Skip to main content

ఏప్రిల్ 2018 జాతీయం

కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హత రద్దు
Current Affairs కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హతను రద్దు చేస్తూ రైల్వేశాఖ ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో చనిపోయిన, వైద్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భార్యలు, పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం లెవల్-1 లేదా గ్రూప్-డి విభాగంలో కారుణ్య నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హత రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : రైల్వేశాఖ
ఎందుకు : చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడంతో

టైమ్స్ ప్రభావశీలుర జాబితా 2018
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ఏప్రిల్ 19న ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ యువరాజు హ్యారీ, సౌదీ యువరాజు బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధినేత కిమ్, కెనడా ప్రధాని ట్రూడో, ఐర్లాండ్‌కు తొలి గే ప్రధాని వరద్కర్, ‘మీ టూ’ ఉద్యమకారిణి తరానా బర్క్, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పాప్ గాయని జెన్నిఫర్ లోపేజ్‌లు కూడా స్థానం సంపాదించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ అత్యంత ప్రభావశీలుర జాబితా 2018
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : విరాట్ కోహ్లి, దీపికా పదుకోన్, సత్య నాదెళ్ల, భవీశ్ అగర్వాల్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడ్డారన్న వారిలో ప్రస్తుతం 48 మంది దేశంలోని వివిధ చట్టసభల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, 45 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 12, శివసేన నుంచి ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు ఉన్నారని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎన్నికల్లో పోటీచేసిన 4,845 అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి ఈ మేరకు ఓ నివేదికను తయారుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్
ఎక్కడ : దేశవ్యాప్తంగా

లోయాది సహజ మరణం: సుప్రీంకోర్టు
సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మరణం సహజమైనదేనని సుప్రీంకోర్టు ఏప్రిల్ 19న తెలిపింది. ఈ మేరకు లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ పిటిషన్లు వేశారని తెలిపింది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ లు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
గుజరాత్‌లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో మృతి చెందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐ జడ్జి లోయాది సహజ మరణమేనని స్పష్టీకరణ
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : సుప్రీంకోర్టు

సీజేఐ మిశ్రాపై అభిశంసన నోటీసులు
భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీజేఐ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఏప్రిల్ 20న నోటీసులు అందజేశాయి. ఈ నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయ్యాయి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి.
సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయనపై నోటీసులో 5 ఆరోపణలు పేర్కొన్నారు.
  1. ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.
  2. సుప్రీంకోర్టులో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్)
  3. రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.
  4. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్ చేశారు. అయితే 1985లోనే ప్లాట్ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.
  5. తనకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.
గతంలో అభిశంసన తీర్మానాలు
గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై నాలుగు సార్లు అభిశంసన తీర్మానాలిచ్చారు. అవి.
  • జస్టిస్ వి.రామస్వామి 1987-1989 మధ్య హర్యానా, పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అధికార నివాసంలో పరిమితికి మించి ఖర్చు చేశారన్న అభియోగంతో 1991లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 1993లో లోక్‌సభలో ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది.
  • 2009లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రసేన్ కు వ్యతిరేకంగా రాజ్యసభలో తీర్మానం వచ్చింది. న్యాయవాదిగా ఉన్నప్పుడు కోర్టు రిసీవర్‌గా నియమితులైన ఆయన తన ఆధీనంలో ఉన్న రూ. 33.23 లక్షలను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది 2011 ఆగస్టు 18న రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్‌సభకు వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్ సౌమిత్ర సేన్ 2011 సెప్టెంబర్ 1న తన పదవికి రాజీనామా చేశారు.
  • 2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీడీ దినకరన్‌పై భూఆక్రమణ, అధికార దుర్వినియోగం తదితర 16 ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమని తేలింది. దీంతో తనపై వచ్చిన ఆరోపణల విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పై నమ్మకం లేదని దినకరన్ రాజీనామా చేశారు.
  • అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. గంగెలేపై 2015 మార్చిలో అభిశంసన నోటీసులు ఇచ్చారు. అయితే విచారణ అనంతర అయనపై వచ్చిన అభియోగాలు రుజువు కాలేదని కమిటీ తేల్చింది.
  • 2016లో తన అధికారాలను దుర్వినియోగం చేసి ఓ దళిత జూనియర్ సివిల్ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్ నాగార్జున్‌రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది.
అభిశంసన ప్రక్రియ సాగే విధానం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. ఈ ప్రక్రియను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు. ప్రతిపాదనపై రాజ్యసభలో అయితే 50 మంది, లోక్‌సభలో అయితే 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి. స్పీకర్ లేదా చైర్మన్ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోతుంది. ఆమోదం పొందితే మాత్రం సుప్రీం జడ్జ్జి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారు.
ఈ కమిటీ న్యాయమూర్తులపై అభియోగాలను నమోదు చేస్తుంది. విచారణ తుది నివేదికను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు సమర్పిస్తుంది. అనంతరం ప్రతిపాదనలపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది. ప్రతిపాదన సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. ఒక సభలో ఆమోదం పొందిన తరువాత రెండో సభకు పంపుతారు. రెండింట్లోనూ ఆమోదం పొందిన ప్రతిపాదన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది. అనంతరం సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు.

