Skip to main content

జూన్ 2017 ఎకానమీ

అంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016
Current Affairs
2016 నాటికి భారత్‌లో ‘ఆధునిక బానిసత్వం’లో మగ్గుతున్న వారి సంఖ్య 1.83 కోట్లని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించిన అంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016 వెల్లడించింది. 2014 నుంచి ఈ సంఖ్య 41 లక్షలు పెరిగిందని.. గత రెండేళ్లలో ప్రతి రోజూ 5,616 మంది భారతీయులు బానిసలుగా మారారని తెలిపింది.
నివేదిక ముఖ్యాంశాలు
  • 2014 నాటికి బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజల సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరకొరియా, ఉజ్‌బెకిస్థాన్, కాంబోడియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • ఆధునిక బానిసత్వం విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అతి ఎక్కువ మంది ప్రజలు ఈ మోడరన్ స్లేవరీలో మగ్గుతున్నారు.
  • ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే 46 శాతం మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో 83 శాతం మంది మగవారు కాగా, 17 శాతం మంది ఆడవారు.
  • బలవంతపు లేదా బాల్య వివాహాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేసియాలోనే అత్యధికం.
  • దేశంలో సగటున ప్రతి వంద మందిలో 51 మంది వెట్టి కార్మికులుగా, బలవంతపు బిచ్చగాళ్లుగా, బలవంతపు పెళ్లిళ్లు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

స్కిల్ ఇండియాకు ప్రపంచ బ్యాంకు రుణం
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ (3-12 నెలలు లేదా 600 గంటలు)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆరేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువత నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకాశాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని అంచనా వేసింది.
కాగా, 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కిల్ ఇండియాకు రూ.1,600 కోట్ల రుణం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు

అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి
అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింధూజ రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవలే ఐసీసీ గుర్తింపు పొందిన ఈ జట్టులో సింధూజ వికెట్ కీపర్‌గా వ్యవహరించనుంది. ఆగస్టులో స్కాట్లాండ్‌లో జరిగే 2020 ప్రపంచకప్ టి20 క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. గతంలో సింధూజ హైదరాబాద్ మహిళల అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఆమె అమెరికాలో నివసిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: సింధూజ రెడ్డి

ఏపీలో వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్‌లో వంద కోట్ల రూపాయల నిధితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్ 27న ప్రపంచ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్పొరేషన్ లోగోను ఆవిష్కరించారు. అమరావతిలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేట్ భవన నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తామని.. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఇక పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎవరు: ఏపీ సీఎం చంద్రబాబు
ఎందుకు : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం

2016-17లో కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం
కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 2016-17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయి్యంది. 2015-16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. జీడీపీతో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, ఆర్థిక వ్యవస్థకు అంత సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం- మొత్తంగా 2016-17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ జూన్ 15న విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా

గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకు ‘కోడ్ ఉన్నతి’
యువత, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా ‘కోడ్ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్‌అండ్‌టీ, ఐటీసీ చారిటబుల్ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించామని, 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్‌ఏపీ ఇండియా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోడ్ ఉన్నతి కార్యక్రమం
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ
ఎందుకు : యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి

ఐసీటీ సర్వీసుల ఎగుమతుల్లో భారత్ టాప్
ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్‌లను సాధించలేకపోయింది.
వివిధ కేటగిరీల్లో భారత్ ర్యాంకులు

కేటగిరీ

ర్యాంకు

గాడ్యుయేట్స్ ఇన్ సైన్‌‌స అండ్ ఇంజినీరింగ్

10

ఇ-పార్టిసిపేషన్‌లో

27

గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీస్

14

గవర్నమెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్

33

జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

32

సృజనాత్మక వస్తువుల ఎగుమతులు

18

ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేమెంట్స్

29

రాజకీయ స్థిరత్వం, భద్రత

106

వ్యాపార పరిస్థితుల్లో

121

ఎడ్యుకేషన్

114

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీటీ ఎగుమతుల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐక్యరాజ్య సమితి 

