Skip to main content

జనవరి 2021 అంతర్జాతీయం

యూఎస్, రష్యా అణు ఒప్పందం మరో అయిదేళ్లు
Current Affairs
అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించింది. ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించారు. దీంతో జాతి ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ తాజా నిర్ణయం తీసుకున్నారని అధ్యక్షభవనం వైట్ హౌస్ జనవరి 22న తెలిపింది. అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్‌హెడ్‌లను మోహరించడానికి వీల్లేదు.

ఇథియోపియాలో నరమేధం
Current Affairs
ఇథియోపియాలోని దక్షిణ బెనిషంగూల్-గుముజ్ రీజియన్‌లో జనవరి 13న నరమేధం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 80 మందికిపైగా మరణించినట్లు ఇథియోపియా మానవ హక్కుల సంఘం ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 100కు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల మధ్య భీకరస్థాయిలో ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. దేశంలో 80కిపైగా వేర్వేరు జాతులు ఉన్నాయి.
ఇథియోఫియా రాజధాని: అడిస్ అబాబా; కరెన్సీ: బిర్
ఇథియోఫియా ప్రస్తుత అధ్యక్షురాలు: సాహ్లే-వర్క్ జెవ్డే
ఇథియోఫియా ప్రస్తుత ప్రధానమంత్రి: అబి అహ్మద్ అలీ

సులవేసి ద్వీపం ఏ దేశంలో ఉంది?
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో జనవరి 15న భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు.
సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు.
ఇండోనేసియా రాజధాని: జకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో

2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?
బ్రిటన్ అధ్యక్షతన 2021, జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల శిఖరాగ్ర సమావేశాలకు యూకేలోని తీర ప్రాంతం ‘‘కార్న్‌వాల్’’ వేదిక కానుంది. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలను ఆతిథ్య హోదాలో ఆహ్వానించారు. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 17న వెల్లడించారు.
బోరిస్ తెలిపిన వివరాల ప్రకారం...
  • 2021 ఏడాది జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
  • తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుంది.

జీ-7 సభ్య దేశాలు...

  • అమెరికా
  • యూకే
  • కెనడా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • ఇటలీ
  • జపాన్

మరిన్ని అంశాలు...

  • యూకే 2021 ఏడాది ఫిబ్రవరిలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
  • భారత్ త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : బ్రిటన్
ఎక్కడ : కార్న్‌వాల్ ప్రాంతం, యూకే
ఎందుకు : సమకాలీన, ఆర్థిక అంశాలపై చర్చలు జరిపేందుకు

జావా సముద్రంలో కూలిన ఇండోనేసియా విమానం పేరు?
Current Affairs
ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ‘‘బోయింగ్ 737 విమానం’’ ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన ఈ విమానం జనవరి 9న మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాళీమంథన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే.
కూలిన చోటు గుర్తించాం
కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని జనవరి 10న ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది.
ఇండోనేసియా రాజధాని: జకార్తా; కరెన్సీ: ఇండోనేసియన్ రూపియా
ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు: జోకో విడోడో

కొత్త రాజధానిగా కాళీమంథన్...
ఇండోనేసియా కొత్త రాజధానిగా బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్‌ను ఎంపికచేసినట్లు ఆ దేశాధ్యక్షుడు జొకో విడోడో 2019, ఆగస్టు 27న ప్రకటించారు. కాళీమంథన్ తూర్పు భాగంలోని అటవీ ప్రాంతంలో 1,80,000 హెక్టార్లలో రాజధానిని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రాజధాని జకార్తా ప్రతీ సంవత్సరం 25 సెంటీమీటర్ల మేర సముద్ర ముంపునకు గురవుతుండటం, వరదలు, భూకంపాల ముప్పు ఎక్కువ ఉండటంతోపాటు విపరీతమైన వాయు కాలుష్యం, ట్రాఫిక్ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజధాని అభివృద్ధికి రూ.2.3లక్షల కోట్లు కేటాయించినట్లు జొకో చెప్పారు.

తైవాన్‌తో స్వీయ ఆంక్షల్ని తొలగించిన అమెరికా
తైవాన్ దౌత్యవేత్తలు, అధికారులతో అమెరికా దౌత్యవేత్తలు, ఇతర అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వీయ అంతర్గత సంక్లిష్ట ఆంక్షలను తొలగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. తైవాన్ అమెరికాకు విశ్వసనీయమైన, అనధికార భాగస్వామి అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
Current Affairs
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ అత్యవసర వినియోగానికి జనవరి 1న అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్‌ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ ఉన్నారు.
సాధారణంగా... ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంది.
ఐరాస భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య?
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని (2021-22) 2021, జనవరి 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో భారత్‌కు చోటు దక్కడం ఇది ఎనిమిదోసారి. ఇటీవల ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ 184 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టు నెలలో, 2022లో మరో నెల పాటు భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్ కొనసాగనుంది.
15 సభ్య దేశాలు...

