Skip to main content

ఆగస్టు 2018 వ్యక్తులు

జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్ కన్నుమూత
Current Affairs ప్రముఖ జర్నలిస్టు, రచయిత, దౌత్యవేత్త, పార్లమెంటేరియన్ కుల్‌దీప్ నయ్యర్ (95) అనారోగ్యం కారణంగా ఢిల్లీలో ఆగస్టు 23న కన్నుమూశారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడిన నయ్యర్ భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. ఎమర్జెన్సీకాలంలో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించి జైలుకు వెళ్లారు.
1923 ఆగస్టు 14న పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన నయ్యర్ లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి అక్కడే న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. 1952లో అమెరికా ఇలినాయిస్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం కోర్సు చేసిన నయ్యర్ అంజామ్ అనే ఉర్దూ పత్రిక ద్వారా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. తర్వాతి కాలంలో ఇంగ్లిషు జర్నలిజంలోకి ప్రవేశించిన ఆయన దేశంలోని వివిధ మీడియాసంస్థలు, ఏజెన్సీలకు సేవలందించారు.
లండన్‌కు చెందిన ‘ద టైమ్స్’ ప్రతినిధిగా రెండు దశాబ్దాలపాటు పనిచేసిన నయ్యర్ ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద స్టేట్స్‌మన్’ వంటి పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. అలాగే ఎడిటర్స్ గిల్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నయ్యర్ ఉన్నారు. 1990లో వీపీసింగ్ ప్రభత్వంలో ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా నియమితులైన నయ్యర్ 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పాత్రికేయ రంగానికి నయ్యర్ అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో రామ్‌నాథ్ గోయంకా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
రచనలు....
‘వితవుట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రీ టోల్డ్, స్కూప్: ఇన్‌సైడ్ స్టోరీస్ ఫ్రం పార్టిషన్ టు ద ప్రెజెంట్’, ‘డిస్టెంట్ నైబర్స్: ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్’ వంటి పుస్తకాలను నయ్యర్ రచించారు. అలాగే భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉందో ‘వితవుట్ ఫియర్’ పుస్తకంలో వివరించారు. మరోవైపు ‘బిట్వీన్ ద లైన్స్’ పేరుతో తన భావాలను నయ్యర్ వ్యక్తపరిచేవాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ జర్నలిస్టు, రచయిత కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కుల్‌దీప్ నయ్యర్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఆర్థిక మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన జైట్లీ
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్‌జైట్లీ తిరిగి ఆగస్టు 23న బాధ్యతలు చేపట్టారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఆయన విధులకు హాజరవటం లేదు. దీంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నిర్వహించారు. పోర్‌‌టఫోలియో లేనప్పటికీ క్యాబినెట్ మంత్రిగానే జైట్లీ కొనసాగినందువల్ల, ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే తిరిగి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : అరుణ్ జైట్లీ

అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా యూకే వర్మ
ఇండస్ట్రీ చాంబర్- అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా యూకే వర్మను నియమిస్తు ఆగస్టు 23న అసోచామ్ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 14 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన డీఎస్ రావత్ స్థానంలో వర్మ నియమితులయ్యారు. 2013 జూన్ 30న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి హోదాలో వర్మ పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండస్ట్రీ చాంబర్- అసోచామ్ సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : యూకే వర్మ

ఆస్ట్రేలియా ప్రధానిగా స్కాట్ మోరిసన్
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా లిబరల్ పార్టీకి చెందిన స్కాట్ మోరిసన్ ఆగస్టు 25న ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ కాస్‌గ్రోవ్ ఆ దేశ ప్రధానిగా మోరిసన్‌తో ప్రమాణం చేయించారు. ఆస్ట్రేలియా మాజీ హోం మంత్రి పీటర్ డ్యుటన్‌పై రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న మోరిసన్ 45-40 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆస్ట్రేలియా ప్రధానిగా 2015లో అధికారంలోకి వచ్చిన మాల్కమ్ టర్న్‌బుల్ పై వచ్చిన వ్యతిరేకత కారణంగా ప్రధాని పదవి నుంచి తప్పుకొన్నారు. గడిచిన పదేళ్లలో ఆస్ట్రేలియాలో ఆరుగురు ప్రధాన మంత్రులు మార గా 2019 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : స్కాట్ మోరిసన్
ఎక్కడ : ఆస్ట్రేలియా

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఎం.దానకిశోర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులును రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ కమిషనర్‌గా బదిలీ చేశారు. దానకిశోర్‌కు అదనంగా ప్రస్తుతం పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ బాధ్యతలతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీహెచ్‌ఎంసీ కమిషనర్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : ఎం.దానకిశోర్

