Skip to main content

జనవరి 2018 జాతీయం

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Current Affairs భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక.
ముఖ్య అతిథులు
1. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ
2. వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్
3. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె
4. థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా
5. సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్
6. బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా
7. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
8. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్
9. లావోస్ పీఎం థాంగ్‌లౌన్ సిసౌలిత్
10. కంబోడియన్ అధ్యక్షుడు హున్‌సేన్
ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి.


చైనాకు భారత్-ఆసియాన్ దేశాల గట్టి సందేశం
చైనాకు భారత్-ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా-ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను జనవరి 25న విడుదల చేశారు.
భారత్-ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై మోదీ చర్చలు జరిపారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ.. ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం... గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఆసియాన్ సదస్సు
ఎప్పుడు : జనవరి 25
ఎక్కడ : న్యూఢిల్లీలో

సోషల్ మీడియాలో టాప్‌లో భారత్ అంటే బిజినెస్’
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న ‘భారత్ అంటే బిజినెస్’ (#Indiameansbusiness) హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన విషయంగా నిలిచింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖంగా వినిపించిన అంశాలపై అమెరికాకు చెందిన టాక్‌వాకర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ అత్యధికంగా39,252 సార్లు ప్రస్తావనకు రాగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహిళలు (35,837), అమెరికా ఫస్ట్ (31,449), సంపద (22,896), కృత్రిమ మేధ(19,018), ప్రపంచీకరణ (16,513), వాతావరణ మార్పులు (15,477)అనే హ్యాష్‌ట్యాగ్‌లున్నాయి.
వ్యక్తుల పరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (2.73 లక్షల సార్లు) అగ్ర భాగంలో నిలిచారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఎమాన్యుయెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా, జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ ఉన్నారు. ఈసారి దావోస్ పేరు సామాజిక మాధ్యమాల్లో 20.20 లక్షల సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు టాక్‌వాకర్ వెల్లడించింది.

2017 సంవత్సరపు హిందీ పదంగా ఆధార్’
ఆధార్ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్ సాహితీ వేడుకలో భాగంగా జనవరి 27న ‘ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్ తర్వాత మిత్రోన్(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్ అనే హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 సంవత్సరపు హిందీ పదంగా ‘ఆధార్’
ఎప్పుడు : జనవరి
ఎక్కడ : జైపూర్ సాహితీ వేడుకలో

మహారాష్ట్ర శకటానికి ప్రథమ బహుమతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన శకటాలకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రాష్ట్రాల కేటగిరీలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని చూపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ల శకటాలు వరుసగా రెండో, మూడో బహుమతులు పొందాయి. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 28న ఢిల్లీలో బహుమతులను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కేటగిరీలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉత్తమ శకటం అవార్డు దక్కింది. త్రివిధ దళాల కేటగిరీలో ఆర్మీ పంజాబ్ రెజిమెంట్, పారా-మిలిటరీ దళాల కేటగిరీలో ఐటీబీపీలు ఉత్తమ కవాతు ట్రోఫీని పొందాయి.

యాసిడ్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా
ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగాల్లో 40 శాతానికి పైగా వైకల్యస్థాయి ఉన్న అభ్యర్థులకు మొత్తం ఖాళీల్లో నాలుగు శాతం కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మొత్తం గతంలో మూడు శాతంగా ఉండేది. దృష్టి లోపం, వినికిడి లోపం, సెరిబ్రల్ పాల్సీ, మరుగుజ్జు, కుష్ఠు వ్యాధి నయమైనవారు, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం(డీవోపీటీ) అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇటీవల లేఖ రాసింది. వీరితో పాటు ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధిమాంద్యంతో బాధపడేవారికి కూడా ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగం వైకల్యమున్న ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించడానికి ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకునే అధికారులు 2 నెలల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వైకల్యమున్న అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుబాటు చేయరాదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

పాత పద్ధతిలోనే పాస్‌పోర్ట్
ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) హోదా ఉన్న పౌరులకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం విరమించుకుంది. మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జనవరి 29న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఆరెంజ్ రంగు కవర్‌తో పాటు చివరి పేజీలో వ్యక్తిగత వివరాలు ముద్రించాలని గతంలో విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకోగా.. దీన్ని వ్యతిరేకిస్తు పలువురు వ్యక్తులు, బృందాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.

