సెప్టెంబర్ 2019 జాతీయం
భారత తీరప్రాంతంలో పహారా కాసేందుకు రూపొందించిన ‘వరాహ’ గస్తీ నౌక నేవీలోకి చేరింది. ఈ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సెప్టెంబర్ 25న చెన్నై రేవులో జాతికి అంకితం చేశారు. ఎల్‌అండ్‌టీ తయారుచేసిన ఈ నౌక మంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించనుంది. జలమార్గం ద్వారా చొరబాటుకు యత్నించే శత్రుమూకల నుంచి రక్షణ కల్పించడం వరాహ విధి. ఈ నౌకకు 2,100 టన్నుల బరువు సామర్థ్యం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావికాదళంలోని వరాహ నౌక
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు
జమ్మూకశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ధర్మాసనం 2019, అక్టోబర్ 1 నుంచి ఆర్టికల్ రద్దుకు సంబంధించి వాదనలను విచారించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్టికల్ 370 రద్దుపై ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు
ఢిల్లీ-కత్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 3న ఈ రైలును ప్రారంభిస్తారని భారతీయ రైల్వే సెప్టెంబర్ 29న వెల్లడించింది. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలందిస్తుందని పేర్కంది. ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ-కత్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : భారతీయ రైల్వే
జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ ప్రారంభం
ముంబైలో సెప్టెంబర్ 28న స్కార్‌పీన్ తరహా జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ, పీ-17ఏ ఫ్రిజెట్స్‌తో కూడిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ నీల్‌గిరిలను వేర్వేరు కార్యక్రమాలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ఐఎన్‌ఎస్ ఖండేరీ రాకతో నావికాదళ శక్తిసామర్థ్యాలు, శత్రువుపై దాడి చేయగల సామర్థ్యం మరింత పెరిగిందన్న విషయాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలని అన్నారు. జలాంతర్గాములను స్వయంగా తయారు చేసుకోగల అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి కావడం ఎంతైనా గర్వకారణమని అన్నారు.
ఎన్‌ఎస్ ఖండేరీ ప్రత్యేకతలు..
- భారత్ సొంతంగా నిర్మించుకున్న కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో రెండోది.
- ఐఎన్‌ఎస్ కల్వరి 2017 డిసెంబరు నుంచి పనిచేస్తోంది.
- మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించిన ఖండేరీ అతితక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది.
- డీజిల్, విద్యుత్తు రెండింటినీ వాడుకుని పని చేయగలదు.
- ఏకకాలంలో గంటకు 20 నాటికల్ మైళ్ల వేగంతో ఆరు క్షిపణులను ప్రయోగించవచ్చు.
- మొత్తం 36 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు.
- సుమారు 45 రోజులపాటు ఏకధాటిగా సముద్రంలో ఉండగలగడం దీని ప్రత్యేకత.
ఏమిటి : జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఉల్లి ఎగుమతులపై నిషేధం
దేశీయ మార్కెట్‌లో ధరలను అదుపులో ఉంచడం కోసం అన్ని రకాల ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 29 ప్రకటించింది. అలాగే వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వల పరిమితిపైనా ఆంక్షలు విధించింది. చిల్లర వర్తకులు 100 క్వింటాళ్లు, టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ ఉంచుకోరాదని ఆదేశించింది. ఉల్లి సరఫరాకు ఇబ్బందులు వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.60-80 మధ్య పలుకుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే వ్యాపారులు ఉల్లిని నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించడం, విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో ధరలు పెరిగాయి.
