నవంబర్ 2020 ఎకానమీ
కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్-2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నవంబర్ 19న మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలు దోహదపడతాయని మూడీస్ తెలిపింది. 2021-22లో భారత్ వృద్ధి రేటు 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం.
పలు సంస్థల అంచనాలు ఇలా...
కరోనా కల్లోల పరిస్థితులతో 2020-21 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020-21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11 శాతం వరకూ ఉంటుందని అంచనావేశాయి.
ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో)
సంస్థ | క్షీణత అంచనా |
కేర్ | 8.2 |
యూబీఎస్ | 8.6 |
ఎస్‌అండ్‌పీ | 9 |
ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ | 9 |
ఆర్‌బీఐ | 9.5 |
ప్రపంచబ్యాంక్ | 9.6 |
ఫిచ్ | 10.5 |
ఎస్‌బీఐ ఎకోర్యాప్ | 10.9 |
ఇక్రా | 11 |
ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్ | 11.8 |
ఐఎంఎఫ్ | 10.3 |
గోల్డ్‌మన్ శాక్స్ | 10.3 |
ఎంఎస్‌ఎంఈల కోసం ఎస్‌బీఐ అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక పోర్టల్?
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)ల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘భారత్ క్రాఫ్ట్’ పేరుతో పత్యేక ఈ-కామర్స్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ‘ఇంటిగ్రేట్ 2020’ పేరుతో నిర్వహించిన వర్చువల్ సదస్సులో నవంబర్ 20న ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిందని ఏపీ ఎంస్‌ఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవో ఆర్.పవన్ మూర్తి పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ క్రాఫ్ట్’ పేరుతో పత్యేక ఈ-కామర్స్ పోర్టల్ అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
ఎందుకు : ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం...
పది లక్షల ట్విట్టర్ ఫాలోయర్లను సొంతం చేసుకున్న తొలి సెంట్రల్ బ్యాంక్?
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఫాలోయర్ల సంఖ్య నవంబర్ 22న పది లక్షలకు చేరింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే ఈ ఘనత సాధించిన మొదటి బ్యాంక్‌గా ఆర్‌బీఐ నిలిచింది. నవంబర్ 22న నాటికి ఆర్‌బీఐ ఫాలోయర్ల సంఖ్య 10,00,513గా ఉంది. ఇక 7.74 లక్షల మంది ఫాలోయర్లతో మెక్సికో సెంట్రల్ బ్యాంక్ రెండో స్థానంలో, 7.57 లక్షల మందితో బ్యాంక్ ఆఫ్ ఇండొనేషియా మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (6.77 లక్షలు), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (5.91 లక్షలు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పది లక్షల ట్విట్టర్ ఫాలోయర్లను సొంతం చేసుకున్న తొలి సెంట్రల్ బ్యాంక్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎక్కడ : ప్రపంచంలో...
లక్ష్మీ విలాస్ బ్యాంక్ను ఏ బ్యాంకులో విలీనం చేయనున్నారు?
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)ను సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)లో విలీనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ నవంబర్ 25న ఆమోదం తెలిపింది. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒక ప్రకటనను విడుదల చేస్తూ... నవంబర్ 27 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్‌వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మారటోరియం గడువు 2020, డిసెంబర్ 16 వరకు ఉంది.
1926లో స్థాపన...
రిటైల్, మిడ్-మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును వీఎస్‌ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 569 బ్రాంచీలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)ను డీబీఐఎల్‌లో విలీనానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో
ఐబీఎం, ఏఎండీ భాగస్వామ్య ఒప్పందం
సాంకేతిక దిగ్గజాలు ఐబీఎం, ఏఎండీ సంయుక్త భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం... సెక్యూరిటీ, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ విభాగాలను మెరుగుపర్చడం, విస్తరణకు ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. హైబ్రిడ్ క్లౌడ్ వ్యవస్థలో రహస్య కంప్యూటింగ్‌ైకె ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్, ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్‌ను అభివృద్ధి చేస్తామని ఐబీఎం రీసెర్చ్ డెరైక్టర్ డేరియో గిల్ ఈ సందర్భంగా తెలిపారు. రహస్య కంప్యూటింగ్‌తో డేటా సురక్షితంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంయుక్త భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : సాంకేతిక దిగ్గజాలు ఐబీఎం, ఏఎండీ
ఎందుకు : హైబ్రిడ్ క్లౌడ్ వ్యవస్థలో రహస్య కంప్యూటింగ్‌పై అధ్యయనం చేసేందుకు
ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన
కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 11న ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద భాగంగా 12 కీలక చర్యలు ప్రకటించారు. మొత్తం రూ. 2.65లక్షల కోట్లతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) మంత్రి నిర్మల తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన..
- కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్‌పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది.
- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది.
- దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
- ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.
- 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది.
ఈసీఎల్‌జీఎస్ మార్చి దాకా పొడిగింపు...
2021, మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నారు.
రియల్టీకి తోడ్పాటు...
గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది.
రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ...
ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి నిర్మల వెల్లడించారు. ఎరువుల వినియోగం 2016-17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020-21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా.
మరిన్ని చర్యలు..
- పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకం పీఎం ఆవాస్ యోజనకు అదనంగా రూ. 18,000 కోట్లు.
- కోవిడ్-19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు.
- గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు.
- మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు.
- డిఫెన్స్, ఇన్‌ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు.
- పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజనకు అదనంగా రూ. 10వేల కోట్ల కేటాయింపు.
15వ ఫైనాన్స్ కమిషన్ నివేదికను ఏ శీర్షికతో రూపొందించారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నవంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో 15వ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, సభ్యులు అజయ్ నారాయన్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేశ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నివేదిక ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26) కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్ను విభజన సహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను నవంబర్ 17న కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది. నవంబర్ 9న కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్ శీర్షికన రూపొందించిన నివేదిక ప్రధాని మోదీకి అందజేత
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : 15వ ఫైనాన్స్ కమిషన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రానున్న ఐదు సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26) కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్ను విభజన సహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై సిఫార్సులు చేసేందుకు
ఏ ప్రైవేటు బ్యాంక్‌పై భారతం ప్రభుత్వం మారటోరియంను విధించింది?
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)పై భారత ప్రభుత్వం నవంబర్ 17న మారటోరియంను విధించింది. నవంబర్ 17 నుంచి నుంచి 30 రోజులపాటు- డిసెంబర్ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ నియమితులయ్యారు.
డీబీఎస్ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన...
తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్‌బీఐ వెలువరించింది.
1926లో స్థాపన...
రిటైల్, మిడ్-మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును వీఎస్‌ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)పై మారటోరియం విధింపు
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో
ఆర్‌ఆర్‌వీఎల్‌లో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సౌదీ సంస్థ?
ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్‌ఆర్‌వీఎల్ నవంబర్ 5న ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. పీఐఎఫ్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను వెచ్చించింది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి.
నిధుల సమీకరణ ఇలా...
ఇన్వెస్టర్ | వాటా | పెట్టుబడి విలువ (రూ. కోట్లలో) |
సిల్వర్ లేక్ | 2.13 | 9,375 |
కేకేఆర్ | 1.28 | 5,550 |
జనరల్ అట్లాంటిక్ | 0.84 | 3,675 |
జీఐసీ | 1.22 | 5,510 |
టీపీజీ | 0.41 | 1,840 |
ముబాదలా | 1.4 | 6,248 |
ఏడీఐఏ | 1.2 | 5,512 |
సౌదీ పీఐఎఫ్ | 2.04 | 9,555 |
మొత్తం | 10.52 | 47,265 |
ఏమిటి : ఆర్‌ఆర్‌వీఎల్‌లో 2.04 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్)
వీజీఐఆర్-2020 సమావేశం
వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ (వీజీఐఆర్) 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న ప్రసంగించారు. అతి తక్కువ కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తన ప్రసంగంలో తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. వైవిధ్యమైన మార్కెట్లను ఒకే మార్కెట్‌లో చూడగలుగుతారని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. ప్రపంచాభివృద్ధి, సంక్షేమంపై భారత్ బహుముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు.
వీజీఐఆర్ నిర్వహకులు?
భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంయుక్తంగా వీజీఐఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో అమెరికా, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన దాదాపు 20 మంది ఉన్నత స్థాయి వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న పెన్షన్ అండ్ సావరిన్ వెల్త్ ఫండ్‌స విలువ దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లను ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్-2020
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (ఏఐఎఫ్‌టీపీ) నిర్వహించిన నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్-2020ని ఉద్దేశించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 6న ప్రసంగించారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల దేశాభివృద్ధి (జీడీపీ)ని మరింత పక్కాగా మదింపు చేయవచ్చని అన్నారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో భారత్ వ్యూహం ఫలించిందని, అందుకే ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి ఒక కార్యక్రమంలో తెలిపారు.
