Skip to main content

అక్టోబర్ 2018 జాతీయం

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం
Current Affairs ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కూమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ... బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎక్కడ : న్యూఢిల్లీ

త్వరలో అతిపొడవైన రైలు-రోడ్డు వంతెన ప్రారంభం
దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 25న తెలియజేశారు. ‘బోగీబీల్ బ్రిడ్‌‌జ’ గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అసోంలోని దిబ్రుగఢ్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ను కలుపుతుంది. వంతెన కింది డెక్‌లో రెండు రైల్వే ట్రాక్‌లు, పైన డెక్‌లో మూడు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా త్వరలో మోదీ దీనిని ప్రారంభించనున్నారు. 2002లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతిపొడవైన రైలు-రోడ్డు వంతెన ప్రారంభం
ఎప్పుడు : త్వరలో
ఎక్కడ : అసోంలోని దిబ్రుగఢ్- అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్

పరిశోధనల ప్రోత్సాహానికి రెండు పథకాలు
దేశంలో మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కొత్తగా రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన’ (ఇంప్రెస్), ‘విద్యా సంబంధిత, పరిశోధనల్లో తోడ్పాటుకు పథకం’ (స్పార్క్) పేరుతో ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఈ రెండు వెబ్‌సైట్లను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అక్టోబర్ 25న ఆవిష్కరించారు. ఇంప్రెస్ పథకానికి కేంద్రం ఏటా రూ. 414 కోట్లు కేటాయిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మానవ వనరుల రంగంలోనూ పరిశోధనలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువచ్చినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంప్రెస్, స్పార్క్ పథకాల ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్
ఎందుకు : మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు

పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం
పాకిస్థాన్ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై గతంలో ఉన్న నిషేధాన్ని అక్టోబర్ 27న ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.
పాకిస్థాన్ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించింది. యునెటైడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్ సకీజ్ నిసార్ ఈ మేరకు తీర్పునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పాకిస్థాన్ సుప్రీంకోర్టు

బయో మెట్రిక్ విధానంలో ఈ-వీసా
పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ-వీసా మంజూరు చేయనున్నట్లు భారత విదేశాంగశాఖ అక్టోబర్ 28న ప్రకటించింది. ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా), మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే ఈ-వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయో మెట్రిక్ విధానంలో ఈ-వీసా
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : భారత విదేశాంగశాఖ
ఎక్కడ : ప్రపంచంలోని మరో 8 నగరాల్లో
ఎందుకు : పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు

పెట్టుబడుల విషయంలో భారత్‌కు అగ్రస్థానం
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ని స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ అక్టోబర్ 29న విడుదల చేసింది. ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ ప్రాంతాల్లో చార్టర్డ్ సంస్థ అధ్యయనం చేసి అప్లూయంట్ స్టడీని రూపొందించింది. ఈ స్టడీ ప్రకారం భారత్ లో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు. 44 శాతం మంది కెరీర్‌లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్టుబడుల విషయంలో భారత్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ
ఎక్కడ : ఆసియా

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ
‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31న ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో నర్మదా నది రూ.2,989 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
పటేల్ విగ్రహ నిర్మాణంలో టర్నర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా వ్యవహరించగా దానికి మెయిన్‌హార్డ్, మైఖేల్ గ్రేవ్‌‌స, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. విగ్రహం స్టక్చ్రర్ డిజైన్, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కాంక్రీట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది. త్రీ డెమైన్షనల్ స్కానింగ్ టెక్నిక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను ఉపయోగించి కేవలం 33 నెలల్లోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
5 జోన్లుగా విగ్రహం...
పటేల్ ఐక్యతా విగ్రహాన్ని 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్‌లో 149 మీ. విగ్రహ మే ఉంటుంది. మూడో జోన్‌లో 157 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్‌లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్‌లో పటేల్ భుజాలు, తల ఉంటుంది. మూడో జోన్ వరకు సందర్శకులను అనుమతిస్తారు. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. ఈ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.
పర్యాటకం...
ఐక్యతా విగ్రహం ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠ భారత్ భవన్, పటేల్ జీవిత విశేషాలతో మ్యూజియం, పరిశోధనా కేంద్రం కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహం నుంచి చూస్తే సర్దార్ సరోవర్ డ్యాం పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తాయి. సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. అలాగేత 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాంగా గుర్తింపు పొందింది.
మరోవైపు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మెరుగైన రవాణా సౌకర్యం, ఉపాధి, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు ఆ ప్రాంత గిరిజనులకు సమకూరుతాయనేది ప్రభుత్వ భావన.
విగ్రహం విశేషాలు...
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సాధు బెట్ ఐలాండ్, నర్మదా జిల్లా, గుజరాత్