సీజేఐ వేతనం నెలకు రూ.2.80 లక్షలు
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాలను దాదాపు రెండు రెట్లు పెంచే బిల్లుపై రాష్ట్రపతి కోవింద్ జనవరి 30న సంతకం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతన, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.1 లక్ష నుంచి రూ.2.80 లక్షలకు పెరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు కూడా రూ.80 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతాయి. 2016 జనవరి 1 నుంచే జడ్జీల వేతన పెంపు అమల్లోకి వస్తుంది.

జాతీయ ఓటరు దినోత్సవం
అర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకొని భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. దీన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు.

గీన్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 177వ స్థానం
వాయు కాలుష్య నియంత్రణలో పేలవ పనితీరు, నామమాత్ర అటవీ సంరక్షణ చర్యలు.. భారత్‌ను 2018 గ్రీన్ ర్యాంకింగ్స్‌లో 177వ స్థానంలో నిలబెట్టాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)180 దేశాలతో కూడిన పర్యావరణ పనితీరు సూచీ (ఈపీఐ)ని జనవరి 23న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్ తొలి ఐదు స్థానాల్లో; బురుండీ(180), బంగ్లాదేశ్(179), కాంగో(178), భారత్(177), నేపాల్(176) చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.

దేశంలో తగ్గిన మరణ శిక్షలు
ఉరిశిక్ష ఖరారైన ఖైదీలు 2017 చివరి నాటికి భారత్‌లో 371 మంది ఉన్నట్లు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2016 చివరి నాటికి ఈ సంఖ్య 399గా ఉంది. 2016తో పోలిస్తే 2017లో 27 శాతం తక్కువగా ఉరి శిక్ష ఖారరైనట్లు పేర్కొంది. భారత్‌లో ‘మరణశిక్ష వార్షిక గణాంకాలు’ పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం జనవరి 25న నివేదిక విడుదల చేసింది.

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
Current Affairs
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతి జనవరి 18న ఢిల్లీలో ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌ల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 3న వెల్లడిస్తారు. ఈ మూడింటిలో ప్రతి రాష్ట్రంలోనూ 60 శాసనసభ స్థానాలే ఉన్నాయి.
ప్రస్తుతం మేఘాలయలో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.

'ఐ క్రియేట్' కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ, నెతన్యాహు
ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గుజరాత్‌లో ఏర్పాటు చేసిన 'ఐ క్రియేట్' ( International Centre for Entrepreneurship and Technology) ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి జనవరి 17న ప్రారంభించారు. అహ్మదాబాద్ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 'ఐ క్రియేట్' స్టార్టప్ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎక్కడ : దియోధోలేరా, అహ్మదాబాద్, గుజరాత్
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

దివ్యాంగుల కోసం మరో 100 వెబ్‌సైట్లు
దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దాదాపు 100 వెబ్‌సైట్లను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. దీంతో తమ శాఖ ‘వెబ్‌సైట్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్టు’ కింద దివ్యాంగుల కోసం రూపొందించిన వెబ్‌సైట్ల సంఖ్య 917కు చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దివ్యాంగులు సమాజంలో ఒక భాగమని మిగతా వారితో సమానంగా వారు వ్యవహరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు.

20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు ఈసీ సిఫార్సు
ఢిల్లీ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు గాను ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఒకపక్క ఎమ్మెల్యేలుగా ఉంటూనే మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగారని.. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు సమంజసమేనని సిఫార్సుల్లో ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ సిఫార్సుల్ని సవాలు చేస్తూ అనర్హత జాబితాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసీ సిఫార్సులపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 20 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనా కేజ్రీవాల్ సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతకు రాష్ట్రపతికి సిఫార్సు
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎందుకు : ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభాదాయక పదవుల్లో కొనసాగినందుకు

విమానాల్లోనూ మొబైల్, ఇంటర్నెట్
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్... తాజాగా ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో... శాటిలైట్, టెరిస్ట్రియల్ నెట్‌వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. విమానం 3,000 మీటర్లకన్నా ఎత్తులో ఉన్నపుడు మాత్రమే వాటిలో మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసులను అనుమతించాలని.. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఈ సేవలుండకూడదని పేర్కొంది. విమాన ప్రయాణం సమయంలో మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచినప్పుడే వై-ఫై సర్వీసులను అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇన్-ఫ్లైట్ కమ్యూనికేషన్‌‌స (ఐఎఫ్‌సీ) సర్వీస్ ప్రొవైడర్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రాయ్ నివేదికలో పేర్కొంది.