చిన్నారులపై రేప్‌కు మరణశిక్ష
చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో కఠిన శిక్షలు అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసర ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 21 న జరిగిన కేబినెట్ సమావేశంలో భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), ద ఎవిడెన్స్ యాక్ట్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్(సీఆర్‌పీసీ), లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో) చట్టాల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం అత్యాచార కేసుల విచారణకు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసుల దర్యాప్తు కోసం అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లను ఇస్తారు.
ఆర్డినెన్స్‌లో ముఖ్యాంశాలు

  • 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే కనిష్టంగా 20 ఏళ్ల జైలు లేదా గరిష్టంగా మరణించేంత వరకూ జైలు లేదా మరణశిక్ష విధిస్తారు.
  • 12 ఏళ్ల లోపు బాలికపై గ్యాంగ్ రేప్ చేస్తే మరణించేంత వరకూ జైలు శిక్ష లేదా మరణ శిక్ష
  • 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే శిక్ష 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంపు లేదా గరిష్టంగా మరణించేంత వరకూ జైలు శిక్ష విధిస్తారు.
  • 16 ఏళ్ల లోపు బాలికపై గ్యాంగ్ రేప్‌నకు మరణించేంత వరకూ జైలు శిక్ష విధిస్తారు.
  • మహిళలపై అత్యాచారం చేస్తే పడే శిక్షను 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంపు లేదా గరిష్టంగా జీవిత ఖైదు అమలు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారులపై రేప్‌కు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఆర్డినెన్స్
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశవ్యాప్తంగా వరుస అత్యాచారాల నేపథ్యంలో

సీజేఐ అభిశంసన నోటీసు తిరస్కరణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందున నోటీసును తిరస్కరిస్తూ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టికల్ 124(4) ప్రకారం ప్రధాన న్యాయమూర్తి దుష్ర్పవర్తనను నిరూపించాలంటే ఆధారాలు తప్పనిసరి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ అభిశంసన నోటీసు తిరస్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు
ఎందుకు : అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందున

అద్భుతంగా సాగిన గగన్ శక్తి విన్యాసాలు
గగన శక్తి పేరుతో ఏప్రిల్ 8 నుంచి 20 వరకు భారీ స్థాయిలో చేపట్టిన విన్యాసాలు అద్భుతంగా సాగాయని వైమానిక దళాధిపతి మార్షల్ బీఎస్ ధనోవా ఏప్రిల్ 23న తెలిపారు. విన్యాసాల్లో భాగంగా పోరాట, రవాణా, గస్తీ విమానాలు 11,000 పైగా చక్కర్లు కొట్టాయని తెలిపారు.

సాయుధ దళాల ప్రత్యేక చట్టం ఎత్తివేత
కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నుంచి మేఘాలయలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పాక్షికంగా తొలగించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్ 23న ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆర్థిక నేరస్తుల ఆస్తుల జప్తుకు ఆర్డినెన్స్
దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ఇచ్చే ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 21నఆమోదించింది.

