Digital Economy: డిజిటల్ ఎకానమీని పెంచేందుకు RBI డిజిటల్ రూపాయి ప్రవేశపెట్టనుంది..
దేశీ డిజిటల్ ఎకానమీకి మరింత ఊతమిచ్చే దిశగా డిజిటల్ రూపాయిని త్వరలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. నిర్దిష్ట అవసరాల కోసం వినియోగించేలా ఈ–రూపీని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. పేమెంట్ వ్యవస్థలను మరింత సమర్థమంతమైనవిగా తీర్చిదిద్దేందుకు, మనీ లాండరింగ్‌ను నిరోధించేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కాన్సెప్ట్ నోట్‌ను రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 7న విడుదల చేసింది.
Also read: S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
డిజిటల్ రూపాయి నేపథ్యం, ప్రత్యేకతలు, ఇతరత్రా విధానపరమైన అంశాలు మొదలైన వివరాలను ఇందులో పొందుపర్చింది. ‘అధునాతనమైన, సులభమైన, సమర్థమంతమైన, సురక్షితమైన పేమెంట్ సిస్టమ్‌ల సహకారంతో డిజిటల్ రూపాయి .. దేశ డిజిటల్ ఎకానమీకి మరింత ఊతమిస్తుంది. త్వరలో నిర్దిష్ట అవసరాల కోసం పైలట్ ప్రాతిపదికన దీన్ని అందుబాటులోకి తెస్తాం. క్రమంగా పరిధిని విస్తరిస్తాం. ఈ–రూపీ ప్రయోజనాలు, ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం‘ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఇది వివిధ రూపాల్లో ప్రస్తుతం చలామణీలో ఉన్న నగదు, చెల్లింపు విధానాలకు అదనంగా మరో విధానం మాత్రమే తప్ప వాటి స్థానంలో ప్రవేశపెడుతున్నది కాదని స్పష్టం చేసింది.
Also read:Small savings schemes interest rates పెంపు
రెండు రకాలు..
రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రవేశపెట్టే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రధానంగా రిటైల్, హోల్‌సేల్ అని రెండు రకాలుగా ఉండనుంది. రిటైల్ సీబీడీసీ సాధారణంగా ప్రజలందరూ వినియోగించుకునేందుకు ఉద్దేశించినది. హోల్‌సేల్ సీబీడీసీ అనేది ప్రత్యేకంగా నిర్దిష్ట ఆర్థిక సంస్థల వినియోగం కోసం ఉంటుంది. కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఈ తరహా డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. ద్రవ్యపరపతి విధానంపై సీబీడీసీ చూపబోయే ప్రభావాలు ప్రస్తుతానికి ఊహాజనితమైనవేనని ఆర్‌బీఐ తెలిపింది.
Also read: Fed Rate Hike: ఫండ్స్ రేటు 0.75 శాతం పెంపు