భారత్ ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేస్తోంది. 2019 ఏడాది తొలి నాలుగు నెలల్లో రూ.1089 కోట్ల విలువైన ఉల్లిని భారత్ ఎగుమతి చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉల్లి ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను అదుపులో ఉంచడం కోసం
పాఠశాల విద్యలో కేరళకి మొదటి స్థానం
పాఠశాల విద్యా ప్రమాణాల విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను విభజించి 2016-17 గణాంకాల ప్రకారం ఈ ర్యాంకులను సెప్టెంబర్ 30న ప్రకటించింది. 30 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
కేరళ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి. పాఠశాల విద్యా ప్రమాణాల్లో రాష్ట్రాల బలాలు, బలహీనతలు తెలియజేయడం, లోటుపాట్లను సరిదిద్దుకొనేలా రాష్ట్రాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాఠశాల విద్యలో కేరళకి మొదటి స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశంలో
ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆదేశాలు ఉపసంహరణ
షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఈ మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 1న విచారణ జరిపింది. 2018 ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తాజాగా కోర్డు పేర్కొంది. అందుకే ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నామని వివరించింది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు 2018 ఏడాది మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆదేశాలు ఉపసంహరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆదేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని
సిక్కింలో అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణం
సిక్కింలోని కెరంగ్-జొడాంగ్‌ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌ఓ) అక్టోబర్ 1న తెలిపింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా ఇది నిలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు 2015లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కెరంగ్-జొడాంగ్ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని బీఆర్‌ఓ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారి నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌ఓ)
ఎక్కడ : కెరంగ్-జొడాంగ్, సిక్కిం
నోయిడాలో భారీ చరఖా ఆవిష్కరణ
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న సెక్టార్-94 వద్ద ఏర్పాటు చేసిన భారీ చరఖా (రాట్నం)ను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సృ్మతీ ఇరానీ అక్టోబర్ 1న ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 1,250 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ చరఖాను తయారు చేశారు. మొత్తం 1,650 కేజీల బరువున్న ఈ చరఖా ప్లాస్టిక్ వ్యర్థాలతో భారత్‌లో రూపొందించిన అతిపెద్ద వస్తువుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారీ చరఖా (రాట్నం) ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సృ్మతీ ఇరానీ
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
చారిత్రక కట్టడాలలో ప్లాస్టిక్ నిషేధం
దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల ప్రాంగణంలో, వాటికి 100 మీటర్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అనుమతించబోమని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ అక్టోబర్ 2న ప్రకటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దేశం విడనాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న ప్రణాళికను కేంద్రప్రభుత్వం అర్ధంతరంగా ఆపివేసింది. నిషేధం విధిస్తే పరిశ్రమలకు విఘాతం కలుగుతుందని, ఆర్థిక మందగమనంతోపాటు ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశలోని చారిత్రక కట్టడాలలో ప్లాస్టిక్ నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్
అహ్మదాబాద్‌లో స్వచ్ఛభారత్ దివస్
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరాన ‘స్వచ్ఛభారత్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారత్ నిలిచిందని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ‘ఓడీఎఫ్ ఇండియా’ మ్యాప్‌ను ఆవిష్కరించారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
- ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరుగుతోంది. భారత ప్రతిష్ట ఏ స్థాయిలో పెరిగిందో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో స్పష్టంగా తెలిసింది.
- ఈ రోజు గ్రామీణ భారతం, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయి.
- 60 నెలల్లో 60 కోట్ల ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడంపై ప్రపంచం భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగవద్దని, ఇంకా ముందుకు సాగాలి.
- పారిశుద్ధ్యం, ప్రకృతి పరిరక్షణ గాంధీజీకి ఎంతో ఇష్టమైన విషయాలు.
- 2022 నాటికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నామరూపాలు లేకుండా చేయాలి.
ఏమిటి : అహ్మదాబాద్‌లో స్వచ్ఛభారత్ దివస్
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆశ్రయంలోని మ్యూజియంను, ఆశ్రమంలో గాంధీ నివాసం హృదయ కుంజ్‌ను సందర్శించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘గాంధీజీ స్వప్నమైన స్వచ్ఛభారత్ ఆయన 150వ జయంతి రోజు నిజం కావడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రూ. 150 నాణాన్ని మోదీ ఆవిష్కరించారు.
దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక 1917లో సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మాగాంధీ నెలకొల్పారు. 1930 వరకు ఇక్కడే ఉన్నారు. 1930లో దండియాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమ సందర్శన
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా
ఎన్డీఆర్‌ఎఫ్‌లో మహిళా ఉద్యోగులు
విపత్తుల నిర్వహణ, సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషిస్తున్న ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’(ఎన్డీఆర్‌ఎఫ్)లో మహిళలు పనిచేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్ కొత్త బెటాలియన్లలో మహిళలకు చోటు కల్పించాలని 2018లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ సెప్టెంబర్ 19న వెల్లడించారు.
ఎన్డీఆర్‌ఎఫ్ డెరైక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..
- త్వరలో ఏర్పాటుకానున్న 4 కొత్త బెటాలియన్లలో నిర్దిష్ట సంఖ్యలో మహిళలు అవసరం.
- ప్రస్తుతమున్న 12 బెటాలియన్లకు అదనంగా చేరే నాలుగు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేషనల్ కాపిటల్ రీజన్‌లలో పనిచేస్తాయి. ఒక్కోదాంట్లో 1150 మంది సిబ్బంది ఉంటారు.
- అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలోపే మహిళా సిబ్బంది విధుల్లోకి చేరతారు.
గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
ప్రపంచ స్థాయిలో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా-ఎన్‌సీఆర్‌లోని ఐటీ పార్క్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సెప్టెంబర్ 19న తెలిపింది. పోలీస్ వర్సిటీ కోసం గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.371 కోట్లకు 90 ఏళ్లు స్థలాన్ని లీజుకు ఇచ్చిందని చెప్పింది. వర్సిటీ ద్వారా పోలీస్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ ఫోరెన్సిక్, క్రిమినల్ జస్టిస్, క్రిమినాలజి, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో విద్య, శిక్షణ అందిస్తామని పేర్కొంది. డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు ఉంటాయని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రేటర్ నోయిడాలో పోలీస్ వర్సిటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్ర హోం శాఖ
విద్యార్థుల కోసం ఎన్‌ఈఏటీ పథకం
ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది. 2019, నవంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని సెప్టెంబర్ 19న వెల్లడించింది. విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం ఈ పథకం లక్ష్యమని పేర్కొంది.
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...
- ఎన్‌ఈఏటీలో భాగంగా స్టార్టప్ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెస్తారు. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
- ఎడ్ టెక్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వసూలు చేస్తాయి.
- పథకంలో భాగంగా టెక్ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది.
ఏమిటి : విద్యార్థుల కోసం ఎన్‌ఈఏటీ పథకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్రప్రభుత్వం
జనగణన కమిషనర్ కార్యలయానికి శంకుస్థాపన
దేశ రాజధాని న్యూఢిల్లీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్ వంటి అనేక గుర్తింపు కార్డుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఒక్క బహుళార్థక గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
మంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- సమాచారాన్నంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తాం.
- దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయి.
- 2021నాటి జనగణనకు సంబంధించి మంచు ప్రాంతాలతో కూడిన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెఫరెన్స్ డేట్ 2020 అక్టోబరు ఒకటో తేదీ కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు 2021 మార్చి 21గా ఉండనుంది.
- మొత్తం 16 భాషల్లో రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన చేపట్టనున్నాం.
- జనగణనతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కూడా వివరాలు సేకరిస్తాం.
ఏమిటి : జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది : ఆర్మీ చీఫ్
పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ వెల్లడించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సెప్టెంబర్ 23న నిర్వహించిన యువ సైనికుల నూతన శిక్షణ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా రావత్ ఈ విషయాన్ని తెలిపారు. బాలాకోట్ దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదుల చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ పేర్కొన్నారు.
రైతుల కోసం రెండు యాప్‌లు
రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మొబైల్ యాప్‌లను రూపొందించింది. వీటి ద్వారా వ్యవసాయానికి అవసరమైన సమగ్ర సమాచారం నేరుగా రైతుల ఫోన్లలోకి రానుంది. దేశంలోని రైతులు ట్రాక్టర్లు కొనేందుకు, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను ఎంపిక చేసుకునేందుకు ‘సీహెచ్‌సీ-ఫామ్ మెషినరీ’ మొబైల్ యాప్‌ను కేంద్రం రూపొందించింది. అలాగే వాతావరణానికి సంబంధించిన సలహాలు ఇవ్వడంతో పాటు కొత్త టెక్నాలజీలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేందుకు కావాల్సిన అంశాలు, విత్తన కేంద్రాల సమాచారంతో ‘క్రిషి కిసాన్’ అనే మరో యాప్‌ను రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుల కోసం రెండు యాప్‌లు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : కేంద్రప్రభుత్వం
విదేశీ విద్యార్థుల్లో నేపాలీలే అత్యధికం
భారత్‌కు ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చే విదేశీయుల్లో నేపాల్, అఫ్గానిస్తాన్ విద్యార్థులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు 2018-19లో మానవ వనరుల అభివృద్ధి శాఖ చేపట్టిన ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వివరాలను సెప్టెంబర్ 24న వెల్లడించింది. ఈ సర్వేలో 962 వర్సిటీలు, 38,179 కళాశాలలు, 9,190 ఇతర సంస్థలు పాల్గొన్నాయి.
ప్రభుత్వం సర్వేలోని అంశాలు
- విదేశీయుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువమంది భారత్‌కు వస్తున్నారు. అత్యధికులు బీటెక్, ఆ తర్వాత బీబీఏ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 164 దేశాలకు చెందిన 47,427 మంది చదువుకుంటున్నారు. వీరిలో అత్యధిక శాతం కర్ణాటకలో చదివేందుకు ఇష్ట పడుతున్నారు.
- విదేశీ విద్యార్థుల్లో 73.4 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 16.15 శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్నారు.
- బీటెక్ చదువుతున్న 8,861 మందిలో 85 శాతం మంది అబ్బాయిలే. ఆ తర్వాత బీబీఏ (3, 354), బీఎస్‌సీ(3,320), బీఏ(2,26)తోపాటు బీఫార్మా, బీసీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ఉన్నాయి.
నేపాల్ | 26.88 |
అఫ్గానిస్తాన్ | 9.8 |
బంగ్లాదేశ్ | 4.38 |
సూడాన్ | 4.02 |
భూటాన్ | 3.82 |
నైజీరియా | 3.4 |
అమెరికా | 3.2 |
యెమెన్ | 3.2 |
శ్రీలంక | 2.64 |
ఇరాన్ | 2.38 |
కర్ణాటక | 10,023 |
మహారాష్ట్ర | 5,003 |
పంజాబ్ | 4,533 |
ఉత్తరప్రదేశ్ | 4,514 |
తమిళనాడు | 4,101 |
హరియాణా | 2,872 |
ఢిల్లీ | 2,141 |
గుజరాత్ | 2,068 |
తెలంగాణ | 2,020 |
ఫోర్బ్స్ జాబితాలో 17 భారత కంపెనీలు
ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ సెప్టెంబర్ 24న విడుదల చేసిన ప్రపంచ ఉత్తమ కంపెనీలు-2019(వరల్డ్ బెస్ట్ రిగార్డెడ్ కంపెనీస్) జాబితాలో 17 భారత కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా... ఇందులో అత్యధిక స్థానాలను అమెరికా(59) కైవసం చేసుకుంది. దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తాజా జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. మరోవైపు టాటా గ్రూప్‌కి చెందిన మూడు కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాందించాయి. విశ్వాసం, సామాజిక ప్రవర్తన, ఉత్పత్తి, సర్వీసుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోనికి స్టాటిస్టా భాగస్వామ్యంతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.
ఫోర్బ్స్ ఉత్తమ కంపెనీలు-2019 జాబితా
ర్యాంకు | కంపెనీ | దేశం |
1 | వీసా | అమెరికా |
2 | ఫెరారీ | ఇటలీ |
3 | ఇన్ఫోసిస్ | భారత్ |
4 | నెట్‌ప్లిక్స్ | అమెరికా |
5 | పేపాల్ | అమెరికా |
6 | మైక్రోసాఫ్ట్ | అమెరికా |
7 | వాల్ట్‌డిస్నీ | అమెరికా |
8 | టయోటా మోటార్ | జపాన్ |
9 | మాస్టర్‌కార్డ్ | అమెరికా |
10 | కాస్ట్‌కో హోల్‌సేల్ | అమెరికా |
22 | టీసీఎస్ | భారత్ |
31 | టాటా మోటార్స్ | భారత్ |
105 | టాటా స్టీల్ | భారత్ |
115 | ఎల్ అండ్ టీ | భారత్ |
117 | మహీంద్రా అండ్ మహీంద్రా | భారత్ |
135 | హెచ్‌డీఎఫ్‌సీ | భారత్ |
143 | బజాజ్ ఫిన్‌సర్వ్ | భారత్ |
149 | పిరమల్ ఎంటర్‌ప్రెజైస్ | భారత్ |
153 | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా | భారత్ |
155 | హెచ్‌సీఎల్ టెక్ | భారత్ |
157 | హిందాల్కో | భారత్ |
168 | విప్రో | భారత్ |
204 | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ | భారత్ |
217 | సన్ ఫార్మా | భారత్ |
224 | జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ | భారత్ |
231 | ఐటీసీ | భారత్ |
248 | ఏషియన్ పెయింట్స్ | భారత్ |
బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరంలో మోదీ
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న జరిగిన బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామమని పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లూంబర్గ్ బిజినెస్ ఫోరం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రారంభం
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ అందించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ ప్రారంభమైంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో సెప్టెంబర్ 12న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్‌ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలను కూడా మోదీ ప్రారంభించారు. ఈ రెండింటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.
ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాంచీలోని ధృవలో ఉన్న ప్రభాత్ తారా మైదాన్ నుంచి మోదీ ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు జార్ఖండ్ నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
ఎందుకు : 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ అందించేందుకు
2 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలు
సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింప చేసేందుకు రూ.2వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రక్షణశాఖ సెప్టెంబర్ 13న ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో సమావేశమైన రక్షణ కొనుగోళ్ల కమిటీ (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టి-72, టి-90 ట్యాంకులకోసం దేశీయ మందుగుండు సామగ్రి అభివృద్ధికి, సరిహద్దుల్లో మందు పాతరలను అమర్చేందుకు డీఆర్‌డీవో రూపొందించిన ‘మెకానికల్ మైన్ లేయర్’ను కొనుగోలుకు అనుమతి లభించింది.