డీఆర్‌డీఓ చైర్మన్‌గా సతీశ్ రెడ్డి

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త గుండ్రా సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పదవిని చేపట్టిన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్ రెడ్డి గుర్తింపు పొందారు. డీఆర్‌డీఓ చైర్మన్ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్న సతీష్‌రెడ్డికి అదనంగా రక్షణ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శి బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డెరైక్టర్ జనరల్‌గా సతీష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. డీఆర్‌డీఓ చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పదవీకాలం 3నెలల క్రితం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న సతీశ్ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్‌టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. 2008లో ఎంఎస్ చేసిన ఆయన 2014లో డాక్టరేట్ పట్టా పొందారు.
1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా పనిచేసిన సతీశ్ రెడ్డి అనంతరం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’(ఆర్‌సీఐ)లోకి మారారు. 1986 నుంచి నేవిగేషన్ విభాగంలో అవుట్‌స్టాండింగ్ శాస్త్రవేత్తగా, ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా, డెరైక్టర్‌గా, అవుట్‌స్టాండింగ్ డెరైక్టర్‌గా, శాస్త్రవేత్తగా, డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా ఆయన పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేసిన సతీష్ 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు.
అగ్ని-5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేసిన సతీశ్ ‘స్మార్ట్ గెడైడ్ ఆయుధాల్ని’ కూడా రూపొందించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్, యూకేలోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాలోని ఫారెన్ మెంబర్ ఆఫ్ ద అకాడమి ఆఫ్ నేవిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సభ్యుడిగా సతీశ్ ఉన్నారు.
అవార్డులు, డాక్టరేట్‌లు....
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్ రెడ్డి అందుకున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్ ఏరోనాటిక్స్ బహుమతి, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్‌మెడల్, ఇంజినీరింగ్ ఎక్స్‌లెన్స్ కు ఇచ్చే ఐఈఐ-ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్ అవార్డు, లండన్ రాయల్ ఏరోనాటిక్స్ సొసైటీ వెండిపతకం వంటి వాటిని అందుకున్నారు. ప్రఖ్యాత డా.బీరెన్‌రాయ్ స్పేస్ సైన్స్ డిజైన్ అవార్డు, ఆో్టన్రాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాకెట్రీ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవార్డును పొందారు. అలాగే దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఆర్‌డీఓ చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : గుండ్రా సతీశ్ రెడ్డి

అమెరికా సెనెటర్ మెక్‌కెయిన్ కన్నుమూత

అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరొందిన అమెరికా సెనెటర్ జాన్ మెక్‌కెయిన్(81) క్యాన్సర్ కారణంగా న్యూయార్క్‌లో ఆగస్టు 25న కన్నుమూశారు. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్‌గా పనిచేసిన కెయిన్ వియత్నాం యుద్ధంలో నేవల్ అధికారిగా పనిచేశారు. దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించి ప్రాణాలతో బయటపడ్డాడు. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్ చేతిలో ఓడిపోగా 2008 రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికై నా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు.
భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాక్షించే కె యిన్ 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్‌ఎన్‌కు సంపాదకీయం రాశారు. ఈ సంపాదకీయంలో ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా-భారత్ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అని పేర్కొన్నారు. అలాగే భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని, అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రస్తుతించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, సెనెటర్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : జాన్ మెక్‌కెయిన్(81)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : క్యాన్సర్ కారణంగా

యూఎన్‌ఈపీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా సత్య త్రిపాఠి
ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) న్యూయార్క్ కార్యాలయం అధిపతి, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా భారత్‌కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త సత్య త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2017 నుంచి యూఎన్‌ఈపీ సుస్థిరాభివృద్ధి కార్యాచరణకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్న త్రిపాఠి ట్రినిడాడ్-టుబాగోకు చెందిన ఎలియట్ హ్యారిస్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఒడిశాలోని బరంపుర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ పట్టాలను త్రిపాఠి పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌ఈపీ సెక్రటరీ జనరల్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : సత్య త్రిపాఠి
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

డీఎంకే నూతన అధ్యక్షుడిగా స్టాలిన్
తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత ఎమ్‌కె. స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా సీనియర్ నేత దురైమురుగన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ ఆగస్టు 28న ప్రకటించారు. ఇప్పటివరకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్ల పాటు పనిచేసిన ముత్తువేలర్ కరుణానిధి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఎమ్‌కె. స్టాలిన్
ఎక్కడ : తమిళనాడు

సినీనటుడు నందమూరి హరికృష్ణ కన్నుమూత
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు, రాజ్యసభ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలో ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.
1956 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. తొలిసారి శ్రీకృష్ణావతారం (1967) సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన తర్వాత కాలంలో తాతమ్మ కల, రామ్ రహీమ్, దాన వీర శూరకర్ణ, శ్రీరాములయ్య, శ్రావణ మాసం, స్వామి, లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు చిత్రాలలో నటించాడు.
మరోవైపు 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఉపయోగించిన చైతన్య రథం డ్రైవర్‌గా హరికృష్ణ ఉన్నారు. 1996లో ఎన్‌టీఆర్ మరణించడంతో హిందూపురం సీటు ఖాళీ కావడం వల్ల హిందూపురం నుంచే పోటీ చేసి ఎమ్మేల్యేగా గెలిచారు. 1995లో తెలుగుదేశం పార్టీలో అధికారమార్పిడిలో కీలక పాత్ర పోషించారు. 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్ల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో మంత్రి పదవిని కొల్పోయారు. తర్వాత కాలంలోటీడీపీలో వచ్చిన విబేధాల కారణంగా టీడీపీ నుంచి బయటికొచ్చిన హరికృష్ణ 1999 జనవరిలో ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. అయితే 1999 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తర్వాత కాలంలో తిరిగి టీడీపీలోకి చేరిన ఆయన టీడీపీ నుంచే 2008లో రాజ్యసభకు వెళ్లారు. 2008లోనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. సమెక్యాంధ్రకు మద్దతుగా 2013 ఆగస్టున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సినీనటుడు, రాజ్యసభ ఎంపీ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : నందమూరి హరికృష్ణ
ఎక్కడ : అన్నెపర్తి, నల్లగొండ జిల్లా, తెలంగాణ
ఎందుకు : రోడ్డు ప్రమాదం కారణంగా

బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
Current Affairs మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ సి నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత అక్కినేని వ్యవహరించనున్నారు. బిగ్ సి కొత్త లోగో ఆవిష్కరించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆగస్టు 16న జరిగిన కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి ఈ మేరకు తెలిపారు. ప్రస్తుతం బిగ్ సి కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్టోర్లు ఉండగా తమిళనాడులో కూడా బిగ్ సి స్టోర్లను సెప్టెంబరులో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిగ్ సి లో 2,500లకు పైగా ఉద్యోగులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిగ్ సి నూతన బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : సమంత అక్కినేని
ఎక్కడ : హైదరాబాద్

మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూత
రాజనీతిజ్ఞుడు, కవి, భారత రత్న, ఉత్తమ పార్లమేంటెరియన్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు. యమునా నది తీరంలో ఉన్న రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఆగస్టు 17న నిర్వహించనున్నారు.
1924లో డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం అయిన కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి దంపతులకు అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించారు. వాజ్‌పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్‌గా పనిచేశాడు. అలాగే కవిగా గుర్తింపు పొందాడు. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో ప్రాథమిక విద్యనభ్యసించిన వాజ్‌పేయి గ్వాలియర్‌లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్ ఆంగ్లో-వేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి 1939లో ఆరెస్సెస్‌లో చేరి 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా పాల్గొన్నారు. అలాగే హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్‌లలో పని చేశారు. అనంతరం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. 1957లో ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు సేవలందించిన వాజ్‌పేయి 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
1968లో జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన 1977లో జనతా పార్టీకి మద్దతివ్వడంతో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వాజ్‌పేయి బాధ్యతలు చేపట్టారు. అలాగే మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు.
1980లో ఎల్‌కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్ వంటి వారితో కలసి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించిన వాజ్‌పేయి తర్వాత 1996, 1998, 1999లలో మొత్తం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన పూర్తికాలం (2004 వరకు) సమర్థపాలనను అందించారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999-2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి.
వాజ్‌పేయి జీవితంలో పద ఘట్టనలు...
1924 : డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జననం
1942 : క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు
1951 : భారతీయ జన సంఘ్ (బీజేఎస్)లో చేరిక
1957 : లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
1962 : రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారి ఎన్నిక
1968 : బీజేఎస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
1975 : ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో ప్రతిపక్షనేతలతో కలిసి అరెస్టయ్యారు
1977 : జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు
1980 : బీజేఎస్‌ను బీజేపీగా మార్పుచేసి.. ఆ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడయ్యారు
1992 : పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
1994 : లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
1996 : తొలిసారి 13 రోజులపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాక,సభలో బలం నిరూపించుకోలేక వాజ్‌పేయి ప్రభుత్వ పతనం
1998 : మేలో రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు
1999 : -చారిత్రాత్మక ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీసు మొదలుపెట్టారు
-కార్గిల్‌లో పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను తిప్పికొట్టేందుకు ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహించారు
-మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు
2001 : దేశవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ప్రారంభం
2004 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు
2005 : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
2009 : గుండెపోటుకు గురయ్యారు
2014 : వాజ్‌పేయి 90వ పుట్టినరోజును ‘సుపరిపాలన దినోత్సవంగా’ నిర్వహణ
2015 : దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం
2018 : జూన్‌లో అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిక.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ప్రధాని కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : అటల్ బిహారీ వాజ్‌పేయి (93)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ 22వ ప్రధానిగా పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18 ప్రమాణస్వీకారం చేశాడు. ఈ మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆ దేశ అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆగస్టు 17న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు 176 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు దక్కాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుండగా ప్రధానిగా ఎన్నికయ్యేందుకు 172 మంది మద్దతు అవసరం. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన 54 మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : పాకిస్థాన్ అధ్యక్ష భవనంలో