ఆప్ ఎమ్మేల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదం
లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు జనవరి 21న కేంద్ర న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని రాష్ట్రపతి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆప్ ఎమ్మేల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదం
ఎప్పుడు : జనవరి 21
ఎందుకు : లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఈసీ సిఫార్సు మేరకు

కశ్మీర్‌లో సోనమ్ వాంగ్‌చుక్ వర్సిటీ
Current Affairs
త్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్‌ఖాన్ ‘ఫున్‌సుక్ వాంగ్‌డూ’పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో కీలక ప్రాజెక్టును చేపట్టారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్(ఎస్‌ఈసీఎంవోఎల్) పేరిట ఇప్పటికే లాభార్జన లేని ఓ పాఠశాలను ప్రారంభించిన సోనమ్.. తాజాగా యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లోనే రూ.800 కోట్లతో దాదాపు 200 ఎకరాల్లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్‌‌స విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు సోనమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడి కోసం క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. 2018, మార్చి ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి రూ.14 కోట్లు అవసరమన్నారు. ఇందులో భాగంగా జనవరి మాసాంతానికి రూ.7 కోట్లను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నుంచి సేకరిస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కశ్మీర్‌లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ విశ్వవిద్యాలయం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సోనమ్ వాంగ్‌చుక్

ఆధార్ భరోసాకు తాత్కాలిక వర్చువల్ ఐడీ
ఆధార్ వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను అధిగమించేందుకు ఆధార్ ధ్రువీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు జనవరి 10న ప్రకటించింది. నూతన విధానంలో ప్రజలెవరూ తమ 12 అంకెల ఒరిజినల్ ఆధార్ సంఖ్యను ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఆధార్ ఎక్కడ అవసరమైతే అక్కడ, దాని స్థానంలో తాత్కాలికంగా ఉండే ఒక వర్చువల్ గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే చాలని యూఐడీఏఐ పేర్కొంది. దీనివల్ల వినియోగదారుడి ఆధార్‌లో ఉన్న సమస్త సమాచారం వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కనిపించదనీ, కేవలం ఫొటో, పేరు వంటి నామమాత్రపు వివరాలు మాత్రమే అందేలా కొత్త విధానంలో పలు నియంత్రణలున్నాయని యూఐడీఏఐ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది.
ఎలా పనిచేస్తుంది?
ముందుగా వినియోగదారులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు అనుసంధానిస్తూ 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ వినియోగదారుడికి కేటాయిస్తుంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ విభాగాలు ఎక్కడైనా సరే...ప్రజలు తమ ఆధార్ నంబర్‌కు బదులుగా ఈ వర్చువల్ నంబర్‌ను ఇచ్చి, గతంలో మాదిరిగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వెంటనే వర్చువల్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న ఆధార్ నంబర్‌లోని సమాచారం వాణిజ్య సంస్థలు/ప్రభుత్వ విభాగాలకు చేరుతుంది. అయితే ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా పేరు, ఫొటో, చిరునామా వంటి నామమాత్రపు సమాచారం మాత్రమే వారికి అందుతుంది. ఆ వివరాలతో కేవైసీ (మీ వినియోగదారుల గురించి తెలుసుకోండి) ధ్రువీకరణను సంస్థలు పూర్తి చేసుకుంటాయి. ఈ వర్చువల్ నంబర్‌ను వినియోగదారులు ఎన్నింటినైనా సృష్టించుకోవచ్చు. ఒక్కో వర్చువల్ సంఖ్య నిర్దిష్ట కాలంపాటు లేదా కొత్త నంబర్‌ను సృష్టించుకునే వరకు యాక్టివ్‌గా ఉంటుంది. సంస్థలకు వినియోగదారుడి ఆధార్ నంబర్‌తో పనిలేదు. అది వారికి తెలియాల్సిన అవసరం ఉండదు. అలాగే పరిమిత సమాచారం మాత్రమే యూఐడీఏఐ నుంచి సంస్థలకు అందుతుంది కాబట్టి ఈ వ్యవస్థ భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. వినియోగదారుడి తరఫున కంపెనీలు ఈ వర్చువల్ గుర్తింపు సంఖ్యను సృష్టించేందుకు కూడా అనుమతి ఉండదు.
మార్చి నుంచి అమలు
కొత్త విధానాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణలన్నీ కొత్త విధానంలోనే జరుగుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. నిర్దేశిత సమయం తర్వాత కూడా ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోని కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ‘ఆధార్ నంబర్ కలిగినవారు ధ్రువీకరణల కోసం ఆధార్ నంబర్‌కు బదులుగా వర్చువల్ గుర్తింపు సంఖ్యను వాణిజ్య సంస్థలకు ఇవ్వొచ్చు. గతంలో ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రలు ఎలా వేసేవారో ఇప్పుడు కూడా అలాగే ఈ తాత్కాలిక నంబర్ చెప్పి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది’ అని సర్క్యులర్‌లో యూఐడీఏఐ పేర్కొంది.
ఆందోళనలు తగ్గించేందుకే
ఆధార్ కార్డు కోసమంటూ ప్రజల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వేలిముద్రలు, ఐరిస్ సహా ఎంతో సున్నితమైన సమాచారాన్ని యూఐడీఏఐ సేకరిస్తోంది. అయితే ఈ సమాచారానికి రక్షణ కరువైందనీ, ఎవరికి పడితే వారికి ఆధార్ సమాచారం చాలా సులువుగా దొరుకుతోందని నిరూపించేలా పలు ఘటనలు జరిగాయి. ఈ నెల 3న ఆంగ్ల పత్రిక ‘ద ట్రిబ్యూన్’... రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఆధారాలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత పత్రిక, ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు, ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకే యూఐడీఏఐ కొత్త విధానం ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత విధానంలో..
  • 12 అంకెల ఆధార్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి
  • వాణిజ్య సంస్థల చేతికి ఆధార్‌లోని పూర్తి సమాచారం వెళ్తుంది
  • ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది.
కొత్త విధానంలో..
  • 16 అంకెల వర్చువల్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి.
  • వాణిజ్య సంస్థలకు పేరు, ఫొటో, చిరునామాతో పరిమిత సమాచారమే వెళ్తుంది.
  • ఎన్ని తాత్కాలిక సంఖ్యలనైనా సృష్టించుకోవచ్చు.

