Skip to main content

సెప్టెంబర్ 2018 ఎకానమీ

జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ఫిచ్
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడిపీ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ సెప్టెంబర్ 21 పెంచింది. ఈ మేరకు గతంలో 7.4 శాతంగా అంచనా వేసిన వృద్ధి రేటును 7.8 శాతం చేసింది. అలాగే 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.2 శాతం తగ్గించి 7.3 శాతానికి సవరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీడీపీ వృద్ధి అంచనాలు 7.8 శాతానికి పెంపు
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : అంతర్జాతీయం రేటింగ్ సంస్థ ఫిచ్

చక్కెర రంగానికి 5538 కోట్ల ప్యాకేజీ
మిగులు చక్కెర నిల్వల సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. చెరకు ఉత్పత్తి, ఎగుమతి వ్యయాల తగ్గింపునకు ఈ సాయం అందించనున్నారు. దీంతో చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం, ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. ఇప్పటికే షుగర్‌కేన్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు అధిక ధరలు నిర్ణయించడంతోపాటు, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యల్ని కేంద్రం గతంలో ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : కేంద్ర కేబినెట్

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం : ఏడీబీ
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. అలాగే 2019-20లో 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. ఈ మేరకు ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్ లుక్ (ఏడీఓ) 2018’ పేరుతో వార్షిక ఆర్థిక నివేదికను సెప్టెంబర్ 26న విడుదల చేసింది. భారత్‌కు రూపాయి బలహీనత, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు వంటి సవాళ్లు ఉన్నాయని ఏడీబీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ)

కుటుంబ వ్యాపారాల్లో భారత్‌కు మూడోస్థానం
Current Affairs కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపారాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘క్రెడిట్ సూసీ ఫ్యామిలీ 1000-2018’ నివేదికను క్రెడిట్ సూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలవగా అమెరికా రెండో స్థానంలో ఉంది. కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయని నివేదిక పేర్కొంది.
భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తుండగా వీటి ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) 839 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లోని కుటుంబ వ్యాపార కంపెనీల షేర్ల రాబడి 2006 నుంచి ఏటా సగటున 13.9 శాతంగా ఉందని క్రెడిట్ సూసీ నివేదిక ప్రధాన రూపకర్త యూజీన్ క్లెర్క్ పేర్కొన్నారు. చైనాలో 159, అమెరికాలో 121 కుటుంబ వ్యాపార సంస్థలు ఉన్నాయి.
క్రెడిట్ సూసీ నివేదికలో 43 కంపెనీలతో (మార్కెట్ క్యాప్ 434 బిలియన్ డాలర్లు) దక్షిణ కొరియా నాలుగో స్థానం పొందింది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్సీన్స్, థాయిలాండ్ 26 కంపెనీల చొప్పున కలిగి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జపాన్ మినహా ఆసియా ప్రాంతంలో 11 దేశాల వివరాలనును ఈ నివేదికలో వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుటుంబ వ్యాపారాల్లో భారత్‌కు మూడోస్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : క్రెడిట్ సూసీ ఫ్యామిలీ 1000, 2018 నివేదిక
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

65 వేల కోట్ల రుణానికి నాబార్డు ఆమోదం
ప్రధాన మంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు రూ. 65,634.93 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు చైర్మన్ హర్షకుమార్ భన్వాలా సెప్టెంబర్ 16న వెల్లడించారు.
పీఎంకేఎస్‌వై కింద మొత్తం 99 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నాబార్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున నిధులు సమకూరుస్తోంది. 99 ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 70 వేల కోట్ల రూపాయలను నాబార్డు అందించాల్సి ఉంది. ఇప్పటికే 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 23,402.72 కోట్లను నాబార్డు విడుదల చేసింది. పీఎంకేఎస్‌వై కింద చేపడుతున్న ఈ 99 ప్రాజెక్టుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 65,634.93 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : నాబార్డు
ఎందుకు : దేశవ్యాప్తంగా 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి

ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం 24 లక్షలు
దేశవ్యాప్తంగా ఉన్న 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.24.59 లక్షలు (ఉమ్మడిగా రూ.773.48 కోట్లు)గా ఉంది. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ సెప్టెంబర్ 17న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం సగటున రూ. కోటికి పైగా వార్షిక ఆదాయంతో కర్ణాటక ఎమ్మేల్యులు మొదటి స్థానంలో ఉండగా సగటున రూ. 5.4 లక్షలతో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు చివరి స్థానంలో ఉన్నారు.
ప్రాంతాలవారీగా ఎమ్మేల్లేల వార్షిక సగటు ఆదాయం చూస్తే దక్షిణాదికి చెందిన 711 మంది సభ్యుల సగటు వార్షికాదాయం రూ.51.99 లక్షలుకాగా, ఈశాన్య రాష్ట్రాల్లోని 614 మంది ఎమ్మేల్యేల ఆదాయం రూ.8.53 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా 4,086 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 941 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ఆదాయాన్ని ప్రకటించనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
నివేదికలోని అంశాలు....
  • మొత్తం ఎమ్మెల్యేలలో 8 శాతం మాత్రమే మహిళలు. పురుష ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం రూ.25.85 లక్షలుకాగా మహిళల ఆదాయం రూ.10.53 లక్షలు.
  • 711 మంది దక్షిణాది ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం రూ.51.99 లక్షలు.
  • 614 మంది ఈశాన్య రాష్ట్రాల ఎమ్మేల్యేల వార్షిక ఆదాయం రూ.8.53 లక్షలు.
  • కర్ణాటకలోని 204 మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.1.11 కోట్లు. దీంతో దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారిగా నిలిచారు.
  • రూ.43.4 లక్షల సగటు ఆదాయంతో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు రెండో స్థానంలో నిలిచారు.
  • 64 మంది ఛత్తీస్‌గడ్ ఎమ్మెల్యేల వార్షికాదాయం అత్యల్పంగా రూ.5.4 లక్షలు.
  • సభ్యుల్లో రెండు శాతం మంది తమ వృత్తి ఏమిటన్నది అఫిడవిట్లలో వెల్లడించలేదు.
  • 25 శాతం మంది తాము వ్యాపారులమని, మరో 24 శాతం మంది రైతులమని పేర్కొన్నారు.
  • వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా ప్రకటించిన 13 శాతం మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం అందరికంటే ఎక్కువగా (రూ.57.81 లక్షలు) ఉంది.
  • 33 శాతం మంది ఎమ్మెల్యేలు తాము 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు ప్రకటించారు. వీరి సగటు వార్షికాదాయం రూ.31.03 లక్షలు.
  • 63 శాతం ఎమ్మెల్యేలు డిగ్రీ, ఆపైన చదువుకున్నట్లు ప్రకటించారు. వీరి వార్షిక సగటు ఆదాయం రూ.20.87 లక్షలు మాత్రమే.
  • 139 మంది ఎమ్మెల్యేలు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. వీరి వార్షిక ఆదాయం అందరికంటే ఎక్కువగా సగటున రూ.89.88 లక్షలు.
  • నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నవారి వార్షిక ఆదాయం మాత్రం రూ.9.31 లక్షలు.
  • శాసనసభ్యుల్లో 25-50 ఏళ్ల మధ్య 1,402 మంది.. 51-80 లోపు 1,727 మంది, 82-90 మధ్య 11 మంది, ఆపై వయసువారు ఇద్దరు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.24.59 లక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా

మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిర్ణయం
రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న నిర్ణయించింది. దీంతో మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ ఏర్పాటుకానుంది. విలీనానంతరం కూడా ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగనున్నాయి. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్ జయకుమార్ అభిప్రాయపడ్డారు.
విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ సూచించారు. ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడనుంది.
ఇప్పటికే అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం చేసుకుంది. దీంతో ప్రపంచంలోని మొదటి 50 బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీవోబీ, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కేంద్రప్రభుత్వం