సీజేఐ సమానుల్లో ప్రథముడు: సుప్రీంకోర్టు
Current Affairs సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడు(ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్) అని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ ఒక వ్యవస్థ అని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం సీజేఐకే ఉంటుందని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పారదర్శకంగా కేసుల కేటాయింపులు జరపాలని న్యాయవాది అశోక్ పాండే దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పును వెలువరిచింది. సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 11న అశోక్ పాండే వేసిన పిల్‌పై తీర్పును వెలువరుస్తూ కోర్టులోని న్యాయమూర్తులంతా సమానులేనని, అయితే సీజేఐ వారిలో ప్రథముడని వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ సమానుల్లో ప్రథముడు
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : సుప్రీంకోర్టు

ఐఈఎఫ్ సదస్సును ప్రారంభించిన మోదీ
16వ అంతర్జాతీయ ఇంధన సంఘం(ఐఈఎఫ్) మంత్రుల సదస్సును ఏప్రిల్ 11న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోధీ ప్రారంభించారు. దాదాపు 22 సంవత్సరాల అనంతరం ఈ సదస్సుకు భారత్ వేదిక కాగా సౌదీ అరేబియా, ఇరాన్ సహా ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) సభ్య దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా హైడ్రోకార్బన్ మార్కెట్ విధానాలు హేతుబద్ధంగా ఉండాలని మోదీ సూచించారు. వచ్చే పాతికేళ్లలో భారత్‌లో చమురు ఉత్పత్తుల డిమాండ్ 4.5 శాతం, గ్యాస్ డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 16వ ఐఈఎఫ్ సదస్సు
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

ఆదివాసీల జీవితకాలం 43 సంవత్సరాలు
దేశంలో అన్ని వర్గాల వారికంటే ఆదివాసీల జీవితకాలం చాలా తక్కువగా 43 సంవత్సరాలే ఉందని ఒక నివేదిక తెలిపింది. ఆదివాసీలు అల్పసంఖ్యాక ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారు ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే ముందుగానే మృత్యువాతపడుతున్నారని ‘భారత్‌లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004-14కాలంలో)’ అనే అంశంపై ప్రముఖ ఆర్థిక వేత్త వాణీకాంత్ బారువా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సరైన స్థాయిలో వైద్య సేవలు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని బారువా పేర్కొన్నారు.
2004 వరకు ఎస్టీల సగటు జీవితకాలం 45 ఏళ్లు కాగా, తర్వాతి దశాబ్దంలో అది 43 కి తగ్గింది. ఎస్సీల సగటు జీవితకాలం 42 ఏళ్లు కాగా 2014 నాటికి అది ఆరేళ్లు పెరిగింది. ముస్లిమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవితకాలం 2004లో 55 ఏళ్లు ఉండగా 2014లో 66 ఏళ్లకు పెరిగింది. తాము అనారోగ్యం బారినపడ్డామని వెల్లడించే ఆదివాసీల సంఖ్య కేవలం 24 శాతం మాత్రమే. అదే ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు.
2004, 2014లలో సామాజిక వర్గాల సగటు జీవితకాలం..

2004 2014
ముస్లిమేతర ఉన్నత వర్గాలు 55 60
ముస్లిమేతర ఓబీసీలు 49 52
ఓబీసీ ముస్లింలు 43 50
ఉన్నత వర్గ ముస్లింలు 44 49
షెడ్యూల్డ్ కులాలు 42 48
షెడ్యూల్డ్ తెగలు 45 43


తమిళనాడులో డిఫెన్స్ ఎక్స్‌పో 2018
తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్‌పోను ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంబించారు. ఈ సందర్భంగా శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నారు.
ఎఫ్‌ఏ-18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్‌లోనే తయారు చేసేందుకు ఎక్స్‌పో లో అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తమిళనాడులో డిఫెన్స్ ఎక్స్‌పో 2018
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