ఎర్రకోటలో శిలాఫలకం ఆవిష్కరణ
Current Affairs నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 21న ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు.
జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. 2002లో ఈ స్మారక నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎర్రకోటలో శిలాఫలకం ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదంలో 61 మంది మృతి
పంజాబ్‌లోని అమృత్‌సర్ నగర శివార్లలో అక్టోబర్ 19న ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జోడా ఫాటక్ అనే గ్రామ సమీపంలో ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని దగ్గరలోని మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తుండగా.. జలంధర్ నుంచి అమృత్‌సర్ వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ప్రజలను ఢీకొంటూ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 61 మంది మృతి చెందగా మరో 72 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పట్టాలపై దాదాపు 300 మంది వరకు ఉండగా, రావణుడి దిష్టిబొమ్మకు అప్పుడే నిప్పుపెట్టి టపాసులు పేలుస్తుండటంతో ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు మరింతమంది పట్టాలపైకి వచ్చారని అధికారులు తెలిపారు. టపాసుల శబ్దం కారణంగా రైలు శబ్దం వినిపించకపోవడంతో ప్రజలు తొందరగా పట్టాల నుంచి పక్కకు రాలేకపోయారన్నారు. జలంధర్-అమృత్‌సర్ రైలు ప్రజలపైకి దూసుకొచ్చిన సమయంలోనే పక్కనే ఉన్న మరో ట్రాక్‌పైకి ఇంకో రైలు కూడా రావడంతో పట్టాలపై ఉన్న ప్రజలు ఎటూ తప్పించుకోలేకపోయారు. దీంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగిందని అమృతసర్-1 సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేశ్ శర్మ వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సహాయక కార్యక్రమాలు చేపట్టామనీ, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైలు ప్రమాదంలో 61 మంది మృతి
ఎప్పుడు: అక్టోబర్ 19
ఎక్కడ: పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరం

బెంగళూరులో మెన్ టూ ఉద్యమం ప్రారంభం
మహిళలపై లైంగిక వేధింపుల నిరసన ఉద్యమం ‘మీ టూ’ తరహాలో ‘మెన్ టూ (పురుషులు కూడా)’ ఉద్యమం ప్రారంభమైంది. 2017లో ఒక లైంగిక వేధింపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన మాజీ ఫ్రెంచ్ రాయబారి పాస్కల్‌మాజురి సహా ఓ 15 మంది కలిసి ఈ ఉద్యమాన్ని బెంగళూరులో అక్టోబర్ 21న ప్రారంభించారు. మహిళల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల గొంతుకగా ఇది నిలవనుందని ఈ ఉద్యమాన్ని ప్రారంభించినవారు చెబుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మెన్ టూ (పురుషులు కూడా)’ ఉద్యమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : మాజీ ఫ్రెంచ్ రాయబారి పాస్కల్‌మాజురి సహా ఓ 15 మంది
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : పురుషులపై లైంగిక వేధింపుల నిరసన తెలిపేందుకు

హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా సఫాయివాలాలు
రైల్వే శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్‌లుగా సంబోధించాల్సి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్-డీ ఉద్యోగులే సఫాయి వాలాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా సఫాయివాలాల పేరు మార్పు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : రైల్వే మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా అన్‌రిజర్వ్‌డ్ రైల్వే టికెట్ల కొనుగోలు
అన్‌రిజర్వ్‌డ్ రైల్వే టికెట్లను యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్)మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే శాఖ అక్టోబర్ 23న ప్రకటించింది. ఈశాన్య సరిహద్దు, పశ్చిమ మధ్య రైల్వే జోన్లలో మినహా మిగిలిన 15 జోన్లలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది. ప్రయాణికుల సౌకర్యార్దం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం ముంబైలో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫాం టికెట్లు, నెలవారీ పాసులను కూడా కోనుగోలు చేయవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాపంగా యూటీఎస్ సదుపాయం అందుబాటులోకి
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : రైల్వేశాఖ

శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీ
ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ ‘ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియా’ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఈ మేరకు అక్టోబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా శివపాల్ మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలనుంచి తమ పార్టీ పోటీచేస్తుందని చెప్పారు. 2018 ఆగస్టులో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మనస్పర్థల కారణంగా శివపాల్ పార్టీనుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియా’ అనే కొత్త పార్టీ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : శివపాల్‌సింగ్ యాదవ్
ఎక్కడ : ఉత్తరప్రదేశ్

