Skip to main content

అక్టోబర్ 2020 అంతర్జాతీయం

ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్ ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?
Current Affairs ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నిర్ణయించింది. అక్టోబర్ 21-23 వరకు వర్చువల్ విధానంలో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం 2021, ఫిబ్రవరి వరకు అమల్లో ఉంటుంది. ‘సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితా(గ్రే లిస్ట్)లోనే పాకిస్తాన్‌ను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ వెల్లడించారు.
ఆరు కీలక షరతులు...
గతంలో అంగీకరించిన 6 కీలక షరతుల అమలు విషయంలో పాకిస్తాన్ విఫలం కావడంతో గ్రే జాబితాలోనే ఆ దేశం కొనసాగే పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్(జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్), హఫీజ్ సయీద్(లష్కరే తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు), జకీఉర్ రహమాన్ లఖ్వీ(లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్)లపై చర్యలు తీసుకోవడం ఆరు కీలక షరతుల్లో ఒకటి.
అనేక ఆంక్షలు...
ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం అందే విషయంలో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న దేశాలపై అనేక ఆంక్షలుంటాయి. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, నగదు అక్రమ రవాణా నివారణలకు ఆయా దేశాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందున

గురువులను గౌరవించడంలో భారత్‌కు ఆరో స్థానం
మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి మందిని ప్రశ్నించారు. టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా? వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా? తదితర ప్రశ్నలు సంధించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ చెప్పారు. భారత్‌లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యపై 14% ఖర్చు పెడుతోంది. రెండో స్థానంలో నిలిచిన ఘనాలో 22.1 శాతాన్ని విద్యపై వెచ్చిస్తున్నారు.

పేద దేశాల్లోనే కరోనా మరణాలు తక్కువ
అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సెన్సైస్(ఎన్సీసీఎస్), చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు మెడ్రిక్సివ్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
106 దేశాల్లో...
పరిశోధకులు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీవ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు కోవిడ్ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమాణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్‌బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు.

ప్రపంచబ్యాంక్ డెవలప్‌మెంట్ కమిటీ 102వ సమావేశం
Current Affairs
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశం అక్టోబర్ 16న ముగిసింది. ఈ సందర్భంగా ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది.
శక్తివంచనలేకుండా పోరు: నిర్మలా
ప్రపంచబ్యాంక్ డెవలప్‌మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 16న మాట్లాడారు. భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్-19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రపంచ ఆకలి సూచీ(గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారత్ ర్యాంకు?
2020 సంవత్సరానికి గాను రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్‌ఐ)లో 107 దేశాలకు గాను భారత్ 94వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 17న విడుదలైన ఈ సూచీని పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు.
ప్రపంచ ఆకలి సూచీ-2020లోని ముఖ్యాంశాలు
  • ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లు ఉన్నాయి.
  • చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి.
  • భారత్ (94 ర్యాంకు), బంగ్లాదేశ్ (75), మయన్మార్ (78), పాకిస్తాన్ (88) స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది.
  • నేపాల్ 73, శ్రీలంక 64 ర్యాంకుల్ని సాధించి ఆకలి సమస్య మధ్యస్తంగా ఉన్న దేశాల జాబితాలో చేరాయి.
  • 2019 ఏడాది 117 దేశాలకు భారత్ 102వ స్థానంలో ఉంటే ఈసారి మెరుగుపడింది.
  • భారత్‌లో 14శాతం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
  • అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4 శాతం మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి.
  • అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3 శాతం మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు.
  • అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7 శాతం మంది మృత్యువాత పడుతున్నారు.

భారత్‌లో ఆకలి కేకలకు కారణాలివీ..

  • అందరికీ ఆహారం పంపిణీ విధానంలో లోపాలు
  • ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యపూరిత వైఖరితో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం
  • పౌష్టికాహార లోపాలు అరికట్టడానికి సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం
  • ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం
  • నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు

క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీలో 94వ స్థానంలో నిలిచిన దేశం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : భారత్

మలబార్ విన్యాసాల్లో కొత్తగా పాల్గొననున్న ద్వీప దేశం?
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 2020, నవంబర్ నెలలో జరగనున్న మలబార్ సైనిక యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ అక్టోబర్ 19న ప్రకటించింది. మలబార్ ఎక్సర్‌సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే.
ఇదే మొదటిసారి...
ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ సైనిక యుద్ధ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా
ఎక్కడ : బంగాళాఖాతం, అరేబియా సముద్రం
ఎందుకు : ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో

పీఎం 2.5 అంశంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం?
గాలిలో కాలుష్యకారకమైన సూకా్ష్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5 అంశంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020’లో ఈ విషయం వెల్లడైంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
గాలిలో పీఎం 2.5