రైల్వే ఫిర్యాదుల కోసం మదద్ యాప్
ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు మదద్ అనే మొబైల్ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం, అత్యవసర సేవల్ని పొందడంతోపాటు ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే అవకాశముంది. ఇప్పటివరకు ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని ట్వీటర్, ఫేస్‌బుక్ గ్రీవియెన్స్ సెల్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్వే ఫిర్యాదుల కోసం మదద్ యాప్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : రైల్వే శాఖ
ఎందుకు : ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు

సోలార్ విద్యుత్ కి అనుకూల నగరాలు
సౌరవిద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్న మెట్రో నగరాల్లో న్యూఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. ఢిల్లీలో 2000 మెగాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని గ్రీన్‌పీస్ ఇండియా, గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (జీఈఆర్‌ఎంఐ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో 1750 మెగావాట్లతో ముంబై రెండోస్థానం, 1749 మెగావాట్లతో పట్నా మూడోస్థానంలో నిలిచాయి. 1730 మెగావాట్లతో హైదరాబాద్ నాలుగోస్థానంలో నిలిచింది. బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవంతులపై సౌర ఫలకాలు (రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ఆర్‌టీపీవీ) ఏర్పాటుతో దీనిని సాధించవచ్చని గ్రీన్ పీస్ ఇండియా తెలిపింది. ఈ మేరకు రూఫ్‌టాప్ రెవల్యూషన్ : అన్‌లీషింగ్ హైదరాబాద్స్ రూఫ్‌టాప్ పొటెన్షియల్ పేరుతో నివేదిక విడుదల చేసింది.

నో యువర్ పర్సనల్ ను ప్రారంభించనున్న సశస్త్ర సీమాబల్
సశస్త్ర సీమాబల్ లక్షమంది సైనికుల శారీరక దారుఢ్యం, నైపుణ్యాలు, ఆసక్తులు, ఆకాంక్షలు, సమస్యల గురించి వివరించే పెన్ పోట్రేయిట్స్ తయారీకి సిద్ధమైంది. బ్యాంకులు ప్రవేశపెట్టిన ‘నో యువర్ కస్టమర్’ మాదిరిగా ఎస్‌ఎస్‌బీ కూడా నో యువర్ పర్సనల్ (కేవైపీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో ప్రతి జవాన్‌కు సంబంధించిన వివరాలను చేతిరాతతో నమోదు చేస్తారు. ఎస్‌ఎస్‌బీ బలాలు, బలహీనతలు, ఆసక్తులు, దళాల ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని సంస్థ డెరైక్టర్ జనరల్ ఆర్కే మిశ్రా తెలిపారు. బొమ్మలు, చేతిరాతతో కూడిన వివరాలు కలిగిన చిన్న చిత్రాలనే పెన్‌పోట్రేయిట్స్ అంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో యువర్ పర్సనల్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : సశస్త్ర సీమాబల్
ఎందుకు : లక్షమంది సైనికుల వివరాలు పొందుపరిచేందుకు

900 ఏళ్ల కరువుతో సింధు నాగరికత అంతం
900 ఏళ్ల కరువు కారణాంగానే సింధు నాగరికత అంతమైందని ఐండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు ఏప్రిల్ 16న వెల్లడించారు. గత 5 వేల సంవత్సరాల్లో రుతుపవనాల స్థితిగతుల్ని, సింధు నాగరికత ప్రాంతంలోనే ఉన్న లేహ్, లడక్‌లో రుతుపవనాలను అధ్యయనం చేసి ఈ అంచనాకు వచ్చారు. క్రీ.పూ 2,350 నుంచి క్రీ.పూ 1,450 వరకు రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారడంతోనే సింధు నాగరికత పూర్తిగా కనుమరుగైందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 900 ఏళ్ల కరువుతో సింధు నాగరికత అంతం
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు
ఎందుకు : రుతుపవనాలు బలహీనంగా మారడంతో

లెఫ్టినెంట్ గవర్నర్ల జీతభత్యాలు పెంపు
లెఫ్టినెంట్ గవర్నర్ల జీతభత్యాలను పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ ఏప్రిల్ 11న నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్‌కు నెలసరి వేతనంగా రూ.2,25,000 అందనుంది. పెరిగిన జీతభత్యాలు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

