Section 6A: రాజ్యాంగ ధర్మాసనం తీర్పు.. సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే.. ఏమిటీ సెక్షన్ 6ఏ?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనో మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 4:1 మెజార్టీతో అక్టోబర్ 17వ తేదీ తీర్పు వెలువరించింది.
జస్టిస్ పార్దివాలా మాత్రమే ఈ తీర్పుతో విభేదించారు. సెక్షన్ 6ఏ రాజ్యాంగవిరుద్ధమని ఆయన చెప్పారు. చట్టవిరుద్ధమైన వలసలకు అస్సాం అకార్డ్(ఒప్పందం) ఒక రాజకీయ పరిష్కారంగా తోడ్పడిందని ధర్మాసనం వెల్లడించింది. అసోంలోకి వలసలకు, వలసదార్లకు పౌరసత్వం ఇవ్వడానికి 1971 మార్చి 25న కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైందేనని పేర్కొంది. సెక్షన్ 6ఏ చట్టబద్ధమేనని సీజేఐ తన తీర్పులో వివరించారు.
చట్టంలో ఈ సెక్షన్‌ను చేర్చడానికి పార్లమెంట్‌కు చట్టబద్ధమైన అధికారం ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అసోంలోకి వలసలు అధికం కాబట్టి అక్కడికి ఎంతమంది అక్రమంగా వచ్చారన్నది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపింది.
అసోంలో భిన్నమైన గిరిజన తెగలు, సమూహాలు, వర్గాలు ఉన్నాయని, ఆయా వర్గాల ప్రజలకు తమ సంస్కృతిని కాపాడుకొనే హక్కును ఆర్టికల్ 29(1) కింద రాజ్యాంగం కల్పించిందని, సెక్షన్ 6ఏ ఈ హక్కును ఉల్లంఘిస్తోందంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆర్టికల్ 29(1)ను ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో వేర్వేరు తెగల ప్రజలు ఉన్నారని చెప్పడం ఒక్కటే సరిపోదని స్పష్టంచేసింది.
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం
ఏమిటీ సెక్షన్ 6ఏ?
1985 నాటి అస్సాం అకార్డ్ తర్వాత అప్పటి ప్రభుత్వం సెక్షన్ 6ఏను ప్రత్యేక ప్రొవిజన్‌గా పౌరసత్వ చట్టంలో చేర్చింది. అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రపుల్ల కుమార్ మహంత నేతృత్వంలోని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌తో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే అస్సాం అకార్డ్. ఈ అకార్డ్ కింద ఎవరెవరికి భారత పౌరసత్వం కల్పించాలన్నది సెక్షన్ 6ఏ నిర్దేశిస్తోంది.
ఈ సెక్షన్ ప్రకారం.. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 దాకా బంగ్లాదేశ్‌తోపాటు నిర్దేశించిన ఇతర ప్రాంతాల నుంచి అసోంలోకి వలసవచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వొచ్చు.
అలాంటివారు పౌరసత్వం కోసం సెక్షన్ 18 కింద రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, అక్రమ వలసదార్లుగా గుర్తించిన తేదీ నుంచి పది సంవత్సరాల దాకా భారత పౌరసత్వం కోసం రిజిస్టర్ చేసుకోవడానికి వీల్లేదు. పదేళ్లు పూర్తయిన తర్వాతే అవకాశం ఉంటుంది.
అలాగే 1971 మార్చి 25 తర్వాత వలస వచ్చినవారిని సెక్షన్ 6ఏ ప్రకారం వెనక్కి పంపించాలి. ఈ సెక్షన్‌ను అసోం సన్మిలితా మహాసంఘతోపాటు మరొకొన్ని గ్రూప్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అసోంలోకి సామూహిక వలసలను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించాయి.
Nijut Moina Scheme: బాల్య వివాహాలను అరికట్టేందుకు కొత్త పథకం ప్రారంభం