Skip to main content

జనవరి 2020 జాతీయం

నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు
Current Affairs
వివిధ వర్గాలకు ప్రభుత్వ డేటాను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం(ఎన్‌డీఏపీ) ఏర్పాటు చేయనున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి సేకరించిన గణాంకాలు ఇందులో ఉంటాయన్నారు. ఎన్‌డీఏపీ సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు.
శత్రు ఆస్తుల అమ్మకం కోసం మంత్రుల బృందం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ‘శత్రు ఆస్తుల’ అమ్మకాన్ని పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9,400 శత్రు ఆస్తులున్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. లక్ష కోట్లు వస్తాయని అంచనా. దేశ విభజన అనంతరం పాక్, చైనాలకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారు భారత్‌లో వదిలి వెళ్లిన స్థిరాస్తులనే శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
ఎందుకు : వివిధ వర్గాలకు ప్రభుత్వ డేటాను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు

అవినీతి సూచీలో భారత్‌కు 80వ స్థానం
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ‘అవినీతి సూచీ 2019(కరప్షన్ పెర్‌సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్‌కు 80వ స్థానం లభించింది. అవినీతిని అదుపుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 180 దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కోసం చెల్లిస్తున్న ముడుపుల వివరాలను ఈ నివేదికను రూపొందించారు. అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ తొలి స్థానంలో... ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్లర్లాండ్ వంటివి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకోలు 80వ స్థానంలో ఉన్నాయి.
పోటీతత్వ సూచీలో 72వ స్థానం
ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీ-2019లో భారత్ ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని 72వ స్థానంలో నిలిచింది. ప్రతిభను పెంచడం, ఆకర్షించడం, కాపాడుకోవడంలో ఆయా దేశాల సామర్థ్యాలను బేరీజు వేసి ఈ సూచీలో ర్యాంకులు కేటాయిస్తారు. 132 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్‌లు 2, 3 స్థానాలు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అవినీతి సూచీలో భారత్‌కు 80వ స్థానం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో

ఎస్‌బీఐతో ఐఎస్‌బీ అవగాహన ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), భారతీయ స్టేట్ బ్యాంకుతో (ఎస్‌బీఐ) ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. విద్యా పరిశోధన, ప్రచురణ, సామర్థ్య కల్పన కార్యక్రమాల్లో ఇరు సంస్థలు సహకారం అందించుకోవడమే ఈ ఒప్పందం ఉద్దేశ్యమని ఐఎస్‌బీ పేర్కొంది. క్షేత్రస్థాయిలో ఎస్‌బీఐకి ఉన్న విశేష అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, దానికి తమ అకడమిక్ నైపుణ్యాన్ని జోడించి పరిశోధనలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఐఎస్‌బీ డీన్ డాక్టర్ రాజేంద్ర శ్రీవాస్తవ వివరించారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ విప్లవాన్ని ఎస్‌బీఐ అందిపుచ్చుకున్న తీరును పరిశోధనాంశంగా చేపడతామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారతీయ స్టేట్ బ్యాంకుతో (ఎస్‌బీఐ) అవగాహన ఒప్పందం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు : విద్యా పరిశోధన, ప్రచురణ, సామర్థ్య కల్పన కార్యక్రమాల్లో పరిశోధనలు చేపట్టేందుకు

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 26 నూతన భారతీయ పదాలు
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు తాజా ముద్రణలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలు స్థానం సంపాదించాయి. వీటిలో తరుచూ వాడుకలో ఉండే ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ మొదలగు పదాలు ఉన్నాయి. జనవరి 24న విడుదలైన తాజా(10వ) ఎడిషన్‌లో భారతీయ పదాలు సహా ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ లాంటి 1,000కి పైగా కొత్త పదాలను చేర్చినట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్ తెలిపింది. 26 కొత్త భారతీయ పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్‌లో ఉన్నాయని వివరించింది. తాజా ఎడిషన్‌లో వినియోగదారుల సహయార్థం వెబ్‌సైట్, యాప్ లాంటి ఆన్‌లైన్ సేవలనూ కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు 10వ ఎడిషన్ విడుదల
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్

ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు
పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 24న ప్రకటించింది. పరిపాలనదక్షులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తలుగా తమదైన ముద్రవేసిన ప్రముఖ మహిళల పేరిట ఈ పీఠాలు ఏర్పాటవుతాయని తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సాయంతో వీటిని నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఈ విద్యాపీఠాల్లో ఆయా రంగాల్లో పరిశోధనలు చేపట్టనున్నారు. తొలుత ఐదేళ్ల కాలవ్యవధికి మాత్రమే వీటిని నెలకొల్పుతారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మహాదేవి వర్మ, రాణి గైదిన్‌లియు తదితరుల పేరిట ఈ విద్యాపీఠాలు ఏర్పాటుకానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 మంది ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో
ఎందుకు : వివిధ రంగాల్లో పరిశోధనలు చేపట్టేందుకు

ఢిల్లీలో ఐటీఏటీ వ్యవస్థాపక దినోత్సవం
దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 24న ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే హాజరై మాట్లాడారు. పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని జస్టిస్ బాబ్డే అన్నారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. ఐటీఏటీను 1941, జనవరి 25న స్థాపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవ ం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
ఎక్కడ : న్యూఢిల్లీ

భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథిగా బోల్సనోరా..
భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
యుద్ధస్మారక వద్ద ప్రధాని నివాళులు
వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. గతేడాది వరకు ఈ కార్యక్రమాన్ని ఇండియా గేట్ వద్ద ఉన్న ‘అమర్ జవాన్ జ్యోతి’ వద్ద నిర్వహించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019, ఏడాది ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ప్రారంభించారు.
22 శకటాల ప్రదర్శన
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన జరిగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. ఆంధ్రప్రదేశ్ తిరుమల బ్రహ్మోత్సవ శకటం, తెలంగాణ బతుకమ్మ శకటం ఆహూతులను ఆకట్టుకున్నాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది.
తొలి ఘటనలు
  • రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్‌ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. - సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్‌స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది.
  • డీఆర్‌డీఒ 2019 ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్‌లో తొలిసారిగా ప్రదర్శించారు.
  • ధనుష్ శతఘు్నలను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్‌లో ప్రదర్శించారు.
  • కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్‌లో ప్రదర్శించాయి.
గూగుల్ స్పెషల్ డూడుల్
భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ డూడుల్‌ను సింగపూర్‌కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపొందించారు. ఇందులో దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాలు, తాజ్‌మహల్, ఇండియా గేట్, వంటివి ఉన్నాయి. అలాగే భారత శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి, దేశంలోని వస్త్ర పరిశ్రమనూ చిత్రంలో చేర్చారు.

స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు ముగింపు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ‘ప్రజల కోసం.. నగరాల నిర్మాణం’ అనే థీమ్‌తో సాగిన ఈ సదస్సు జనవరి 25న ముగిసింది. ఈ సదస్సుకు 100 నగరాల నుంచి 25 మంది ప్రముఖులు, 192 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల స్థితిగతులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.
విశాఖకు ఇన్నోవేషన్ ఐడియా అవార్డు
స్మార్ట్ సిటీస్ మూడో శిఖరాగ్ర సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ విభాగాల్లో ముందుకు దూసుకుపోతున్న స్మార్ట్ నగరాలకు పలు అవార్డులు ప్రకటించింది. 4 విభాగాల్లో 18 అవార్డులకు నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 3 అవార్డులు లభించగా.. ఇందులో 2 అవార్డులను విశాఖపట్నం, ఒక అవార్డును అమరావతి సొంతం చేసుకున్నాయి. ఇన్నోవేషన్ ఐడియా అవార్డుతో పాటు పెర్ఫార్మెన్స్ రికగ్నైజేషన్ విభాగంలో టైర్-1 సిటీస్‌లో విశాఖపట్నం అవార్డు సొంతం చేసుకోగా, టైర్-3 విభాగంలో అమరావతి అవార్డు దక్కించుకుంది. గవర్నెన్స్ థీమ్‌లో వడోదర, బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ థీమ్‌లో ఇండోర్ నగరాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి.

సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ జనవరి 27న ఆమోదించింది. రాజ్యాంగానికి, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే తీర్మానాలను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ

బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించే ‘త్రైపాక్షిక ఒప్పందం’పై కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు జనవరి 27న సంతకాలు చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, బోడో సంఘాల నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం చాలాకాలం నుంచి బోడో ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది చేయకపోయినా, ఇతర అంశాలతో తాజా ఒప్పందం ఖరారైంది.
ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది. వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుంది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాండ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
త్రైపాక్షిక ఒప్పందం-ప్రధానాంశాలు
  • ఆయుధాలు విడిచిపెట్టే ఎన్‌డీఎఫ్‌బీ ఉద్యమకర్తలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తాయి.
  • వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేస్తాయి.
  • బోడోల్యాండ్‌ను ఇకపై బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి(బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్-బీటీసీ)గా పిలుస్తారు.
  • రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని, బరామాలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతారు.
  • ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వాటిలో అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ), యునెటైడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి.
27 ఏళ్లలో మూడోసారి..
ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి.
తొలి ఒప్పందం: పరిమిత రాజకీయాధికారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది.
రెండో ఒప్పందం : రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది.
మూడో ఒప్పందం : బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కేంద్రప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించేందుకు

భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
అరుదైన ఆఫ్రికా చిరుతలను భారత్‌కు తీసుకొచ్చి.. అవి జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. భారత్‌లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో నమీబియా నుంచి చిరుతలు తీసుకుని వచ్చేందుకు, మనదేశంలోనే దానికి తగిన ఆవాసం కల్పించేందుకు అనుమతించాలంటూ జాతీయ పులుల సంరక్షణ సంస్థ(ఎన్టీసీఏ) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆఫ్రికా చిరుతలను తీసుకురావడంలో మార్గనిర్దేశం చేసేందుకు జనవరి 28న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చిరుతల ఆవాసానికి అనువైన ప్రదేశంపై కమిటీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : భారత్‌లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో

ఎన్‌సీసీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో జనవరి 28న జరిగిన ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. మూడు యుద్ధాల్లో ఓడిపోయినా పాక్ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందన్నారు.
పొరుగు దేశాల్లో మతపరమైన మైనారిటీలకు జరిగిన అన్యాయాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకువచ్చామని మోదీ అన్నారు. వారికి గతంలో భారత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు. 1950లో నాటి భారత, పాకిస్తాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పొటాటో కాంక్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగం
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గ్లోబల్ పొటాటో కాంక్లేవ్’ను ఉద్దేశించి జనవరి 28న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆలుగడ్డల ఉత్పత్తి, ఎగుమతికి గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఆలుగడ్డల ఉత్పత్తి 20 శాతం పెరగగా, గుజరాత్‌లో 170 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ‘సుజలాం, సుఫలాం’, ‘సౌని యోజన’ తదితర పథకాల వల్ల రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు సైతం నీటి పారుదల సౌకర్యం లభించిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

అబార్షన్‌కు 20 నుంచి 24 వారాల వరకు గడువు పెంపు
అబార్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జనవరి 29న జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనిని ఒక ప్రగతిశీల సంస్కరణగా కేంద్ర మంత్రి జవదేకర్ అభివర్ణించారు. అయితే ఇన్నాళ్లూ ఒక వైద్యుడు అంగీకరిస్తే అబార్షన్ చేసేవారని, కానీ 24 వారాలు వచ్చాక అబార్షన్ చేస్తే ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి తీరాలని జవదేకర్ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అబార్షన్‌కు 20 నుంచి 24 వారాల వరకు గడువు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎందుకు: అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తింపు.

మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు: ఏఐఎంపీఎల్‌బీ
న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు జనవరి 29న అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ అఫిడవిట్ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ‘ఇస్లాం గ్రంధాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది. ఈ విషయానికి సంబంధించి ఉన్న విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై మేం స్పందించదలచుకోలేదు’ అని ఏఐఎంపీఎల్‌బీ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.

