Skip to main content

ఫిబ్రవరి 2021 అంతర్జాతీయం

దక్షిణాసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ
Current Affairs
భారత్‌కు పొరుగు దేశాలైన 10 దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలతో కలిసి ‘‘కోవిడ్‌–19 మేనేజ్‌మెంట్‌: ఎక్స్‌పీరియన్స్, గుడ్‌ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్‌’’ పేరిట ఫిబ్రవరి 18న నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. దక్షిణాసియా దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు.

ఫేస్‌బుక్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్‌ సంస్థ ఫేస్‌బుక్‌ తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్‌బుక్‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్‌బుక్‌ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది.
ఆస్ట్రేలియా రాజధాని: కాన్‌బెర్రా; కరెన్సీ: ఆస్టేలియన్‌ డాలర్‌
ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానమంత్రి: స్కాట్‌ మోరిసన్‌

రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించిన అరబ్‌ దేశం?
అరబ్‌ దేశం సౌదీ అరెబియా... తమ దేశ రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించింది. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విజన్‌ 2030లో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియన్‌ ఆర్మీ, రాయల్‌ సౌదీ వైమానిక దళం, రాయల్‌ సౌదీ నావికాదళం, రాయల్‌ సౌదీ వ్యూహాత్మక మిస్సైల్‌ ఫోర్స్, ఇతర సాయుధ బలగాలు, సైనిక వైద్య సేవారంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ఫిబ్రవరి 22న ప్రకటించింది.
సౌది అరేబియా రాజధాని: రియాద్‌; కరెన్సీ: రియాల్‌
సౌది అరేబియా ప్రస్తుత రాజు: సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌
సౌది అరేబియా యువరాజు: మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌ సౌద్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగంలోకి మహిళలకు ప్రవేశం కల్పించిన అరబ్‌ దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : సౌదీ అరెబియా
ఎక్కడ : సౌదీ అరెబియా
ఎందుకు : మహిళాభ్యున్నతి కోసం రూపొందించిన విజన్‌ 2030 సంస్కరణల్లో భాగంగా

ఆఫ్రికా దేశం ఘనా రాజధాని నగరం ఏది?
భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న ‘‘కోవిషీల్డ్‌’’ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి. నిరుపేద దేశాలకు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసుల్ని పంపించారు. కోవాగ్జ్‌ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే. యూనిసెఫ్‌ ఆర్డర్‌ చేసిన ఈ కరోనా టీకా డోసులు అక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 24న చేరుకున్నాయి. కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘనా కూడా ఉంది. ఘనా జనాభా 3 కోట్లు. ఈ దేశంలోఇప్పటివరకు 81 వేల కేసులు, 600మరణాలు సంభవించాయి.
డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్‌ గ్రూప్‌ గవీ, కొయిలేషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్‌ సంయుక్తంగా పేద దేశాలను ఆదుకోవడానికి కోవాగ్జ్‌ కార్యక్రమం ప్రారంభించాయి.
ఘనా రాజధాని: అక్రా; కరెన్సీ: ఘనా సెడి
ఘనా ప్రస్తుత అధ్యక్షుడు: నానా అకుఫో–అడో
ఘనా ప్రస్తుత ఉపాధ్యక్షుడు: మహాముడు బావుమియా
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఘనా దేశానికి చేరుకున్న ‘‘కోవిషీల్డ్‌’’ టీకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎక్కడ : అక్రా అంతర్జాతీయ విమానాశ్రయం, ఘనా
ఎందుకు : ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్‌ కార్యక్రమంలో భాగంగా

ఇటీవల పాక్‌ భూభాగంలో ఏ దేశం సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది?
Current Affairs
పాకిస్తాన్‌ భూభాగంలో ఫిబ్రవరి 2న తాము సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినట్లు ఇరాన్‌ ఎలైట్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్‌ ఉల్‌–అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్‌ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది.
2018, అక్టోబర్‌ 16న...
పాకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్‌ అయిన జైష్‌ ఉల్‌–అదల్‌ 2018, అక్టోబర్‌ 16న 12 మంది ఐఆర్‌జీసీ గార్డులను అపహరించింది. పాక్‌–ఇరాన్‌ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్‌జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఇరాన్‌ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది.
ఉగ్రవాద సంస్థ జైష్‌ ఉల్‌–అదల్‌... ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్‌ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇటీవల పాక్‌ భూభాగంలో ఏ దేశం సర్జికైల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది?
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : ఇరాన్‌
ఎక్కడ : బలూచిస్తాన్, పాకిస్తాన్‌
ఎందుకు : జైష్‌ ఉల్‌–అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్‌ గార్డులను విడిపించేందుకు

ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు?
మయన్మార్‌ సైనిక పాలకులు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అంగ్‌సాన్‌సూకీ సహా ప్రజాప్రభుత్వాన్ని గద్దె దింపిన మిలటరీ జుంటా... ప్రజాందోళనలు విస్తరిస్తుండటంతో ఈ చర్య తీసుకుంది. సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ దేశంలోని అతిపెద్ద నగరం యాంగూన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్ని నిలిపేసింది. మయన్మార్‌లో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ కొనసాగుతోందని.... లండన్‌ కేంద్రంగా ఉన్న ఇంటర్నెట్‌ అంతరాయాలు, నిషేధాలను పసిగట్టే ‘నెట్‌బ్లాక్స్‌’ సంస్థ తెలిపింది.
మయన్మార్‌(బర్మా) రాజధాని: న్యేఫిడా(Naypyidaw)
మయన్మార్‌ కరెన్సీ: క్యాట్‌ (kyat)
మయన్మార్‌ అధికార భాష: బర్మీస్‌(Burmese)
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : మయన్మార్‌ సైనిక పాలకులు
ఎక్కడ : మయన్మార్‌
ఎందుకు : సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు విస్తరిస్తుండటంతో

ఇంధన వినియోగం విషయంలో భారత్‌ స్థానం?
భారత్‌లో ఇంధన వినియోగం భారీగా పెరుగుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న ‘‘ఐఈఏ ఇండియా ఎనర్జీ అవుట్‌లుక్‌–2021’’ నివేదికను విడుదల చేసింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే 2030 నాటికి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)ను అధిగమిస్తుందని, రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతుందని విశ్లేషించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
  • ఇంధన వినియోగం విషయంలో నాల్గవ అతిపెద్ద దేశంగా ప్రస్తుతం భారత్‌ ఉంది. చైనా, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
  • విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి వంటి అంశాలు భారత్‌ ఇంధన అవసరాలను పెంచనున్నాయి.
  • 2000 తరువాత భారత్‌ ఇంధన డిమాండ్‌ రెట్టింపయ్యింది. బొగ్గు, ఆయిల్‌ భారత్‌ ప్రధాన ఇంధన వనరులుగా ఉన్నాయి.
  • సిమెంట్, స్టీల్, విద్యుత్‌ రంగాలకు గణనీయమైన డిమాండ్‌ పెరగనుంది.
  • సాంప్రదాయేతర ఇంధన వనరులపై భారత్‌ అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
  • 2019–40 మధ్య ప్రపంచం మొత్తం ఇంధన డిమాండ్‌లో భారత్‌ వాటా పావుశాతం ఉంటుంది. అప్పటికి ఎకానమీ విలువ 8.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది.
  • 2040 నాటికి భారత్‌ విద్యుత్‌ వ్యవస్థ కూడా యూరోపియన్‌ యూనియన్‌కన్నా భారీగా ఉండే వీలుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐఈఏ ఇండియా ఎనర్జీ అవుట్‌లుక్‌–2021 విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)
ఎందుకు : భారత్‌లో ఇంధన వినియోగ వివరాలు వెల్లడించేందుకు

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం దావోస్‌ సదస్సు
Current Affairs
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌)కు సంబంధించిన దావోస్‌ ఎజెండా సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 28న ప్రసంగించారు. జనవరి 24 నుంచి 29 దాకా జరిగిన ఈ ఆన్‌లైన్‌ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక, పర్యావరణ, సామాజిక, సాంకేతిక సవాళ్లు, టీకాల ప్రక్రియ, ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిపారు.
సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్‌ సహకారం అందిస్తుందని అన్నారు. ‘చాలా దేశాలకు కోవిడ్‌ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు. దావోస్‌ నగరం స్విట్జర్లాండ్‌ దేశంలో ఉంది.
స్విట్జర్లాండ్‌ రాజధాని: బెర్న్‌; కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌
స్విట్జర్లాండ్‌ ప్రస్తుత అధ్యక్షుడు: గై పార్మెలిన్‌
స్విట్జర్లాండ్‌ ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఇగ్నాజియో కాసిస్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ ఎజెండా సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్‌

వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్‌ స్థానం?
కొత్తగా ఆవిష్కరించిన ఆరోగ్య సూచీ ప్రమాణాలను బట్టి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 11 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) జనవరి 28న విడుదల చేసిన ‘‘ఆసియా–పసిఫిక్‌ పర్సనలైజ్డ్‌ హెల్త్‌ ఇండెక్స్‌’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఇండెక్స్‌లో సింగపూర్‌ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్‌ తర్వాత తైవాన్‌ రెండో స్థానంలో, జపాన్‌ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి.
11 ఆసియా పసిఫిక్‌ దేశాలు...
ఆస్ట్రేలియా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్‌ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, న్యూజీలాండ్‌ దేశాలలో వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నాయా? అనే విషయంపై అధ్యయనం చేసి ‘ఆసియా–పసిఫిక్‌ పర్సనలైజ్డ్‌ హెల్త్‌ ఇండెక్స్‌’ను రూపొందించారు. 27 విభిన్న ప్రమాణాల ఆధారంగా నాలుగు కేటగిరీల్లో వ్యక్తిగత ఆరోగ్య సూచీని కొలుస్తున్నారు. ఆరోగ్య సమాచారం విషయంలో భారత్‌ 41వ స్కోరుతో పదో స్థానం పొందింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో భారత్‌ 10వ స్థానం
ఎప్పుడు: జనవరి 28
ఎవరు: ఆసియా–పసిఫిక్‌ పర్సనలైజ్డ్‌ హెల్త్‌ ఇండెక్స్‌
ఎక్కడ: 11 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో

పాకిస్తాన్‌కు చైనా అందజేసిన అధునాతన యుద్ధనౌక పేరు?
లాంగ్‌రేంజ్‌ మిస్సైల్స్, మెరుగైన రాడార్‌ వ్యవస్థతో కూడిన అధునాతన యుద్ధనౌక ‘‘టైప్‌054ఏబైపీ’’ను పాకిస్థాన్‌కు చైనా జనవరి 29న అందజేసింది. టైప్‌054ఏబైపీ యుద్ధనౌకలు నాలుగింటిని నిర్మించి ఇవ్వాలని 2017లో చైనాకు పాక్‌ కాంట్రాక్టు ఇచ్చింది. వీటిలో తొలినౌకను 2020, ఆగస్టులో పాక్‌కు అందించారు. తాజాగా రెండో నౌకను పాక్‌కు చైనా అందించింది. ఈ నౌకలను స్టెల్త్‌ మోడ్‌లో కూడా వాడవచ్చు. పాక్‌కు అన్ని రకాలుగా ఆయుధ సహకారం అందిస్తున్న చైనా, పాక్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: పాకిస్తాన్‌కు అధునాతన యుద్ధనౌక ‘‘టెప్‌054ఏబైపీ’’ అందజేత
ఎప్పుడు: జనవరి 29
ఎవరు: చైనా
ఎందుకు: 2017లో పాకిస్తాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు

ఆక్స్‌ఫర్డ్‌ హిందీ వర్డ్‌ ఆఫ్‌–2020గా ఎంపికైన పదం?
2022 సంవత్సరంలో హిందీ భాషలో అత్యంత పాపులర్‌ అయిన పదంగా ఆక్స్‌ఫర్డ్‌ హిందీ విభాగం వారు ‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని ఎంపిక చేశారు. కోవిడ్‌–19 రికవరీ ప్యాకేజీ సమయంలో ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదం విరివిగా వాడుకలోకి వచ్చింది. ఏడాది కాలంతో అత్యంత ప్రభావం చూపడంతో పాటు, సంస్కృతిని, సంప్రదాయాలను సూచించే పదాలను వర్డ్‌ ఆఫ్‌ ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటిస్తుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: ఆక్స్‌ఫర్డ్‌ హిందీ వర్డ్‌ ఆఫ్‌–2020గా ఎంపికైన పదం
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: ఆత్మనిర్భరత
ఎందుకు: ఏడాది కాలంతో అత్యంత ప్రభావం చూపడంతో

వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ గ్రూప్‌లో చేరిన దేశాలు?
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల అవకాశాలను పెంచేందుకు ఉద్దేశించిన వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ (డబ్ల్యూఎల్‌పీ) గ్రూప్‌లో భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు చేరాయి. భారత్‌లోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్‌ కంటైయినర్‌ టెర్మినల్, ఎమిరేట్స్‌ స్కైకార్గో తమ భాగస్వాములుగా ఉంటాయని డబ్ల్యూఎల్‌పీ ఫిబ్రవరి 3న పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్‌ భాస్కరన్‌ ఉన్నారు.
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్‌ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ కసరత్తు చేస్తోంది. కొలంబియా, సెనెగల్, కజక్‌స్థాన్, బ్రెజిల్, ఉరుగ్వే తదితర దేశాలు ఇప్పటికే ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: వరల్డ్‌ లాజిస్టిక్స్‌ పాస్‌పోర్ట్‌ (డబ్ల్యూఎల్‌పీ) గ్రూప్‌లో చేరిక
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: భారత్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా
ఎందుకు: వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల అవకాశాలను పెంచుకునేందుకు

వూహాన్‌ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం
కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం జనవరి 31న చైనాలోని వూహాన్‌లో ఉన్న హూనన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ను సందర్శించింది. 2019 ఏడాదిలో కరోనా వైరస్‌ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. ఈ మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్‌ నుంచే కరోనా వైరస్‌ పుట్టిందన్న వాదన ఉంది. అయితే దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: వూహాన్‌లో ఉన్న హూనన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ సందర్శన
ఎప్పుడు: జనవరి 31
ఎవరు: డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం
ఎక్కడ: వూహాన్, చైనా
ఎందుకు: కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు

ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నివేదికను ఆవిష్కరించిన అంతర్జాతీయ సంస్థ?
ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాటర్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌(UNU-INWEH) అనే సంస్థ ‘‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌’’ నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను... ఐరాస తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు....
  • ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేశారు. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది.
  • కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నారు.
  • 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది.
  • నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి.
  • ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి ఉంది.
  • కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి.
భారతదేశంలో...
  • భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది.
  • దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి.
  • 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్‌ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు: ఫిబ్రవరి 2
ఎవరు: యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాటర్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌(UNU-INWEH)
ఎందుకు: ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై చేసిన అధ్యయన వివరాలను వెల్లడించేందుకు

దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఏ దేశ మిలటరీ ప్రకటించింది?
మయన్మార్‌ పాలన మరోసారి సైనిక జుంటా(మిలటరీ సమూహం) చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు తమ ఆధీనంలో ఉంటుందని ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం ప్రకటించింది. దేశ అగ్రనేత, కౌన్సిలర్‌ హోదాలో ఉన్న అంగ్‌సాన్‌ సూకీ, అధ్యక్షుడు విన్‌ మియింత్‌ సహా సీనియర్‌ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపింది. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఔంగ్‌ హ్లయింగ్‌ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్‌ స్వే ఉంటారని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’ టీవీ తెలిపింది.
కారణం ఇదే...
2020, నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు మిలటరీ తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది.
మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే..
1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్‌ వారినుంచి స్వాతంత్రం లభించింది.
1962: మిలటరీ నేత నీ విన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు.
1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్‌ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు.
1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్‌ అరెస్టు చేశారు.
1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది.
1991, అక్టోబర్‌: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.
2010, నవంబర్‌ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.
2010, నవంబర్‌ 13: దశాబ్దాల హౌస్‌ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు.
2012: పార్లమెంట్‌ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు.
2015, నవంబర్‌ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి కట్టబెట్టింది.
2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.
2019, డిసెంబర్‌ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు.
2020, నవంబర్‌ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి మరోమారు మెజార్టీ దక్కింది.
2021, ఫిబ్రవరి 1: ఎన్నికల్లో జరిగిన అక్రమాల కారణంగా దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: మయన్మార్‌ పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటన
ఎప్పుడు: ఫిబ్రవరి 1
ఎవరు: మయన్మార్‌ సైన్యం
ఎందుకు: దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లిందని
Published date : 11 Mar 2021 12:24PM

Photo Stories