దళిత్’ అనే పదప్రమోగం వద్దు: కేంద్రం
Current Affairs పాలనా వ్యవహారాల్లో దళిత్ అనే పదప్రయోగాన్ని వాడవద్దని కేంద్రం ప్రభుత్వం తాజాగా సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ)ను అలాగే ఉపయోగించాలని పేర్కొంది. ఈ మేరకు 2018 మార్చి 15న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
భారత రాజ్యాంగంలో దళిత్ అనే పదం ప్రస్తావన లేదని, షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాల్లో వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలని తెలిపింది. ఒక వ్యక్తిని ఏ అంశం కింద షెడ్యూల్డ్ క్యాస్ట్‌గా గుర్తించారో కూడా పేర్కొనాలి కానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదని కేంద్రం 1988లోనే చెప్పింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దళిత్ అనే పదప్రయోగం వద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : కేంద్రం ప్రభుత్వం
ఎక్కడ : ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో
ఎందుకు : ఈ పదాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించనందున

నదుల జాతీయాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
దేశంలోని నదులు, ఆనకట్టలను జాతీయం చేయాలంటూ తమిళనాడుకు చెందిన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న తోసిపుచ్చింది. కేవలం కొన్ని రాష్ట్రాలు ఘర్షణపడుతున్నాయని నదులను జాతీయం చేయలేమని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కమిటీ
సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఏప్రిల్ 4న ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హెచ్చార్డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ మే 31 కల్లా సాంకేతికత సాయంతో భద్రంగా పరీక్షలు నిర్వహించేందుకు తగు సూచనలు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ లోపాల అధ్యయనానికి కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వంలో
ఎక్కడ : దేశవ్యాప్తంగా

ఇండియా ట్యుబర్‌క్యులోసిస్-2018 నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లోని క్షయ వ్యాధిగ్రస్తుల్లో (83,118) పది శాతం మంది హెచ్‌ఐవీ బాధితులేనని ఇండియా ట్యుబరిక్యులోసిస్-2018 నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, నాగాలాండ్ 14 శాతంతో మొదటి స్థానం, 8 శాతం మందితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. హెచ్‌ఐవీ సోకిన క్షయ వ్యాధిగ్రస్తుల్లో క్షయ తీవ్రత మరింత పెరుగుతుంది.
దేశంలోనే అత్యధికంగా క్షయ బాధితులు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో (3,11,041) హెచ్‌ఐవీ సోకిన క్షయ బాధితులు 1 శాతమే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా ట్యుబర్‌క్యులోసిస్-2018 నివేదిక విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఎక్కడ : ఏపీలో 10 శాతం క్షయవ్యాధిగ్రస్తులు హెచ్‌ఐవీ బాధితులు

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో దోషులు 30 శాతానికి మించడం లేదు: ఇండియా స్పెండ్
దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదని ఇండియా స్పెండ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి, ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని తెలిపింది. నివేదిక ప్రకారం 2006-16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799, ఆదివాసీలపై 81,322 నేరాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 కింద నిందితుల్ని తక్షణం అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఇండియా స్పెండ్ అనే సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు.
  • దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు), ఆదివాసీల(ఎస్టీ)పై 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయి.
  • దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్ (42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్-నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • దళితులకు సంబంధించి పోలీస్‌స్టేషన్లలో 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది.
  • 2006-16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులు కాగా వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో మొదటిస్థానంలో ఉంది.
  • ఈ కేసుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించలేదు.
  • పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారని విశ్లేషించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్సీ, ఎస్టీ కేసుల్లో దోషులు 30 శాతానికి మించడం లేదు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ఇండియా స్పెండ్ అనే సంస్థ
ఎక్కడ : దేశవ్యాప్తంగా

చంపారన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ
చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బిహార్‌లోని మోతిహారీలో ఏప్రిల్ 10న జరిగిన కార్యక్రమంలో 20వేల మంది స్వచ్ఛాగ్రహి (స్వచ్ఛత వాలంటీర్లు)లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కతిహార్-పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు.
మహాత్మగాంధీ ప్రారంభించిన చంపారన్ సత్యాగ్రహం 2017 ఏప్రిల్ 10 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోవడంతో సంవత్సరం పాటు చంపారన్ సత్యాగ్రహ వేడుకలు నిర్వహించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చంపారన్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎక్కడ : మోతిహారీ, బిహార్