సాంకేతికత వినియోగంలో... భారత్‌కు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
న్యూయార్క్: విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్.. దేశంలోని వివిధ జన సమూహాల మధ్య ఉన్న తారతమ్యాలను తగ్గించడంలో సమర్థంగా వ్యవహరించిందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రశంసించింది. దీనికోసం డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని ఐరాస చేసిన అధ్యయనంలో తేలింది. అంతరాలను తగ్గించేందుకు మొబైల్ టెక్నాలజీతో ఆధార్ గుర్తింపు వ్యవస్థను అనుసంధానం చేసి వినియోగించుకున్న విధానం భవిష్యత్తులో వేరే దేశాల్లో అమలు చేస్తే బాగుంటుందని అధ్యయనంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్‌ఈ) ‘ది వరల్డ్ సోషల్ నివేదిక-2020’ పేరిట నివేదికను విడుదల చేసింది. అన్ని రంగాల అభివృద్ధి కోసం డిజిటల్ సాంకేతికతను భారత్ ఎలా వినియోగించుకుందో ఈ నివేదికలో పేర్కొంది. మొబైల్ డిజిటల్ టెక్నాలజీని వేరే సాంకేతికతతో కలిపి ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చి అంతరాలను ఎలా తగ్గించాలో భారత్ అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఆధార్ సంఖ్య ఆధారంగా ప్రజలకు ఖాతాలు ఇవ్వాల్సిందిగా 2014లో భారత ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించిన విషయాన్ని నివేదికలో పొందుపరిచింది. దీంతో బ్యాంకు ఖాతాలు లేని వారి సంఖ్య సగానికి తగ్గిందని వెల్లడించింది. 2011లో దాదాపు 55.7 కోట్ల మందికి ఖాతాలు లేవని, అదే 2015లో 23.3 కోట్ల మందికి మాత్రమే ఇప్పుడు బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొంది. ‘2017 నాటికే 80 శాతం భారత్‌లోని పెద్దలు కనీసం ఒక్క బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సాంకేతికత వినియోగంలో... భారత్‌కు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
ఎక్కడ: న్యూయార్క్
ఎందుకు: డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని...

ఆ బెయిల్‌కి పరిమితి’ ఉండదు
న్యూఢిల్లీ: ఏ కేసులోనైనా నిందితులకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నిర్దిష్ట కాల వ్యవధి వంటి షరతులేవీ ఉండవని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులకు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం జనవరి 29వ తేదీన ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పొందిన నిందితుడు/నిందితురాలు కోర్టు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా, సదరు వ్యక్తిపై అభియోగాలు నమోదైనప్పటికీ సాధారణ పరిస్థితుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏ కేసులోనైనా నిందితులకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎందుకు: వ్యక్తిపై అభియోగాలు నమోదైనప్పటికీ సాధారణ పరిస్థితుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

రుతుపవనాల సూచన తేదీల మార్పు : ఐఎండీ
Current Affairs
మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. 2020 ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్‌సైన్స్ మంత్రిత్వ శాఖ జనవరి 16న వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికే వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది.
ప్రస్తుతం ఐఎండీ అనుసరిస్తున్న విధానంలో.. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ ఏటా జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 1940లలో ఈ తేదీలను ఖరారుచేశారు. ప్రస్తుత తీరుతెన్నులకు అనుగుణంగా దీన్ని మార్చనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రుతుపవనాల సూచన తేదీల మార్పు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఎర్త్‌సైన్స్ మంత్రిత్వ శాఖ
ఎక్కడ : దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో
ఎందుకు : మారుతున్న వర్షపాతం విధానం కారణంగా

అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో
సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. 2019, నవంబర్ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందాదారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్
ఎక్కడ : దేశంలో

కోజికోడ్-ఐఐఎంలో ఇండియన్ థాట్ సదస్సు
కేరళలోని కోజికోడ్-ఐఐఎంలో ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... విశ్వవ్యాప్తమైన హింస, ద్వేషం, ఉగ్రవాదం, ఘర్షణల నుంచి విముక్తి కోరుకునే ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఒక ఆశారేఖ అని అభివర్ణించారు. శాంతి, సామరస్యపూర్వక జీవన విధానం కారణంగానే భారతీయ నాగరికత వర్ధిల్లిందన్నారు. బల ప్రదర్శన ద్వారా కాకుండా, శాంతి చర్చల ద్వారానే ఘర్షణలను నిరోధించగలమన్నది భారతీయుల విధానమన్నారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్ పేరుతో సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కోజికోడ్-ఐఐఎం, కేరళ