దేశవ్యాప్తంగా1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సెప్టెంబర్ 15న తెలిపింది. ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని వెల్లడించింది. వీటిలో 389 కోర్టులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయని తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ. 767.25 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం
హైదరాబాద్-కర్ణాటక పేరు మార్పు
కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి కల్యాణ కర్ణాటకగా నామకరణం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. హైదరాబాద్- కర్ణాటక విమోచన దినం సందర్భంగా సెప్టెంబర్ 17న కలబురిగిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బీదర్, బళ్లారి, కలబురిగి, రాయచూర్, యాద్గిర్, కొప్పల్ జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని, వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కల్యాణ కర్ణాటకగా హైదరాబాద్-కర్ణాటక పేరు మార్పు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
నమామి దేవి నర్మదే మహోత్సవ్‌లో మోదీ
69వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా(138.68 మీటర్లు) నిండిన సందర్భంగా కేవాడియాలో చేపట్టిన ‘నమామి దేవి నర్మదే మహోత్సవ్’లో ఆయన పాల్గొన్నారు. 2017లో డ్యామ్ ఎత్తు పెంచాక పూర్తిగా నిండటం ఇదే తొలిసారి. అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్‌ను, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పటేల్ విగ్రహాన్ని, బటర్‌ఫ్లై పార్కును సందర్శించిన మోదీ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. కాషాయ రంగులో ఉండే ‘టైగర్ బటర్‌ఫ్లై’ని గుజరాత్ రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమామి దేవి నర్మదే మహోత్సవ్
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కేవాడియా, గుజరాత్
ఎందుకు : నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా నిండిన సందర్భంగా
సరిహద్దుల చరిత్రకు రాజ్‌నాథ్ ఆమోదం
దేశ సరిహద్దుల చరిత్రను లిఖితరూపంలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారని సెప్టెంబర్ 18న రక్షణ శాఖ వెల్లడించింది. భారత చారిత్రక పరిశోధన మండలి, జనరల్ ఆఫ్ ఆర్కైవ్‌స డెరైక్టరేట్ జనరల్, దేశ, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులతో సమావేశమై రాజ్‌నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. రెండేళ్లలోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చరిత్రను అధ్యయనం చేయడం, సరిహద్దుల మార్పులు, భద్రతా బలగాల ప్రాముఖ్యత, ఆ ప్రాంత ప్రజల సామాజిక-ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ సరిహద్దుల చరిత్ర ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : దేశ సరిహద్దుల చరిత్రను లిఖితరూపంలోకి తెచ్చేందుకు
ఇ-సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
ఇ-సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, పంపిణీ, నిల్వ, అమ్మకాలు, సిగరెట్ల వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇ-సిగరెట్ల నిషేధంపై పలు వివరాలు వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం..
- ఇ-సిగరెట్లపై నిషేధంతో ఖజానాకు రూ.2,028 కోట్ల నష్టం వాటిల్లే వీలుంది.
- ఎవరి దగ్గరైనా ఇ-సిగరెట్లు ఉంటే వారికి (తొలిసారి) రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ నేరం చేస్తే రూ.5లక్షల జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.
- ఇ-సిగరెట్లను నిల్వ చేయడం నేరమే. వీరికి రూ.50 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వరకు విధిస్తారు.
- నవంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చట్టం తీసుకురానున్నారు.
- అమెరికాలో ఇ-సిగరెట్లు యువతను ఎంతగా బలి తీసుకుంటున్నాయో గ్రహించాక ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకొని నిషేధం విధించాం.
- భారత్‌లో 460 ఇ-సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఇవేవీ భారత్‌లో తయారవడం లేదు.
- 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ-సిగరెట్ ఒక్క కేట్రిడ్‌జలో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది.
- భారత్‌లో ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇ-సిగరెట్లపై నిషేధం విధించారు.
- అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఇ-సిగరెట్లపై నిషేధం విధించాయి.
- 2011-16 సంవత్సరాల మధ్య వీటి వాడకంలో 900 శాతం వృద్ధి నెలకొంది.
- పొగాకు వల్ల వచ్చే వ్యాధులతో భారత్‌లో ప్రతీ ఏడాది 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు.
- ప్రపంచంలో చైనా తర్వాత పొగ తాగే వారు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. మొత్తంగా 10.6 కోట్ల మంది పొగాకు బానిసలుగా మారారు.