2020 నుంచి బీఎస్-4 అమ్మకాలు బంద్ : సుప్రీంకోర్టు
దేశంలో 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(బీఎస్)-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాల ని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న ఆదేశించింది. అప్పటి నుంచి కేవలం బీఎస్-6 వాహనాలను మాత్రమే అమ్మాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తీర్పునిచ్చింది. దేశంలో వాయుకాలుష్యం నియంత్రించేందుకు కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. యూరో-6 ప్రమాణాలతో సమానమైన బీఎస్-6 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువస్థాయిలో వెలువడతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 నుంచి బీఎస్-4 అమ్మకాలు బంద్
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : దే శవ్యాప్తంగా
ఎందుకు : దేశంలో కాలుష్యం నియంత్రించేందుకు

లైంగిక వేధింపులపై జీవోఎం ఏర్పాటు
కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఏర్పాటు చేసింది. ఈ బృందానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించనుండగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుంది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుంది.
మహిళలకోసం షీ-బాక్స్...
మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ-బాక్స్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అక్టోబర్ 24న ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తారు. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లైంగిక వేధింపులపై జీవోఎం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు

ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన
Current Affairs దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’ (మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్‌సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. 10,975.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 271 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మ్యూజియంలో ఫ్రధానమంత్రి పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పొందుపరచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధానమంత్రుల మ్యూజియం కు శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్‌సింగ్ పూరి
ఎక్కడ : తీన్‌మూర్తి ఎస్టేట్స్, న్యూఢిల్లీ

ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్ పేరు మార్పు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా-యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్ పేరు మార్పు
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరప్రదేశ్

గ్లోబల్ ఎంప్లాయర్స్ కంపెనీల జాబితాలో ఎల్ అండ్ టీ
బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్-2018 జాబితాలో దేశీ మౌలిక రంగ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) 22వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,000 కంపెనీలతో రూపొందించిన జాబితాను ఫోర్బ్స్ అక్టోబర్ 16న విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకి చెందిన ఆల్ఫాబెట్ అగ్రస్థానం పొందింది. అలాగే మైక్రోసాఫ్ట్ రెండో స్థానం, ఆపిల్ మూడో స్థానం, వాల్ట్ డిస్నీ నాలుగోస్థానం, అమెజాన్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్.. వీటిలో అత్యంత ఉత్తమమైన ఎంప్లాయర్స్‌గా 2వేల కంపెనీలను ఎంపికచేసింది.
ఈ జాబితాలో వందలోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీలలో ఎల్ అండ్ టీ 22వ స్థానం పొందగా మహీంద్రా అండ్ మహీంద్ర 55వ స్థానం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 59, హెచ్‌డీఎఫ్‌సీ 91వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 24 దేశీ కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది.
ఈ జాబితాలో వంద తరువాత స్థానాల్లో నిలిచిన భారత కంపెనీలు

సంస్థ పేరు

స్థానం

జీఐసీ

106

ఐటీసీ

108

సెయిల్

139

సన్ ఫార్మా

172

ఏషియన్ పెయింట్స్

179

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

183

అదానీ పోర్‌‌ట్స అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్

201

జెఎస్‌డబ్ల్యూ స్టీల్

207

కోటక్ మహీంద్రా బ్యాంక్

253

హీరో మోటోకార్ప్

295

టెక్ మహీంద్రా

351

ఐసీఐసీఐ బ్యాంక్

359

విప్రో

362

హిందాల్కో

378

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

381

బజాజ్ ఆటో

417

టాటా మోటార్స్

437

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్

479

యాక్సిస్ బ్యాంక్

481

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

489

క్విక్ రివ్యూ:
ఏమిటి : బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్-2018 జాబితాలో 22వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

నేరం జరిగిన ప్రదేశం వీడియో చిత్రీకరణ
నేర విచారణను కంప్యూటరీకరించే చర్యల్లో భాగంగా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియోలో చిత్రీకరించడం తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అక్టోబర్ 16న తెలిపింది. మొదటి దశలో భాగంగా న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్ నగరాల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. తర్వాతి దశలో దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఈ వీడియో చిత్రీకరించే నింబధన అమలులో భాగంగా గుజరాత్.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘మొబైల్ పాకెట్ యాప్’ అనే అప్లికేషన్‌కు అనుసంధానమయ్యే ఒక సెంట్రల్ సర్వర్‌ను రూపొందించింది.
చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు నేర విచారణలో వీడియోగ్రఫీని ప్రవేశపెట్టేందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్ 5న కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం కేంద్ర పర్యవేక్షక బోర్డు (సీఓబీ)ని ఏర్పాటు చేసింది. సీఓబీ తొలి సమావేశం మే 24న నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరం జరిగిన ప్రదేశం వీడియో చిత్రీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్
ఎందుకు : నేర విచారణను కంప్యూటరీకరించే చర్యల్లో భాగంగా