జూన్ 30న పార్లమెంట్‌లో జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం
ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జీఎస్టీ అమల్లోకి రానున్న జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం
ఎప్పుడు : జూన్ 30
ఎక్కడ : పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో
ఎందుకు : జీఎస్టీ చట్టం అమలు అందరికీ గుర్తుండేలా

2017 ఖరీఫ్ కు మద్దతు ధర పెంపు
2017 ఖరీఫ్ సీజన్‌లో 18 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పెంచింది. వరి క్వింటాలుకు రూ.80 లు, ఇతర పప్పు ధాన్యాల పంటలకు క్వింటాలుకు రూ. 400 వరకు పెంచింది. దీంతో కామన్ గ్రేడ్ రకం వరికి రూ.1,550, ఏ గ్రేడ్ రకం వరికి రూ.1,590 లు కనీస మద్దతు ధరగా ఉన్నాయి. పప్పు దాన్యాల మద్దతు ధర క్వింటాలుకు రూ.5,050 నుంచి రూ.5,450కు పెరిగింది.
పెరిగిన మద్ధతు ధరలు (రూ.లలో)

ధాన్యం

2016-17

2017 ఖరీఫ్

పెంపు

వరి (కామన్ గ్రేడ్)

1470

1550

80

వరి (ఎ గ్రేడ్)

1510

1590

80

పప్పుధాన్యాలు

5050

5450

400

మినప్పప్పు

5000

5400

400

పెసరపప్పు

5225

5575

350

పత్తి

3860

4020

160

సోయాబీన్

2775

3050

275

వేరుశనగ

4220

4450

230

ద్దుతిరుగుడు

3950

4100

150

సజ్జ

1330

1425

95

జొన్న

1650

1725

75

రాగి

1725

1900

175

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

జీఎంఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్ట్
గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్‌‌ట్స దక్కించుకుంది. ఇన్‌ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. నిర్మాణం పూర్తయ్యాక ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపడుతుంది. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. హిరాక్లియో గ్రీస్‌లో రెండో అతిపెద్ద విమాశ్రయం.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
హిరాక్లియో విమానాశ్రయం కాంట్రాక్ట్
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : గ్రీస్‌లో
ఎవరు : జీఎంఆర్

ఐడీబీఐ ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం 5 వేల కోట్లు
భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్‌పీఏలను (నికర నిరర్ధక ఆస్తుల) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత.
2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్‌పీఏల విలువ రూ.28 వేల కోట్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం రూ. 5 వేల కోట్లు
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : ఐడీబీఐ

జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ జూన్ 10న విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్‌కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు

66 వస్తువులపై జీఎస్టీ పన్ను తగ్గింపు
సామాన్యులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించింది. జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై 133 పరిశ్రమలతోపాటు సమాజంలోని వివిధ వర్గాలనుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమైన జీఎస్టీ మండలి చిరువ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది.
జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతికత, రవాణా, చమురు, గ్యాస్ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటు చేసింది.
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మేలు
  • రూ.100 రూగపాయల్లోపల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28 శాతం నుంచి తొలగించి 18 శాతం శ్లాబులోకి చేర్చారు. రూ.100 పైనున్న టికెట్లపై ధరలు ఇటీవల నిర్ణయించిన రేటు (28 శాతం)తోనే కొనసాగనున్నాయి.
  • పచ్చళ్లు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12 శాతం (గతంలో 18 శాతంలో ఉండేవి)లోకి చేర్చగా.. జీడిపప్పును 12 నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.
  • ఏడాదికి 75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ యజమానులు (గత పరిమితి రూ.50 లక్షల టర్నోవర్) కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5 శాతం రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించారు.
తగ్గనున్న ఇన్సులిన్, స్కూలు బ్యాగులు
  • చిన్న పిల్లల డ్రాయింగ్ పుస్తకాలను 12 శాతం నుంచి పన్నురహిత వస్తువుల్లోకి చేర్చగా.. స్కూలు బ్యాగులు 18 శాతంలోకి వచ్చాయి.
  • కంప్యూటర్ ప్రింటర్లు గతంలో ఉన్న 28 శాతం నుంచి 18 శాతంలోకి వచ్చాయి.
  • ఇన్సులిన్, అగర్‌బత్తీలు ఐదుశాతంలోకి.. కాటుక 28 నుంచి 18 శాతంలోకి వచ్చాయి.
  • వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్ పరిశ్రమలపై పన్నురేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
  • ట్రాక్టర్ విడిభాగాలు, ప్లాస్టిక్ టార్పలిన్‌లపై పన్ను 18 శాతానికి తగ్గింపు.
  • జూన్ 18న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లాటరీ పన్నులు, ఈ-వే బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నారు. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
66 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : జీఎస్టీ మండలి