క్రియాశీల నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం
ప్రపంచ క్రియాశీల(డైనమిక్) నగరాల జాబితాలో హైదరాబాద్ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్’ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020’లో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపి రూపొందించిన ఈ ఇండెక్స్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 18న హైదాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2019లో బెంగళూరుతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్న హైదరాబాద్, 2020లో బెంగళూరును రెండో స్థానంలోకి నెట్టి మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయమన్నారు.
సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020లో మొదటి 20 స్థానాల్లో భారత్‌కి చెందిన 7 నగరాలు చోటు సంపాదించాయి. వరుసగా 2, 5, 7, 12, 16, 20 స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, ముంబై నగరాలు నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రియాశీల నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : జేఎల్‌ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020
ఎక్కడ : ప్రపంచంలో

బిహార్‌లో 5 కోట్ల మంది మానవహారం
పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్‌లో 5.17 కోట్ల మంది కలసి జనవరి 19న భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ చైన్ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యనిషేధం, వరకట్నం-బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవహారం కంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం. 2017లో మొదటిసారి మొదలైన ఈ మానవ హారం అప్పట్లోనే గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో బంగ్లాదేశ్ రికార్డును అధిగమించిందని అధికారులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5.17 కోట్ల మంది మానవహారం
ఎప్పుడు : జనవరి 19
ఎక్కడ : బిహార్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం

తాల్కటోరా స్టేడియంలో పరీక్షా పే చర్చా
న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జనవరి 20న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ పేర్కొన్నారు. కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్ నుంచి మొదలుకొని, చంద్రయాన్ -2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరీక్షా పే చర్చా కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తాల్కటోరా స్టేడియం, న్యూఢిల్లీ
ఎందుకు : పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలిపేందుకు

తంజావూరులో సుఖోయ్30 యుద్ధ విమానాలు
హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది. టైగర్‌షార్క్ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలను తంజావూరు వైమానిక స్థావరంలో చేర్చింది. జనవరి 20న జరిగిన ప్రారంభ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా పాల్గొన్నారు.
ఈ సందర్భంగ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. భారత్-రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని ఐఏఎఫ్ పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను బ్రహ్మోస్ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు. సుఖోయ్ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : భారత వాయు సేన (ఐఏఎఫ్)
ఎక్కడ : తంజావూరు, తమిళనాడు
ఎందుకు : హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు

రాజకీయం-దనబలం సదస్సు ప్రారంభం
Current Affairs
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రాంగణంలో ‘రాజకీయాల్లో ధనబలం’(మనీ పవర్ ఇన్ పాలిటిక్స్)అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు జనవరి 9న ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజకీయాల్లో ధనబలం అంశంపై సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), హైదరాబాద్

ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ-బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
‘జమ్మూకశ్మీర్-ఇంటర్నెట్’ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం జనవరి 10న తీర్పు వెలువరించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఆర్టికల్ 19(1)
భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 2020, జనవరి 10న అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
దేశవ్యాప్తంగా ఆందోళనలు
పౌరసత్వ సవరణ బిల్లు-2019కు 2019, డిసెంబర్ 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టంలో ముస్లింల పట్ల వివక్ష ఉందని పేర్కొంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌కు 84వ స్థానం
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ జనవరి 7న విడుదల చేసిన ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్(హెచ్‌పీఐ)-2020’లో భారత పాస్‌పోర్టుకు 84వ స్థానం లభించింది. భారత్ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. భారత పాస్‌పోర్ట్‌తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది.
హెచ్‌పీఐ-2020లో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. ఈ జాబితాలో సింగపూర్ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్, ఇటలీ (188), డెన్మార్క్, లగ్జెంబర్గ్, స్పెయిన్ (187) టాప్-5లో నిలిచాయి. అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టు చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక అమెరికా, బ్రిటన్ ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌కు 84వ స్థానం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో

వాయుసేనకు 200 జెట్ విమానాలు
భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ జనవరి 12న వెల్లడించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసే 83 ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్‌సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాయుసేనకు 200 జెట్ విమానాలు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్

బేళూరు మఠంలో యువజన దినోత్సవం
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ యువజన దినోత్సవం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బేళూరు మఠం, రామకృష్ణ మిషన్, కోల్‌కతా