దేశంలో ధనిక పార్టీగా బీజేపీ
2016-17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీల ఆదాయపు పన్ను రిటర్నులను విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2016-17లో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,559.17 కోట్లు కాగా ఇందులో బీజేపీకి రూ. 1,034.27 కోట్ల ఆదాయం లభించింది. రూ. 225.36 కోట్లు ఆదాయం పొంది కాంగ్రెస్ రెండో ధనిక పార్టీగా నిలవగా కేవలం రూ.2.08 కోట్లతో అతి తక్కువ ఆదాయం పొందిన పార్టీగా సీపీఐ నిలిచింది. అలాగే ఏడు పార్టీల మొత్తం వ్యయం రూ.1,228.26 కోట్లు కాగా ఇందులో బీజేపీ వాటా రూ.710.05 కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ
ఎప్పుడు : 2016-17
ఎవరు : అసోసియేషన్ ఫర్ డె మోక్రాటిక్ రిఫార్మ్స్
ఎందుకు : రూ.1,034.27 కోట్ల ఆదాయం పొందినందుకు

జగన్నాథ ఆలయ ఖజానాను పరీక్షించనున్న పురావస్తుశాఖ
పూరీలోని ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం రత్న భండార్(ఖజానా)ను దాదాపు 34 ఏళ్ల తర్వాత తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ సందర్భంగా రత్న భండార్ పటిష్టత, భద్రతల్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) పరీక్షిస్తుందని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా తెలిపారు. 1984లో ఖజానాలోని 7 గదుల్లో మూడింటిని మాత్రమే తాము తెరవగలిగామని, నాలుగో గది దగ్గరకు వెళ్లగానే పాములు బుసలుకొట్టిన శబ్దాలు విన్పించాయని ఈ ఆలయంలో పనిచేసిన ఆర్.ఎన్.మిశ్రా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగన్నాథ ఆలయ ఖజానాను పరీక్షించనున్న ప్రభుత్వం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : భారత పురావస్తు శాఖ
ఎక్కడ : పూరీ, ఒడిశా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 44.16% బీసీలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 44.16 శాతం మంది వెనుకబడిన తరగతుల వారున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర ఉద్యోగుల్లో 17.55 శాతం మంది షెడ్యూల్ కులాలు, 8.37 శాతం షెడ్యూలు తెగలు, మిగతా వెనకబడిన తరగతుల వారు 18.24% మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ 2016-17 వార్షిక నివేదిక ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించారు.

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్‌సీ
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్‌సీ) నిలిచింది. ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్‌సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్, అత్యుత్తమ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం-అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్‌మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ ఏప్రిల్ 3న ర్యాంకులు ప్రకటించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఇండియా ర్యాంకింగ్‌‌స 2018 పేరిట విడుదల చేసిన ఈ ర్యాంకుల కోసం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్‌మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 డిగ్రీ కళాశాలలు మొత్తం 3,954 విద్యా సంస్థలను పరిశీలించారు. టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ వంటి అంశాల ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఈ ర్యాంకులను ప్రకటించింది.

ఓవరాల్ కేటగిరీలో టాప్-5
1. ఐఐఎస్‌సీ-బెంగళూరు
2. ఐఐటీ-మద్రాస్
3. ఐఐటీ-బాంబే
4. ఐఐటీ-ఢిల్లీ
5. ఐఐటీ-ఖరగ్‌పూర్

ఇంజనీరింగ్ విద్యలో టాప్-5
1. ఐఐటీ-మద్రాస్
2. ఐఐటీ-బాంబే
3. ఐఐటీ-ఢిల్లీ
4. ఐఐటీ-ఖరగ్‌పూర్
5. ఐఐటీ-కాన్పూర్