త్వరలో కొత్త రూ.500 నోట్లు
మహాత్మా గాంధీ సిరీస్‌లోనే ముద్రించిన కొత్తరకం 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ జూన్ 13న ప్రకటించింది. వీటిలో ‘రెండు నంబర్ ప్యానెళ్లలో ‘ఏ’ అక్షరం, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం, వెనక వైపు ముద్రిత సంవత్సరం ‘2017’ ఉంటాయి. ఈ నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల మాదిరిగానే ఉండనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కొత్త సిరీస్‌తో రూ.500 నోట్లు
ఎప్పుడు : త్వరలో
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు
మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కింగ్‌ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు లక్షల కోట్లు ఎగ్గొట్టిన మరో 12 మందిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా జూన్ 13న బ్యాంకుల్ని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారగా.. అందులో 25 శాతం, అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం ఈ 12 మందే. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం ఆర్‌బీఐ వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం, అంటే రూ. 6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
12 ఎన్‌పీఏలపై దివాలా చట్టం కింద చర్యలు
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎందుకు : రుణాలు ఎగవేసినందుకు

కస్టమర్ సర్వీసులో 12 బ్యాంకులే ఉత్తమం
దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకింగ్ కోడ్‌‌స అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) జూన్ 13న విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో ఈ 12 బ్యాంకులు హై రేటింగ్‌ను పొందాయి. ఇందులో ఉన్న ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ కాగా మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకుల స్కోర్ సగటున 77గా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయి్యంది.
బీసీఎస్‌బీఐ అనేది ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం.
‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకులు
ఆర్‌బీఎల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్
ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ యస్ బ్యాంక్
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు
సిటీ బ్యాంక్‌
క్విక్ రివ్యూ:
ఏమిటి :
బీసీఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ రిపోర్ట్
ఎప్పుడు : 2016-17
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : హై రేటింగ్ పొందిన 12 బ్యాంకులు
ఎందుకు : ఖాతాదారులకు అందించే సేవలకు గాను

2017-18కి మారనున్న జీడీపీ బేస్ ఇయర్
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011-12 నుంచి త్వరలో 2017-18కి మారనుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ జూన్ 13న వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న గృహ వినియోగ వ్యయంపై సర్వే, దేశంలో కార్మిక శక్తికి సంబంధించి గణాంకాల సేకరణ 2018తో పూర్తవుతాయని.. అటు తర్వాత జీడీపీకి సంబంధించి బేస్ ఇయర్ మారుతుందని చెప్పారు.
గణాంకాల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కేంద్ర గణాంకాల కార్యాలయం 2015 మొదట్లోనే జీడీపీ బేస్ ఇయర్‌ను 2004-05 నుంచి 2011-12కు మార్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్‌ను 2017 మే నెలలో 2004-05 నుంచి 2011-12కు మార్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మారనున్న జీడీపీ బేస్ ఇయర్
ఎప్పుడు : 2011-12 నుంచి 2017-18కి
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ

రైతులకు కేంద్రం వడ్డీ రాయితీ కొనసాగింపు
స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకు రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ కాగా.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం (3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రైతులకు స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : సకాలంలో రుణాలు చే ల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ

మధ్యప్రదేశ్ రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ జూన్ 6న మంద్ సౌర్ జిల్లాలోని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పోలీసు కాల్పుల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
ఎక్కడ : మధ్యప్రదేశ్

వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. 2017-18 రెండో ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను జూన్ 8న ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ రెపో రేటును వరుసగా నాలుగో సారి యథాతథం(6.25 శాతం)గా ఉంచింది. రివర్స్ రెపో రేటును 6 శాతంగా కొనసాగించింది. సీపీఐ ద్రవ్యోల్బణ మధ్య కాలిక లక్ష్య సాధనకే వడ్డీ రేట్లను మార్చలేదని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పరపతి సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం
Current Affairs
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.1 శాతంగా నమోదయింది. జీడీపీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక గణాంకాలను మే 31న విడుదల చేసింది.
కేంద్ర గణాంకాల్లో ముఖ్యాంశాలు
- 2015-16లో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం. 2014-15లో 7.5 శాతం.
- 2016-17లో వ్యవసాయ రంగం మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 0.7 శాతం క్షీణత నుంచి 4.9 శాతం వృద్ధి బాటకు ఈ రంగం మళ్లింది. నాల్గవ త్రైమాసికంలో కూడా వ్యవసాయ రంగం వృద్ధి 1.5% నుంచి 5.2%కి చేరింది.
- స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 5.6 శాతానికి పడిపోయింది. ఈ రేటు 2015 జనవరి-మార్చిలో 8.7 శాతంగా ఉంది.
- డీమోనిటైజేషన్ కాలంలో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్చి త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధిలేకపోగా -3.7%కి క్షీణించింది. 2015-16 ఇదే కాలంలో దీని వృద్ధి రేటు 6%.
- తయారీ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతం నంచి 7.9 శాతానికి పడిపోయింది.
- మైనింగ్, క్వారీయింగ్ రంగంలో క్షీణత - 10.5 శాతం నుంచి -1.8 శాతానికి చేరింది.
- పెట్టుబడులకు సూచికగా ఉన్న స్థూల స్థిర మూలధన కల్పన రూ.40.03 లక్షల కోట్ల నుంచి రూ.41.18 లక్షల కోట్లకు చేరింది.
నెరవేరిన ద్రవ్యలోటు లక్ష్యం..
2016-17 ఆర్థిక సంవత్సరం కేంద్రం ద్రవ్యలోటు (వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య వ్యత్యాసం) లక్ష్యాన్ని సాధించింది. జీడీపీలో 3.5 శాతం ద్రవ్యోలోటును కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. విలువ రూపంలో ఇది రూ.5.35 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం.
తలసరి ఆదాయం 9.7 % వృద్ధి
2015-16తో పోల్చిచూస్తే, 2016-17లో తలసరి ఆదాయం 9.7% పెరిగింది. ఈ విలువ రూ.94,130 నుంచి రూ.1,03,219 కి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: 7.1 శాతంగా నమోదైన భారత వృద్ధి రేటు
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు 5 వేల కోట్లు
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అథియా జూన్ 1న ప్రకటించారు.
నల్లధనం వెల్లడికి అవకాశమిస్తూ ప్రభుత్వం 2017 డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయంను ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు 2017 మార్చి 31తో ముగిసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు రూ. 5 వేల కోట్లు
ఎప్పుడు : జూన్ 1 నాటికి
ఎవరు : కేంద్ర రెవెన్యూ శాఖ