దేశమంతా ఎన్నార్సీ అమలు : అమిత్ షా
జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని దేశమంతా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెళ్లగొడతామన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో సెప్టెంబర్ 18న జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో 19 లక్షల మందిని విదేశీయులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని దేశమంతా అమలుచేస్తాం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
ఫోర్బ్స్ జాబితాలో ఐఎస్‌బీకి ఏడోస్థానం
ఫోర్బ్స్ మేగజైన్ సెప్టెంబర్ 18న ప్రకటించిన ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్స్-100 ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి ఏడో స్థానం లభించింది. ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా ఐఎస్‌బీ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ ర్యాంకుల్లో ఐఎస్‌బీకి చోటు లభించడం 2019 ఏడాదే తొలిసారి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా అత్యుత్తమ బి స్కూళ్ల ర్యాంకులను ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన వారికి లభిస్తున్న పారితోషికం, కెరీర్ ఎంపికలు తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూల్స్-100 ర్యాంకుల్లో ఏడో స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎక్కడ : ప్రపంచంలో
హెచ్‌సీయూకు ఎమినెన్స్ హోదా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 5న ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2019, ఆగస్టులో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఐవోఈ హోదా లభించడంతో హెచ్‌సీయూకు వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయి్య కోట్లు నిధులు అందనున్నాయి.
దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చింది. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయి్య కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకై తే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌సీయూకు ఎమినెన్స్ హోదా
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎందుకు : ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంతో
ఇథనాల్ ధర లీటరుకు రూ.1.84 పెంపు
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ సెప్టెంబర్ 3న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు కొత్త రేట్ల ప్రకారం కొనుగోళ్లు జరుపుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
సీసీఈఏ సి గ్రేడు మొలాసిస్ నుంచి నుంచి తీసిన ఇథనాల్ ధర లీటరుకు 29 పైసలు పెంచడంతో కొత్త ధర రూ. 43.75గా ఉండనుంది. ఇక ’బి గ్రేడు మొలాసిస్’ నుంచి తీసే ఇథనాల్ రేటు రూ. 1.84 పెరిగి లీటరు ధర రూ. 54.27కి చేరుతుంది. 2018-19లో 226 మిలియన్ టన్నుల చమురు దిగుమతులపై భారత్ 112 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇథనాల్ ధర లీటరుకు రూ.1.84 పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా
సౌదీ, యూఏఈ పర్యటనకు పెట్రోలియం మంత్రి
పెట్రోలియం ఎగుమతిదేశాల సంఘం (ఒపెక్)లో కీలక పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), కతర్ దేశాల్లో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్నారు. చమురు ప్రధాన ఉత్పాదక దేశాలతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకూ మంత్రి ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 10వ తేదీన అబూధబీలో ఇంధనంపై జరిగే 8వ ఆసియన్ మంత్రిత్వస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ సమావేశానికి యూఏఈతో కలిసి భారత్ కూడా ఆతిథ్య దేశంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ, యూఏఈ పర్యటనకు పెట్రోలియం మంత్రి
ఎప్పుడు : సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకూ
ఎవరు : ధర్మేంద్ర ప్రధాన్
ఎందుకు : చమురు ప్రధాన ఉత్పాదక దేశాలతో సహకారాన్ని మరింత పెంపొందించుకోనేందుకు
రిపబ్లికన్ ఎథిక్-2 పుస్తకావిష్కరణ
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్ ఎథిక్-2’, ‘లోక్‌తంత్ర కే స్వర్’ ఖండ్-2 పుస్తకాలను ఆవిష్కరించారు న్యూఢిల్లీ సెప్టెంబర్ 6న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రిపబ్లికన్ ఎథిక్-2’, ‘లోక్‌తంత్ర కే స్వర్’ ఖండ్-2 పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ముంబైలో మూడు మెట్రోలైన్ పనులు ప్రారంభం
ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 7న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు.