1984 అల్లర్లపై మరో సిట్
సంచలనం సృష్టించిన 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నాటి అల్లర్లకు సంబంధించిన 241 కేసుల్లో 186 కేసులను ఎలాంటి దర్యాప్తు జరపకుండానే మూసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తాజా దర్యాప్తును పర్యవేక్షించేందుకు మళ్లీ త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య బృందంలో ఆయనతో పాటు అభిషేక్ దులార్(2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి)సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ అదేశించింది.
1984 నాటి ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులపై మరో సిట్
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు

ఆధార్‌కు ‘బయోమెట్రిక్’ లాక్
ఆధార్ సమాచారానికి రక్షణ, గోప్యత కోసం 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ వర్చువల్ ఐడీ కన్నా ముందే ఆధార్ వెబ్‌సైట్‌లో మరో సెక్యూరిటీ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి్య, తన బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు. లాక్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఆధార్ ధ్రువీకరణకు వేలిముద్ర వేసినా పనిచేయదు. వినియోగదారుడు తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మళ్లీ బయోమెట్రిక్ డేటాను అన్‌లాక్ చేయొచ్చు. వేలి ముద్ర వేసి ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాగానే మళ్లీ లాక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో బయోమెట్రిక్ సమాచారం భద్రంగా ఉంటుందనీ, ఆధార్ వివరాలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ అవకాశాన్ని కల్పించామని యూఐడీఏఐ సీఈవో తెలిపారు.

హజ్ సబ్సిడీ రద్దు: కేంద్ర మంత్రి నఖ్వీ
ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జనవరి 17న తెలిపారు. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదని.. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తామని వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ చెప్పారు. సబ్సిడీలో భాగంగా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హజ్ సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకు

సివిల్స్, గ్రూపు-1లకు ఉమ్మడి సిలబస్
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు 60శాతం ఉమ్మడి (కామన్) సిలబస్ ఉండాలన్న ప్రతిపాదనకు గోవాలో జరిగిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు 2018, జనవరి 12న ఆమోదించింది.

జోజిలా పాస్ సొరంగానికి కేబినెట్ ఓకే
Current Affairs
జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 3న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం-1లోని హల్దియా-వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : జోజిలా పాస్, జమ్ము కశ్మీర్
ఎందుకు : జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించేందుకు

మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్
మహిళలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఓ చోట అందించేందుకు వీలుగా రూపొందించిన "NARI" వెబ్ పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ పోర్టల్‌లో మహిళా సంక్షేమానికి సంబంధించిన 350కి పైగా పథకాల సమాచారాన్ని పొందు పరిచారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఫిర్యాదుల సదుపాయాన్ని కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎందుకు : మహిళలకు సంబంధించిన పథకాల సమాచారాన్ని అందించేందుకు

రక్తదాతలకు వేతనంతో కూడిన సెలవు
ఎదుటివారి ప్రాణాలు నిలపగలిగే శక్తి ఉన్న రక్తదాన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులు ఏడాదిలో ఇలాంటివి గరిష్టంగా నాలుగు సెలవులను వాడుకోవచ్చు. రక్తదానానికి సెలవులు మంజూరు చేసే విధానం కొన్ని విభాగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో.. రక్తదానంతో పాటు ప్లేట్‌లెట్స్, రక్త కణాలు, ప్లాస్మాను దానం చేసేవారికి కూడా సెలవులు వర్తింపజేసే విధంగా నిబంధనలు సవరించారు. ఉద్యోగులు దీనికి సంబంధించి లెసైన్‌‌సలు కలిగి ఉన్న రక్తనిధి కేంద్రాల్లోనే రక్తదానం చేయడమే కాకుండా.. అందుకు తగిన ఆధారాలను కూడా అందజేయాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నం ఆవిష్కరణ
పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నాన్ని (రాజముద్ర) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 5న ఆవిష్కరించారు. విశ్వ బంగ్లా, అశోక చక్రంతో కూడిన ఈ రాజముద్రని.. మమతా బెనర్జీయే స్వయంగా రూపొందించారు. అనంతరం ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ రాజముద్రకి ఆమోదం తెలపటంతో.. కోల్‌కతాలో అధికారంగా ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ జీవోలు, అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ఈ రాజముద్రను వినియోగించనున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఆలిండియా డీజీపీల సదస్సు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్‌ఎఫ్ అకాడమీలో జనవరి 6-8 వరకు జరిగిన డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో మోదీ విసృ్తతంగా చర్చించారు. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గతేడాది హైదరాబాద్..
ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విసృ్తత చర్చ జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆలిండియా డీజీపీల సదస్సు - 2017
ఎప్పుడు : జనవరి 6 - 8
ఎక్కడ : గ్వాలియర్, మధ్యప్రదేశ్

సెక్షన్ 377ను పునఃపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విసృ్తత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విసృ్తత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది.
1861నుంచి నేరంగా...
ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : సుప్రీంకోర్టు

డిసెంబర్‌కల్లా భారత్ నెట్ రెండో దశ పూర్తి
దాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా జనవరి 8న జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు.
తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నెట్ రెండో దశ పూర్తి గడువు
ఎప్పుడు : 2018 డిసెంబర్ నాటికి
ఎవరు : కేంద్ర టెలికం శాఖ
ఎందుకు : గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు

థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్రం ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు సినిమాహాళ్లలో జాతీయగీతం పాడటంపై మార్పులు చేసేందుకు 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కమిటీ ఆరు నెలల కాలంలో తమ నివేదికను సమర్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీలో ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ)’ తొలి సదస్సు జనవరి 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఏ దేశ భూభాగంపైగానీ, వనరులపైన గానీ భారత్‌కు కన్ను లేదని పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో ఆధిపత్యానికి ఇటీవల చైనా చేస్తున్న ప్రయత్నాల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇతర దేశాలకు అభివృద్ధి సాయం చేసే విషయంలో మానవతా దృక్పథమే తప్ప.. భారత్‌ది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదని స్పష్టం చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధికి సహాయకారిగా ఉండాలని ప్రవాస భారత పార్లమెంటేరియన్లను మోదీ కోరారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మహాత్మాగాంధీ వచ్చినరోజుకు సంబంధించిన 102వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు
ఎప్పుడు : జనవరి 9
ఎక్కడ : న్యూఢిల్లీలో

జడ్జీల వేతనాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లును లోక్‌సభ జనవరి 4న ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నెల వేతనం రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు; సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు; హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.80,000 నుంచి రూ.2.25 లక్షలకు చేరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు చేసిన ఈ మార్పులు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఎయిమ్స్
హిమాచల్‌ప్రదేశ్‌కు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ వద్ద రూ.1,350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తిచేస్తారు.

18వ అఖిల భారత విప్‌ల సదస్సు
18వ అఖిల భారత విప్‌ల సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జనవరి 8న ఉదయ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్‌లు పార్టీ సభ్యులను పర్యవేక్షించడంతోపాటు చైతన్యవంతులను చేయాలని సూచించారు. చట్టసభల్లో సభ్యల ప్రవర్తన, క్రమశిక్షణలను పరిశీలించాల్సింది విప్‌లేనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల విప్‌లు హాజరయ్యారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Current Affairs తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది.
బిల్లులో ఏముంది..
ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది.
  • రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.
  • బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.
  • మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది.

ఇక నుంచి భారత సైన్యంలో ఒంటెలు
చైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.

మన్‌కీబాత్’ ట్విటర్‌లో టాప్
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.

లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును ప్రభుత్వం డిసెంబర్ 29న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
  • నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
  • ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి.
  • వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
  • వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
  • పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎందుకు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటుకు

సత్యేంద్రనాథ్ బోస్ జయంత్యుత్సవాల్లో మోదీ ప్రసంగం
శాస్త్ర సాంకేతికాంశాలను విసృ్తతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్‌‌సపై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ఈ మేరకు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జనవరి 1న కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

ఎలక్టోరల్ బాండ్ల విధి విధానాలు ఖరారు
రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం అమల్లోకి తేనున్న ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాల్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 2న ప్రకటించారు. విరాళాలిచ్చే దాతలు ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను ఈసీకి సమర్పించిన బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఎంపిక చేసిన ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో మాత్రం 30 రోజుల పాటూ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలు అనంతరం 15 రోజుల పాటు ఇవి చెల్లుబాటు అవుతాయి. బాండ్లపై విరాళమిచ్చే దాత పేరు ఉండదని, అయితే వాటిని కొనుగోలు చేసే వ్యక్తి లేక కంపెనీ.. బ్యాంకుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఖరారు చేసిందని వెల్లడించారు.
కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే
ప్రామిసరీ నోటును పోలిఉండే ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ ఇవ్వవు. బాండ్లలో పేర్కొన్న మొత్తాన్ని రాజకీయ పార్టీలకు చెల్లించేవరకు వాటిపై పూర్తి హక్కులు దాతకే చెందుతాయి. అయితే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల సొమ్మును చెల్లిస్తారు. అందుకోసం పార్టీలు ఎన్నికల సంఘానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి మొత్తాల్లో బాండ్లను దాతలు కొనుగోలు చేయవచ్చు. భారతీయ పౌరులు, భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే బాండ్లపై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండదు. 15 రోజుల్లోగా పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవాలి.
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు
దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టాండింగ్ కమిటీకి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : లోక్‌సభ

అసోం తొలి ఎన్‌ఆర్‌సీ ముసాయిదా విడుదల
జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ర్టంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.

బ్రహ్మపుత్రలో జలరవాణా ప్రారంభం
కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డిసెం బర్ 29న బ్రహ్మపుత్ర నదిలో పాండు-ధుబ్రి మధ్య కార్గో రవాణాను ప్రారంభించారు. ఎగువ అసోంలోని సాదియా నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ధుబ్రి మధ్య బ్రహ్మ పుత్ర నదిలో 891 కి.మీ. పొడవున అభివృద్ధి చేసిన జలర వాణా మార్గాన్ని జాతీయ జలమార్గం-2గా ప్రకటించారు. దీన్ని ప్రారంభించడంతో 300 కి.మీ. మేర రహదారి ప్రయా ణం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు ఆదా అవుతాయి.
Published date : 05 Jan 2018 03:05PM

Photo Stories