13 వందల కోట్లకు టైమ్ మేగజీన్ అమ్మకం
అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మేగజీన్‌ను రూ.1,377 కోట్లకు (190 మిలియన్ డాలర్లు)కు అమ్ముతున్నట్లు మెరిడిత్ కార్పొరేషన్ సెప్టెంబర్ 17 ప్రకటించింది. ఈ మేరకు క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
1923, మార్చిలో యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటాన్ హడెన్‌లు కలసి టైమ్ మేగజీన్‌ను ప్రారంభించారు. గతేడాది టైమ్ మేగజీన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కొనుగోలు చేసింది. ఇదే తరహాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2013లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికను రూ.1,811 కోట్లకు కొనుగోలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.1,377 కోట్లకు టైమ్ మేగజీన్ కోనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : మార్క్ బెనియాఫ్
ఎక్కడ : అమెరికా

మోర్ ను కొనుగోలు చేసిన అమెజాన్
ఆదిత్య బిర్లా గ్రూప్‌కి చెందిన మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ (ఆదిత్య బిర్లా రిటైల్ -ఏబీఆర్‌ఎల్)ను అంతర్జాతీయ రిటైల్ రంగ సంస్థ అమెజాన్, సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఆదిత్య బిర్లా గ్రూప్‌తో సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పంద విలువ సుమారు రూ. 4,200 కోట్లుగా ఉంది. ఏబీఆర్‌ఎల్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోర్ బ్రాండ్ కింద 509 మోర్ బ్రాండెడ్ సూపర్‌మార్కెట్లు, 20 హైపర్‌మార్కెట్లు ఉన్నాయి.
ఏబీఆర్‌ఎల్‌లో కుమార మంగళం బిర్లా కుటుంబానికి చెందిన ఆర్‌కేఎన్ రిటైల్‌కి 62 శాతం వాటా ఉండగా కనిష్ట ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి 37 శాతం వాటాలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఏబీఆర్‌ఎల్‌లోని తమ తమ వాటాలను అమెజాన్, సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కి చెందిన విట్‌జీగ్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో అమెజాన్ 49 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఏబీఆర్‌ఎల్‌లో వాటాలు కొంటున్న విట్‌జీగ్ అడ్వైజరీలో కూడా అమెజాన్‌కు వాటాలు ఉన్నాయి.
భారత విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ చట్టాల ప్రకారం మోర్ లాంటి మల్టీ బ్రాండ్ రిటైలర్స్‌లో విదేశీ కంపెనీలు 51 శాతం వరకు మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి అవాకాశం ఉంది. దీంతో దేశీ సంస్థలతో జట్టు కట్టి విదేశీ సంస్థలు ఇటువంటి కొనుగోళ్లు జరుపుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ కొనుగొలు
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : అమెజాన్, విట్‌జీగ్ అడ్వైజరీ సర్వీసెస్

మహిళల భద్రతకు 3వేల కోట్లు
Current Affairs మహిళల భద్రత కోసం ‘నిర్భయ’ నిధుల నుంచి దాదాపు రూ.3,000 కోట్లను వెచ్చించి ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 9న వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు 8 మహానగరాల్లో వివిధ సౌకర్యాలను కల్పించనున్నారు.
పథకంలోని అంశాలు....
  • షీ-టీమ్స్ తరహాలో మహిళా పోలీసు గస్తీ బృందాలు, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించేందుకు ‘అభయం’ పేరుతో పోలీస్ వ్యాన్‌ల ఏర్పాటు.
  • బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారులకు భద్రతను కల్పించేందుకు, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నేరాలకు అవకాశమున్న చోట్ల ‘రక్షిత’ ప్రాంతాల అభివృద్ధి, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానిస్తారు.
  • ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా చర్యలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను అప్రమత్తం చేసే ‘ప్యానిక్ బటన్’ లను అమర్చడం, సురక్షిత ప్రాంతాల్లో టాయిలెట్లు, చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాల(డార్మిటరీలు)ను అందుబాటులోకి తెస్తారు.
  • బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటానికి, తక్షణ సాయం పొందటానికి వీలుగా మహిళా హెల్ప్ డెస్క్‌లు, మహిళా కౌన్సిలర్లు, సైబర్ క్రైం, ఫోరెన్సిక్ నిపుణుల నియామకం.
‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో 2013లో కేంద్రప్రభుత్వం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. తాజాగా ప్రకటించిన పథకానికి ‘నిర్భయ’ నిధి నుంచి రూ.2,919.55 కోట్లను కేటాయించింది. 2018-19, 2020-21 సంవత్సరాల్లో అమలయ్యే ఈ పథకానికి ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, చెన్నైకి రూ.425.06 కోట్లు కేటాయించారు. అలాగే అహ్మదాబాద్‌కు రూ.253 కోట్లు, కోల్‌కతా రూ.181.32 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు , హైదరాబాద్‌కు రూ.282.50 కోట్లు, లక్నోకు రూ.195 కోట్లను వెచ్చించారు.
ఈ పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్’ బ్యూరో గణాంకాల ప్రకారం 2015లో మహిళలపై దేశవ్యాప్తంగా 3,29,243 నేరాలు జరగ్గా 2016 నాటికి 3,38,954కు పెరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల భద్రతకు కోసం 3వేల కోట్లు నిధులు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : ఎనిమిది నగరాలలో