మరోవైపు ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడు మెట్రోలైన్ పనులు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
కోయంబత్తూరులో కేన్సర్ చికిత్సా విభాగం
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న శ్రీ రామకృష్ణ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన చిన్నారుల కేన్సర్ చికిత్సా విభాగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే సెప్టెంబర్ 8న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు సహా దేశంలో 75 ప్రాంతాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. త్వరలో గోమూత్రాన్ని ఔషధంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారుల కేన్సర్ చికిత్సా విభాగం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే
ఎక్కడ : శ్రీ రామకృష్ణ ఆస్పత్రి, కోయంబత్తూరు, తమిళనాడు
ఎన్‌ఈసీ 68వ ప్లీనరీలో హోంమంత్రి అమిత్ షా
అస్సాంలోని గువాహటిలో సెప్టెంబర్ 8న జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని తెలిపారు. ఎన్‌ఆర్‌సీని ప్రస్తావిస్తూ.. అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : గువాహటి, అస్సాం
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5-7 ఏళ్లలో రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్‌వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు
జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని మధురలో సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పశుపోషణ లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనుగడ సాధించడం సాధ్యమా? అని మోదీ ప్రశ్నించారు. ఉగ్రమూకలకు పాకిస్తాన్‌లో అన్నిరకాలుగా అండదండలు అందజేస్తున్నారనీ, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. దేశభద్రత విషయంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
12 వేలకోట్లతో వాక్సినేషన్
దేశంలోని 50 కోట్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, పందులకు గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండీ) సోకకుండా రూ.12,652 కోట్లతో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం ఓ మహిళా బృందంతో కలిసి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేశారు. 2025 నాటికి జంతు సంబంధిత వ్యాధులను నియంత్రించాలనీ, 2030 నాటికి పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మధుర, ఉత్తరప్రదేశ్
సీబీడీటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రమోద్ చంద్ర పదవీకాలం 2019, ఆగస్టు 31తో ముగియనుండగా.. మరో ఏడాది పాటు ఆయనను కొనసాగించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీడీటీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్రప్రభుత్వం
కిసాన్-జవాన్ సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్
జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో ఆగస్టు 29న డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఏడుపు ఆపాలని పాకిస్తాన్‌కు సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్‌లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళా సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : లేహ్, జమ్మూకశ్మీర్
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం
ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ను మొదలు పెట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిట్‌నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేదన్నారు.
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగాస
ప్రధాని మోదీతో ఏడీబీ ప్రెసిడెంట్ భేటీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రెసిడెంట్ టకెహికో నకావో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 29న ఈ సమావేశం సందర్భంగా భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది.
ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నకావో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందన్నారు. కేంద్రానికి ఆర్‌బీఐ నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చన్నారు. నాలుగురోజుల నకయో భారత్ పర్యటన ఆగస్టు 30తో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020-21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రెసిడెంట్ టకెహికో నకావో
ఎక్కడ : న్యూఢిల్లీ
మూకదాడులపై బిల్లుకు బెంగాల్ ఆమోదం
మూకదాడులు, హత్యలు, నేరపూరిత సంఘటనలు నియంత్రించే ‘ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్-2019’ బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. మూకదాడులు నియంత్రించి సామన్యులకు రక్షణ కల్పించడం, అటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు తీసుకొచ్చారు. మూకదాడులకు పాల్పడే వారిపై 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా బిల్లులో పొందుపరిచారు. మూకదాడులు సామాజిక దుశ్చర్యలను ప్రేరేపిస్తున్నాయని, కలిసికట్టుగా వీటికి వ్యతిరేకంగా పోరాడాలని బిల్లుపై చర్చలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్-2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ
ఎందుకు : మూకదాడులు, హత్యలు, నేరపూరిత సంఘటనలు నియంత్రించేందుకు
అస్సాంలో ‘ఎన్‌ఆర్‌సీ’ తుదిజాబితా విడుదల
గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుది జాబితా ఆగస్టు 31న విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కార్యాలయం ఆగస్టు 31న ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
ఎన్నార్సీ పూర్వాపరాలివీ..
- 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) తయారైంది.
- 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు.
- 1951 -1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
- 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు.
- 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు.
- 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు
- 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు.
- 1985: భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం.
- 1997: అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం.
- 2003: పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు.
- 2005-1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్‌ఆర్‌సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం.
- 2010: బార్‌పేటలోని ఛాయాగావ్‌లో ఎన్‌ఆర్‌సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత.
- 2016: ఎన్‌ఆర్‌సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు
- 2017: డిసెంబరు 31న ఎన్‌ఆర్‌సీ తొలి ముసాయిదా జాబితా విడుదల
- 2019 జూలై 31న ఎన్‌ఆర్‌సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు
- 2019 ఆగస్టు 31. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు.
