Skip to main content

సెప్టెంబర్ 2017 అంతర్జాతీయం

పర్యావరణ పరిరక్షణకు డికాప్రియో విరాళం
పపంచవ్యాప్తంగా ఉన్న 100కుపైగా పర్యావరణ పరిరక్షణ సంస్థలకు 20 మిలియన్ డాలర్లను గ్రాంటుగా అందజేయనున్నట్లు హాలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో ప్రకటించారు. భూ సంరక్షణ, సముద్ర జలాలు, జీవుల పరిరక్షణ, అడవులను కాపాడుకోవడం, అంతరించిపోతున్న జీవులను రక్షించుకోవడంతోపాటు అత్యవసరంగా నివారించాల్సిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను ఉపయోగించాలని ఆయన సూచించారు.
1998లోనే పర్యావరణ పరిరక్షణ కోసం ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన ఈ హాలీవుడ్ నటుడు.. అప్పటి నుంచి ఏదో ఓ రూపంలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యావరణ పరిరక్షణకు 20 మిలియన్ డాలర్ల గ్రాంటు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : హలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో

గూగుల్‌కి చేతికి హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం
తైవాన్‌కి చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు గూగుల్‌కి ఈ ఒప్పందం తోడ్పడుతుంది.
ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్ చేర్చుకుంటుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్ పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌టీసీలో కొంత భాగాన్ని కొనుగోలు చేయనున్న గూగుల్
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎందుకు : మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు

ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ లెక్కించనున్న నేపాల్
Current Affairs ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును తిరిగి లెక్కిస్తామని నేపాల్ తెలిపింది. 2015లో హిమాలయాల్లో సంభవించిన భీకర భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా భారత సర్వే విభాగం 1955లో ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా నిర్ధారించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తు మళ్లీ లెక్కింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నేపాల్
ఎందుకు : ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందన్న నివేదికల నేపథ్యంలో

అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం
అణు ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒడంబడికకు 50 దేశాల ఆమోదం లభించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో ఆయా దేశాలు ఒడంబడికపై సంతకం చేశాయి. దీంతో.. 90 రోజుల ఇది అమల్లోకి వస్తుంది. ఈ ఒడంబడికపై సంతకం చేసిన తొలి దేశం బ్రెజిల్.
అణు ఆయుధాల ఉత్పత్తి, ప్రయోగం, పరిశోధన, కొనుగోలు, విక్రయం, నిల్వలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది జూలై 7న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 122 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. నెదర్లాండ్స్ వ్యతిరేకించింది. అయితే.. ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగి ఉన్న దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లు.. ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో

బుల్లెట్ రైళ్ల వేగాన్ని 350 కి.మీ.కు పెంచిన చైనా
బుల్లెట్ రైళ్ల వేగాన్ని చైనా మళ్లీ గంటకు 350 కిలోమీటర్లకు పెంచింది. 2008లో ఇదే వేగంతో చైనా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే.. 2011, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించడంతో.. వేగమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయంతో అపట్లో రైళ్ల వేగాన్ని 300 కిలోమీటర్లకు కుదించారు. అదే సమయంలో జపాన్ వంటి దేశాలు తమ వేగాన్ని పెంచి, సురక్షిత ప్రయాణానికి చిరునామాగా మారుతున్న తరుణంలో.. చైనా కూడా తమ సామర్థ్యాన్ని గరిష్టస్థాయికి పెంచుకునేందుకు గత కొన్నినెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 20న బీజింగ్ నుంచి బయల్దేరిన ఫ్యూజింగ్ బుల్లెట్ రైలు 1,318 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై నగరాన్ని కేవలం 4 గంటల 28 నిమిషాల్లో చేరుకుంది. అంటే గంటకు 350 గరిష్ట వేగాన్ని అందుకుంది.