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్పు
కోల్‌కతా పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న జనవరి 12న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కోల్‌కతా పోర్టు ట్రస్ట్ పేరుని జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
కరెన్సీ బిల్డింగ్ ప్రారంభం
కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌తో పాటు బెల్వెడెరె హౌస్, మెట్‌కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 11 ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని అన్నారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోల్‌కతా పోర్టు ట్రస్టుకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు పేరు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష
కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వేర్వేరు మతాల్లో, ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు 2020, జనవరి 17న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం నలుగురు సీనియర్ న్యాయవాదులను జనవరి 13న ఆదేశించింది. ఇదే సమయంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
‘‘శబరిమల కేసులో తీర్పును సమీక్షించబోవడం లేదు. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తావించిన అంశాలను పరిగణిస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది. మతపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం ఎంతవరకూ ఉండాలన్న దానిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిపై మాత్రమే తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థన స్థలాల్లో మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పరిశీలనకు ఇవి..: మసీదుల్లో మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా తెగల్లో మహిళల జననాంగాల విచ్చిత్తి, పార్శీ మహిళను పెళ్లాడిన పార్శీయేతర పురుషులకు వారి ప్రార్థన స్థలంలో ప్రవేశంపై నిషేధం వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లను వేరుగా విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీలతో కూడిన నలుగురు సీనియర్ న్యాయవాదులు సమావేశమై ఏయే అంశాలపై తాము విచారణ జరపాలో సూచించాలని ఆదేశాలు జారీ చేసింది.

డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై విమానయాన శాఖ ఆదేశాలు
దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020, జనవరి 31లోగా స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ జనవరి 13న తెలిపింది. నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్‌లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై ఆదేశాలు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర విమానయాన శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా

ప్రభుత్వ సంస్థల్లో ఇక నుంచి యోగా బ్రేక్ ...
వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై-బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికై న వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై-బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను జనవరి 13న ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై-బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై-బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్‌లెట్ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై-బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది.
ఎక్కడ: ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో
ఎందుకు: పని ఒత్తిడిని తగ్గించడానికి

రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
Current Affairs భారత రైల్వేలో ఇకపై ఒకటే హెల్ప్‌లైన్ నంబర్ ఉండనుంది. ఈ మేరకు అన్ని సేవలకు 139 నంబర్ హెల్ప్‌లైన్‌గా పనిచేస్తుందని రైల్వేశాఖ జనవరి 2న ఓ ప్రకటనలో తెలిపింది. 182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది. ఇది 12 భాషల్లో ఐవీఆర్‌ఎస్ పద్ధతి ద్వారా సేవలందించనుంది. ఇక 182 నంబర్ రైల్వే భద్రత కోసం పనిచేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రైల్వేశాఖ
ఎందుకు : 182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది

అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పుతో పాటు దాని సంబంధిత వ్యవహారాలను ఈ విభాగమే చూసుకోనుందని కేంద్ర హోంశాఖ జనవరి 2న వెల్లడించింది. అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో ఈ విభాగం పనిచేయనుందని తెలిపింది. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం హోంశాఖలోని కశ్మీర్, లదాఖ్ వ్యవహారాల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు

డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్ ప్రారంభం
ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఏర్పాటు చేసిన ‘డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్(డీవైఎస్‌ఎల్)’ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. బెంగళూరులో జనవరి 2న జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘మీ సామర్ధ్యం అనంతం. మీరెన్నో చేయగలరు. పరిధిని విసృ్తతం చేసుకోండి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి’ అని చెప్పారు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ డీవైఎస్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు.
సిద్దగంగమఠ్ సందర్శన
కర్ణాటకలోని తుమకూరులో ఉన్న సిద్దగంగమఠ్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. సిద్దగంగమఠ్‌లో గత సంవత్సరం చనిపోయిన శివకుమార స్వామీజీ సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు.
6 కోట్ల మంది రైతులకు 12 వేల కోట్లు
తుమకూరులో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ రెండో దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కింద 6 కోట్లమంది రైతులకు రూ. 12 వేల కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ‘కృషి కర్మన్’ పురస్కారాలను ప్రధాని అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు

జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
2020 జనవరి 1న శిశు జననాల్లో భారత్ అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ జనవరి 2న వెల్లడించింది. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారని పేర్కొంది.
విరీ చైల్డ్ అలైవ్ ఉద్యమం...
ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
2020, జనవరి 1న...
తొలి శిశువు జన్మించిన దేశం: ఫిజి
ఆఖరి శిశువు జన్మించిన దేశం: అమెరికా
ఏ దేశంలో ఎంతమంది పుట్టారు

దేశం

శిశు జననాల సంఖ్య

భారత్

67,385

చైనా

46,299

నైజీరియా

26,039

పాకిస్తాన్

16,787

ఇండోనేసియా

13,020

అమెరికా

10,452

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

10,247

ఇథియోపియా

8,493

మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం
2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతంగా ఉంది. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాకిస్తాన్‌లు ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్
ఎక్కడ : ప్రపంచంలో

107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జనవరి 3న 107వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 7 వరకు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ‘సైన్స్, టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి’ని అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్, సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎస్.రంగప్ప, వివిధ దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరయ్యారు.
సైన్స్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగిస్తూ... ‘సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం, వాటికి పేటెంట్ సాధించడం, పరిశ్రమ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి సాధించడం (ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్)’ అనే నాలుగు మార్గాలు దేశ పురోగతిని శీఘ్రతరం చేస్తాయని’ యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
  • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతి పైననే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.
  • ప్రపంచ సృజనాత్మక సూచీలో భారత్ స్థానం 52కి చేరింది.
  • ప్లాస్టిక్‌కు చవకైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.
  • 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందేందుకు పరిశ్రమల అవసరాలకు తగ్గ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది.
  • మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను సమర్థంగా, చౌకగా వెలికితీయగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 111 శిశుమరణాలు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. దీనితో పాటు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ జనవరి 5న వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు.
శిశుమరణాల గణాంకాలు..
రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్
ఎక్కడ : రాజ్‌కోట్ జిల్లా, గుజరాత్

కిర్లోస్కర్ జీవిత కథ యాంత్రిక్ కి యాత్ర ఆవిష్కరణ
కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ వీటిని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని స్పష్టం చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన ఈ సమావేశంలో ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్, టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్‌అండ్‌టీ అధినేత ఏఎం నాయక్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిర్లోస్కర్ జీవిత కథ యాంత్రిక్ కి యాత్ర ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర జనవరి 6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మహాపాత్ర ప్రసంగిస్తూ... రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక

శబరిమలపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు
శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో 9 మంది జడ్జీలు 2019, జనవరి 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననుందని జనవరి 7న సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నారు. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో లేరు.
అన్ని వయసుల వారిని శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలంటూ యువ న్యాయవాదుల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శబరిమలపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు

సీఏఐటీ సమావేశంలో నిర్మలా సీతారామన్
అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) జనవరి 7న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మై టైమ్ ఎట్ సెబీ పుస్తకం విడుదల
మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్, సెబీ మాజీ చైర్మన్ యు.కె. సిన్హా రచించిన ‘గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబీ’ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. నియంత్రణ సంస్థలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడ కూడదని సిన్హా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాథమిక అవసరమని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) సమావేశం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

మార్చి 12న వింగ్స్ ఇండియా 2020 సదస్సు
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12 - 15 తేదీల మధ్య ‘వింగ్‌‌స ఇండియా 2020’సదస్సును నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. సదస్సు ఏర్పాట్లకు సంబంధించి జనవరి 9న ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హాజరుకానున్నారు. దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు వింగ్‌‌స ఇండియా సదస్సు ఉపయోగపడుతుందని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వింగ్‌‌స ఇండియా 2020 సదస్సు
ఎప్పుడు : మార్చి 12 - 15 తేదీల మధ్య
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్
ఎందుకు : దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు

బొగ్గు గనులు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం-2015లో సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ జనవరి 8న ఆమోదం తెలిపింది. దీంతో బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
  • ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్‌ఐఎన్‌ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, బీహెచ్‌ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్‌లకు వాటాలు ఉన్నాయి.
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు జాతీయ ప్రాధాన్య హోదా ఇవ్వాలని నిర్ణయం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బొగ్గు గనులు చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 27 Jan 2020 04:05PM

Photo Stories