ఏమిటి: ఎన్‌ఆర్‌సీ తుదిజాబితా విడుదల
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎందుకు: అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు
ఎక్కడ: అస్సాం
ఆర్మీలో 575 మంది కశ్మీర్ యువకులు
జమ్మూ కశ్మీర్ చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. వారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 31న స్థానిక బానా సింగ్ మైదానంలో పరేడ్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే తపన కశ్మీర్ యువకుల్లో కనపడిందని ఆయన తెలిపారు. తమ కుమారులు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్ ఆర్మీలోకి 575 మంది కశ్మీర్ యువకులు
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎవరు: కశ్మీర్ యువకులు
ఎక్కడ: జమ్మూ& కశ్మీర్
ఎన్నారైలకూ ఆధార్
న్యూఢిల్లీ: మూడు నెలల్లో భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఆరునెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సాంకేతిక మార్పులు ఇప్పటికే చేపట్టామని.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్ కార్డు జారీ కోసం టైమ్‌స్లాట్‌లు బుక్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. అయితే ఎన్నారైలకు ఆధార్ కార్డు జారీపై ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. యూఐడీఏఐ దేశంలో మరిన్ని ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆధార్ నమోదు, జారీ, మార్పులు చేర్పుల వంటి అన్ని సౌకర్యాలకూ ఈ కేంద్రాలు కేంద్రంగా మారనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ
ఎవరు: ఎన్నారైలకూ
ఎందుకు: దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఆధార్ కార్డు
ఎక్కడ: ఇండియా
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(58)ను కేంద్రం నియమించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమాకం
ఎప్పుడు: సెప్టెంబర్1, 2019
ఆక్వా ఆక్వేరియా ఇండియా ప్రారంభం
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 30న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా ఇండియా-2019 ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉందని, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నంబర్ వన్‌కు చేరాలని అన్నారు. ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపీఈడీఏ లాంటి సంస్థలు, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు కృషి చేయాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్వాఆక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైటెక్స్, హైదరాబాద్
మలయాళ మనోరమ సదస్సులో మోదీ
కేరళలోని కోచీలో ఆగస్టు 30న నిర్వహించిన మలయాళ మనోరమ సదస్సును ఉద్దేశించి న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నిర్మాణాత్మక విమర్శలను తానెప్పుడూ స్వాగతిస్తానని, ప్రజా జీవితంలో భిన్నాప్రాయాలకు తావుండాలని, అందరూ తమ తమ భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా... సమాజంలో అంశాలపై చర్చ నిరంతరం సాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.
పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం
హరియాణాలో ఏర్పాటైన పది ఆయుష్ కేంద్రాలను ఆగస్టు 30న న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే ఆయుర్వేద, సిద్ధ తదితర భారతీయ వైద్యవిధానాలకు విశేష సేవలందించిన 12 మంది వ్యక్తుల పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. వీరిలో గాంధీజీ వ్యక్తిగత వైద్యుడు దిన్‌షా మెహతా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆయుష్ కార్యక్రమంలోకి తాజాగా సోవా రిగ్‌పా అనే బౌద్ధ వైద్యవిధానాన్ని చేరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రాచీన, ఆధునిక వైద్యవిధానాల మేళవింపుతోనే దేశ ఆరోగ్య రంగం మెరుగుపడగలదని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణా
ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ ప్రారంభం
కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్- 2019 సదస్సు సెప్టెంబర్ 4న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్‌ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పాల్గొన్నారు.
సదస్సు సందర్భంగా ఐటీసీ-2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్- 2019 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : బెంగళూరు, కర్ణాటక
భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అపాచీ ఎహెచ్-64ఇ యుద్ధ హెలికాప్టర్లు భారత్ అమ్ముల పొదిలో చేరాయి. మొత్తం ఎనిమిది హెలికాప్టర్లను పఠాన్ కోట వైమానిక దళానికి అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ సెప్టెంబర్ 3న అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ హెలికాప్టర్లకు పూజలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థలతో 2015లో 22 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. 2019, జూలైలో నాలుగు హెలికాప్టర్లు అప్పగించారు. ఆఖరి విడత మార్చి 2020 నాటికల్లా బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. కాలం చెల్లిన ఎంఐ-35 హెలికాప్టర్ల స్థానంలో అపాచీ కొనుగోలు చేశారు.
అపాచీ హెలికాప్టర్ల ప్రత్యేకతలు
- గంటకి 284 కి.మీ. వేగంతో దూసుకెళ్లేందుకు సాయపడే రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్లు
- ఎత్తు : 15.24 అడుగులు
- బరువు : 6,838 కేజీలు
- రెండు రెక్కలను కలుపుతూ కొనల మధ్య దూరం: 17.15 అడుగులు
- ఒకేసారి 8 క్షిపణుల్ని ప్రయోగించే సత్తా
- నిట్టనిలువుగా ఎగిరే సామర్థ్యం : నిముషానికి 2 వేల అడుగులు కంటే ఎక్కువ
- ఒక్కో నిమిషానికి గరిష్టంగా ఎగరగల ఎత్తు : 2,800 అడుగుల కంటే ఎక్కువ
- అన్నిరకాల ప్రతికూల వాతావరణాల్లోనూ రేయింబగళ్లు ప్రయాణించే ఆధునిక సాంకేతికత
- లక్ష్యాలను ఛేదించడానికి లేజర్, ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థ
- 35 ఎంఎం ఫిరంగులు ఒకేసారి 1200 రౌండ్లు కాల్చే సామర్థ్యం
- యుద్ధభూముల్ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపే సదుపాయం