సహ-రుణ పథకాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్
ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నవంబర్ 5 ఒక కీలక విధానాన్ని ప్రకటించింది. బ్యాంకులు-బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా ‘కో-లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం)’ పథకాన్ని ఆవిష్కరించింది. సహ-రుణాలను అందించడానికి ఆయా బ్యాంకులు-ఎన్‌బీఎఫ్‌సీ మధ్య ఒక ముందస్తు అవగాహన ఉండాలి. రుణాలకు సంబంధించి లాభ-నష్టాలను వాటి వాటి వాటాల ఆధారంగా బ్యాంకులు-ఎన్‌బీఎఫ్‌సీ పంచుకుంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కో-లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం) పథకం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : బ్యాంకులు-బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు సిఫారసులతో రూపొందించిన నివేదికను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలో కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేశ్‌చంద్‌తో పాటు కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా రాష్ట్రపతిని కలిసి నవంబర్ 9న నివేదికను సమర్పించారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత...
ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని కమిషన్ ప్రతి రాష్ట్రం ఆర్థిక పరిస్థితులను లోతుగా విశ్లేషించింది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర-నిర్దిష్ట పరిశీలనలను కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. రిపోర్టులో ఉన్న సిఫారసులపై వివరణాత్మక మెమోరాండం, చేపట్టిన చర్యల నివేదికతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
సమతుల్యతను సూచించే త్రాసు...
15వ ఆర్థిక సంఘం నివేదిక ముఖచిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ‘కోవిడ్ కాలంలోని ఫైనాన్స్ కమిషన్’ అన్న ప్రధాన శీర్షికతో, రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమతుల్యతను సూచించే త్రాసును నివేదికపై ముద్రించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేత
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలో కమిషన్ సభ్యులు
ఎందుకు : రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించడానికి
రూపే కార్డును ఆవిష్కరించిన సంస్థ పేరు?
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 73వ వార్షిక సదస్సును కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ... డిజిటల్ చెల్లింపు విధానాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలని బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ దిశలో రూపే కార్డులను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా రూపే కార్డును ఆవిష్కరించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీఐ) ‘బ్రాండ్ ఇండియా ప్రొడక్ట్’గా ఆవిర్భవించేలా చూడాలని అన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సదస్సులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 73వ వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు : ఆర్థికాంశాలపై చర్చలు జరిపేందుకు
ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం
దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నవంబర్ 11న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదముద్ర వేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి.
ప్రభుత్వ సంకల్పం...
ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి పీఎల్‌ఐ పథకం తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో పీఎల్‌ఐ తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
రంగాల వారీగా ప్రోత్సాహకాలు (రూ. కోట్లలో)
ఆటోమొబైల్స్, వాహన విడిభాగాలు | 57,042 |
అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్(ఏసీసీ) బ్యాటరీ | 18,100 |
ఫార్మాసూటికల్స్ | 15,000 |
టెలికం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు | 12,195 |
ఆహారోత్పత్తులు | 10,900 |
టెక్స్‌టైల్స్ ఉత్పత్తులు | 10,683 |
స్పెషాలిటీ స్టీల్ | 6,322 |
వైట్ గూడ్స్ | 6,238 |
ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఉత్పత్తులు | 5,000 |
అధిక సామర్థ్య సోలాల్ పీవీ మాడ్యూల్స్ | 4,500 |
ఏమిటి : ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు
ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను ఏ బ్యాంక్‌లో విలీనం చేశారు?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 102వ వ్యవస్థాపక దినోత్సవం నవంబర్ 11న ఘనంగా జరిగింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం తర్వాత జరిగిన తొలి వ్యవస్థాపక దినోత్సవం ఇది. 1919, నవంబర్ 11న యూనియన్ బ్యాంక్‌ను స్థాపించారు. ఈ బ్యాంకు ప్రధాన కార్యలయం భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఎండీ, సీఈవోగా జీ. రాజ్‌కిరణ్ రాయ్ ఉన్నారు.
బ్యాంకుల విలీనం-వివరాలు
దేవాస్‌కు ఇస్రో రూ.8,939.79 కోట్ల నష్ట పరిహారం
శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీ మీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం... 70 మెగాహెట్జ్‌ఎస్-బ్యాండ్ స్పెక్టమ్‌న్రు దేవాస్‌మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్టమ్‌న్రు దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ విఫలమైంది.
2011లో ఒప్పందం రద్దు...
2011 ఫిబ్రవరిలో దేవాస్ ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్‌ఎస్.జిల్లీ అక్టోబర్27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్‌సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీ మీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్ కు తేల్చిచెప్పారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : దేవాస్ మల్టీ మీడియాకు ఇస్రోకి చెందిన యాంట్రిక్స్ కార్పొరేషన్ రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలి
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టు
ఎందుకు : దేవాస్‌తోయాంట్రిక్స్ కార్పొరేషన్ ఒప్పందం రద్దు చేసుకున్నందున