సామాజిక సేవ కోసం జుకర్‌బర్గ్ భారీ విరాళం
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా 12 బిలియన్ డాలర్లు (రూ.76,800 కోట్ల డాలర్లు) సమీకరించనున్నట్టు వెల్లడించారు. ఈ నిధులను ఆరోగ్యం, విద్యా రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. ఇందుకోసం రానున్న 18 నెలల్లో 3.5 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు షేర్లను విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఫేస్‌బుక్ వాటాలకు ఇప్పుడు చాలా విలువ ఉందని, తన వాటాలో స్వల్ప మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం కేటాయించనున్నాని ఆయన వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక సేవ కోసం 12 బిలియన్ డాలర్ల విరాళం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : మార్క్ జుకర్‌బర్గ్
ఎందుకు : కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా

ప్లాట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితా
దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్‌‌స ఇండస్ట్రీస్.. ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్ సంస్థ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో గతేడాది 14వ స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సారి 7వ స్థానానికి చేరింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. మొత్తంగా... 2017 ర్యాంకింగ్‌‌సలో 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.
అమెరికన్ సంస్థ ఎక్సాన్ మొబిల్ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్‌ప్రోమ్ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జర్మనీకి చెందిన ఇ.ఆన్ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాలో మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్

జర్మనీ చాన్స్‌లర్ పదవికి అర్హత పొందిన మెర్కెల్
జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు సెప్టెంబర్ 24న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)-క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది. దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్‌డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్‌డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ-సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జర్మనీ దిగువ సభ బుందేస్టాగ్ ఎన్నికల ఫలితాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్‌కు 33 శాతం ఓట్లు
ఎక్కడ : జర్మనీలో
ఎందుకు : వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందిన మెర్కెల్

ఉత్తర కొరియాపైనా ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రావెల్ బ్యాన్ జాబితాలోకి కొత్తగా ఉత్తర కొరియా సహా మూడు దేశాలను చేర్చారు. ఆరు ముస్లిం దేశాల (లిబియా, సూడాన్, ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా) ప్రజలకు అమెరికాలోకి ప్రవేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో నిషేధ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ ఆజ్ఞల గడువు సెప్టెంబర్ 24తో ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్తగా మరో మూడు దేశాలపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సూడాన్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. క్షిపణి, అణు పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాతోపాటు, వెనిజులా, చాద్ దేశాలపై కూడా ఆయన తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో ప్రస్తుతం అమెరికా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న మొత్తం దేశాల సంఖ్య 8కి చేరింది.

ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితా
అమెరికాకు వెలుపల అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. వీరిద్దరు బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్‌కే సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్ మూడో స్థానంలో నిలిచారు.
అమెరికాలోని అత్యంత శక్తిమంతమైన మహిళల పేరిట ఫార్చ్యూన్ ప్రకటించిన మరో జాబితాలో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్ హేవ్సన్ మూడో స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా, అమెరికా వెలుపుల శక్తిమంతమైన మహిళల జాబితా
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : పార్చ్యూన్

42 వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు
అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్‌లో ఉన్న 6.7 బిలియన్ డాలర్ల(రూ.42 వేల కోట్లు) విలువైన ఆస్తుల్ని ఆ దేశ ప్రభుత్వం సీజ్ చేసింది. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ మెయిల్ కథనం ప్రకారం దావూద్‌కు వార్విక్‌షైర్‌లో ఒక హోటల్, బ్రిటన్ మిడ్‌లాండ్ ప్రాంతంలో నివాస సముదాయాలున్నాయి. 2015లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దావూద్ ఆస్తుల వివరాల జాబితాను అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్‌కు అందచేశారు. ఆ జాబితాలో లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దావూద్, అతని సన్నిహితుల పేరిట ఇళ్లు, ఫ్లాట్స్, హోటల్స్ వివరాలు ఉన్నాయి.

సింగపూర్ అధ్యక్షురాలిగా హలీమా
Current Affairs ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ సింగపూర్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఒక మహిళ దేశ అత్యున్నత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. నలుగురు ప్రత్యర్థులూ అర్హత ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో.. ఓటింగ్ లేకుండానే ఆమె ఎన్నికయ్యారు.
63 ఏళ్ల హలీమా సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా, అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున రెండు దశాబ్దాలు ఎంపీగా కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : హలీమా యాకూబ్
ఎక్కడ : సింగపూర్

చైనాలో బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ మూసివేత
క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద బిట్‌కాయిన్ ఎక్స్చేంజీల్లో ఒకటైన బీటీసీచైనా (బిట్‌కాయిన్ చైనా) మూతపడనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 30 నుంచి తమ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 4న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక పత్రం విడుదల చేసిన దరిమిలా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీటీసీచైనా మూసివేత
ఎక్కడ : చైనాలో
ఎవరు : బిట్‌కాయిన్ చైనా సంస్థ
ఎందుకు : క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో

అమెరికాతో పోటీ పడటమేతమ లక్ష్యం: ఉత్తర కొరియా
సైనిక సంపత్తి విషయంలో అమెరికాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సెప్టెంబర్ 16న ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి

సాయుధ సిబ్బంది వాహకాలు

2,500

యుద్ధ ట్యాంకులు

4,060

ఆర్టిల్లరీ, ఎయిర్ డిఫెన్‌‌స గన్‌‌స

32,100

సైన్యం

10, 20,000

యుద్ధ విమానాలు

545

హెలికాప్టర్లు

286

ప్రధాన యుద్ధ నౌకలు

3

తీరప్రాంత గస్తీ నౌకలు

383

ల్యాండిగ్‌క్రాఫ్ట్+హోవర్ క్రాఫ్ట్

267

జలాంతర్గాములు

70


నేపాల్ సరిహద్దుకు చైనా రోడ్డు
నేపాల్ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి G - 318ని, టిబెట్‌లోని షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన 40 కిలో మీటర్ల పొడవైన రోడ్డును చైనా సెప్టెంబర్ 18న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని పౌర అవసరాలతోపాటు మిలిటరీ సేవలకు కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ రహదారి ద్వారా దక్షిణాసియా ప్రాంతాల్లోకి చేరుకోవడానికి చైనాకు సులభమవుతుంది. టిబెట్ రాజధాని లాస, షిగాసే నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు సమాంతరంగా కొత్త రోడ్డు మార్గం ఉంది. జీ 318 రహదారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరి నుంచే వెళ్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ సరిహద్దు నుంచి షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన రోడ్డు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : చైనా

దక్షిణ కొరియా, జపాన్‌తో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
దక్షిణ కొరియా, జపాన్‌తో సంయుక్తంగా అమెరికా సైనిక బలగాలు సెప్టెంబర్ 18న శక్తిమంతమైన అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్ సమీప ప్రాంతాల మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు బీ-1బీలు, నాలుగు ఎఫ్-35బీ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా బలగాలకు చెందిన నాలుగు ఎఫ్-15కే యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించిన మూడు రోజుల తర్వాత అమెరికా ఈ విన్యాసాలు నిర్వహించింది

ఐరాస వేదికగా ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరిక
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ఉత్తర కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని తేల్చిచెప్పారు.
భూమండలంపై ఏ దేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ వంటి అణ్వాయుధాలు, మిసైళ్లు కలిగిన నేరస్తులుండరని ట్రంప్ అన్నారు. కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా సంబోధించారు. రాకెట్ మ్యాన్ ఆత్మహత్య మిషన్‌లో ఉన్నారని ట్రంప్ హెచ్చరించారు.
ఉగ్రసాయాన్ని ఉపేక్షించం
ఈ ప్రసంగంలోనే పరోక్షంగా పాకిస్తాన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి సాయం చేస్తున్న దేశాలను గుర్తించి వారిని బాధ్యులుగా చేయాలన్నారు. గత నెలలో పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానుకోవాలంటూ ట్రంప్ నేరుగా తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తర కొరియాకు హెచ్చరిక
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : ఐరాస వేదికగా
ఎందుకు : ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షల నేపథ్యంలో

హెచ్-1బీ వీసా ప్రక్రియను పునరుద్ధరించిన అమెరికా
ఐదు నెలల కిందట అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్-1బీ వర్క్ వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసింది. తిరిగి సెప్టెంబర్ 18న దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించింది. ఈ మేరకు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించినట్టు ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరానికి 65 వేల వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్ - 1బీ వీసా ప్రక్రియ పునరుద్ధరణ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : అమెరికా

టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2018
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018 వివరాలను సెప్టెంబర్ 6న ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, విదేశీ విద్యార్థుల శాతం, బాల, బాలికల నిష్పత్తి, బోధన, పరిశోధన, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ ప్రకారం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3వ స్థానంలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకులివ్వగా మన దేశంలోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స గతేడాది 201-250 మధ్య స్థానంలో నిలవగా, ఈసారి 250-300 మధ్య ర్యాంకుకు పడిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ 801-1000 స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : టైమ్స్
ఎక్కడ : తొలి స్థానంలో ఆక్‌్రఫర్డ్ యూనివర్సిటీ

2040 నాటికి ఫ్రాన్స్‌లో చమురు ఉత్పత్తులపై నిషేధం
భూతాపాన్ని తగ్గించేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 2040 నాటికి దేశంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తి నిషేధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఇందుకోసం కొత్త బిల్లును తీసుకురానుంది. ఇప్పటికే చమురు తవ్వకాల అనుమతులకు సంబంధించిన లెసైన్‌‌సలను రెన్యువల్ చేయకూడదని ముసాయిదా బిల్లులో పేర్కొన్న ఫ్రాన్‌‌స.. చట్టాన్ని చేసి, అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే చమురు, గ్యాస్ ఉత్పత్తిని నిషేధించే తొలి దేశంగా ఫ్రాన్‌‌స నిలిచిపోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2040 నాటికి చమురు ఉత్పత్తులపై నిషేధం
ఎవరు : ఫ్రాన్స్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, భూతాపాన్ని తగ్గించేందుకు

పాక్‌కు చెందిన హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం
పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హబీబ్ బ్యాంక్ లిమిటెడ్(హెచ్‌బీఎల్) న్యూయార్క్ శాఖను మూసివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కట్టడికి నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో పాటు హబీబ్ బ్యాంకుపై 225 మిలియన్ డాలర్ల(రూ.14,385 కోట్లు) జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. 2006 ఒప్పందం ప్రకారం లోపాలను సరిదిద్దుకోవడానికి పలు అవకాశాలు ఇచ్చినప్పటికి హబీబ్ బ్యాంకు వాటిని వినియోగించుకోలేదని డీఎఫ్‌ఎస్ సూపరింటెండెంట్ మారియావుల్లో తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎందుకు : అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు కారణంగా

ఫ్లోరిడాలో పెను విధ్వంసం సృష్టించిన 'ఇర్మా'
హరికేన్ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 10న ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా ధాటికి ఆ రాష్ట్ర తూర్పు తీరంలో ఊహించని స్థాయిలో ఆస్తినష్టం చోటుచేసుకుంది. హరికేన్ ప్రభావం ఫ్లోరిడాతో పాటు జార్జియా, అలబామా, దక్షిణ, ఉత్తర కరోలినాల్లో కనిపించింది.
హార్వీ.. ఇర్మా.. ఎందుకీ పేర్లు?
తుపానుల గురించి సమాచారం అందించడానికి, ప్రజలను సులభంగా అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి మనుషుల పేర్లను పెట్టే విధానాన్ని అమెరికా తుపానుల కేంద్రం 1950ల్లో ప్రారంభించింది. 1953 తర్వాత తుపానులకు మహిళల పేర్లనే పెట్టేవారు. 1979 నుంచి మగవారి పేర్లను కూడా పెట్టడం ప్రారంభించారు. తుపాన్లకు ఏ పేరు పెట్టాలో తెలుపుతూ ప్రపంచ వాతావరణ సంస్థ వద్ద ముందుగానే ఒక జాబితా సిద్ధంగా ఉంటుంది. ఇలా ఒక్కో ఏడాదిలో వచ్చే తుపాన్లకు ఒక జాబితా ఉంటుంది. అలాగే ప్రతి ఆరేళ్లకూ అవే పేర్లు పునరావృతమవుతుంటాయి. అంటే 2017లో తుపాన్లకు పెట్టిన పేర్లనే 2023లోనూ మళ్లీ వాడతారు. ప్రాంతాన్ని బట్టి తుపానుల పేర్లు మారుతుంటాయి. అయితే ఏవైనా తుపాన్లు తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించి, చరిత్రలో మిగిలిపోయేలా నష్టాన్ని కలిగిస్తే మాత్రం వాటి పేర్లను మళ్లీ వాడరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పెను విధ్వంసం సృష్టించిన హరికేన్ ఇర్మా
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎక్కడ : ఫ్లోరిడా, అమెరికా

స్పెయిన్‌లో ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా
ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య సంస్థలకు అందకుండా నిలువరించలేకపోయిందంటూ స్పెయిన్ సమాచార రక్షణ సంస్థ ఫేస్‌బుక్‌కు 1.2 మిలియన్ యూరో(రూ.9.18 కోట్ల)ల జరిమానా విధించింది. ఖాతాదారుల నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోకుండా వారి ఆలోచన విధానం, లింగం, మత విశ్వాసాలు, వ్యక్తిగత అభిరుచులు తదితర అంశాలను ఫేస్‌బుక్ సేకరించిందని ఆరోపించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఫేస్‌బుక్‌కు రూ.9.18 కోట్ల జరిమానా
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : స్పెయిన్ సమాచార రక్షణ సంస్థ
ఎందుకు : ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య సంస్థలకు అందకుండా నిలువరించలేకపోయినందుకు

బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
బ్రెగ్జిట్ (యూరప్ కూటమి (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం)కు సంబంధించిన ఓ బిల్లుకు బ్రిటిష్ పార్లమెంటు సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. దీంతో బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరెసా మే ప్రభుత్వం మరో ముందడుగు వేసినటై్లంది. ఈ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 290 ఓట్లు పడ్డాయి. తదుపరి దశలో ఈ బిల్లును ఎంపీలు క్షుణ్నంగా పరిశీలిస్తారు. 1972 నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. అలాగే ఈయూ చట్టాలను ఈ బిల్లు యూకే (యునెటైడ్ కింగ్‌డమ్) చట్టాలుగా మారుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : బ్రిటన్ పార్లమెంట్
ఎందుకు : ఈయూ చట్టాలను యూకే చట్టాలుగా మార్చేందుకు


ఉత్తర కొరియాపై ఐరాస కఠిన ఆంక్షలు
ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి కఠిన ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఉత్తర కొరియాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెప్టెంబర్ 12న ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఉత్తర కొరియా ఇంధన దిగుమతులు, వస్త్రాల ఎగుమతిపై నిషేధం విధించినట్లయింది.
అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియాను ప్రపంచం ఎప్పటికీ ఆమోదించదని, ఇప్పటికై నా ఆ దేశం అణు ప్రయోగాలు ఆపకపోతే.. తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ హెచ్చరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఉత్తర కొరియాపై ఆంక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : వరుస క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో

ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కెన్యా కఠినచట్టం
Current Affairs
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ కెన్యా ప్రపంచంలోకెల్లా కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆ దేశంలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, విక్రయం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. నిబంధనలను ఉల్లంఘించిన వారు 4 ఏళ్ల జైలు శిక్ష లేదా 40 వేల డాలర్ల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కఠినమైన చట్టం
ఎప్పుడు : ఆగస్టు 2017
ఎవరు : కెన్యా
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం

భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు
రెల్వే రంగంలో సహకారానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే.. నల్లధనం, పన్ను ఎగవేతల నిర్మూలనకు పరస్పర సహకారం కొనసాగించాలని భారత్, స్విట్జర్లాండ్‌లు నిర్ణయించాయి. ఇందుకు ఉన్న అన్ని మార్గాలను మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : రైల్వే రంగంలో సహకారానికి సంబంధించి

పాక్‌కు 25.5 కోట్ల డాలర్ల యూఎస్ సాయం
పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,600 కోట్లు) విలువైన మిలిటరీ సాయాన్ని అందించనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 30న తెలియజేసింది. అయితే పాకిస్తాన్‌లో తలదాచుకొంటూ అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సైనికులపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ సాయం అందుతుందని షరతు విధించింది. ఉగ్రవాదులపై పాకిస్తాన్ సమర్థవంతంగా పోరాడిందా లేదా అనే విషయాన్ని విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ నిర్ధారిస్తారనీ, పాక్ పనితీరుతో ఆయన సంతృప్తి చెందితేనే 25.5 కోట్ల డాలర్ల నిధులు విడుదలవుతాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల మిలిటరీ సాయం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అమెరికా

3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం చేసుకున్న అమెరికా
అమెరికా-రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్‌ల్లోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా సెప్టెంబర్ 2న స్వాధీనం చేసుకుంది. గత నెలలో తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిని రష్యా సగానికి పైగా తగ్గించింది. దీనికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యకలాపాలకు రష్యా ఈ కార్యాలయాలను ఇకపై ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భద్రత, నిర్వహణ సహా ఈ మూడు కార్యాలయాలూ పూర్తి స్థాయిలో తమ అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : అమెరికాలో

‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. ఎన్‌డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. ఎన్‌డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)

మయన్మార్ నుంచి బంగ్లాకు రోహింగ్యా శరణార్థులు
మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే(ఆగస్టు 21-సెప్టెంబర్ 1) దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.
బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు.. భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 4న కేంద్రాన్ని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్‌కు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : మయన్మార్ నుంచి
ఎందుకు : మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల

జియామెన్‌లో 9వ బ్రిక్స్ సదస్సు
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కింది. చైనాలోని జియామెన్‌లో సెప్టెంబర్ 3 - 5 వరకు జరిగిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) సదస్సు డిక్లరేషన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా ఉగ్రసంస్థలపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. పాక్ పేరెత్తకుండానే.. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. సమావేశాల ముగింపు సందర్భంగా 43 పేజీల జియామెన్ డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాగా.. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై చర్చ జరగటం ఇదే తొలిసారి.
ఉగ్రవాదంపై ఆందోళన
  • బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదం అంశాన్ని మోదీ లెవనెత్తారు. దీనికి ఇతర నేతల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో వారు కూడా మోదీ ప్రతిపాదనను సమర్థించారు. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ (ఈటీఐఎమ్), ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తెహ్రికే తాలిబాన్, హిజ్బుత్ తహ్రీర్ వంటి సంస్థలు శాంతికి విఘాతం కల్పించటంపై బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు తుర్కిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఈటీఐఎమ్ చేస్తున్న విధ్వంసంపై ప్రత్యేకంగా చర్చించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లనున్నట్లు సభ్య దేశాలు పేర్కొన్నాయి.
  • సాంప్రదాయ వైద్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని కూడా సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎబోలా, హెచ్‌ఐవీ, క్షయ, మలేరియాతోపాటుగా ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది.
  • ఉత్తరకొరియా అణుపరీక్షలపైనా బ్రిక్స్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీ ప్రసంగం
ప్రపంచంలోని ఓపెన్ ఎకానమీల్లో ఒకటిగా భారత్ వేగంగా పరిణామం చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిందని వెల్లడించారు. చెల్లింపులు, లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చేలా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు స్థానికంగా తయారీని ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారిగా 40 శాతానికి చేరాయని.. 2016-17లో రూ.3.86 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని మోదీ వెల్లడించారు. పేదరిక నిర్మూలనతోపాటుగా వైద్యం, పారిశుద్ధ్యం నైపుణ్యం, ఆహార భద్రత, లింగ సమానత, విద్యుత్, విద్య రంగాలపై భారత్ మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు.
  • సౌరశక్తి వినియోగాన్ని పెంచే ఎజెండాతో అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)ని మరింత బలోపేతం చేసే విషయంలో బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
బ్రిక్స్ దేశాలకూ రేటింగ్ ఏజెన్సీ
ఇప్పటిదాకా క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్‌ఏ (క్రెడిట్ రేటింగ్) మార్కెట్లో ఎస్‌అండ్‌పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికావే.
నాలుగు ఒప్పందాలు ..
సదస్సు సందర్భంగా బ్రిక్స్ కూటమిలో భారత్ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017-2020), బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
బ్రిక్స్ దేశాల గణాంకాలు..
  • ఆర్థికాభివృద్ధిలో బ్రిక్స్ దేశాల వాటా 50 శాతం.
  • ప్రపంచ జనాభాలో 42.58 శాతం మంది బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు.
  • బ్రిక్స్ దేశాల విస్తీర్ణం 26.6 శాతం.
  • 2015 నాటి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా 22.53 శాతం.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వాటా 14.91 శాతం.
  • ప్రపంచ బ్యాంకులో ఓటింగ్ హక్కులు - 13.24 శాతం.

అక్రమ వలసదారులుగా అమెరికాలోని స్వాప్నికులు
చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారిని అమెరికాలో స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. ట్రంప్ తాజా నిర్ణయంతో 7 వేల మంది భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన, సరైన అనుమతి పత్రాల్లేని 8 లక్షల మందిపై ప్రభావం పడనుంది. స్వాప్నికుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉంది.
డ్రీమర్లు అమెరికాలోనే నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు చట్టపరంగా వెసులుబాటు కల్పిస్తూ ఒబామా 2012 ‘బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా (డీఏసీఏ)’ సహాయ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తాజాగా ట్రంప్ ఈ కార్యక్రమాన్నే రద్దు చేశారు. దీంతో వారంతా అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వాప్నికులను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : అమెరికాలో
Published date : 16 Sep 2017 02:48PM

Photo Stories