ఐడియా, వొడాఫోన్ విలీనం పూర్తి
Current Affairs ప్రముఖ టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ భారత విభాగం విలీనం ఆగస్టు 31న పూర్తయి్యంది. ఈ విలీన సంస్థకు ‘వొడాఫోన్ ఐడియా’ గా నామకరణం చేశారు. వొడాఫోన్ ఐడియా కు దేశంలో 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటా ఉంది. సుమారు 23.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్ ఐడియా దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న భారతి ఎయిర్‌టెల్ ఇకపై రెండో స్థానంలో కొనసాగనుంది.
వొడాఫోన్ ఐడియాకు ఆదిత్య బిర్లా గ్రూప్ (ఐడియా సెల్యులార్ ప్రమోటర్) అధిపతి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే బాలేశ్ శర్మ సీఈవోగా ఉంటారు. డీల్ ప్రకారం వొడాఫోన్ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లు, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగా పరిగణించారు. వొడాఫోన్ ఐడియాలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి. బ్రిటన్‌కి చెందిన వొడాఫోన్ 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం హచిసన్ ఎస్సార్ నుంచి భారత టెలికం వ్యాపారాన్ని 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడియా, వొడాఫోన్ విలీనం పూర్తి
ఎప్పుడు : ఆగస్టు 31
ఎక్కడ : భారత్

ఎఫ్‌డీఐల్లో మారిషస్ కు అగ్రస్థానం
2017-18 సంవత్సరంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టిన దేశంగా మారిషస్ నిలిచింది. ఈ మేరకు ఎఫ్‌డీఐల వివరాలను అసోచాం సెప్టెంబర్ 2న వెల్లడించింది. 2017-18లో దేశంలోకి మొత్తం 37.36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన మారిషస్ అగ్రస్థానంలో నిలవగా 9.27 బిలియన్ డాలర్లతో సింగపూర్ రెండోస్థానంలో నిలిచింది.
గత సంవత్సరం మొత్తం 36.31 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి రాగా మారిషస్ నుంచి 13.38 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6.52 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో గత సంవత్సరంలోనూ మారిషస్ మొదటిస్థానంలో నిలిచింది. గత ఏడాదిలో నెదర్లాండ్‌‌స నుంచి 3.23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా ప్రస్తుత సంవత్సరం 2.67 బిలియన్ డాలర్లు వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టిన దేశం
ఎప్పుడు : 2017-18 సంవత్సరంలో
ఎవరు : మారిషస్
ఎక్కడ : భారత్

ఎనిమిది టన్నుల బంగారం కోనుగోలు చేసిన ఆర్‌బీఐ
2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారంను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద 2017 జూన్ నాటికి 557.77 టన్నులు ఉన్న బంగారు నిల్వలు 2018 జూన్ 30 నాటికి 566.23 టన్నులకు చేరాయి. ఈ మేరకు సెప్టెంబర్ 3న ఆర్‌బీఐ ఒక నివేదికలో తెలియజేసింది. ఆర్‌బీఐ చివరిసారిగా 2009లో 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం వల్ల గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంది. ఆర్‌బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలైతో ప్రారంభమై జూన్‌తో ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : .46 టన్నుల బంగారం కోనుగోలు
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎందుకు : డాలర్‌తో రూపాయి మారకం తగ్గడంతో
Published date : 20 Sep 2018 03:59PM

Photo Stories