భారత్

83.2

నేపాల్

83.1

రిపబ్లిక్ ఆఫ్ నైజర్

80.1

ఖతార్

76.0

నైజీరియా

70.4

ఎన్‌ఓజీఏ నివేదికలోని ప్రధానాంశాలు

  • గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్‌లోనే అత్యధికం. 2019 ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు.
  • భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి.
  • గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి.
  • వాయు కాలుష్యంతో భారత్‌లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం 2.5 అంశంలో మొదటి స్థానంలో భారత్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020
ఎక్కడ : ప్రపంచంలో

చైనా వ్యాక్సిన్ కరోనావాక్‌ను తిరస్కరించిన బ్రెజిల్
2,700 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి చైనా నుంచి 4.6 కోట్ల ‘కరోనావాక్’ అనే కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కొనాలని బ్రెజిల్ ఆరోగ్య శాఖామంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తిరస్కరించారు. చైనా ఔషధ కంపెనీ సినోవాక్ తయారు చేస్తోన్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ ఇంకా పూర్తి కాలేదని, ప్రయోగాలకు వాడుకునేందుకు బ్రెజిల్ ప్రజలు గినియా పందులు కారని బోల్సోనారో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 1,54,906 మరణాలు సంభవించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా నుంచి కరోనావాక్ అనే కోవిడ్ వ్యాక్సిన్ కొనుగోలుకు తిరస్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో

అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతం?
Current Affairs
ఇరుగు పొరుగు దేశాలైన అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద నగొర్నొ-కరబక్ ప్రాంతంలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది. ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్‌బైజాన్ అక్టోబర్ 11న ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది.
శతాబ్దాలుగా వివాదం...
నగొర్నో-కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్‌బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజాన్‌లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది. ఇరుదేశాల మధ్య 2020, సెప్టెంబర్‌లో ఆరంభమైన ఘర్షణతో 400కుపైగా మరణాలు సంభవించాయి.

యూఎన్‌హెచ్‌ఆర్సీకి పాక్, చైనా ఎంపిక
ఐరాస మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ)కి చైనా, రష్యా, క్యూబాలతో సహా పాకిస్తాన్ కూడా చోటు సంపాదించింది. ఆ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, సామాజిక గ్రూపులు బలంగా వ్యతిరేకించినప్పటికీ మండలిలో స్థానాన్ని పొందగలిగాయి. 193 సభ్యదేశాలు గల ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ జరగగా, పాకిస్తాన్ 169 ఓట్లు పొందగా, ఉజ్బెకిస్తాన్ 164, నేపాల్ 150, చైనా 139 ఓట్లు సాధించాయి. సౌదీ అరేబియా 90 ఓట్లు పొంది, రేస్ నుంచి తప్పుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్సీ)కి ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : చైనా, రష్యా, క్యూబా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, నేపాల్

హెచ్-1బీపై నిషేధం ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు
Current Affairs
అమెరికాలో హెచ్-1బీ సహా ఇతర వీసాలన్నింటిపైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను మీరి ప్రవర్తించారని పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020, జూన్‌లో హెచ్-1బీ, హెచ్-2బీ, ఎల్ వీసాలన్నింటిపైన ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ వివిధ ఐటీ కంపెనీలు, తయారీ సంస్థలు కోర్టుకెక్కాయి. ఈ పిటిషన్లను విచారించిన కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అక్టోబర్ 1న తీర్పు వెలువరించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు అత్యంత ప్రయోజనం చేకూరనుంది.
ట్రంప్‌కు కరోనా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్టోబర్ 2న ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఏ దేశానికి చెందిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి?
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు కిర్గిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ రాజధాని బిష్కేక్‌లో ఫలితాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పలు నగరాల్లో ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శకులు నిరసనలు తెలుపుతూ పలు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష సమర్ధకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో వందలాది మంది గాయపడ్డారు. దేశంలో ఉద్రిక్తతల నివారణకు ఫలితాలను రద్దు చేసామని ఎన్నికల సంఘం అధ్యక్షుడు నుర్జహాన్ షైల్డబెకోవా చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిర్గిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రద్దు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : కిర్గిస్థాన్ ఎన్నికల సంఘం
ఎందుకు : దేశంలో ఉద్రిక్తతల నివారణకు

క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశానికి వేదికైన నగరం?
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 2020, అక్టోబర్ 6న జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమైంది. సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు వరుసగా జైశంకర్, మైక్ పాంపియో, మరిసె పేన్, తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు

  • చైనా విస్తరణవాదంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని భారత్ సహా నాలుగు ‘క్వాడ్’ దేశాలు పునరుద్ఘాటించాయి.
  • క్వాడ్ ‘నిజమైన భద్రతా చట్రం’అని అమెరికా పేర్కొంది.
  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్ పేర్కొంది.
  • ఇండో-పసిఫిక్ విధానానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటం సంతృప్తికరమైన అంశమని జైశంకర్ చెప్పారు.
  • క్వాడ్ వైఖరి మూడో దేశం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని చైనా ఆరోపించింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగా మంత్రులు
ఎక్కడ : టోక్యో, జపాన్

Published date : 10 Nov 2020 04:57PM

Photo Stories