Adani Stocks: సంపద సృష్టిలో పోటాపోటీ.. అదానీ గ్రూప్ కంపెనీల హవా
సంపద సృష్టిపై బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన 27వ వార్షిక నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఈ ఏడాది దుమ్మురేపాయి.
టాప్–100 ఇలా..: గత ఐదేళ్లలో టాప్–100 కంపెనీలు మొత్తం రూ.92.2 లక్షల కోట్ల సంపదను జమ చేసుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆర్‌ఐఎల్ అతిపెద్ద వెల్త్ క్రియేటర్‌గా నిలిచింది. అయితే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ ఆస్తుల కొనుగోలు, కొత్త రంగాలలోకి ప్రవేశించడం వంటి అంశాలతో వెలుగులో నిలిచాయి. వెరసి 2022లో గౌతమ్ అదానీ 155.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే రెండో ధనవంతుడిగా రికార్డు సాధించారు. సెప్టెంబర్ 16కల్లా ఫోర్బ్స్ రూపొందించిన రియల్ టైమ్ జాబితా ఇది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలలో 75 శాతం చొప్పున వాటా కలిగిన గౌతమ్ అదానీ 2022లో సెప్టెంబర్‌కల్లా ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపదను జమ చేసుకున్నారు. గ్రూప్ కంపెనీలు అదానీ టోటల్ గ్యాస్(37 శాతం), గ్రీన్ ఎనర్జీ(61 %) ఫోర్బ్స్(65 %)లోనూ వాటాలు కలిగి ఉండటం ఇందుకు సహకరించింది. ఇదే సమయంలో ముకేశ్ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 8వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 253.5 బిలియన్ డాలర్ల సంపదతో ఎలక్ట్రిక్ కార్ల(టెస్లా) దిగ్గజం ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఆవిర్భవించారు.
☛ 2 నెలల్లో 1.25 లక్షల ఉద్యోగాలు తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం..!
ఐదేళ్ల కాలంలో..: 2017–22 కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్‌మిషన్, ఎంటర్‌ప్రైజెస్ అత్యంత వేగంగా నిలకడగా ఎదిగిన భారీ కంపెనీలుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే ఈ కాలంలో టెక్నాలజీ, ఫైనాన్షియల్స్ తొలి రెండు ర్యాంకులను సాధించాయి. సంపద సృష్టిలో టాప్–100 కంపెనీలను, మార్కెట్ విలువల్లో మార్పులను నివేదిక పరిగణించింది. దీనిలో భాగంగా విలీనాలు, విడదీతలు, ఈక్విటీ జారీ, బైబ్యాక్ తదితర కార్పొరేట్ అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంది. ఈ ఐదేళ్లలో నాలుగేళ్లపాటు ఆర్‌ఐఎల్ అత్యధిక సంపదను సృష్టించిన దిగ్గజంగా ఆవిర్భవించింది. వెర సి ఐదేళ్లకుగాను టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ జాబితాలో టాప్–5లో నిలిచాయి. కాగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ గత ఐదేళ్లలో నిలకడైన సంపద సృష్టికి నిదర్శనంగా నిలిచింది.