PM Rojgar Mela : 75,000 మందికి నియామక పత్రాలు
దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయన్నారు.
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘‘అంతర్జాతీయంగా పరిస్థితి బాగాలేదు. పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. కరోనా వంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. కరోనా వంటి సమస్యల నుంచి దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా..
డ్రోన్ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఉచితాలు పోవాలి: మోదీ
దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఉచితాలకు అడ్డుకట్ట పడాలని ఎంతోమంది కోరుకుంటున్నారని తెలిపారు. పీఎంఏవై కింద ఎనిమిదేళ్లలో 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామన్నారు. ఆ ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని పిలుపునిచ్చారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP