Republic Day 2023: ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు.. మహిళా యోధులే సారథులు
రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26వ తేదీ నిర్వహించిన వేడుకల్లో దేశ విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపన తర్వాత సైనికులు లాంఛనంగా 21 గన్ సెల్యూట్ సమర్పించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు సూచికగా పాతకాలపు విదేశీ 25–పౌండర్‌గన్స్ స్థానంలో ఈసారి స్వదేశీ 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చారు.
అబ్బురపర్చిన విన్యాసాలు
కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కన్నుల పండువగా సాగింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. సైనికుల విన్యాసాలు అబ్బురపర్చాయి. మన ఆయుధ పాటవాన్ని, సైనిక శక్తిని తిలకించిన ఆహూతుల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మరఠా లైట్ ఇన్‌ఫాంట్రీ, బిహార్ రెజిమెంట్, గూర్ఖా బ్రిగేడ్ తదితర సేనలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు, రక్షణ సామగ్రిని పరేడ్‌లో ప్రదర్శించారు. అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్, కె–9 వజ్ర యుద్ధ ట్యాంకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నావికాదళం నుంచి 9 మంది అగ్నివీరులు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు యువతులున్నారు. వైమానిక విన్యాసాల్లో ఆధునిక మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకేఐ, రఫేల్ ఫైటర్లు, సి–130 సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానాలతోపాటు సి–17 గ్లోబ్ గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. నావికా దళానికి చెందిన ఐఎల్–38 యుద్ధ విమానం సైతం తొలిసారిగా పాలుపంచుకుంది. దట్టమైన పొగమంచు వల్ల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రజలు పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయారు. 800 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా కళ్లు చిట్లించుకొని చూడాల్సి వచ్చింది. వాటిని ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయాస పడ్డారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (01-07 జనవరి 2023)
మహిళా యోధులే సారథులు
నారీశక్తిని ప్రతిబింబిస్తూ ‘ఆకాశ్’ ఆయుధ వ్యవస్థను లెఫ్టినెంట్ చేతన్ శర్మ నాయకత్వంలో ప్రదర్శించారు. 144 మంది జవాన్లు, నలుగురు అధికారులతో కూడిన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధూరెడ్డి నేతృత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం(సీఆర్‌పీఎఫ్) నుంచి పూర్తిగా మహిళా సైనికులతో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది. ఈ బృందానికి అసిస్టెంట్ కమాండెంట్‌పూనమ్ గుప్తా సారథ్యం వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఆర్మ్‌డ్ పోలీసు బెటాలియన్‌గా ఈ బృందానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఢిల్లీ మహిళా పోలీసుల పైప్ బ్యాండ్ కూడా మొదటిసారిగా గణతంత్ర పరేడ్‌లో భాగస్వామిగా మారింది. ‘ఢిల్లీ పోలీసు సాంగ్’ను వారు ఆలపించారు.
25–పౌండర్ శతఘ్నులకు సెలవు
రిపబ్లిక్ డే వేడుకల్లో 21 గన్ సెల్యూట్‌లో భాగంగా 25–పౌండర్ గన్స్ పేల్చడం దశాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇకపై వీటికి శాశ్వతంగా సెలవు ఇచ్చేసినట్టే. ఈసారి దేశీయంగా తయారు చేసిన 105–ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ పేల్చారు. ఈ వందనంలో మొత్తం ఏడు శతఘ్నులు పాల్గొన్నాయి. ఒక్కొక్కటి మూడుసార్లు పేల్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో స్వదేశీ శతఘ్నులతో వందనం సమర్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2281 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన 25–పౌండర్ గన్స్ 1940 దశకం నాటివి. ఇవి యునైటెడ్ కింగ్‌డమ్‌లో తయారయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. 21 గన్ సెల్యూట్‌కు పట్టే సమయం 52 సెకండ్లు.
Team India Top 1 Rank : వన్డే, టి20ల్లో టాప్-1 మనమే.. ఇక టెస్టులో కూడా..
పరేడ్ సైడ్‌లైట్స్
• రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చిన తర్వాత ఇవే తొలి గణతంత్ర వేడుకలు.
• ఈసారి ‘నారీశక్తి’ థీమ్‌తో వేడుకలు జరిగాయి.
• ఈజిప్ట్ సైనిక దళాలు, బ్యాండ్ తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాయి.
• ప్రధాని మోదీ ధరించిన రంగుల తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
• ముగ్గురు పరమవీర చక్ర గ్రహీతలు, ముగ్గురు అశోక చక్ర అవార్డు గ్రహీతలు పరేడ్‌లో పాల్గొన్నారు.
• బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఒంటెల దళాన్ని తొలిసారిగా మహిళా సైనికులు నడిపించారు.
• మొత్తం 23 శకటాలను ప్రదర్శించారు. 17 రాష్ట్రాలవి కాగా 6 కేంద్ర శాఖలవి.
• ఢిల్లీ సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న ‘శ్రమయోగీల’తోపాటు పాలు, కూరగాయలు విక్రయించుకొనేవారిని, చిరు వ్యాపారులను గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.
• 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) శకటంపై చిరుధాన్యాలను ప్రదర్శించారు. కనువిందుగా అలంకరించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.