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ కన్నుమూత

ఐక్యరాజ్యసమితి(ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్(80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా స్విట్జర్లాండ్‌లో ఆగస్టు 18న అన్నన్ తుదిశ్వాస విడిచారని కోఫీ అన్నన్ ఫౌండేషన్ తెలిపింది.
ఐరాస ఏడవ ప్రధాన కార్యదర్శిగా 1997 నుంచి 2006 వరకు రెండు పర్యాయాలు పనిచేసిన అన్నన్ ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందారు. ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి గాను 2001లో అన్నన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2012లో ఐరాస-అరబ్‌లీగ్ ప్రత్యేక దూతగా సిరియాకు అన్నన్ వెళ్లారు.
1938, ఏప్రిల్ 8న ఆఫ్రికా దేశమైన ఘనాలోని కుమసి పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో కోఫీ అట్టా అన్నన్ జన్మించారు. అన్నన్ తండ్రి ఘనాలో ఓ ప్రావిన్సు గవర్నర్‌గా పనిచేశారు. 1961లో చిన్నస్థాయి దౌత్యాధికారిగా ఐరాసలో చేరిన అన్నన్ 1971లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇథియోపియాలో ఐరాస ఆర్థిక కమిషన్ సభ్యుడిగా, ఈజిప్ట్‌లో ఎమర్జెన్సీ ఫోర్స్, జెనీవాలోని శరణార్థుల హైకమిషన్‌లో అన్నన్ విధులు నిర్వహించారు. అలాగే న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో మానవవనరులు, బడ్జెట్, ఆర్థిక వనరులు, భద్రత తదితర విభాగాల్లో పనిచేశారు. 1990లో గల్ఫ్ యుద్ధం సందర్భంగా ఇరాక్‌లో చిక్కుకుపోయిన 900 మంది విదేశీయుల్ని వారి స్వదేశానికి పంపడంలో అన్నన్ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గ్యుటెరస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : కోఫీ అట్టా అన్నన్
ఎక్కడ : స్విట్జర్లాండ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత
మాజీ ఎంపీ, సంఘ సేవకురాలు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి విద్య (84) గుండెపోటు కారణంగా ఆగస్టు 18న విజయవాడలో కన్నుమూశారు.
1934 జూన్ 5న గోపరాజు రామచంద్ర రావు (గోరా), సరస్వతి గోరా దంపతులకు విజయనగరంలో జన్మించిన విద్య 1949లో కులాంతర వివాహం చేసుకున్నారు. తొలిసారిగా 1962లో గొల్లపూడి పంచాయతీ కో-ఆప్టెడ్ సభ్యురాలిగా నియమితులైన విద్య 1967లో కృష్ణాజిల్లా పరిషత్ కో-ఆప్టెడ్ సభ్యురాలిగా పనిచేశారు. 1980-84, 1989-91 కాలంలో విజయవాడ నుంచి రెండుసార్లు లోక్‌సభకు విద్య ఎన్నికయ్యారు.
సమాజంలో అసమానతలు రూపుమాపి, ఆర్థికాభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు 1969లో గోరా, సరస్వతి గోరా వాసవ్య మహిళా మండలిని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌గా విద్య రిజిస్ట్రేషన్ చేశారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న విద్య పలు సంఘ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నుపాటి విద్య భర్త చెన్నుపాటి శేషగిరిరావు పదేళ్లక్రితం మరణించారు. విద్యకు ముగ్గురు కుమార్తెలు రశ్మీ, దీక్ష, కీర్తితో పాటు, ఒక కుమారుడు వజీర్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ఎంపీ, సంఘ సేవకురాలు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : చెన్నుపాటి విద్య (84)
ఎక్కడ : విజయవాడ
ఎందుకు : గుండెపోటు కారణంగా

281 అండ్ బియాండ్’ పేరుతో లక్ష్మణ్ జీవిత చరిత్ర
‘281 అండ్ బియాండ్’ పేరుతో హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ఈ పుస్తకాన్ని నవంబర్ 20న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ఆగస్టు 20న తెలిపింది.
2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్ చేసి మంచి గుర్తింపు పొందాడు. దీంతో లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తకానికి 281 అనే శీర్షిక పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘281 అండ్ బియాండ్’ పేరుతో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జీవిత చరిత్ర
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్

నో స్పిన్ పేరుతో వార్న్ జీవిత చరిత్ర
‘నో స్పిన్’ పేరుతో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ఈ పుస్తకాన్ని అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘ఎబ్యురీ ప్రెస్’ ఆగస్టు 20న వెల్లడించింది. నో స్పిన్ పుస్తకంలో వార్న్ తన అత్యుత్తమ క్రీడా జీవితం సహా వ్యక్తిగత జీవితంలోని ఎవరికీ తెలియని విషయాలను సొంత వ్యాఖ్యానంలో వెల్లడించనున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘నో స్పిన్’ పేరుతో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ జీవిత చరిత్ర
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ఎబ్యురీ ప్రెస్

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 21న ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఎన్‌ఎన్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ నియమితులయ్యారు. అలాగే బిహార్ గవర్నర్‌గా మాలిక్ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్జీ టాండన్ బాధ్యతలు చేపట్టారు. హరియాణా నూతన గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబి రాణి మౌర్య నియమితులయ్యారు. అలాగే హరియాణా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి త్రిపురకు, త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ మేఘాలయకు, మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ సిక్కిం కు బదిలీ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ గురుదాస్ కామత్(63) గుండెపోటు కారణంగా ఢిల్లీలో ఆగస్టు 22న కన్నుమూశారు. 1954లో అక్టోబర్ 5న కర్ణాటకలోని అంకోలాలో కామత్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ ఇందిరా గాంధీ హయాంలో 1976 -80 వరకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించటంతోపాటు ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు.
ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన కామత్ గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా కామత్ బాధ్యతలు నిర్వర్తించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్‌లలో పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహూల్ గాంధీ ఎన్నికయ్యాక కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు కామత్ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : గురుదాస్ కామత్(63)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా

అత్యధిక ఆదాయ ఆర్జనలో సింధుకు ఏడోస్థానం
ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు ఏడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల వివరాలతో రూపొందించిన జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆగస్టు 22న విడుదల చేసింది. ఈ జాబితాలో 85 లక్షల డాలర్ల (రూ. 59 కోట్లు) సంపాదనతో సింధు ఏడో స్థానం సాధించగా కోటీ 81 లక్షల డాలర్ల (రూ. 126 కోట్లు)తో అమెరికాకి చెందిన సెరెనా విలియమ్స్ మొదటిస్థానం కైవసం చేసుకుంది.
సింధు టోర్నీలు ఆడటం ద్వారా... ప్రైజ్‌మనీ రూపంలో ఐదు లక్షల డాలర్లు, వాణిజ్య ఒప్పందాల ద్వారా 80 లక్షల డాలర్లు సంపాదించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొదటి పది స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న టాప్-10 క్రీడాకారిణిలు

ర్యాంకు

పేరు

దేశం

సంపాదన లక్షల డాలర్లలో....