  • 15 దేశాలు సభ్యులుగా గల ఐరాస భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.
  • తాత్కాలిక సభ్యదేశాలుగా ఎస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ గ్రెనెడైన్స్, ట్యునీషియా, వియత్నాం కొనసాగుతున్నాయి.
  • 2021, జనవరి 1 నుంచి భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా కొత్తగా చేరాయి.


ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం?
ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల జాబితాలో తమిళనాడు రాజధాని చెన్నై తొలి స్థానంలో నిలిచింది. చెన్నై తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలో, చైనాలోని హర్బిన్ మూడో స్థానంలో ఉన్నాయి. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో ఈ నివేదికను రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని నివేదిక పేర్కొంది.
అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాలు...

ర్యాంకు

నగరం

సీసీ కెమెరా (చ.కి.మీకు)

సీసీ కెమెరా(1,000 మందికి)

1

చెన్నై(భారత్)

657

25.5

2

హైదరాబాద్ (భారత్)

480

30.0

3

హర్బిన్ (చైనా)

411

39.1

4

లండన్ (బ్రిటన్)

399

67.5

5

గ్జియామెన్ (చైనా)

385

40.3

6

చెంగ్డూ (చైనా)

350

33.9

7

తైయువాన్ (చైనా)

319

119.6

8

ఢిల్లీ(భారత్)

289

14.2

9

కున్మింగ్ (చైనా)

281

45.0

10

బీజింగ్ (చైనా)

278

56.2

క్విక్ రివ్యూ:
ఏమిటి : చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా... అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో చెన్నైకి అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సర్ఫ్‌షార్క్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో

నైగర్‌లో మారణహోమం
పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. నైగర్-మాలి సరిహద్దుల్లో ఉన్న రెండు గ్రామాలు ‘టోంబాంగౌ, జారౌమ్‌దరే’లలో దాడి చేసి వందమందికిపైగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు చోటు చేసుకున్న రెండు గ్రామాలను నైగర్ ప్రధాని జనవరి 4న సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
జనవరి 3న టిల్లాబెరి ప్రాంతంలో తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు కొట్టి చంపారు. ప్రతీకారంగా సాయుధ ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేశారు. పొరుగు దేశం నైజీరియాలోని బోకో హరామ్ ఉగ్రవాదులతోపాటు, అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రముఠాలు నైగర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి.
నైగర్ రాజధాని: నియామె; కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
నైగర్ ప్రస్తుత అధ్యక్షుడు: మహమదౌ ఇస్సౌఫౌ
నైగర్ ప్రస్తుత ప్రధాని: బ్రిగి రాఫిని

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రథమంగా ఏ దేశంలో ప్రారంభమైంది?
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్-19 టీకా ‘‘కోవిషీల్డ్’’ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా జనవరి 4న యూకేలో మొదలైంది. డయాలసిస్ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్ రోగి బ్రియాన్ పింకెర్(82)కు మొదటగా టీకా వేశారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు.
కోవిషీల్డ్: రూ.200-400
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3-4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6-8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్‌ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిషీల్డ్ వ్యాక్సినేషన్‌ను ప్రథమంగా ప్రారంభించిన దేశం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : యూకే
ఎక్కడ : యూకే
ఎందుకు : కోవిడ్-19ను నిర్మూలించేందుకు

ఏ దేశ రాజధానిలో గ్లోబల్ టెక్నాలజీ సదస్సు-2021 జరగనుంది?
జపాన్ రాజధాని టోక్యోలో 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021 జరగనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రండే జనవరి 5న లేఖ రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)
ఎక్కడ : టోక్యో, జపాన్

మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్పారు. జనవరి 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. నిషేధానికి గురైన యాప్‌లలో... అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్‌లు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : అమెరికా
ఎందుకు : అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమని

జో బెడైన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోదం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బెడైన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు జనవరి 7న అధికారికంగా అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లలో బెడైన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. దీంతో 78 ఏళ్ల బెడైన్ 2021, జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై జనవరి 6న దాడి చేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బెడైన్ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించడానికి జరిగిన పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. ఈ దాడిని భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి.
Published date : 12 Feb 2021 03:08PM

Photo Stories