Skip to main content

Modi in Russia: ఉక్రెయిన్‌ యుద్ధంపై ద్వైపాక్షిక చర్చలు జ‌రిపిన పుతిన్‌, మోదీ

ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన చేశారు.
Indian Prime Minister Narendra Modi meets Vladimir Putin in Russia  Modi and Putin at the 22nd Indo-Russia summit

ఇందులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో క్రెమ్లిన్‌ భవనంలో మోదీ 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర, ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఉక్రెయిన్‌తో ర‌స్యా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం దేనికి పరిష్కారం అవ్వ‌ద‌ని మోదీ పుతిన్‌తో అన్నారు.  ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయం చేయడానికి భార‌త్ సిద్ధంగా ఉన్న‌ట్లు పుతిన్‌కు చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇద్దరూ ‘ఓపెన్ మైండ్’తో చర్చ‌లు జ‌రిపిన‌ట్లు మోదీ తెలిపారు.

"ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఓపెన్ మైండ్‌తో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరు చాలా గౌరవంగా విన్నాం. యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. ఎవ‌రికైనా ప్రాణహాని జరిగినప్పుడు మానవత్వం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ బాధ కలుగుతుంది. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే హృదయాన్ని కదిలిస్తుంది. ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. దీనిపై కూడా నేను మీతో చర్చించాను" అని మోదీ పేర్కొన్నారు.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి పునరుద్ధరణకు సహకరించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మోదీ పుతిన్‌తో చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని మేము మీతో పాటు ప్రపంచానికి హామీ ఇస్తున్నాన‌ని తెలిపారు. 

India-Russia Annual Summit: ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు.. పాల్గొననున్న ప్రధాని మోదీ

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పిల్లల ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ముక్కుపచ్చలారని అమాయక చిన్నారులు దాడిలో పదుల సంఖ్యలో బలైన వైనం హృదయాలను తీవ్రంగా కలచివేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.

ద్వైపాక్షిక బంధం మరింత సుదృఢం..
కొన్నేళ్లుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఆహార, ఇంధన, ఎరువుల కొరత భారత్‌లో రైతులకు ఎదురవకుండా రష్యా అందిస్తున్న సహకారం అమూల్యమంటూ మోదీ కొనియాడారు. ‘పుతిన్‌తో చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. వర్తకం, వాణిజ్యం, భద్రత, వ్యసాయం, టెక్నాలజీ వంటి పలు రంగాలపై లోతుగా చర్చించాం. పలు రంగాల్లో రష్యాతో బంధాన్ని మరింతగా విస్తరించడమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు. ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పలు అంశాల్లో భారత్, రష్యా సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని పుతిన్‌ అన్నారు.

‘ఇరు దేశాలదీ దశాబ్దాలకు పైబడ్డ సుదృఢమైన బంధం. భారత్‌తో రష్యా వర్తకం గతేడాది ఏకంగా 66 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే మరో 20 శాతం పెరుగుదల నమోదైంది’ అని అన్నారు. అక్టోబర్లో రష్యాలోని కజాన్‌లో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్రానికి మోదీని ఈ సందర్భంగా పుతిన్ ఆహ్వానించారు. అనంతరం మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించనుండటం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

Rachel Reeves: తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులైన‌ రాచెల్‌ రీవ్స్

రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!
ఉక్రెయిన్‌ కదనరంగంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్‌ వద్ద ఈ అంశాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని సబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధంలో పని చేస్తున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని పుతిన్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాలో ఉపాధి కల్పిస్తామంటూ కొందరు భారతీయ యువకులను ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లి అక్కడి సైన్యం సహాయకులుగా నియమించింది.

Published date : 10 Jul 2024 01:17PM

Photo Stories