Skip to main content

యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది.
Current Affairsఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు శక్తికాంతదాస్ ప్రకటించారు.

వృద్ధి రేటు 5 శాతం
2019-20లో దేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5-6 శాతానికి తగ్గించింది.

సీఆర్‌ఆర్ నిబంధనల సడలింపు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది 2020 ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం-ముఖ్యాంశాలు
  • వడ్డీ రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
  • దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి.
  • ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.
  • తదుపరి ఆర్‌బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
Published date : 07 Feb 2020 05:43PM

Photo Stories