1

సెరెనా విలియమ్స్

అమెరికా

కోటీ 81 (రూ. 126 కోట్లు)

2

వొజ్నియాకి

డెన్మార్క్

కోటీ 30 (రూ. 90 కోట్లు)

3

స్లోన్ స్టీఫెన్స్

అమెరికా

కోటీ 12 (రూ. 78 కోట్లు)

4

ముగురుజా

స్పెయిన్

కోటీ 10 (రూ. 76 కోట్లు)

5

షరపోవా

రష్యా

కోటీ 5 (రూ. 73 కోట్లు)

6

వీనస్ విలియమ్స్

అమెరికా

కోటీ 2 (రూ. 71 కోట్లు)

7

పీవీ సింధు

భారత్

85 (రూ. 59 కోట్లు)

8

హలెప్

రొమేనియా

77 (రూ. 53 కోట్లు)

9

డానికా ప్యాట్రిక్

అమెరికా

75 (రూ. 52 కోట్లు)

10

కెర్బర్

జర్మనీ

70

క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో ఏడో స్థానం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : పూసర్ల వెంకట (పీవీ) సింధు
ఎక్కడ : ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో


రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్
Current Affairs రాజ్యసభ 13వ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్‌డీఏ అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ నారయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆగస్టు 9న జరిగిన ఎన్నికల్లో హరివంశ్‌కు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులు ఉండగా 226 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పి.జే కురియన్ జూన్ 30న పదవీ విరమణ పొందారు.
1956 జూన్ 30న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జన్మించిన హరివంశ్ తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పాత్రికేయునిగా, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగా పనిచేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివిన హరివంశ్ హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే హిందీలో పలు పుస్తకాలు రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యసభ 13వ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : హరివంశ్ నారయణ్ సింగ్

ట్రాయ్ చైర్మన్ పదవీకాలం పొడిగింపు

ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది. 2020 సెప్టెంబర్ 30 వరకు ట్రాయ్ చైర్మన్‌గా శర్మను కొనసాగించాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 9న ఆమోదించింది. 2015 జూలైలో మూడేళ్ల కాలానికి ట్రాయ్ చైర్మన్‌గా శర్మ నియమితులయ్యారు. 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) అయిన శర్మ ఆధార్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రాయ్ చైర్మన్ పదవీకాలం రెండేళ్లు పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : క్యాబినెట్ నియామకాల కమిటీ

కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు విద్యార్థులు
ఆఫ్రికా ఖండంలో ఎత్తై కిలిమంజారో పర్వతాన్ని గుంటూరు జిల్లాకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆగస్టు 6న అధిరోహించారు. ఏసీ కళాశాలలో చదువుతున్న పొట్టిబండల ప్రసన్న కుమార్, బాపట్ల ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కళాశాల విద్యార్థి గడ్డిపాటి భవానీ శంకర్‌లు ఈ శిఖరాన్ని అధిరోహించి ఆగస్టు 10న ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి రష్యాలోని ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆహ్వానం అందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు విద్యార్థులు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : పొట్టిబండల ప్రసన్న కుమార్, గడ్డిపాటి భవానీ శంకర్
ఎక్కడ : టాంజానియా, ఆఫ్రికా

తెలంగాణ ఏజీగా బీఎస్ ప్రసాద్
తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌గా బండా శివానంద ప్రసాద్ (బీఎస్ ప్రసాద్)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన బీఎస్ ప్రసాద్ గత 30 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు ఆర్థిక సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. మొదట ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ)గా కొన్నేళ్లు సేవలు అందించిన బీఎస్ ప్రసాద్, తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయన 3 ఏళ్లపాటు ఏజీగా బాధ్యతలు నిర్వర్తించి 2017 జూలై 12న రాజీనామా చేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి జూలై 17న ఏజీగా నియమితులయ్యారు. 2018 మార్చి 26న ప్రకాశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అడ్వొకేట్ జనరల్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : బండా శివానంద ప్రసాద్ (బీఎస్ ప్రసాద్)

సింగరేణి సీఎండీకి ఉత్తమ సేవా అవార్డు
సింగరేణి ఛీప్ మేనెజింగ్ డెరైక్టర్ (సీఎండీ) శ్రీధర్‌కు తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ‘ఉత్తమ సేవా అవార్డు’ లభించింది. ఈ మేరకు ఆగస్టు 10న రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో గవర్నర్ నరసింహన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి సంస్థ నిర్వహించిన సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా శ్రీధర్‌కు ఈ అవార్డు దక్కింది.
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్నేళ్లుగా రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు సింగరేణి సంస్థ సహకారాలు అందించడంతోపాటు 2008 నుంచి థలసేమియా వ్యాధిగ్రస్తులకు సాధారణ రక్తనిధి నిర్వహణకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ‘ఉత్తమ సేవా అవార్డు’
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సింగరేణి సీఎండీ శ్రీధర్
ఎందుకు : సామాజిక సేవ చేసినందుకు

ఐరాస మానవహక్కుల చీఫ్‌గా బ్యాష్లే
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాష్లే ఎన్నికయ్యారు. ఈ మేరకు 93 సభ్య దేశాల సాధారణ అసెంబ్లీ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మానవ హక్కుల సంస్థ చీఫ్‌గా కొనసాగుతున్న జొర్డాన్ దౌత్యవేత్త జీద్ రాద్ అల్-హుసేన్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో హుసేన్ స్థానంలో బ్యాష్లే ఏడో హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. యూఎన్ మానవ హక్కుల సంస్థ 1993లో ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ హైకమిషనర్ ఎన్నిక
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : మిచెల్ బ్యాష్లే

