RBI: ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం.. ఎక్కడి రేట్లు అక్కడే..!
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు పెంపు నిలుపుదల చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, గతేడాది మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరుసగా ఆరవసారి పెంపుతో అప్పటి నుంచి 2.5% రెపో రేటు పెరిగినట్లయ్యింది.
వృద్ధి 6.5 శాతానికి పెంపు
2023–24లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 6.4 శాతం రేటు అంచనాల తాజా పెంపు సానుకూల పరిణామం. క్యూ1లో 7.8%, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 6.1 శాతం, క్యూ4లో 5.9 శాతం వృద్ధి నమోదు అంచనా.
Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం!
ద్రవ్యోల్బణం అంచనా తగ్గింపు
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరిలో అంచనా వేస్తే, తాజాగా ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. అయితే ద్రవ్యోల్బణంపై పోరు ముగిసిపోలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఒపెక్ చమురు ఉత్పత్తి కోత నిర్ణయం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశంగా పాలసీ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 6 శాతం దిగువకు సుదీర్ఘకాలం కొనసాగేంత వరకూ దీనిపై సెంట్రల్ బ్యాంక్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది.
World Bank: భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
ముఖ్యాంశాలు..
☛ రెగ్యులేటర్లు నిరంతరం ‘ఒడిదుడుకులకు దారితీసే అంశాలపై’ అప్రమత్తంగా ఉండాలి. ఈ సవాళ్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
☛ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ సంక్షోభ పరిస్థితులపై ఆర్‌బీఐ నిరంతర అప్రమత్తత పాటిస్తుంది. బ్యాంకింగ్‌లో తగిన నిధుల లభ్యత అవసరాలను పర్యవేక్షిస్తుంది.
☛ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించడానికిగాను ఆర్‌బీఐ ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుంది.
☛ భారత రూపాయి 2022లో ఒక క్రమపద్ధతిలో కదలాడింది. 2023లో కూడా అలాగే కొనసాగుతుంది. కరెన్సీ స్థిరత్వంపై ఆర్‌బీఐ అప్రమత్తత కొనసాగుతుంది.
☛ బ్యాంకింగ్ నెట్‌వర్క్ నుంచి యూపీఐ ద్వారా ముందస్తు రుణాలను పొందేందుకు త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
☛ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష జూన్ 6 నుంచి 8 వరకూ జరుగుతుంది.