వస్తు, సేవల పన్నురేట్లు ఖరారు
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పరిధిలోకి రానున్న మరికొన్ని వస్తువులు, సేవలను పన్ను శ్లాబులను జూన్ 3న జీఎస్టీ మండలి ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ బంగారంపై 3శాతం పన్నును ఖరారు చేసింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా (2 నుంచి 2.5 శాతం) పన్నువసూలు చేస్తున్నారు. సానబెట్టని వజ్రాలపై 0.25 శాతం పన్ను విధించింది.
తగ్గనున్న బిస్కెట్లు, పాదరక్షల ధర
రూ.1000 లోపలున్న దుస్తులు, బిస్కట్లు, చెప్పులు మొదలైనవాటి ధర స్వల్పంగా తగ్గనుంది. ప్రస్తుతానికి కిలో వందరూపాలయకు తక్కువగా ఉన్న బిస్కెట్లపై 20.6 శాతం, అంతకన్నా ఎక్కువ ధర ఉన్న వాటిపై 23.11 శాతం పన్నుభారం పడుతుండగా.. జీఎస్టీలో అన్ని రకాల బిస్కెట్లపై పన్నును 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. 9.5శాతం పన్ను ఉన్న రూ.500లోపు పాదరక్షలపై 5 శాతం, అంతకన్నా ఎక్కువ ధర కలిగిన పాదరక్షలపై 23.1 నుంచి 29.58 శాతం ఉన్న పన్నును 18 శాతంగా నిర్ణయించారు.
తునికాకును 18 శాతం, బీడీలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. సిల్క్, జనపనార వస్త్రాలకు పన్నునుంచి పూర్తి మినహాయింపునివ్వగా.. కాటన్, ఇతర రకాల దారాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే చేతితో నేసిన దారాలు, పోగులు మాత్రం 18 శాతం పరిధిలోకి రానున్నాయి. సౌర పానెళ్ల పరికరాలపై 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మండలి 5, 12 శాతం పన్ను శ్లాబుల్లోకి చేర్చింది.
ఏ వస్తువుకు ఎంత పన్ను?
పన్నులేనివి:

