Skip to main content

డిసెంబర్ 2017 అంతర్జాతీయం

బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు 2020
Current Affairs
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై డిసెంబర్ 20న మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు
ఎప్పుడు : 2020 డిసెంబర్ 31
ఎవరు : ఈయూ
ఎందుకు : ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు

జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం
జెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి.భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా తీర్మానం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎక్కడ : ఐరాసలో
ఎవరు : తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన భారత్ సహా 128 దేశాలు

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిసెంబర్ 22న ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిం ది. ఆ దేశం నవంబర్ 29న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టడంతో భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షల ఫలితంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, విదేశాల్లోని శ్రామికుల నుంచి పొందే ఆదాయాలపై పరిమితులు ఉంటాయి.

గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదిక
Current Affairs
భారత్‌లో అనారోగ్య, పర్యావరణ సమస్యలు తీవ్రంగా పెరగడానికి అత్యల్ప అక్షరాస్యతే కారణమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాదిమందికి అక్షరజ్ఞానం లేకపోవడం వల్లే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేదని పేర్కొంది. ఈ మేరకు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికను డిసెంబర్ 14న విడుదల చేసింది.
2016 లో ప్రపంచవ్యాప్తంగా 44.7 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కాగా, దానిలో 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ- వేస్ట్ ఉత్పత్తిలో 7.2 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ చైనా మొదటి స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : భారత్‌లో

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్
2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ అనే పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ డిసెంబర్ 15న ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్ అంటే యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు
ఎందుకు : యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యానికి గుర్తింపుగా

ట్వీటర్ న్యూస్ నెట్‌వర్క్ టిక్‌టాక్’
వార్తల కోసం మొబైల్ ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడే వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్ తాజాగా వార్తల సర్వీసులను ప్రారంభించింది. బ్లూమ్‌బర్గ్ మీడియాతో కలిసి టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా బ్లూమ్‌బర్గ్ జర్నలిస్టులు రిపోర్ట్ చేసే వార్తలు, లైవ్ వీడియోలు ఉంటాయి. వీక్షకులు పంపే బ్రేకింగ్ న్యూస్ కంటెంట్‌ను కూడా బ్లూమ్‌బర్గ్ ఎడిటర్లు ధృవీకరించుకుని, ఎడిట్ చేసి అందిస్తారు. ఈ టిక్‌టాక్ న్యూస్ సర్వీసు కోసం బ్లూమ్‌బర్గ్ సంస్థ... ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, సోషల్ మీడియా అనలిస్టులు, ప్రోడక్ట్ డెవలపర్స్, ఇంజినీర్లు, డిజైనర్లు మొదలైన వారితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ట్వీటర్, బ్లూమ్ బర్గ్

జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి.
50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవద్దని కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేం తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎక్కడ : ఐరాస భద్రతా మండలి
ఎందుకు : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈజిప్టు తీర్మానాన్ని రూపొందించింది

ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత
Current Affairs
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డిసెంబర్ 7న ఆమోదించింది. ఇంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43-12 మెజారిటీతో ఆమోదించగా.. తాజాగా ప్రతినిధుల సభ (దిగువ సభ) 146-4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేసి 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎక్కడ : ఆస్ట్రేలియా

సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
సౌదీ అరేబియాలో 35 సంవత్సరాల కింద సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ డిసెంబర్11న ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వచ్చి 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయని ఛాందసవాదులు ఆందోళన చేయడంతో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. ఇటీవల సౌదీలో మహిళలను డ్రైవింగ్, క్రీడామైదానాల్లోకి అనుమతించడం వంటి కీలక సంస్కరణలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియాలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఎందుకు : సామాజిక సంస్కరణల్లో భాగంగా

జెరూసలేం పాలస్తీనాదే : ఓఐసీ
ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ డిసెంబర్ 13న నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ డిక్లరేషన్‌లో తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొంటూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరారు.
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను అమెరికా కాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
ఎందుకు : జెరూసలెంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని

విధ్వంసక ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
Current Affairs
అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు పెడచెవినపెడుతూ ఉత్తర కొరియా మూడోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవంబర్ 29న ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.
కొరియా పరీక్షించిన మూడో ఖండాంతర క్షిపణి అయిన హవాసాంగ్-15 భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఉత్తర కొరియా

ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాలు కోత
రోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే నవంబర్ 29న వెల్లడించింది. దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి.
ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాల కోత
ఎప్పుడు : 2030
ఎవరు : మెకిన్సే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఉత్తర కొరియాను ధ్వంసం చేస్తాం : అమెరికా
ఉత్తర కొరియా చేస్తున్న వరుస క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే.. ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా నవంబర్ 29న పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విధంగా స్పందించారు.
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి, జూలైలో పరీక్షించిన హవాసాంగ్-14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరకొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అమెరికా రాయబారి నిక్కీహేలి
ఎక్కడ : ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సమావేశంలో
ఎందుకు : ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే

ట్రావెల్ బ్యాన్ కు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదం
ఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారికి సంబంధించినవారమని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు అమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అమెరికా సుప్రీం కోర్టు
ఎందుకు : అక్రమ వలసలు నిరోధించి ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా సెలైన్స్ బ్రేకర్స్’
లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన సెలైన్‌‌స బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ 2017 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా చాలా మంది మహిళలు తమ బాధలను పంచుకున్నారు. వీరినే సెలైన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి నరుటో’ ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి కొన్ని సెల్ఫీలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2017
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : సెలైన్స్ బ్రేకర్స్ (మీ టూ హ్యాష్‌ట్యాగ్)
ఎందుకు : తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్ ద్వారా వెల్లడించినందుకు

జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన ట్రంప్
ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమెరికా విదేశాంగ శాఖను ఆదేశించారు. జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం అని వారందరు కలిసే దేశాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు అమెరికా ముందుంటందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : జెరూసలేం మూడు గొప్ప మతాలకు ప్రధాన కేంద్రం అయినందున
Published date : 16 Dec 2017 03:19PM

Photo Stories