వైద్యవిద్యలో టాప్-5
1. ఎయిమ్స్-ఢిల్లీ
2. పీజీఐఎంఈఆర్-చండీగఢ్
3. సీఎంసీ-వేలూరు
4. కేఎంసీ-మణిపాల్
5. కేజేఎంయూ-లక్నో

మేనేజ్‌మెంట్ విద్యలో టాప్-5
1. ఐఐఎం-అహ్మదాబాద్
2. ఐఐఎం-బెంగళూరు
3. ఐఐఎం-కలకత్తా
4. ఐఐఎం-లక్నో
5. ఐఐటీ-బాంబే

న్యాయ విద్యలో టాప్-5
1. ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరు
2. ఎన్‌ఎల్‌యూ-ఢిల్లీ
3. నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్
4. ఐఐటీ-ఖరగ్‌పూర్
5. ఎన్‌ఎల్‌యూ-జోధ్‌పూర్

ఫార్మసీ విద్యలో టాప్-5
1. ఎన్‌ఐపీఈఆర్-మొహాలీ
2. జామియా హందర్ద్-ఢిల్లీ
3. పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్
4. ఐసీటీ-ముంబై
5. బిట్స్-పిలానీ

టాప్-5 విశ్వవిద్యాలయాలు:
1. ఐఐఎస్‌సీ-బెంగళూరు
2. జేఎన్‌యూ-ఢిల్లీ
3. బీహెచ్‌యూ-వారణాసి
4. అన్నా యూనివర్సిటీ-చెన్నై
5. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ.

తెలంగాణలో..
ఈ ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నాలుగు విద్యా సంస్థలు టాప్-100లో ఉన్నాయి. న్యాయ విద్యా సంస్థల కేటగిరీలో హైదరాబాద్‌లోని నల్సార్‌కు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి ఓవరాల్‌గా 11వ స్థానం దక్కింది. 2017లో 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈసారి 45వ ర్యాంకుకు పడిపోయింది. గతేడాది 63వ ర్యాంకు దక్కించుకున్న జేఎన్‌టీయూ ఈసారి 42వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక ఆర్కిటెక్చర్ కాలేజీల కేటగిరీలో హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఏడో ర్యాంకు సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌లో..
యూనివర్సిటీల విభాగంలో
ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం) - 22
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) - 49
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) - 56
శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (తిరుపతి)- 62
గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం)- విశాఖ- 85
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపురం)- 92
ఇంజినీరింగ్ విభాగంలో...
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)- 49
ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ (విశాఖపట్నం) - 65
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) - 71
సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్ కాలేజ్ (భీమవరం) - 85
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కాకినాడ) - 97
కళాశాల విభాగంలో..
సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజ్ (కర్నూలు) - 35
ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ)- 56
మేనేజ్‌మెంట్ విభాగంలో..
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (సత్యవేడు)- 34
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) - 46
ఫార్మసీ విభాగంలో..
ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ (ఆంధ్రాయూనివర్సిటీ) - 28
రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (అనంతపురం) - 39
లా విభాగంలో..:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా (విశాఖపట్నం) - 10

ఢిల్లీలో యూరో-6 ఇంధనం విక్రయం
దేశంలో తొలిసారిగా న్యూఢిల్లీలో ఏప్రిల్ 1 నుంచి యూరో-6(బీఎస్-6) ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్‌ను విక్రయిస్తున్నారు. దీంతో యూరో-4 నుంచి నేరుగా యూరో-6 ఇంధన వినియోగానికి వెళ్లిన మొదటి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.

ఎస్సీ, ఎస్టీ కోటాలో మినహాయింపులు ఉండవు
ఎస్సీ, ఎస్టీ కోటా ప్రయోజనాల వర్తింపులో ఆయా వర్గాలకు చెందిన సంపన్న శ్రేణిని మినహాయించలేమని కేంద్రం మార్చి 28న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ‘సంపన్న శ్రేణి’అనే సిద్ధాంతం వీలుకాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో సంపన్న శ్రేణిని సదరు కోటా ప్రయోజనాల నుంచి మినహాయించాలంటూ ‘సమతా ఆందోళన్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది.
Published date : 04 May 2018 12:54PM

Photo Stories