ఖాదీ దారం, గాంధీ టోపీ, భారత జాతీయ పతాకం, జనపనార, తాజా మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, తేనె, తాజా పళ్లు, తాజా కూరగాయలు, గోధుమపిండి, శెనగ పిండి, బ్రెడ్, ప్రసాదం, ఉప్పు, బొట్టు బిళ్లలు, సింధూరం, స్టాంపులు, జ్యుడిషియల్ పేపర్స్, వార్తాపత్రికలు, గాజులు, చేనేత, రూ.వెయి్యకన్నా తక్కువ చార్జీ ఉన్న లాడ్జీలు, విభూతి, రుద్రాక్షలు వంటి పూజా సామగ్రి.
5 శాతం పరిధిలోకి:
ముక్కలుగా కోసిన చేపలు, రూ. 1000 కన్నా తక్కువ ధర, దుస్తులు, శీతలీకరించిన కూరగాయలు, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, లైఫ్‌బోట్లు, రైల్వే, విమాన రవాణా సేవలు, చిన్న రెస్టారెంట్లు. బ్లాంకెట్లు, ప్రయాణపు దుప్పట్లు, కర్టెన్లు, పరుపు కవర్లకు వాడే లినెన్, టాయిలెట్, వంటగదుల్లో వాడే లినెన్, నాప్కిన్లు, దోమతెరలు, సంచులు, బ్యాగులు, లైఫ్ జాకెట్ల ధర రూ. వెయి్య లోపు ఉంటే 5 శాతం పన్ను. రూ. వెయి్య దాటితే 12 శాతం పన్ను. అగ్గిపెట్టెలు, ప్యాక్ చేసిన సేంద్రియ ఎరువులపై 5 శాతం.
12 శాతం పరిధిలోకి:
రూ.1000 కన్నా ఎక్కువ ధర గల దుస్తులు, శీతలీకరించిన మాంస ఉత్పత్తులు, వెన్న, చీజ్, జంతువుల కొవ్వు, భుటియా, నమ్‌కీన్, కలరింగ్-చిత్రాల పుస్తకాలు, గొడుగులు, కుట్టు మిషన్లు, నాన్-ఏసీ హోటళ్లు, బిజినెస్ క్లాస్ విమానం టికెట్లు, ఎరువులు, వర్క్ కాంట్రాక్టులు
18 శాతం పరిధిలోకి:
పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, పేస్ట్రీలు, కేకులు, నిల్వఉంచిన కూరగాయలు, జామ్, సాస్‌లు, సూప్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, ఎన్వలప్‌లు, ప్రింటెడ్ సర్క్యూట్‌లు, కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లు , మద్యం సరఫరా చేసే ఏసీ హోటళ్లు, టెలికాం సేవలు, ఐటీ సేవలు, ఆర్థిక సేవలు
28 శాతం పరిధిలోకి:
మొలాసిస్, కోకోవా లేని చాక్‌లేట్స్, చాకలేట్ పూతపూసిన వేఫర్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్, వాల్‌పేపర్, సెరామిక్ టైల్స్, వాటర్ హీటర్, డిష్‌వాషర్, త్రాసు, వ్యాక్యూమ్ క్లీనర్, షేవర్స్, వ్యక్తిగత అవసరాల కోసం విమాన సేవలు, 5-స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగుల, సినిమాలు మొదలైనవి.
ఐజీఎస్టీ నుంచి మినహాయింపు
రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తు, సేవలపై కేంద్రం విధించే సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) నుంచి మినహాయిపు ఉన్న వివరా లను పన్ను శాఖ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. ధార్మిక సంస్థలు పేదలకు పంచడానికి విదేశాల నుంచి అందుకునే ఆహారం, ఔషధాలు, వస్త్రాలు, దుప్పట్లపై పన్ను ఉండదు. బాధితుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ దిగుమతి చేసుకునే మందులు, భోపాల్ లీక్ గ్యాస్ బాధితుల చికిత్సకు అవసరమయ్యే వైద్య పరికరాలపై పన్ను వేయరు. ప్రజానిధులతో నడిచే పరిశోధన సంస్థలు, వర్సిటీలు, ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లేబొరేటరీలు, ప్రాంతీయ కేన్సర్ సెంటర్లు తదితర సంస్థలు వాడే పరిశోధన పరికరాలపైనా పన్ను ఉండదు.
2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ
2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో రైతు రుణమాఫీలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతానికి చేరుకుంటాయని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల మాదిరే అన్ని రాష్ట్రాలూ రైతుల రుణాలను మాఫీ చేస్తాయనీ, ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులు తీసుకున్న అప్పుల విలువ 2019 నాటికి 40 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,60,000 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. మార్కెట్‌పై ప్రభావాన్ని పరిమితం చేస్తూనే రుణమాఫీకి నిధులు సమకూర్చుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ఉదయ్’ తరహా బాండ్లను జారీ చేయాల్సి ఉంటుందని సూచించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే రూ.30 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.2 శాతం) రైతు రుణాలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.36 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.3%) రుణాలను మాఫీ చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ
ఎక్కడ : భారత్‌లో
ఎవరు : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్

2017లో భారత్ వృద్ధి 7.2 శాతం : ప్రపంచబ్యాంకు
2017లో భారత్ వృద్ధి 7.2 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2016లో మాదిరిగానే 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’లో అంచనాలని సవరించింది. అలాగే డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి భారత్ బయటపడుతోందని.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రకటించింది. 2018లో 7.5 శాతం, 2019లో 7.7 శాతం మేర భారత్ వృద్ధి నమోదవుతుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
2017లో భారత్ వృద్ధి 7.2 శాతం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రపంచ బ్యాంకు

ఎయిర్‌టెల్-టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకే
భారతీ ఎయిర్‌టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జూన్ 5న అనుమతి ఇచ్చింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్‌టెల్ సొంతం అవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్ - టెలీనార్ విలీనానికి అనుమతి
ఎప్పుడు : జూన్ 5
ఎక్కడ : కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
Published date : 13 Jun 2017 03:26PM

Photo Stories