్పుడు 580 జిల్లాల కోసం కరువుపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేశారు. పర్యావరణ అనుకూల బయోపెస్టిసైడ్‌‌స విధానాలను అభివృద్ధి పరిచారు.
నెదర్లాండ్స్ ప్రభుత్వం గుర్తింపు...
అంతర్జాతీయ స్థాయిలో గెరాడ్ ప్రసాద్ సేవలకు గుర్తింపుగా నెదర్లాండ్‌‌స ప్రభుత్వం ఎన్‌యూఎఫ్‌ఎఫ్‌ఐసీ స్కాలర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహించింది. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ 2012లో డాక్టర్ బాప్ రెడ్డి మెమోరియల్ అవార్డుతో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పత్తి పరిశోధన కేంద్రం డెరైక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : డాక్టర్ వై. గెరాడ్ ప్రసాద్

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కన్నుమూత
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రాంవిలాస్ పాశ్వాన్ (74) అక్టోబర్ 8న ఢిల్లీలో కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవలే గుండె శస్త్ర చికిత్స జరిగింది. రాజ్యసభ సభ్యుడైన పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు.
1969లోనే ఎమ్మెల్యేగా...
1946, జూలై 5న బిహార్‌లోని ఖగారియాలో జన్మించిన పాశ్వాన్ పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. అనంతర కాలంలో డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది.
లోక్‌జనశక్తి పార్టీ స్థాపన...
2000 సంవత్సరంలో పాశ్వాన్ మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు గట్టిగా ప్రయత్నం చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : రాంవిలాస్ పాశ్వాన్ (74)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా

ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచిన సంపన్నుడు?
ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ 100 మంది భారతీయ సంపన్నులతో రూపొందించిన ‘ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల జాబితా’లో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో వరుసగా పదమూడోసారీ జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు. ముకేశ్ తర్వాత గౌతమ్ అదానీ రెండో స్థానంలో, శివ్ నాడార్ మూడో స్థానంలో నిలిచారు.
కరోనా ప్రభావం ఉన్నా...
కరోనా వైరస్ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది‘ అని పేర్కొంది. ముకేశ్ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం...
దేశంలోని మొదటి ఐదు మంది కుబేరులు

ర్యాంకు

పేరు

సంస్థ

సంపద (కోట్ల డాలర్లలో)

1

ముకేశ్ అంబానీ

రిలయన్స్

8,870

2

గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్

2,520

3

శివ నాడార్

హెచ్‌సీఎల్

2,040

4

రాధాకిషన్ దమానీ

అవెన్యూ సూపర్‌మార్ట్స్

1,540

5

హిందుజా సోదరులు

అశోక్ లేల్యాండ్

1,280

తెలుగు రాష్ట్రాల దిగ్గజాలు

20

మురళి దివి

దివీస్ ల్యాబొరేటరీస్

650

43

డాక్టర్ రెడ్డీస్ ప్రమోటర్ల కుటుంబం

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్

325

45

పి.పి. రెడ్డి

మేఘా ఇంజనీరింగ్

310

49

పి.వి రాంప్రసాద్ రెడ్డి

అరబిందో ఫార్మా

290

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచిన సంపన్నుడు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : గౌతమ్ అదానీ
ఎక్కడ : దేశంలో

పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్‌గా పారమౌంట్ గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 8న పీహెచ్‌డీ చాంబర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ముల్తానీ ఫార్మాసూటికల్స్ చైర్మన్ ప్రదీప్ ముల్తానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, పీజీ ఇండస్ట్రీ మేనేజింగ్ డెరైక్టర్ సాకెట్ దాల్మియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారని పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు సంబంధించి పలు అంశాల్లో ముగ్గురికీ విశేష అనుభవముందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పారమౌంట్ గ్రూప్ చైర్మన్ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్

ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్ చార్లీ మూర్ కన్నుమూత
అమెరికా మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చార్లీ మూర్(91) కన్ను మూశారు. కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన అక్టోబర్ 8న పెన్సిల్వేనియా రాష్ట్రం(అమెరికా)లోని లాపోర్ట్‌లో తుదిశ్వాస విడిచారని ప్రపంచ అథ్లెటిక్స్ తెలిపింది. ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బరిలో దిగిన చార్లీ 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రిలే ఈవెంట్‌లో పాల్గొని రజతం సాధించారు.
ప్రపంచ రికార్డు...
బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొన్న చార్లీ 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 1978లో కార్నెల్స్ అథ్లెటిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌తోపాటు 1999లో యూఎస్‌ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ హాల్ ఫేమ్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు.
వీడ్కోలు అనంతరం...
క్రీడలకు వీడ్కోలు పలికిన చార్లీ మూర్.. తదనంతర కాలంలో వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్ పాలనాధికారిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్ పతకాలను విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు మూర్ ‘13 స్టెప్ అప్రోచ్’ టెక్నిక్‌ను సూచించారు. దీనిని అథ్లెట్స్ ఇప్పటికీ హర్డిల్స్‌లో ఉపయోగిస్తుండటం విశేషం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : చార్లీ మూర్(91)
ఎక్కడ : లాపోర్ట్, పెన్సిల్వేనియా రాష్ట్రం, అమెరికా
ఎందుకు : పాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా

ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత బి. విజయరెడ్డి (84) ఇకలేరు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. 1936, జూలై 15న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విజయరెడ్డి జన్మించారు. నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్న ఆయన పలు చిత్రాలకు సహాయ ఎడిటర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1966లో తెలుగులో ‘శ్రీమతి’ చిత్రం ద్వారా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. 1970 విడుదలైన ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. కన్నడలో 40 చిత్రాలను, హిందీలో 17 చిత్రాలను తెరకెక్కించిన ఆయన రాజ్‌కుమార్, విష్ణువర్థన్ , అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : బి. విజయరెడ్డి
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : కార్డియాక్ అరెస్ట్ కారణంగా

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ జాన్ రీడ్ కన్నుమూత
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్టు క్రికెటర్ జాన్ రీడ్(92) కన్నుమూశారు. కివీస్‌కు ప్రాతినిధ్యం వారిలో అతి పెద్ద వయస్కుడైన జాన్ రీడ్ ఆక్లాండ్‌లో అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారని న్యూజిలాండ్ కికెట్ బోర్డు ప్రకటించింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో 1928, జూన్ 3న జన్మించిన జాన్ రీడ్ 19 ఏళ్ల వయస్సులో (1949) టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1950-60వ దశకాల్లో అద్భుతంగా ఆడిన ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు. 34 టెస్టుల్లో కివీస్‌కు సారథిగా వ్యవహరించాడు.
ఐసీసీ మ్యాచ్ రిఫరీగా...
టెస్టు క్రికెట్‌లో కివీస్ తరఫున 58 మ్యాచ్‌ల్లో 33.28 సగటుతో 3,428 పరుగులు చేసిన జాన్ రీడ్ 33.35 సగటుతో 85 వికెట్లు దక్కించుకున్నాడు. 246 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 41.35 సగటుతో 16,128 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా 22.60 సగటుతో 466 వికెట్లు దక్కించుకున్నాడు. 1965లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక న్యూజిలాండ్ సెలెక్టర్‌గా, మేనేజర్‌గా, ఐసీసీ మ్యాచ్ రిఫరీగా క్రికెట్‌కు సేవలందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్టు క్రికెటర్ కన్నమూత
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : జాన్ రీడ్(92)
ఎక్కడ : ఆక్లాండ్, న్యూజిలాండ్

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు ఇకలేరు
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు(64) ఇకలేరు. గత కొంతకాలంగా న్యూరో సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె ఇటీవల కోవడ్ బారిన పడ్డారు. శరీరంలో సోడియం లెవల్స్ పడిపోవడంతో హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారు. 1956లో విశాఖపట్నం అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా చేరి, సత్యభామ, పద్మావతి పాత్రల్లో విశేషంగా ఆకట్టుకున్నారు.
హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన శోభానాయుడు నృత్య గురువుగా వందల మంది శిష్యులను తయారు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లో ఆమె అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె భర్త సి.అర్జునరావు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీగా పని చేశారు.
2001లో పద్మశ్రీ...
సంప్రదాయ నృత్యరంగంలో శోభానాయుడు సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు(64)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్య సమస్యలతో

ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా పేరు?
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ‘800’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మోషన్ పోస్టర్ అక్టోబర్ 13న విడుదలైంది. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో కనిపిస్తాడు.
మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్‌ను ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మురళీ బయోపిక్‌కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్‌లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘800’ అనే పేరుతో సినిమా నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్
ఎందుకు : శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ చాప్‌మన్ కన్నుమూత
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ కార్ల్‌టన్ చాప్‌మన్(49) కన్నుమూశాడు. గుండెపోటు కారణంగా బెంగళూరులో అక్టోబర్ 12న తుదిశ్వాస విడిచాడు. 1971, ఏప్రిల్ 13న బెంగళూరులో జన్మించిన చాప్‌మన్ 1995 నుంచి 2001 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోని టీమిండియా 1997 ‘శాఫ్’ కప్‌ను గెలుచుకుంది.
మాజీ క్రికెటర్ సురేశ్ కన్నుమూత
కేరళకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ మణి సురేశ్ కుమార్ (47) ఇకలేరు. అనారోగ్యం కారణంగా కేరళలోని అలప్పూజ(అలెప్పీ)లో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన సురేశ్ 14 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో కేరళ, రైల్వేస్ జట్ల తరఫున 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27.54 సగటుతో 196 వికెట్లు పడగొట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : కార్ల్‌టన్ చాప్‌మన్(49)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : గుండెపోటు కారణంగా

నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ కన్నుమూత
Current Affairs
సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్, అశ్వనీ కుమార్ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని ఆయన స్వగృహంలో అక్టోబర్ 7న ఉరి వేసుకొని మరణించారని అధికారులు చెప్పారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించింది. జీవితంపై విరక్తి చెందినట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనీ కుమార్ 2008లో సీబీఐ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసు విచారణకు నేతృత్వం వహించారు. 2013లో అప్పటి యూపీఏ హయాంలో నాగాలాండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అశ్వనీ కుమార్ (69)
ఎక్కడ : సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
ఎందుకు : ఆత్మహత్యకు పాల్పడటంతో

20 ఏళ్ల పరిపూర్ణ ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఏడు సంవత్సరాలు ప్రధానిగా, మొత్తం 20 ఏళ్ళ పాటు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2001, అక్టోబర్ 7న మోదీ మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ విజయవంతంగా 6941 రోజులు పూర్తి చేసుకున్నారని బీజేపీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేత
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

ఎస్‌బీఐ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నూతన చైర్మన్‌గా ఎస్‌బీఐ సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఖరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా ఉన్న రజనీష్‌కుమార్ మూడేళ్ల పదవీ కాలం అక్టోబర్ 6న ముగిసిపోయింది. దీంతో రజనీష్ స్థానంలో ఖరాను మూడేళ్ల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఢిల్లీ వర్సిటీ పూర్వ విద్యార్థి...
దినేష్ ఖరా 2016 ఆగస్ట్‌లో ఎస్‌బీఐ ఎండీగా మూడేళ్ల కాలానికి తొలుత నియమితులయ్యారు. ఆయన పనితీరు ఆశాజనకంగా ఉండడంతో రెండేళ్ల పొడిగింపు పొందారు. ఎస్‌బీఐ గ్లోబల్ బ్యాంకింగ్ డివిజన్ హెడ్‌గానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ఫాకుల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్వ విద్యార్థి అయిన ఖరా.. 1984లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ అధికారిగా చేరి ప్రతిభ ఆధారంగా పదోన్నతులను పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : దినేష్ కుమార్ ఖరా

Published date : 10 Nov 2020 05:15PM

Photo Stories