దేశంలోనే తొలి
సొరంగ’ రైల్వే స్టేషన్ !
భారత్-చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్‌పూర్-మనాలి-లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది. ‘బిలాస్‌పూర్-మనాలి-లేహ్ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్ స్టేషన్‌ను సొరంగంలో నిర్మిస్తాం’ అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా తెలిపారు. 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా. ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్
ఎవరు: రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా
ఎక్కడ: భారత్-చైనా సరిహద్దులో
ఎందుకు : ఈ లైను భద్రతా బలగాలకు, పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షేడ్యూల్ విడుదల
Current Affairs ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అక్టోబర్ 6న షేడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ షేడ్యూల్ ప్రకారం ఛత్తీస్‌గ ఢ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, మిగతా రాష్ట్రాల్లోఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న విడుదల చే యనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్...
మొత్తం స్థానాలు :
90
రెండు దశల్లో ఎన్నికలు
తొలి దశ (18 స్థానాలు) :
నవంబర్ 12
రెండో దశ (72 స్థానాలు) : నవంబర్ 20
మధ్యప్రదేశ్
మొత్తం స్థానాలు :
230
ఒకే దశలో ఎన్నికలు : నవంబర్ 28
మిజోరం
మొత్తం స్థానాలు :
40
ఒకే దశలో ఎన్నికలు : నవంబర్ 28
రాజస్తాన్
మొత్తం స్థానాలు :
200
ఒకే దశలో ఎన్నికలు : డిసెంబర్ 7
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
మొత్తం స్థానాలు :
119
ఎన్నికల నోటిఫికేషన్ : నవంబర్ 12
నామినేషన్లకు గడువు : నవంబర్ 19
నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20
‘ఉపసంహరణ’ గడువు : నవంబర్ 22
ఒకే దశలో ఎన్నికలు : డిసెంబర్ 7
ఓట్ల లెక్కింపు తేదీ : డిసెంబ‌ర్ 11
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐదు రాష్ట్రాల ఎన్నికల షేడ్యూల్ విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ

ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 7న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని అన్నారు. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్-2018 ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా గర్హి సంప్లాలో జాట్ నేత, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రానికి ముందు రైతుల కోసం సర్ చోటూరామ్ ఎన్నో ఉద్యమాలు నడిపారని చెప్పారు. అన్నదాతలు ఆర్థికంగా బలపడేందుకు, వారికోసం సంక్షేమ చట్టాలు తీసుకువచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు.
రైల్ కర్మాగారానికి శంకుస్థాపన....
హరియాణలోని సొనిపట్ జిల్లా బర్హిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే రైల్ కోచ్ మరమ్మతు, ఆధునీకరణ కర్మాగారం ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారంలో ఏడాదికి 250 ప్యాసింజర్ కోచ్‌లకు మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టే వీలుంటుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. 160 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020-21కల్లా పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్ చోటూరామ్ విగ్రహావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : గర్హి సంప్లి, రోహ్‌తక్, హరియాణ

తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్ శాశ్వత కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞానవిద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్‌ఈఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) శాశ్వత కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 10న నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహించేందుకు, శాశ్వత భవనాల నిర్మాణం కోసం మొత్తంగా 3074.12 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు.
2021 చివరికల్లా ఐఐఎస్‌ఈఆర్ కేంద్రాల నిర్మాణం పూర్తికానుండగా ఈ విద్యాసంస్థల కోసం రెండు రిజిస్ట్రార్ ఉద్యోగాలను సృష్టించనున్నారు. 1,17,000 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఒక్కో క్యాంపస్‌లో 1,855 మంది విద్యార్థులకు సరిపోయేలా సౌకర్యాలను కల్పించనున్నారు. సైన్సు విద్యలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోధనను అందించేందుకు ఐఐఎస్‌ఈఆర్‌లను స్థాపిస్తున్నారు.
మంత్రివర్గ ఇతర నిర్ణయాలు
  • జాతీయ వృత్తి శిక్షణా మండలి (ఎన్‌సీవీటీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)లను జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్‌సీవీఈటీ)లో విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదం.
  • వృత్తి విద్య, శిక్షణకు సంబంధించిన సంస్థలను నియంత్రించే అధికారం ఎన్‌సీవీఈటీకి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, నాణ్యమైన కార్మికులను తయారుచేసేందుకు దోహద పడుతుందని కేంద్రం పేర్కొంది.
  • పర్యావరణ పరిరక్షణలో సహకారం కోసం భారత్-ఫిన్లాండ్‌ల మధ్య జరిగిన ఒప్పందానికి, పర్యాటక రంగంలో రొమేనియాతో కుదిరిన మరో ఒప్పందానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐఎస్‌ఈఆర్ శాశ్వత కేంద్రాలు ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తిరుపతి, బరంపురం