జమ్మూకశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ గీత

జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత మిట్టల్ నియమితులయ్యారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్. ఎన్ వోహ్రా రాజ్‌భవన్‌లో ఆగస్టు 11న గీతా మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కశ్మీర్ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళగా గీతా మిట్టల్ నిలిచారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత వ్యవహరిస్తున్నారు.
1981లో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన గీత మిట్టల్ 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : జస్టిస్ గీత మిట్టల్

ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్, మ్యాన్ బుకర్ బహుమతుల గ్రహీత విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ (వీఎస్) నైపాల్ (85) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా లండన్‌లో ఆగస్టు 12న తుదిశ్వాస విడిచారు.
1932 ఆగస్టు 17న ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించిన నైపాల్ ఇంగ్లిష్ భాషలో అత్యంత ప్రవీణుడిగా పేరు తెచ్చుకున్నారు. వీఎస్ నైపాల్ తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్ గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేసేవారు. 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ట్రినిడాడ్ నుంచి లండన్ వచ్చిన నైపాల్ జీవితంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన నైపాల్ 1996లో ఆమె చనిపోవడంతో వయసులో తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదైన, అప్పటికే పెళ్లయి్య విడాకులు తీసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్ నదీరాను రెండో పెళ్లి చేసుకున్నారు.
మతాన్ని, రాజకీయ నాయకులను, వలసవాదాన్ని విమర్శిస్తూ నైపాల్ రాసిన ముప్పైకి పైగా పుస్తకాలు బాగా ప్రజాధరణ పొందాయి. ఇస్లాం మతవాదంపై అమాంగ్ ద బిలీవర్స్, బియాండ్ బిలీఫ్ వంటి పుస్తకాలను నైపాల్ రాశారు. అలాగే గెరిల్లాస్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఎ వే ఇన్ ద వరల్డ్, ద మైమిక్ మెన్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్, హాఫ్ ఎ లైఫ్ వంటి ఇతర పుస్తకాలను ఆయన రచించారు.
అవార్డులు...
2001లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని నైపాల్ అందుకున్నారు. అలాగే 1971లో ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ పుస్తకానికి ఆయనకు మ్యాన్‌బుకర్ ప్రైజ్ లభించింది. సాహిత్య రంగానికి నైపాల్ చేసిన సేవలను గుర్తిస్తూ 1990లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 ఆయనకు నైట్‌హుడ్‌ను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ (వీఎస్) నైపాల్ (85)
ఎక్కడ : లండన్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) అనారోగ్యం కారణంగా కోల్‌కతాలో ఆగస్టు 13న కన్నుమూశారు. 2004-09 మధ్య కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఛటర్జీ పనిచేశారు. జెంటిల్మన్ కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన పదిసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో సోమనాథ్ ఛటర్జీ జన్మించాడు. ఆయన తండ్రి నిర్మల్ చంద్ర ఛటర్జీ లాయర్‌గా, అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేశాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో లా చదివిన ఛటర్జీ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. లాయర్‌గా పనిచేసే సమయంలో కార్మిక సంఘాలతో కలిసి పనిచేసిన ఆయన 40 ట్రేడ్ యూనియన్లకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1968లో సీపీఎం పార్టీలో చేరిన ఛటర్జీ 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం పది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఆయన ఒక్కసారి మాత్రమే (1984లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్ నుంచి పోటీచేసి మమతా బెనర్జీ చేతిలో) ఓడిపోయారు. 1989 నుంచి 2004 వరకు లోక్‌సభలో సీపీఎం నాయకుడిగా ఉన్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వంపై సీపీఎం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌గా ఉన్న చటర్జీ మద్ధతు ఇవ్వకుండా ప్రభుత్వానికి మద్ధతు తెలపడంతో సీపీఎం పార్టీ ఆయనను బహిష్కరించింది.
వివిధ పార్లమెంట్ కమిటీల్లో పనిచేసిన ఛటర్జీ 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఉండి 2004లో లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన ఏకైక వామపక్ష నేతగా ఆయన గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ మాజీ స్పీకర్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : సోమ్‌నాథ్ ఛటర్జీ (89)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ టాండన్ కన్నుమూత
జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ దాస్ టాండన్ (90) కన్నుమూశారు. 2014 జూలై 14 నుంచి ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టాండన్ గుండెపోటు కారణంగా రాయ్‌పూర్‌లో ఆగస్టు 14న తుది శ్వాస విడిచారు.
1927 నవంబర్ 1న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన టాండన్ జన్‌సంఘ్ (1951లో స్థాపన) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. 1951-1957 మధ్య కాలంలో పంజాబ్ జన్‌సంఘ్ కార్యదర్శిగా ఉన్న టాండన్ 1995-97 మధ్య పంజాబ్ విభాగం బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1960లో మొదటిసారిగా అమృత్‌సర్ నుంచి ఎమ్మెల్యేగా టాండన్ ఎన్నికయ్యారు. మొత్తం అమృత్‌సర్ నుంచి ఐదుసార్లు, రాజ్‌పురా నుంచి ఒక్కసారి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. అలాగే పంజాబ్ డిప్యూటీ సీఎంగా, కేబినేట్ మంత్రిగా ఆయన పనిచేశారు. ఎమర్జెన్సీకాలంలో 1975-77 వరకు 19 నెలల పాటు జైలులో ఉన్నారు. టాండన్ భార్య బ్రిజ్‌పాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఛత్తీస్‌గఢ్ గవర్నర్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : బల్‌రాంజీ దాస్ టాండన్
ఎక్కడ : రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
ఎందుకు : గుండెపోటు కారణంగా

మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా పవార్

భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు పవార్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ ఆగస్టు 14న ప్రకటించింది. మహిళల జట్టు కోచ్‌గా ఉన్న తుషార్ అరోథే సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకోవడంతో జూలైలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : రమేశ్ పవార్

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ వాడేకర్ కన్నుమూత
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఆగస్టు15న తుది శ్వాస విడిచారు.
1941 ఏప్రిల్ 1న బొంబాయిలో జన్మించిన వాడేకర్ 1958లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేసిన వాడేకర్ 1974లో రిటైరయ్యాడు. మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేశాడు.
1990ల్లో అజహరుద్దీన్ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్ కమ్ కోచ్‌గా వ్యవహరించిన వాడేకర్ 1998-99 మధ్యకాలంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా వాడేకర్ నిలిచారు. మరోవైపు 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పురస్కారంను వాడేకర్ పొందారు. అలాగే భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ వాడేకర్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77)
ఎక్కడ : ముంబై
ఎందుకు : క్యాన్సర్ కారణంగా

ఆచార్య శంకర్‌కు రాయల్ సొసైటీ గుర్తింపు
Current Affairs ఆచార్య ఎం.వి.శంకర్‌కు ఆగస్టు 1న ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ గుర్తింపు లభించింది. 2009లో వైఎస్సార్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో చేరిన శంకర్ మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ విభాగంలో పని చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ) కరైకూడి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ వంటి సంస్థల్లో సంయుక్త పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయి జర్నల్స్‌లో శంకర్ కు చెందిన 67 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. శంకర్ పరిశోధనలకు అమెరికా, ఫ్రాన్స్, యూరోప్ దేశాలలో పేటెంట్లు లభించాయి.
1841 సంవత్సరంలో లండన్‌లో ఏర్పాటైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్థ్రీ రసాయనశాస్త్రంలో పేరుగాంచిన శాస్త్రవేత్తలకు గుర్తింపును ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఆచార్య ఎం.వి.శంకర్
ఎందుకు : రసాయన శాస్త్రంలో చేసిన కృషికి

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోసెఫ్
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. అలాగే మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌లకు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతిని కల్పించింది. దీంతో కోర్టులో జడ్జీల సంఖ్య 25కు చేరింది. సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది జడ్జీలు ఉంటారు.
జస్టిస్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న కేంద్రానికి సిపార్సు చేసింది. అయితే కేరళ నుంచి సుప్రీంలో ఇది వరకే తగిన ప్రాతినిధ్యం ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ప్రభుత్వం వెనక్కు పంపింది. జోసెఫ్ పేరును సుప్రీం జడ్జి పదవికి పరిశీలించాలని మే 10న కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించగా తాజాగా ఆమోదం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల నియామకం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

వైద్యం కోసం ఇళయరాజా సంగీతం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని వైద్య చికిత్సల్లో ఉపయోగించేందుకు సింగపూర్‌కు చెందిన మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి కృషి చేస్తుంది. ఈ మేరకు ఇళయరాజా రూపొందించిన సంగీత ఆల్బమ్‌లపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక బాణీలను ఇళయరాజా సమకూర్చుతున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఇళయరాజాకు 2018లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైద్యం కోసం ఇళయరాజా సంగీతం
ఎప్పుడు : ఆగస్టు
ఎవరు : మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి, సింగపూర్

మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ తహిల్మ్రణి
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వీకే తహిల్మ్రణి నియమితులయ్యారు. ప్రస్తుతం ముంబై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తహిల్ రమణిని మద్రాసు హైకోర్టు జీజేగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 4న ఆమోదించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జి సుప్రీం న్యాయమూర్తిగా నియమితులవడంతో ఈ నియామకం అనివార్యమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మద్రాస్ హైకోర్టు సీజే నియామకం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : జస్టిస్ వీకే తహిల్ రమణి

కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే దావన్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత రాజీందర్ కుమార్ ధావన్ (81) ఆగస్టు 6న ఢిల్లీలో కన్నుమూశారు. 1962-84 మధ్య కాలంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ధావన్ 1990లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు. 1995-96 కాలంలో గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
దావన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లోని చీనియట్‌లో 1937 జూలై 16న జన్మించాడు. బెనారస్ హిందూ యూనివ ర్శిటీలో చదివిన ధావన్ 74 ఏళ్ల వయసు (2012) లో పెళ్లి చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : రాజీందర్ కుమార్ ధావన్ (81)
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి రాజీనామా
అమెరికాకి చెందిన శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్‌‌స తయారీ సంస్థ పెప్సీకో సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రా కృష్ణమూర్తి నూయి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు కంపెనీ నూతన సీఈవోగా డెరైక్టర్ల బోర్డు ఎంపిక చేసిన కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాకు ఆమె అక్టోబర్ 3న బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే 2019 జనవరి వరకు ఇంద్రానూయి చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు.
1994లో పెప్సీకో ఉద్యోగిగా చేరిన ఇంద్రానూయి 2001లో పెప్సీకో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. అలాగే 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో నూయి కీలక పాత్ర పోషించారు.
ఫార్చూన్స్ జాబితాలో రెండో స్థానం
‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చూన్స్ జాబితా 2017లో ఇంద్రానూయి 2వ స్థానంలో ఉన్నారు. అలాగే ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళలతో 2014లో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. 2014లో అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగా అగ్ర స్థానంలో ఉన్నారు.
1955 అక్టోబర్ 28న మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా నూయి అక్కడే పాఠశాల విద్యనభ్యసించి 1974లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఐఐఎం, కల్‌కత్తా నుంచి ఎంబీఏ చేసిన నూయి దేశీయంగానే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చేరి పబ్లిక్, ప్రైవేటు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందిన తర్వాత బోస్టన్ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్ బొవేరిలోనూ పనిచేశాక 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెప్సీకో సీఈవో రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఇంద్రా కృష్ణమూర్తి నూయి

