Skip to main content

2008 Ahmedabad Serial Blasts Case: 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు

2008 Ahmedabad bombings

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని జరిగిన 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్‌ ముజాహిదీన్‌ ముష్కరులకు మరణశిక్ష పడింది. వాళ్లను చనిపోయేదాకా ఉరి తీయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్‌ పటేల్‌ ఆదేశించారు. మరో 11 మందికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు ఫిబ్రవరి 18న ఆయన 7,000 పేజీల పైచిలుకు తీర్పు వెలువరించారు. ఒకే కేసులో ఏకంగా ఇంతమందికి మరణ శిక్ష పడటం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో 26 మందికి మరణ శిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు.

ఈ పేలుళ్ల ద్వారా..

అహ్మదాబాద్‌ పేలుళ్ల ద్వారా అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని జడ్జి తన తీర్పులో చెప్పారు. నాటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు అప్పటి మోదీ మంత్రివర్గ సహచరులు ఆనందీబెన్‌ పటేల్, నితిన్‌ పటేల్, స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్‌సింగ్‌ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్‌ అని పేర్కొన్నారు.

14 ఏళ్ల పాటు విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి 2009లో విచారణ మొదలైంది. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన 78 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు 2019లో అప్రూవర్‌గా మారారు. 49 మందిని దోషులుగా ఫిబ్రవరి 8న కోర్టు తేల్చింది. మరో 28 మందిని వదిలేసింది. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, మరొకరికి రూ.2.88 లక్షలు జరిమానా విధించారు. మరణశిక్ష పడ్డ వాళ్లలో ప్రధాన కుట్రదారులైన మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్‌ నగోరీ, కమ్రుద్దీన్‌ నగోరీ, గుజరాత్‌కు చెందిన ఖయాముద్దీన్‌ కపాడియా, జహీద్‌ షేక్, షంషుద్దీన్‌ షేక్‌ తదితరులున్నారు.

ఏం జరిగింది?

  • 2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వరుస బాంబు పేలుళ్లు వణికించాయి. 
  • సాయంత్రం 6.45 నుంచి గంటంపావు పాటు 14 చోట్ల 21 పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోయింది. 
  • 56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మరో రెండు బాంబులు పేలలేదు. 
  • ఇది తమ పనేనని సిమి కనుసన్నల్లో నడిచే ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్రకటించుకుంది. 
  • తర్వాత రెండు రోజుల్లో సూరత్‌లో 29 లైవ్‌ బాంబులు దొరకగా నిర్వీర్యం చేశారు. 
  • 2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు నిందితులు పేర్కొన్నారు. 
  • పేలుళ్ల కుట్ర 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో అడవుల్లో ఐఎం క్యాంపులో జరిగింది. 
  • దేశవ్యాప్తంగా రిక్రూట్‌ చేసుకున్న 50 మందికి అక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. 
  • పేలుళ్లకు పాల్పడుతున్నట్టు సరిగ్గా 5 నిమిషాల ముందు మీడియా సంస్థలకు ఉగ్రవాదులు ఇ–మెయిళ్లు పంపారు.

విచారణ–విశేషాలు

  • అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్‌ఐఆర్‌లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారణ చేపట్టారు.
  • ప్రస్తుత గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా సారథ్యంలో విచారణ మొదలైంది. 
  • విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. బేలా త్రివేది నుంచి ఏఆర్‌ పటేల్‌ దాకా మొత్తం 9 మంది జడ్జీలు విచారణ జరిపారు.
  • నిందితుల్లో 24 మంది 213 అడుగుల సొరంగం తవ్వి పారిపోయే ప్రయత్నం చేశారు.

చ‌ద‌వండి: ఇథీరియం అనే పేరు దేనికి సంబంధించినది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Feb 2022 12:33PM

Photo Stories