మహిళల భద్రత కోసం వొడాఫోన్ సఖి
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ‘వొడాఫోన్ సఖి’ పేరుతో మొబైల్ ఆధారిత సేఫ్టీ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు అక్టోబర్ 10న వొడాఫోన్ సఖిని ఆవిష్కరించారు. సఖి సేవల కోసం 1800123100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో కస్టమర్ ఉన్న ప్రాంతం (లొకేషన్) వివరాలు ముందుగా నమోదు చేసుకున్న 10 కాంటాక్ట్ నంబర్లకు వెళ్తుంది. మొబైల్‌లో బ్యాలెన్స్ లేనప్పటికీ 10 నిముషాలపాటు కాల్స్ చేసుకోవచ్చు. రిటైల్ ఔట్‌లెట్ వద్ద నంబర్ గోప్యత కోసం 10 అంకెల డమ్మీ నంబరును కస్టమర్‌కు కేటాయిస్తారు. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లలోనూ ఇది పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘వొడాఫోన్ సఖి సర్వీసులు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : వొడాఫోన్ ఐడియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళల భద్రత కోసం

Current Affairsవివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీంకోర్టు
వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా గల ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది.
మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని పేర్కొంది. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని.. అయితే బ్రిటిష్ కాలంనాటి ఐపీసీలోని సెక్షన్ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని తేల్చిచెప్పింది.
విడాకులకు కారణంగా చూపొచ్చు
వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహ రద్దు లేదా విడాకులు తీసుకోవచ్చని కోర్టు వివరించింది. వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497, వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సీఆర్‌పీసీలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
ఐపీసీ సెక్షన్ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
తిరోగమన చర్య అవుతుంది : జస్టిస్ దీపక్ మిశ్రా
‘వరకట్న వేధింపులు, గృహ హింసతో పోలిస్తే వివాహేతర సంబంధం పూర్తిగా భిన్నమైనది. వివాహేతర సంబంధాన్ని నేరంగా భావిస్తే...అప్పటికే వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగా లేని వారికి మరింత శిక్ష విధించినట్లవుతుంది. వివాహేతర సంబంధాన్ని నేర కోణంలోనే చూడటం తిరోగమన చర్య అవుతుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదు. వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయి.
సెక్షన్ 497 ఏం చెబుతోంది..
భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు.
వివాహేతర సంబంధాలు
ఈ దేశాల్లో నేరం..
అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, యూఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు.
ఈ దేశాల్లో నేరం కాదు..
చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్‌‌స, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోస్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, ద. కొరియా, గ్వాటెమాలా
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాహేతర సంబంధం నేరం కాదు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : సుప్రీంకోర్టు

అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం
అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు శబరిమల కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది.
శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు-1965లోని 3(బి) నిబంధనను కొట్టేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.
వివక్ష చూపలేం
భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాద న్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పును వెలువరుస్తూ... రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమని, రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : శబరిమల, కేరళ

టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో కేఐఐటీ
టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్‌‌స-2019లో భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటు లభించింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో సెప్టెంబర్ 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీగా కేఐఐటీ నిలిచింది. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది. ప్రొఫెసర్ అచ్యుతా సమంత కేఐఐటీని నెలకొల్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్-2019
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిషా

పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
‘పరాక్రమ్ పర్వ్-2018’ ఎగ్జిబిషన్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 28న ప్రారంభించారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) ఆవల భారత సైన్యం నిర్వహించిన మెరుపుదాడుల (సర్జికల్ స్ట్రైక్స్) రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు.
2016, సెప్టెంబర్ 29వ తేదీన నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలోని ఏడు ఉగ్రవాద స్థావరాలపై భారతసైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. అంతకుముందు నెలలో పాక్ రేంజర్లు జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌పై దాడికి పాల్పడడంతో భారత్ ఈ ప్రతీకార చర్యకు దిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జోధ్‌పూర్, రాజస్థాన్

హెచ్‌ఆర్డీ సమావేశంలో పాల్గొన్న మోదీ
అకడమిక్ లీడర్‌షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్’ పేరుతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్‌ఆర్డీ) న్యూఢిల్లీలో సెప్టెంబర్ 29న నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత అంటూ లేకుండాపోతే మానవ జీవితం దుర్భరమైపోతుందని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌ఆర్డీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎక్కడ : న్యూఢిల్లీ

ఐరాస సమావేశంలో ప్రసంగించిన సుష్మాస్వరాజ్
ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబర్ 29న ప్రసంగించారు.ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానంగా కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదని ఈ సందర్భంగా సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదులను కీర్తిస్తూ, ముంబై దాడుల సూత్రధారి స్వేచ్ఛగా సంచరించేందుకు అనుమతిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస సమావేశంలో ప్రసంగించిన భారత విదేశాంగ మంత్రి
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : సుష్మా స్వరాజ్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

వ్యవసాయంలో పెరిగిన మహిళలు
వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు 2015-16 సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2010-11లో 12.79 శాతం మంది మహిళా రైతులు ఉండగా, 2015-16 నాటికి 13.87 శాతానికి వారి సంఖ్య పెరిగింది. 2010-11లో సాగుభూమి 159.59 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 2015-16లో అది 1.53 శాతం తగ్గి 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది.
దేశంలో మొత్తం కమతాల సంఖ్య 5.33 శాతం పెరిగినప్పటికీ సగటు కమతం విస్తీర్ణం మాత్రం తగ్గింది. అత్యధిక కమతాలు ఉత్తరప్రదేశ్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కమతాలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తొలిరెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సాగుభూమి అత్యధికంగా రాజస్తాన్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయంలో మహిళల పెరుగుదల
ఎప్పుడు : 2015-16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా

ప్రభుత్వం ఆదీనంలోకి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ప్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెసె (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం తన ఆదీనంలోకి తీసుకుంది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అక్టోబర్ 1న అనుమతించింది. దీంతో ప్రస్తుత బోర్డును రద్దు చేసిన కేంద్రం కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు తమకు అప్పగించాలని, బోర్డును మార్చాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) పిటిషన్ వేసింది.
కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 (2), 242 ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ సంస్థ వ్యవహారాలను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించవచ్చు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత కేంద్రం స్వయంగా ఒక కంపెనీ బోర్డును తన నియంత్రణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వం ఆదీనంలోకి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్

ఫోర్బ్స్ జాబితాలో 12 భారత కంపెనీలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 250 ఉత్తమ కంపెనీలతో ఫోర్బ్స్ 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో 12 భారత కంపెనీలు చోటు సంపాందించుకున్నాయి. ఈ జాబితాలో ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 31 వ స్థానంలో నిలవగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 35 వ స్థానం పొందింది. అలాగే టాటా మోటార్స్70, టాటా స్టీల్ 131, ఎల్ అండ్ టీ 135, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 154, జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 156, మహీంద్ర అండ్ మహీంద్రా 164, ఏషియన్ పెయింట్స్ 203, స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా 227, ఐటిసి 239 స్థానాల్లో నిలిచాయి.
మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ నిలిచింది. ఈ జాబితాలో 61 కంపెనీలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో 32 కంపెనీలతో జపాన్, 19 కంపెనీలతో చైనా, ఫ్రాన్స్ (13), జర్మనీ (11) ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్-2018 జాబితాలో 12 భారత కంపెనీలు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ఫోర్బ్స్

సౌర కూటమి సమావేశంలో పాల్గొన్న మోదీ
అంతర్జాతీయ సౌర కూటమి సభ్యుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 2న నిర్వహించిన ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌తో సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 2030 కల్లా భారత్ 40శాతం శిలాజేతర ఇంధనాలను ఉత్పత్తి చేస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్’ నినాదాన్నిచ్చిన ప్రధాని.. సరిహద్దుల్లేకుండా అన్ని దేశాలు సౌరశక్తితో అనుసంధానమయ్యేలా ముందుకురావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సౌర కూటమి సభ్యుల సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 24 Oct 2018 03:36PM

Photo Stories