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కన్నుమూత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ ఉద్యమ నేత, డీఎంకే అధినేత కలైజ్ఞర్ ముత్తువేలర్ కరుణానిధి (94) కన్నుమూశారు. కొద్ది రోజులుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 7న చెన్నై ఆళ్వారుపేట్‌లోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎనిమిది దశాబ్దాలపాటు దేశానికి కరుణానిధి సేవలందించారు.
1924 జూన్ 3న తిరువారూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగమ్మ, దంపతులకు(తెలుగు సంగీత కళాకారుల కుటుంబం) జన్మించిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. తిరువారూరులో ఉన్నత పాఠశాలలో విధ్యనభ్యసించిన ఆయన 1942లో మురసోలి అనే మాసపత్రికను స్థాపించి ‘చేరన్’ పేరిట వ్యాసాలు రాశారు. 1947లో రాజకుమారి సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలకు కథ, కథనాలు, సంభాషణలు అందించారు. అలాగే ఆయన రాసిన తెన్‌పాండి సింగం నవలకు గాను తంజావూర్ తమిళ విశ్వవిద్యాలయం రాజరాజన్ అవార్డుతో సత్కరించింది.
కలైజ్ఞర్ గా....
కరుణానిధి కలైజ్ఞర్(నటుడు)గానే అభిమానులకు, ప్రజలకు ప్రసిద్ధులు. కరుణ రచించిన తూక్కుమేడై (ఉరి కంబం) నాటికను చూసిన నటుడు ఎంఆర్ రాధా ఆయనకు కలైజ్ఞర్ బిరుదును ప్రదానం చేశారు.
రాజకీయ జీవితం...
14 ఏళ్ల వయసులో జస్టిస్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ద్రవిడ కళగం(డీకే) పార్టీలో చేరి పెరియార్‌కు శిష్యుడిగా ఉన్నారు. అనంతరం అన్నాదురైతో కలిసి డీఎంకే పార్టీని స్థాపించారు. 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి జిల్లా కులితలై నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం ఐదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అన్నాదురై (డీఎంకే స్థాపకుడు) మరణంతో 1969 మార్చిలో కరుణ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అలాగే పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై మరణించేంత వరకు కొనసాగారు.
కరుణ ప్రస్థానమిలా..
1924 జూన్ 3 తిరుక్కువలైలో జననం
1938 జస్టిస్ పార్టీలో చేరిక. తర్వాత ద్రవిడ కజగం పార్టీలోకి.
1949 అన్నాదురైతో కలసి డీఎంకే స్థాపన
1957 కులితలై నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నిక.
1967 అన్నాదురై కేబినెట్‌లో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు.
1969 అన్నాదురై మరణం అనంతరం సీఎంగా ..
1977 అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే. 13 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కరుణ
1989 ఎంజీఆర్ మరణం. తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి డీఎంకే
2001 అవినీతి ఆరోపణలతో కరుణ, స్టాలిన్, మారన్‌లను అరెస్టు చేసిన జయలలిత ప్రభుత్వం
2006 ఐదోసారి సీఎంగా ఎన్నిక
2013 తన వారసుడిగా కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించిన కరుణ.
కరుణానిధి వల్లే సీఎంలకు జెండా ఎగరేసే హక్కు
తమిళనాడుకు ప్రత్యేక పతాకం (జెండా) ఉండాలనే డిమాండ్‌ను కరుణానిధి 1970లో బలంగా వినిపించారు. అలాగే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని వాదించేవారు. అధికారంలో ఉండగా ఆయన.. 1969లో జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల పరిశీలన కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫారసులు, కరుణ కృషి వల్లే దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు లభించింది. 1974 వరకు సీఎంలకు ఈ అవకాశం ఉండేది కాదు.

టెన్ ఐడియాలజీస్ పుస్తకావిష్కరణ
సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి రాసిన మొదటి పుస్తకం ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఆగస్టు 7న ఆవిష్కరించారు. 15 అధ్యాయాలున్న ఈ పుస్తకంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ వంటి విధానాలను ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెన్ ఐడియాలజీస్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ఎక్కడ : న్యూ ఢిల్లీ

ఆర్‌బీఐ డెరైక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో డెరైక్టరుగా చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న నియమించింది. దీంతో ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో అనుబంధం ఉన్న గురుమూర్తి తమిళ పత్రిక తుగ్లక్‌కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : స్వామినాథన్ గురుమూర్తి

కెన్యా అథ్లెట్ నికోలస్ బెట్ కన్నుమూత
కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్, ప్రపంచ మాజీ చాంపియన్ నికోలస్ బెట్ (28) కన్నుమూశాడు. పశ్చిమ కెన్యాలో ఆగస్టు 8న జరిగిన కారు ప్రమాదంలో జెట్ మర ణించాడు. 2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిల్స్‌లో బెట్ స్వర్ణం సాధించాడు. అలాగే చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డిల్స్ టైటిల్ గెలిచిన బెట్ రెండుసార్లు ఆఫ్రికా హర్డిల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : నికోలస్ బెట్ (28)
ఎక్కడ : పశ్చిమ కెన్యా
ఎందుకు : రోడ్డు ప్రమాదం కారణంగా
Published date : 18 Aug 2018 05:20PM

Photo Stories